Tuesday, February 19, 2008

ఒక ట్రావెలాగుడు - ఎనిమిదవ టపా

వర్షం కొద్దిగా తగ్గింది. రేంజరు బండిని మెల్లగా నడుపుతున్నాడు. సన్నని తుంపర్లు ట్రక్కు యొక్క విండ్‌షీల్డు (గాలి డాలు!? ) మీద పడి, గడ్డకట్టాలా వద్దా అని నిర్ణయించుకొనేలోగా వైపర్లు వాటిని విసురుగా తోసేస్తున్నాయి. పక్కనున్న ముసలి ఆఫీసరు చెబుతున్నాడు - "నేను వచ్చేటప్పుడు ఇంకా మెల్లగా వస్తున్నాను, 20-25mph లో, ఒక కారు చాలా వేగంగా నన్ను దాటి సర్రున వెళ్లిపోయింది. తరువాతి మలుపులో అది రోడ్డుపక్కకు జారిపోయి కనబడింది. ఆ కారు నడిపేవానికి తగిన శాస్తే జరిగింది. అలా జరుగుతుందని నేనూహించాను." ఈ మాటలు చెప్పడానికి ఆయనకు ఐదునిముషాలు పట్టింది. కారణం - ట్రక్కులోని వాకీటాకీ మాటిమాటికీ ఏదోవొకటి టాకుతుండటమే . వాటిని జాగ్రత్తగా వింటూ కొన్నింటికి సమాధానం చెబుతూ వస్తున్నాడు రేంజరు. ముసలి ఆఫీసరు మాటకు ఎవ్వరి నుంచీ స్పందన రాలేదు.

రేంజరు తన వ్యక్తిగత మొబైల్ ఫోనులో సిగ్నలుందేమోనని మాటిమాటికీ చూసుకొంటున్నాడు. అడక్కుండానే చెప్పాడు - "నా భార్యతో మాట్లాడాలి. ఈరోజు ఇంటికెళ్లేసరికి తెల్లవారుఝాము అవుతుందని చెప్పాలి. హైకర్లందరూ సురక్షితంగానే గమ్యాలకు చేరుకున్నారట. ఛాపర్ల అవసరం రాలేదు." ఒక చోటికి చేరగానే సిగ్నల్ వచ్చింది. వెంటనే తన పరిస్థితిని ఫోనులో ఇంటికి చేరవేశాడు. ఫోన్ జేబులో పెట్టుకుంటూ - "ఐ ల్‌ల్‌లవ్ దిస్ జాబ్... అండ్ దిస్ లేడీ టూ" అన్నాడు. ముసలి ఆఫీసరు అడిగాడు - "నీకు పిల్లలున్నారా" అని. మెడిసిన్ పూర్తి చేయనున్నకూతురు, కాస్త చిన్నవాడైన కొడుకూ వున్నారనీ, ఇద్దరూ చదువులో చాలా చురుకైనవాళ్లనీ సంతోషంగా చెప్పుకొచ్చాడు రేంజరు. నాకు చాలా ముచ్చటేసింది. ప్రయోజకులవుతున్న పిల్లలూ, తనను ప్రేమించే భార్య, తాను ప్రేమించే ఉద్యోగం. తాము చేసే పనిని ప్రేమించే వాళ్లను చాలా అరుదుగా చూశాన్నేను.

పాంథర్ జంక్షన్ చేరాం. అక్కడ మా ఇద్దరు మిత్రులు మాకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని చూడగానే, "ఇదిగో మీ మిత్రులు క్షేమంగా వచ్చేశారు, మీరిక ఆందోళన పడనవసరం లేదు" అన్నారు పాంథర్ జంక్షన్ అదికారులు - మా వాహనమోహన్‌తో. వాహనమోహన్ మొహంలో చెప్పలేని ఆనందం. పెద్ద బరువు దిగిపోయినట్టు ఒక సుదీర్ఘనిశ్వాసాన్ని వదిలి, ఒక నవ్వుకూడా విసిరాడు. మా కృతజ్ఞతలు అందుకునే తీరికగానీ, ఉద్దేశంగానీ లేనట్టుగా తన తరువాతి పనుల్లో పడి తన మిగతా సహోద్యోగుల్లో కలిసిపోయాడు రేంజరు. అక్కడొక అమెరికనుల జంట తమకు సరైన సహాయం అందలేదని అధికారులను దబాయిస్తోంది. పేరుకే అధికారిగానీ, ప్రజలకే అతనిమీద అధికారం వున్నట్టుందిక్కడ. ఆ అధికారులు కూడా తాము ప్రజాసేవకులమనే భావనతోనే పనిచేస్తున్నట్టుంది. అయ్యా, బాబూ, సారూ అని బతిమాలి కాళ్లూకడుపులూ పట్టుకొని, అంతోఇంతో అర్పించుకొని పనులు జరిపించుకొనే మన పరిస్థితి గుర్తొచ్చి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

బయట ఇంకా వర్షం కురుస్తూనే వుంది. అటుగా వెళ్తున్న మా రేంజరుకు ఒక 'థాంక్యూ' విసిరాను. అది ఆయనకు అందలేదు (వినబడలేదు). దీన్ని గమనించిన దబాయింపు జంట నన్నూ రేంజరునూ మార్చిమార్చి చూస్తూ నవ్వుకున్నారు. నాకు చివుక్కుమనిపించింది. ఐనా, మనకు సాయం చేసినవాడికి కృతజ్ఞులమవడం మన వంతు. మన పని మనం చేశాం. ఇందులో చిన్నబోవడానికేముందని సమాధానపరచుకుంటూ వుండగా ఆ రాత్రికి తిండీ నిద్రా ఎక్కడో అక్కడి అధికారులతో మాట్లాడి మా వాహనమోహన్ చూసుకుంటున్నాడు.

అక్కడికి బాగా పడమరలో - అంటే బిగ్‌బెండు అంచున - ఒక చిన్న పల్లెటూరిలో పూటకూళ్ల ఇల్లు. అక్కడ మా బస. మా వాహనంలో అక్కడికి ప్రయాణిస్తూ ఆరోజు పొద్దున్నుంచీ మావైపు ఏం జరిగిందో మేం చెప్పగా, వాళ్లెంత ఆదుర్దా పడ్డారో వాళ్లూ చెప్పుకొచ్చారు. మన తల్లిదండ్రులు మన గురించి ఆందోళన పడితే మనకు కాసింత విసుగుతో కూడిన ఆనందం కలుగుతుంది. అలాంటిది మన మిత్రుడు పడుతున్నాడంటే మరీ ఆనందం. అమ్మానాన్నలంటే పెద్దవాళ్లు, మరి మన వయసులో వున్న మిత్రుడుకూడా అలా అయిపోవడమంటే అది కొత్తసంగతి! వీడి మాట వినకుండా కొండనెక్కినందుకు క్లాసు పీకి చంపుతాడనుకుంటే వీడు సెంటిమెంటుతో చంపుతున్నాడు.

మా సా.యి. మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఏమిటలా వున్నావని ఆడిగాడు మోహన్. "ఒరు మాదిరి బయమా యిరుక్క అణ్ణే" అని సమాధానం. "ఇంకా భయమేముంది మనం సేఫ్" అని మోహన్ అనునయం. ఏం జరుగుతోందిక్కడ, నాకు తెలియాలి - అని నా సీట్లోనుంచి మూడుసార్లు లేచి కూర్చున్నాను నేను. వాహనమోహన్ చెప్పాడు - "మీరటు వెళ్లగానే మేం బండ్లో ఇంకోచోటుకు వెళ్తున్నాం. ఎదురుగా పెద్ద గోడ మాదిరి నల్లగా నిట్ట నిలువుగా పెద్ద కొండ. ఆ కొండమీదికి దిగూతూ తెల్లని మేఘాలు. ఉన్నట్టుండి జోరున వాన, మంచు, బండి అద్దాలమీద పడి దబదబ మని శబ్దం. దాంతో మనోడు కాస్త భయపడ్డాడంతే!" పరిస్థితి అర్థమైంది కానీ, పెద్దగా నవ్వొచ్చింది.

"ఈ ఆనంద సమయంలో మాంచి పార్టీ" - అన్నాడు వా.మో. అందరం సై అన్నాం. అది మెక్సికన్ శైలి పూటకూళ్ల ఇల్లు. ముందుగా మా గది తాళాలిప్పించుకొని, తడిసిన బట్టల్లోంచి శరీరాలను బయటకు తీసి ఆరబెట్టి బట్టలను హీటరు గాలికి ఆరేసి, అరగంటలో తాజాగా భోజనానికి సిద్ధమయ్యాం. అక్కడ గిటారు పట్టుకొని జానపదాలు పాడే ఒక గాయకుడు వున్నాడు. మాంచి ఆనందంగా పాటలు పాడుతున్నాడు. మన జానపదాల్లాగే ఆ ప్రాంతానికి సంబంధించిన జీవితాన్ని ప్రతిబింబించే సంఘటనలే ఆ పాటల్లోని విషయం. శరీరానికి వేడిని చేకూర్చే ఒక గ్లాసుడు సురాపానం చేస్తూ వింటూండగా, మా ముందుకు భోజనాలొచ్చాయి. మరిన్ని పాటలు అడిగి పాడించుకొంటూ, తలా కొంచెం కలాపోసన చేసి తిరిగి మా గదికొచ్చి కంటినిండా నిద్రపోయాం.

తెల్లారి నిద్రలేచి బయటకొచ్చి చూస్తే కొండలన్నీ తెల్లగా మెరుస్తున్నాయి. ఎండ జోరుగా కాస్తోంది. ఆ రోజు అక్కడినుంచీ బయటపడి, మా గుడారాలు, ఇతర సామాగ్రిని వదిలివేసిన చోటు(చీసోస్ బేసిన్)కు వెళ్లి, అవన్నీ బండిలో వేసుకొని హ్యూస్టనుకు చేరుకోవాలి. అవన్నీ తీరా అక్కడికెళ్లాక మళ్లీ మంచు మొదలై ఇరుక్కుపోతామేమోనని నా అనుమానం. ఏమీ కాదు, ఎండ కాస్తోంది అని వా.మోహన్.

దారిపొడవునా మంచు. ఆ ప్రాంతమెలా వుందంటే ...


ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో మాత్రమే చూసివున్న నాకు, ఒక ఎడారిలో ఇలాంటివి కనిపించడం భలే అనుభవం. కాసింత సామాగ్రికోసం మళ్లీ చిక్కులో పడబోతున్నామేమో అనిపిస్తోంది ఒకపక్క.

మేం బస చేసిన ప్రదేశం ... ఇలా కనిపించింది. ఈ గుడారాలకు చిన్న చరిత్ర వుంది. వీటితో కొన్ని సెంటిమెంట్లు ముడిపడి వున్నాయి. వీటి అవశేషాలైనా సరే హ్యూస్టనుకు చేరాలి. అంతేగానీ ప్రయత్నం చేయకుండా వదిలేసి రావడం బాధకలిగిస్తుందని మా వాహనమోహన్ చెప్పాడు.


(సశేషం)

2 comments:

రాజు said...

ఫోటోలు అద్భుతం. మీ శైలి ఇంకా అద్భుతం.

రానారె said...

థాంక్యూ రాజుగారూ.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.