గూగులమ్మ పదాలు

ఏడో విడత...
*******

బుద్ధి మాంద్యుల చేత
అర్థ మాంద్యపు వాత
సబ్‌-ప్రైము తలరాత
ఓ గూగులమ్మా!

మాంద్య మార్థిక మగుట
ఉద్యోగులకు నొసట
హృద్రోగముల చెమట
ఓ గూగులమ్మా!

పింకు స్లిప్పుల సెగకు
జంకకుండా వెదుకు
సద్యోగములె దొఱుకు
ఓ గూగులమ్మా!

స్లంపు వేళల జనము
జంపు చేయుట శుభము
అంటబోదట అఘము
ఓ గూగులమ్మా!

కొత్త విద్యల నేర్పు
శక్తులన్నిటి కూర్పు
మాంద్యమున ఓదార్పు
ఓ గూగులమ్మా!

కఠినమౌ ఈ జగతి
ఓర్మి గల్గిన సుమతి
పొంద గలడట సుగతి
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

sunita చెప్పారు…
బాగా విపరీతంగా తీరిక సమయం దొరికి (పనీ-పాటు) లేకుండా రోజూ కొన్ని చొప్పున మీరు రాసిన పాత టపాలన్నీ చదువుతున్నాను. మీ ట్రావెలాగుడు, మీ పియానో ప్రదర్శన, మొసలి, ఆర్కాన్సాస్ వీడియో, మీరు రాసే మాండలికము (నేను నామిని గారి అభిమానిని కాబట్టి మీ రాత ఇంకా కొంచం ఎక్కువగా నచ్చి ఉండవచ్చు) మీ రచనల్లోని ఆ పల్లెటూరి మట్టి వాసన (రాకేశ్వర్ గారన్నట్ట్లు మీకున్న ఇమేజికి ఏమి రాసినా వహ్వా అని కాదు నిజంగానే బాగున్నాయి.
Thotaramudu చెప్పారు…
కచేరీలో అర్థ రాతిరి
చేయుచుండగ వెట్టిచాకిరి
రామనాథుని మధుర పదఝరి
ఓ గూగులమ్మా!

జంపు చేయుట తగిన పనియని
సఖుడు పల్కిన పల్కులను విని
చితిని పేర్చితి నేటి పనికిని
ఓ గూగులమ్మా!

(మీ కాపీహక్కులను ఉల్లంఘిస్తూ) -

గౌతం
రవి చెప్పారు…
బయట వాడి నౌకిరి
ఎప్పుడూ కిరికిరి
సేద్యమే మంచి వైఖరి
ఓ గూగులమ్మా
కొత్త పాళీ చెప్పారు…
బ్రమ్మాండంగా రాశావు రామ్నాథా. చాలా బాగా రాశావు.
రవి, మీకు గూగులమ్మ తూగు పట్టుబడలేదు.
రానారె చెప్పారు…
గురూజీ, నెనరులు. గూగులమ్మ పదాలు ఇంక రాయలేనేమో అనుకున్నాను. హ్యూస్టన్ సాహితీ మిత్రుల ప్రోత్సాహంతో మళ్లీ రాయగలిగాను.

రవిగారూ - మంచి పాయింటే కానీ, స్వతంత్రంగా సేద్యం చేసుకొని సుఖపడటానికి తగిన వనరుల్లేకుండా పోతున్నాయే రాన్రానూ! ఉద్యోగాలు చేయాల్సిన ఖర్మ మనకేమిటనుకొని అగచాట్లపాటలయిన నేపథ్యం నుంచే నేనొచ్చింది. :)

గౌతంగారూ - థాంక్యూ. జంపుచేయకుండానే చితిని పేర్చుకోకండి. :) ఉల్లంఘనేం కాదుగానీ, మీ పద్యాల్లో మంచి లయ వుంది. గురజాడ ముత్యాలసరాల్లాగా. 'ఓ గుగులమ్మా' బదులు 'గూగులమ్మ మయం' అనో 'గూగులమ్మ పదం' అనో అంటే ముత్యాలసరమే ఔతుందనుకుంటా.

సునీతగారూ - ధన్యవాదాలు.
కామేశ్వరరావు చెప్పారు…
గూగులమ్మ పదాలు బాగున్నాయి.
సాహితీ సేద్యానికి కావలసినన్ని వనరులున్నాయి మీ దగ్గర.
Sudesh చెప్పారు…
యాహూ తో నీ పోటి
'బింగ్' తో మరి భేటి
ఎవ్వరు నీకు సాటి!!
ఓ గూగులమ్మ!

చాల బాగున్నది రానారే!! ఎప్పుడు మీ నిజ రూప దర్శనం??

సుధేష్
రవి చెప్పారు…
కొ.పా గారు : సత్యమే వచించారు. నాకు గూగులమ్మ తూగు పట్టుబడలేదు! :-)
కొత్త పాళీ చెప్పారు…
@ sudesh ..
bAgunnArA?
mI aksharAlni ilA kAsta (sannAyi) nokkulu nokkitE padaMlO iMcakkA imuDutAyi

యాహు నా నీ పోటి?
'బింగు' తో మరి భేటి
లేరెవరు నీ సాటి!!
ఓ గూగులమ్మ!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము