రాష్ట్రప్రభుత్వం 'కడపజిల్లా' పేరును 'డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా'గా మారుస్తూ ఉత్తర్వులు చేసిందనే వార్తను చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కడప అనే పేరుకు చిన్నప్పటి నుండి అలవాటు పడివున్నాను. వెంకటేశుని గడప కాలక్రమాన కడప అయిందంటారు. ఆంగ్లేయుల Cuddapah అనే స్పెల్లింగు కూడా నాకు నచ్చేదికాదు. కొన్నేళ్లక్రితమే Kadapa గామారిందని తెలిసి సంతోషించాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ పేరునే తీసేయాలనడం బాధాకరం. వై.ఎస్. స్మృత్యర్థం కడప విమానాశ్రయాన్ని అభివృద్ధిచెయ్యడమో, మరో కొత్త అభివృద్ధిపని చేపట్టి దానికి ఆయన పేరు పెట్టడమో చేస్తే బాగుంటుందిగానీ, చారిత్రాత్మకమైన జిల్లా పేరును మార్చడం యేమీ బాగలేదు.
సదరు మార్పు ఇష్టం లేనివారు ముప్పైరోజుల్లో తమ అభ్యంతరాన్ని తెలియజేయొచ్చని కూడా వార్తల్లో వచ్చింది. ఎలా తెలియజెయ్యాలో నాకు తెలియలేదు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగివున్న తరుణంలో విడుదలైన ఈ ఉత్తరువులకు అభ్యంతరం తెలియజేయడానికి గల గడువు మించిపోతోంది. అంతర్జాలంలో ఎవరో
ఈ ఫిర్యాదు ఏర్పాటు చేశారు. అక్కడ సంతకం చేస్తే రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి అభ్యంతరం తెలిపినట్టేనట. ఇదెంతమాత్రం ఫలితాన్నిస్తుందో తెలీదుగానీ, నా అభ్యంతరాన్ని వ్యక్తం చెయ్యడానికి నాకు దొరికిన సులభమైన మార్గమిది. జిల్లా పేరు మార్పు విషయంలో నాలాగే అనుకునేవాళ్లు చెయ్యగలిగిన మానవప్రయత్నం ఇంకేదైనా వుందా?