విజయా వారి విజయపతాక

నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు.

మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति".

క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది.


పూర్తి శ్లోకం ఇదీ:

విజేతవ్యా లంకా చరణతరణీయా జలనిధిః
విపక్షః పౌలస్త్యో రణభువి సహాయశ్చ కపయః।
తథాప్యేకో రామః సకలమవధీద్రాక్షసకుమమ్
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే।।

లంకానగరిని జయించడానికి కాలినడకన సముద్రాన్ని దాటవలసి వచ్చినా, ప్రత్యర్థి రావణుడు మహాబలవంతుడయినా, తనకు సహాకులుగా వున్నది కపులే అయినా - అన్నీ ప్రతికూలతలే అయినా - రాముడు సకలరాక్షసులనూ నిర్మూలించినాడు. మహాత్ముల సత్వము స్వయంక్రియాసిద్ధమే గానీ ఉపకరణాధారితం కాదని భావం.

A bad workman blames his tools అనే ఆంగ్ల సామెతకు సమానార్థకంగా ఈ శ్లోకపు భావాన్ని నాకు తెలియజేసిన కార్తీక్ గారికి కృతజ్ఞతలు. దీనికి సమానార్థకం గల తెలుగు పద్యమేదయినా వుందా!? అని అడుగుదామని ఈ టపా రాస్తున్నాను.

మొత్తానికి పాతాళభైరవిని ఎప్పుడు చూస్తానో!

కామెంట్‌లు

Kottapali చెప్పారు…
బహు బాగుంది.

ఇన్నాళ్ళూ దాన్ని క్రియాసిద్ధీ రసత్వే భవతి అని చదివేసుకుని, రసం పుట్టనిదే క్రియ వ్యర్ధం అని దానికి అర్ధం చెప్పేసుకుని తరువాయి సినిమాలోకి దూకేస్తూ వచ్చాను.
గూగులమ్మ, మరియూ కార్తీక్ జిందాబాద్!
అజ్ఞాత చెప్పారు…
మంచి శ్లోకం.

కాశీమజిలీ కథలు 7వ భాగములో సప్త మిత్ర చరిత్రములో పై శ్లోకానికి సంబంధించి చక్కటి కథ ఉంది.
కథ అంతా ఇక్కడ రాయడం కష్టం కానీ శ్లోకాలను మాత్రం ఉదాహరిస్తాను.

పై సమస్యను భోజ మహారాజు మార్గమధ్యములో తనతో ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి ఇవ్వగా వారు
పూర్తి చేసిన శ్లోకములు:

బ్రహ్మదత్తుడు: ఘటోజన్మ స్థాన మృగ పరిజనోభూర్జవ సనో
వనేవాసః కంగాదిక మశన మేవంవిధగుణః
అగస్త్యః పాధోధిం యదకృత కరాంభోజకుహరే
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాంనోపకరణైః

అనగా కుండలో నుండి పుట్టి జంతువులతో, అడవులలో నివసించిన అగస్త్యుడు సముద్రాన్ని త్రాగాడు.
మహాత్ములకు ఉపరకరణాలతో పని లేదు.

బ్రహ్మదత్తుని భార్య: రథ స్సైకంచక్రం భునగజమితస్సప్తతురగా
నిరాలంబోమార్గచ్చరణ వికలస్పారధిరపి
రవిర్యాత్యేవాంతం బ్రతిదిన మపారస్యనభసః
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాంనోపకరణైః

అనగా ఒకే చక్రం ఉన్న బండిని ఎక్కి నిర్మలమైన ఆకాశంలో కాళ్ళు లేని సారధితో సూర్యుడు తిరుగుతున్నాడు.
మహాత్ములకు ఉపరకరణాలతో పని లేదు.

ఘోటకముఖుడు: విజేత వ్యాలంకా...


బ్రహ్మదత్తుని కుమార్తె మల్లిక: ధనుః సౌష్పం మౌర్వీమధుకరమయీ చంచలదృశా
దృశాంకోణో బాణస్సుహృదపి జడాత్మాహికరః
స్వయం చైకోనంగ స్సకలభువనం వ్యాకులయతి
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాంనోపకరణైః

అనగా పుష్పధనుస్సు, తుమ్మెదల బారును త్రాడుగా కలిగి స్త్రీల చంచల మనస్సు యొక్క ఓర చూపులనే
బాణాలుగా చేసుకుని మన్మధుడు దేహం లేకపోయినా మూడు లోకాల వారిని చిక్కుల్లో పెడుతున్నాడు.

పై వాటిలో భోజ మహారాజుకు నచ్చినది చివరిదే అని వేరుగా చెప్పనవసరం లేదు కదా.

శ్లోకాలలో తప్పులు ఏవైనా ఉంటే వ్రాయడంలో అవి నావే నని గమనించ ప్రార్థన.

సూర్యప్రకాష్
అజ్ఞాత చెప్పారు…
నేను కూడా ఇదివరకు విజయా వాళ్ళ సినిమా పాస్ పెట్టి మరీ లోగో మీద క్యాప్షన్ చదివేను: క్రియా సిధ్ధి: సత్వే భవతి అని. కానీ అసలు శ్లోకం ఎక్కడిదో విచారించలేదు. సత్వగుణం వల్లనే క్రియా సిద్ధి కలుగుతున్నది అని అర్ధం చెప్పుకున్నాను. కానీ ఇక్కడ సత్త్వం అంటే బలం లేక సామర్ధ్యం అని మీరిచ్చిన శ్లోకం వల్ల తెలుస్తోంది. ఈ శ్లోకాల్ని ఇక్కడ ఇచ్చినందుకు చాలా కృతఙ్ఞతలు.
సూర్యప్రకాష్ గారూ, మీరు చెప్పిన శ్లోకాల్లో మన్మథుడిమీది శ్లోకం ఇంచుమించుగా అదే రీతిలో సౌందర్యలహరిలో ఉంటుంది. చూడండి -

ధను: పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖా:
వసన్త: సామన్తో మలయమరుదాయోధన రథ:
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ||

మరి ఈ రెండు శ్లోకాల్లో భావాలూ ఒకేలా ఉండడం కేవలం యాదృచ్ఛికమే అయితే చాలా ఆశ్చర్యమే...

అలాగే నాకు నచ్చిన మరొక క్యాప్షన్ మా ఊళ్ళో లయన్స్ క్లబ్ వాళ్ళది (అన్నిచోట్లా అలాగే ఉంటుందేమో నాకు తెలియదు). అది ’న హి కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి’ అని భగవద్గీతలో వాక్యం.
రానారె చెప్పారు…
ఈ మాటతో ఇన్ని శ్లోకాలున్నాయన్నమాట. ఇదొక సమస్యాపూరణానికి వాడబడిన సంగతి, కథా కమామీషు - మీ వ్యాఖ్యలతో తెలిశాయి. ధన్యవాదాలు. ఇన్ని శ్లోకాల్లో ఒకదానికైనా తెలుగు పద్యానువాదం ఉందా?
అజ్ఞాత చెప్పారు…
ఈ లోగో నేను చూసినా పెద్దగా గమనించలేదు. నాకు గుర్తున్నంత వరకు (చిన్నప్పుడు సంస్కృతం వెలగబెట్టాను) ఈ పద్యం, భర్తృహరి సుభాషితాలలో ఒకటి అనుకుంటాను. సజ్జన పద్ధతో, మాన శౌర్య పద్ధతో తెలీదు. ఈ పద్యాలకు ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం చేసారు. అందులో తెలుగు అనువాదం దొరక వచ్చునేమో...
రాఘవ చెప్పారు…
నాక్కూడా ఇది భర్తృహరి సుభాషితాలలో చదివినట్టుగానే గుర్తు. నా స్మృతి నిజమే ఐతే ఈ శ్లోకాలకి తెలుగు అనువాదాలు కచ్చితంగా ఉండాలి.

లేదంటే చెప్పండి... ఒక పట్టు పట్టాలని ఊరిస్తున్నాయి ఈ శ్లోకాలు :)
రానారె చెప్పారు…
ఉంటేమాత్రమేమి! పట్టవయ్యా నీకా శక్తి వుంది!! నీ శక్తికొలదీ ప్రయత్నించు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం