Wednesday, February 13, 2008

ఒక ట్రావెలాగుడు - ఏడవ టపా

"మీకిష్టమైనంత సేపు" అంటే మరో మూడుగంటలే. మేం తొడుక్కున్న పాదరక్షల్లోకి (Shoes) మంచునీళ్లు చేరడంతో పాదాల్లో వేళ్లను కొరికేస్తున్నట్టున్న చలి. ముందుగా ఒక కాఫీ కొనుక్కుని తాగాం. మా గొడవలో పడి గమనించలేదుగానీ ఆ అంగడిలో వున్న జనాలందరూ ఆదుర్దాగానే వున్నారు. కొండలెక్కడానికి వెళ్లి మంచులో చిక్కి తిరిగిరాని తమ సహచరుల గురించి కొందరు ఆందోళన పడుతున్నారు. కొందరు రష్యనులు మాత్రం తమ తోటివారు తిరిగిరానందుకు ఏదో రాక్షసానందాన్ని అనుభవిస్తున్నట్టున్నారు.

అప్పటికే చీకటి పడిపోతోంది. మరికొంత సేపట్లో ఆ అంగడి మూతబడుతుంది. మేం ఆలోచించాం. మా మిగతా ఇద్దరు మిత్రులూ ప్రస్తుతం ఎక్కడున్నారో, యే పరిస్థితిలో వున్నారో తెలీదు గనుక వారికోసం ఎదురుచూడటం అవివేకం. ముందుగా మేము స్థిమితపడిన తరువాత మిగతా విషయాలు ఆలోచించవచ్చునని, కొద్ది దూరంలోనే ఒక పూటకూళ్ల ఇల్లు వుందికదా, అక్కడికి వెళ్దామనుకున్నాం. అంగట్లో వున్న ముసలావిడను వివరాలడిగాం. అందులో తలదాచుకోవాలంటే ప్రస్తుతానికి కష్టమే కానీ ప్రయత్నించమని గదినమోదుకేంద్రానికి దారి చూపింది. అంగట్లోనుండి బైటపడి ఒక్క పరుగులో అక్కడికి చేరాలని తలుపు తెరిచాను. బయటనుండి చల్‌ల్లని గాలి విసురుగా లోపలికొచ్చింది, నేనూ విసురుగా బయట అడుగుపెట్టాను. గడ్డకట్టిన నీళ్లపైన సర్రుమని జారింది. నిలదొక్కుకుని, ఆశాదీప్‌కు జాగ్రత్తచెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ వీలైనంత తొందరగా నమోదుకేంద్రానికి చేరాం. అక్కడ జనాలరద్దీలో మెల్లగా దారి చేసుకొని వరుసలో నిలబడ్డాం.

మా వంతు వచ్చింది. ఏమిటన్నట్టు చూశాడు. వాలెట్ బయటకు తీసి అతనిముందు పెట్టాను. నా పూర్తి పేరు, డ్రైవింగు లైసెన్సు నంబరు కావాలన్నాడు. ఆంగ్లవర్ణమాలలో వున్నన్ని అక్షరాలు నా పేరులో వున్నాయి. కామాలూ, ఖాళీలతో కలిపితే ఇంకా ఎక్కువే అవుతాయి. స్పెల్లింగు చెప్పి హింసించడం ఎందుకని, నా డ్రైవింగు లైసెన్సు అతని చేతికిచ్చాను. ఎగాదిగా చూశాడు. "నీ కన్నా నీ పేరే పొడుగ్గా వుందికదా, ఇదంతా కంప్యూటర్లో రాసేటప్పటికి నాకు రామకోటి రాసినంత పుణ్యం వచ్చేస్తుంది, !@$^$~&( ^%$&^$#@ ఉఫ్‌ ఉఫ్..." అని ఆ చూపుకు అర్థం - తెంగ్లీషు భాషలో. అమెరికాలో ఆ చూపు నాకు చాలా సార్లు అనుభవమే.

గది కావాలన్నాను. పది మీ నంబరన్నాడు. అనగా మాకన్నా ముందు తొమ్మిదిమంది గదికోసం నిరీక్షిస్తున్నారు. అంటే ప్రస్తుతం వున్నవాళ్లలో పదిమంది ఖాళీచేసి వెళ్లిపోతే మాకు చోటు దొరుకుతుందన్నమాట. పక్కకొచ్చేశాను. కూర్చోవడానికి స్థలం లేదు. ఉన్న ఒకటిరెండు బల్లలూ ఆక్రమించబడ్డాయి. కిందకూర్చుందామంటే అదేమీ ఖాళీ స్థలం కాదు, అక్కడ పుస్తకాలూ, సీడీలూ, సిగరెట్లు, చిరుతిళ్లు, బహుమతులూ అమ్మకానికి పెట్టారు. ఇంకెంతసేపు నిలబడాలో తెలీదు. బయట హోరున గాలి, వాన. ఆకులమీద, కొమ్మలమీదా వాననీళ్లు గడ్డకట్టడంతో కిందికి వంగిపోయి విరగడానికి సిద్ధంగా వున్న చెట్లు.

ఇలాంటి పరిస్థితి మన దేశంలో ఎదురైతే గదుల అద్దె హనుమంతునిలాగా ఆకాశంలోకి పెరిగిపోదూ అనుకొంటూ వున్నాను. అంతలో 'రమా..నందా..రెడీ' అంటూ పిలుపు. ఎందుకోగానీ నా పేరును వున్నదున్నట్టుగా కొత్తవాళ్లెవరూ పలుకలేరు. ఈ సంగతి నా చెవులకు ఊహ తెలిసినప్పటినుంచీ అలవాటే. అమెరికనులు, భారతీయులూ కూడా ఒకేవిధంగా పలకడంలోని ఒద్దిక ఒక విశేషం. వెళ్లాను. మీ డీ.ఎల్ నంబరెంత అన్నాడు. చెప్పాను. ఇదిగోండి మీ డ్రైవిగు లైసెన్సు కార్డుముక్క అంటూ ఇచ్చాడు. అసలది పోయినట్టు కూడా నాకు తెలీదు. తెలిసుంటే, చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు హీరో అయ్యాక ఎదురైతే అంజలీదేవి అతణ్ణి కావులించుకొని "బాబూ" అంటూ బావురుమనే సీను రీమేక్ చేసుండొచ్చు. కానీ ఇప్పుడేముందీ... హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్కోడమేఁ.

ఎంత సేపు నిలబడాలో తెలీదు గనుక, మళ్లీ తిండి ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలీదు గనుక, ఒంట్లో వున్న శక్తిని ఇలా నిలబడి కోల్పోకూడదని, నేలమీదే కూర్చున్నాను. పక్కనే సంచీ పెట్టాను. నేను కూర్చున్న స్థలం ముందే తడిగావుండి, నేనూ, నా సంచీ కలిసి అక్కడ బాగా తడిని పెంచేశాం. ఆక్కడ షాపింగ్ పేరుతో కంగాళీగా తిరుగుతున్నవాళ్లందరికీ జారిపడతారు జాగ్రత్త అని చెబుతూ కూర్చున్నాను. అక్కడ నలుగురు పిల్లల తల్లి ఒకామె వుంది. మనిషి శరీరం చాలా చిన్నది. నలుగురిని కని పెంచుతోందంటే గట్టిమనిషే అనుకున్నాను. నలుగురు పిల్లల్లో చిన్నవాడు అక్కడున్న సీడీలనూ పుస్తకాలనూ ఒక్కోటిగా కింద పడేసి ఆనందించాలని ప్రయత్నిస్తూ వుండగా వాళ్లమ్మ వారిస్తోంది. వాడు కిందపడేసిన వాడిని ఆమె సర్దేలోపుగా పక్కకెళ్లి ఇంకొన్ని పడేస్తున్నాడు. మిగతా ముగ్గురు పిల్లలూ అది చూసి నవ్వుతున్నారు. ఆమెకు కోపం వచ్చినట్టు లేదుగానీ, అలసట మాత్రం కనిపిస్తోంది. సీడీలూ పుస్తకాలూ నేను తీసి సర్దుతానుగానీ పిల్లాణ్ణి ఆపే పని మాత్రం చూసుకోమని ఆవిడకు చెప్పాను. చాలా సంతోషించి థాంక్స్ చెప్పింది. బాగా తడిసిపోయినట్లున్నారు? అంది. నా సమస్య ఇది కాదమ్మా, అంతకంటే పెద్ద సమస్యే వుంది అని విషయం చెప్పాను.

అంతలో ఒకాయనొచ్చి అక్కడున్నవారందర్నీ ఉద్దేశించి - "ఇక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి పార్కు రేంజర్లు మీకు ఎస్కార్టు ఇస్తారు, మీ మీ వాహనాల్లో సిద్ధంగా వుండండి, నాలుగు లేదా ఐదు వాహనాలకు ముందొకరు, వెనకొకరుగా మా రేంజర్లు అనుసరిస్తారు, మీరు వెళ్లి ఫలానా గేటు దగ్గర మీ వేచివుండండి" - అని ప్రకటిస్తూండగానే అక్కడ ఒకటే కలకలం మొదలైంది. అందర్నీ తోసుకుంటూ అక్కడున్న పన్నెండుమంది చైనా యువతీయువకులు ముందుకు దూసుకెళ్లారు.

ప్రకటన ఇలా కొనసాగుతోంది - "ఒక ముఖ్య గమనిక - మీ వాహనం 4x4 అయివుండాలి. కాని వారిని తరలించడం సురక్షితం కాదు. వారు దయచేసి ఇక్కడే ఆగిపోండి." మిగతావారందరూ రకరకాల ప్రశ్నలు వేస్తూండగా ఆయన ఓపికగా జవాబులు చెబుతున్నాడు. ఒక ముసలామె దాదాపుగా ఏడుస్తూ వుంది. హైకింగుకు వెళ్లిన ఆవిడ భర్త జాడ ఇంకా తెలియలేదని ఆవిడ బాధ. ఆమెకు ధైర్యం చెబుతున్నాడు. వైర్‌లెస్ సెట్టులో మాట్లాడి ఆవిడను భర్తతో కలిపే బాధ్యతను ఎవరికో అప్పగించాడు. చైనా యువతకు ఆవేశం వచ్చింది. అందరినీ తోసుకుంటూ వెనక్కు వచ్చి, శక్తివంతమైన కారు లేనివాళ్లను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఆ అధికారితో వాగ్వాదానికి దిగారు. శక్తివంతమైన కార్లు మాత్రమే ఆ వాతావరణంలో కొండ మలుపుల్లో తట్టుకోగలుగుతాయనీ, ఇప్పటికే ఒక ట్రెయిలరు రోడ్డునుంచీ జారి లోయలో పడినట్లు వార్త అందిందనీ - వాళ్లకు చెబుతున్నాడు. నీ నియమాలను సవరించుకో మంటున్నారు చైనీయులు. ఆఫీసరు ఉక్కిరిబిక్కిరౌతున్నాడు.

మా వాహనం శక్తివంతమైనదే, కానీ అదిక్కడ లేదే! నేనూ, మా ఆశాదీపు లేచి, గదుల రిజిస్ట్రేషను కౌంటరు వద్దకు వెళ్లి గదులేమైనా ఖాళీ అయ్యాయేమోనని అడిగాం. కావలసినన్ని ఉన్నాయి అన్నారు. ఆనందంగా ఒకటి మాకోసం కేటాయించమని అడుగుతున్నాం. అంతలో ఆ నలుగురు పిల్లల తల్లి గొంతు - "ఆఫీసర్, దీజ్ జెంటిల్‌మన్ ఆరినె యునీక్ సిచ్చుయేషన్", తల తిప్పి చూస్తే, ఆ గందరగోళంలో దారిచేసుకొని వచ్చి మావైపు చెయ్యిచూపి మా వాహనం మావద్ద లేదని, మమ్మల్ని మా స్నేహితులతో కలపమనీ చెబుతోంది. ఆశ్చర్యం, ఆనందం, కృతజ్ఞత లాంటివన్నీ నన్ను ముప్పిరిగొన్నాయి. ఆ అనుభూతులను పాటగాజేస్తే వెంటనే ఘంటసాల స్థాయిలో మానిక్యవీణాముఫలాలయంతీమ్... అని వినిపిస్తుందనుకోండి. ఆ పారవశ్యాన్ని ఆంగికంగా మార్చి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేశాను.

ఆఫీసరు మాకోసం మరొక అధికారిని నియమించాడు. ఆ మనిషి వైర్‌లెస్ సెట్టులో మాట్లాడి, బయట ట్రక్కులో తిరుగుతున్న ఒక రేంజరుకు విషయం వివరించాడు. తరువాత మా వైపు తిరిగి - మీ వాళ్లిద్దరూ పాంథర్‌జంక్షన్‌ విజిటర్ సెంటర్‌లో మీకోసం వాకబు చేస్తున్నారు, మా రేంజరు మిమ్మల్ని అక్కడికి చేరుస్తారు, మరికొద్ది క్షణాల్లో మీరతని వాహనంలో కూర్చోబోతున్నారు - అని చెప్పాడు. ఆహా! అనిపించింది.

సంతానలక్ష్మి ఇంకా అక్కడే వేచివుంది. ఆమె దగ్గరకు వెళ్లి - అమ్మా, మీ చొరవతో అతి త్వరలో మా బాధలు తీరబోతున్నాయి. కృతజ్ఞతాశతములు, మిమ్మల్ని మరిచిపోము - అని చెప్పి సెలవు కోరగా, మీరు క్షేమంగా ఇల్లు చేరగానే నాకొక ఈమెయిల్ పంపండని ఒక కాగితంముక్క మీద ఐడీ రాసి ఇచ్చింది. ఇంటికొచ్చి మెయిల్ చేస్తే వెళ్లలేదు, ఆ తొందర్లో ఐడీ తప్పు రాసినట్లుంది. ఫరవాలేదు, ఆవిడ, ఆవిడ పిల్లలూ సంతోషంగా వుండాలని శక్తివంతంగా దీవించేశాను. :-)

అంతలో "మిస్టర్ రెడ్డీ అండ్ రెడ్డీ" అంటూ పిలుపు, బయట రేంజరు వాహనం. "యస్ సర్" అంటూ వెళ్లాం. మా ఇద్దర్లో ఒకడే కదా రెడ్డి, అని సందేహం. అడుగుదామా అన్నాను ఆశాదీప్‌తో. ఫరవాలేదు పదమన్నాడు. రేంజరు వాహనం నాలుగు సీట్లున్న ఒక ట్రక్కు. వెనుక సీట్లో కూర్చోమన్నాడు. కూర్చునే లోపల మళ్లీ తడిసిపోయాం. కారణం - వెనుక సీటంతా యేదేదో లగేజీ. దాన్ని సర్దుతూ మమ్మల్ని వానలో నిలబెట్టాడు రేంజరు. అందుకు సారీ కూడా చెప్పాడు. అంతటితో ఆగక మమ్మల్ని తడిపినందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఆయన వయసు రమారమి యాభై సంవత్సరా లుండవచ్చు. "ఛా ఊరుకోండి సార్, భలే వారే" అని అర్థమొచ్చేలా ఏదో అన్నాను.

వీపుమూట(బ్యాక్‌పాక్‌)ను తీసి కాళ్లమీద పెట్టుకున్నాను. అంతవరకూ ఆలోచనల్లో పడి తెలియలేదుగానీ ఆ చలికి నా బ్లాడరు నిండి కొన్ని యుగాలైంది. వీపుమూట నీళ్లోడుతోంది. ఇంతవరకూ మోకాళ్ల పైభాగం తడవలేదు. ఇప్పడు ఒక్కసారిగా మొత్తం తడిసిపోయింది. పైగా ఆ బండిలో కాళ్లు పెట్టుకునే స్థలం చాలా ఇరుకుగా వుండడంతో ఈ వీపుమూట పొత్తికడుపును నొక్కుతోంది.

ఈ చలికి వెచ్చగా స్మూత్'రాశయాన్ని' నెరవేర్చుకో గలిగితే అంతకంటే హాయి వుండదు కదా! కానీ మనం బతుకుతున్నది నాగరిక సమాజంలోనాయె. మానవ నాగరికత మీదే రోతపుట్టింది. ఇలాంటప్పుడే మనోనిబ్బరంతో పరిస్థితులను జయించవలసి వుంటుంది. :-)

ముందు సీట్లో రేంజరు పక్కన ఇంకొక వృద్ధ ఆపీసరు కూర్చొని వున్నాడు. ఆయనకు పాపం ఒక చిత్రమైన వ్యాధుల కలయిక వల్ల, పడుకొని నిద్రపోవడం సాధ్యం కాదట. కూర్చొనే నిద్రపోవాలట. రాత్రిళ్లు కొన్ని మందులు, మాత్రలూ తప్పనిసరిగా మింగాలి. ఆ మందులు పాంథర్‌జంక్షనులో వున్నాయట. వాటికోసం ఆయన మాతోపాటే వస్తున్నాడు. ఆయన బాధతో పోల్చుకుంటే నాదీ ఒక ఆపదేనా! అవతల మా మిత్రులిద్దరూ ఎంతగా ఆదుర్దాపడుతున్నారో ఆయన మాకు చెప్పాడు. ఆ రకంగా మేం ఆపద్బాధవులమయ్యాం.

మా పరిస్థితి మొత్తం కనుక్కున్నాడు. వాళ్లిద్దరూ మమ్మల్ని వెళ్లవద్దని హెచ్చరించారని, మేం వినకుండా కొండనెక్కడానికి వెళ్లామనీ, వాళ్లు మరోచోటుకు వెళ్లారనీ చెప్పగానే నవ్వి - పిరికివాళ్లు - అన్నాడు. నాకు నవ్వు రాలేదు. సాహసానికీ, పిరికితనానికీ, మొండిమూర్ఖత్వానికీ మధ్య చాలా పలుచని పొర వుందనిపించింది. ఎందుకంటే, ఇదే మంచువర్షంలో మేము కొండపైన చిక్కుకుపోయి వుంటే మాది మూర్ఖత్వమయ్యేది. క్షేమంగా కిందికి చేరాం గనుక మా నిర్ణయం ఒక సాహసమయ్యింది.

బండి ఒక గేటువద్దకు వచ్చి ఆగింది. కార్లకు ఎస్కార్టు ఇవ్వడం కోసం అక్కడ వేచివున్నాం. రేంజరుట్రక్కులోని సమాచార వ్యవస్థలో యేవేవో మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని సంఖ్యలు, కొన్ని సంకేతాలు, రకరకాల శబ్దాలూ...మధ్యమధ్యలో ఎన్ని వాహనాలొచ్చాయో వాకబు చేస్తున్నాడు. అన్నీ 4x4లేనని నిర్థారించుకొమ్మని వెనుక వాహనంలోని తన జూనియరును ఆదేశించాడు. అక్కడెవరో ముసలాయన గొడవ - ఆయనది 4x4కాదట, అయినా వస్తానంటున్నాడట. అతను రావడానికి వీల్లేదని సర్ది చెప్పి పంపించమని జూనియరుకు సలహా ఇచ్చాడు.

I know they hate me, but it's for their own good - అన్నాడు. ఒక గంట సేపటి తరువాత మొత్తానికి మా బండి మెల్లగా కదిలింది. వెనుకగా మిగతా వాహనాలు కదిలాయి. మమ్మల్ని ఉద్దేశించి There's nothing like weather that can make your trip memorable - అన్నాడు రేంజరు. ఇది మాత్రం చాలా నిజం అన్నాన్నేను.

మిగతా ప్రాంతాల రేంజర్ల నుంచీ వచ్చే రకరకాల సందేశాలతో పాటు, రేడియోలో మాటిమాటికీ ఒక సందేశం వస్తోంది - Msg 502 Message code 109. Toook. ఏమిటిదని రేంజర్ని అడిగాడు ముందు కూర్చున్న అధికారి. "నదిని దాటి వచ్చే ట్రాఫిక్‌ని గుర్తించడానికి వాడిన సెన్సర్ అది. దాన్నెవరైనా తొలగించే ప్రయత్నం చేసినపుడు ఈ సందేశం వస్తుంది, కాకపోతే ప్రస్తుతానికి ఈ సందేశానికి కారణం - దానిమీద నీరు గడ్డకట్టి ఒత్తిడి కలిగించడం కూడా అయివుండొచ్చు."

నిన్న ఆ నదిని చూస్తూ - ఇదేం పెద్ద లోతు లేదు, ఇక్కడ కాపలా కూడ లేదు, ఎంత దూరమని కాపలా కాయగలరు, కంచెలు వేయగలరు? అనుకున్నాంగానీ ఇప్పుడీ సెన్సర్ల సంగతి విని ఓహో అనుకున్నాం. (సశేషం)

No comments:

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.