ఒక ట్రావెలాగుడు - ఆరవ టపా

ఇద్దరూ అందంగా వున్నారు. మా ఆశాదీప్ కంటే బలంగా వున్నారు.
ఉన్నట్టుండి గాలి వీచింది. కొమ్మలపైనుంచి నీటి చినుకులు టపటపా రాలాయి.
వాళ్లిద్దరూ ఒకేసారి కెవ్వుమన్నారు. మామూలు కన్నా కొంచెం ఎక్కువ కెవ్వు అది.
తరువాత బిగ్గరగా గిగిల్ గిగిల్ అని ఆంగ్లంలో నవ్వారు.
ఆ నవ్వులో పలకరింపు కూడా కలిసి వుంది.

చిన్న పలకరింపు తరువాత అడిగాం, సౌత్‌రిమ్ నుంచా ఎమొరీపీక్ నుంచా? అని.
"ఎమొరీ నుంచి. మీరు రిమ్ముకా, పీక్‌కు వెళ్తున్నారా?"
"ఎమొరీకే."

"మీరేదైనా అడవి జీవాన్ని చూశారా?" అడిగారు.
"దుప్పి తప్ప ఇంకేమీ కనబడలేదు. మీకేమైనా..?"

"మాకూ అంతే. అంతకుమించి కనబడకపోవడమే మంచిదేమో. హిహీ."
"హహ్హ, మాకూ ఇప్పుడే అర్థమౌతోంది మేము సరిగా సంసిద్ధం కాకుండా వచ్చామని."
"జాగ్రత్తగా వెళ్లిరండి"
"థాంక్యూ"

ఇప్పటివరకూ దారిలో కనబడిన ప్రతివాళ్లూ "జాగ్రత్త" అనే మాటనే మాడుతున్నారు. క్షేమంగా వెళ్లిరండి అంటే సందేహించాల్సిన పని లేదు గానీ జాగ్రత్త అనేటప్పటికి మళ్లీమళ్లీ అనిపిస్తోంది - మనమేమైనా మూర్ఖంగా ముందుకుపోతున్నామా అని. ఇంకో సంగతేమిటంటే అందరూ ఎదురొచ్చేవాళ్లేగానీ పైకివెళ్తున్నవాళ్లు ఎవరూ తారసపడలేదు. పెద్ద కొండనెక్కడం మాకిది మొదటిసారి. అందునా వాతావరణం ఏమీ బాగోలేదు. తుంపరలు వానగా మారుతున్నాయి.

తిని బయల్దేరబోతుండగా ఒక పొడుగాటి మానవుడు పెద్దపెద్ద అడుగులేస్తూ మమ్మల్ని చూసి - "నలుగురు రష్యనులు గుంపుగా పైకి వెళ్లడం మీరేమైనా చూశారా" అనడిగాడు. లేదండీ అన్నాను. థాంక్యూ అనేమాటకూడా చెప్పకుండా మమ్మల్ని దాటి వడివడిగా వెళ్లిపోయాడు. ఏమిటి సంగతి అని అడగడానికి అవకాశం లేదు. ఈ సంఘటన మాలో కొంచెం ఉత్కంఠతను పెంచింది.

ఒకచోట మా ఆశాదీప్ ఒక మొద్దుపై అడుగు వేశాడు. తడికి అది సర్రున జారింది. పెద్దగా బెణకలేదు. అక్కడ గనుక ఆశాదీప్ కాలు బెణికి 'మడమ తిప్పని యోధుడు'గా మారిపోతే కష్టం. వెంటనే నాకు "జాగ్రత్త" చెప్పాడు, మొద్దులమీదా బండలమీదా పొరపాటున కూడా అడుగువేయొద్దని. నేల బురదగా మారుతోంది.

అప్పుడొకటీ అప్పుడొకటీ చిన్న చిన్న వడగండ్లు పడటం మొదలైంది. వాటిని వడగండ్లు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అవి బొరుగుల మాదిరి తేలికగా వున్నాయి. వడగళ్లు మనమీద పడి జారిపోతాయి. ఇవి బట్టలకు అతుక్కుపోతున్నాయి. అప్పటికి ఒక కూడలి లాంటి చోటుకు చేరాం. అక్కడినుండి సౌత్‌రిమ్‌కు వెళ్లేదారి, ఎమోరీశిఖరానికి వెళ్లే దారి విడిపోతాయి. అక్కడి నుంచి మరి కొంతసేపు రాతిమెట్ల వెంట పైకి నడిస్తే శిఖరాన్ని చేరుకోవచ్చు. ఆ దారివెంట పైకి చూస్తే ఎక్కువదూరమేమీ కనబడటం లేదు, కొద్ది సేపట్లో చీకటి పడేలా మబ్బుగా వుంది. సమయం మధ్యాహ్నం రెండుగంటలు. చలికాలం కాబట్టి త్వరగానే చీకటి పడుతుంది. నాలుగు గంటల్లోగా ఇంత దూరమూ వెనక్కి నడవాలి. కొండ ఎక్కడం కన్నా దిగడమే కష్టమంటారు, తిరుమలకు నడిచిన వాళ్లు. ఇంటర్మీడియట్లో స్నేహితులతో కలిసి నేనూ ఒకసారి ఎక్కిదిగాను కానీ అప్పుడు నాకేమీ కష్టమనిపించలేదు.

చూస్తూ వుండగానే మా చుట్టూ బొరుగులు చల్లినట్లు నీటిగుళ్లు. మా ఆశాదీప్ అన్నాడు - "ఈ మబ్బుల్లో ఎమొరీ పైకి నడచినా ఇప్పుడు చూడగలిగేదేమీ లేదు." నిజమే అనిపించింది కానీ, కనీసం ఒక సారి ఎక్కామన్న తృప్తి వుంటుంది కదా అని కూడా అనిపించింది. "నువ్వేం చెబితే ఆ పని చేద్దాం" అన్నాను. "వెనక్కుమళ్లడమే మంచిదేమో, చీకటి పడుతోంది, మనుషులెవ్వరూ కనబడటం లేదు" అన్నాడు.

వెనుదిరిగాం. వాన బొరుగులు ఎక్కువౌతున్నాయి. చక్కెర పాకం లాంటి వానను చూడటం మాకు అదే మొదలు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ నడుస్తున్నాం. ఆ ఎడారి ప్రాంతంలో ఈ పర్వతాలు కాస్త పచ్చగా వుంటాయి. చెట్లన్నీ ఉన్నట్టుండి తెల్లగా మారిపోతున్న వింత ఒకవైపు, ఇలాంటప్పుడు నాలుగు సింహాలెదురైతే... అనే ఊహ మరొక వైపు. పరుగులాంటి నడకలో ఒక బండపై రెండు కాళ్లూ సర్రున జారి పడబోయి నిలదొక్కుకున్నాక గమనించాను బండలపైన పలుచని నునుపైన గాజుపొర లాగా నీరు గడ్డకట్టిన సంగతి. నావిహైకింగ్‌ పాదరక్షలు. కానీ ఇక్కడ వాటి గొప్ప పనికి రాలేదు.

చలి నా పాదరక్షల్లోకి దూరి వేళ్లను కొరకసాగింది. ఒక చెట్టుకింద ఆగి వీపుమూటలోనుంచి ఉత్తేజితకర్బనసంచులను తీసి పాదరక్షల్లో పాదాల కింద వేసి మళ్లీ పరుగుందుకొన్నాం. పాదాలకింద వేడి పుట్టించి రక్షించింది కర్బనం. ఒళ్లు, కళ్లు దగ్గరపెట్టుకొని మరింత జాగ్రత్తగా దారిని గమనిస్తూ పరుగాపకుండా చాలాదూరమే దిగి వచ్చేశాం.

చేతితొడుగులు (Gloves) తీసి వేళ్లను చూపించాడు ఆశాదీప్. అవి నీలం రంగులోకి మారిపోయి వుండడం చూసి నాకు మొదటిసారి నిజంగా భయం పుట్టింది. కారణం అతని చేతితొడుగులు పూర్తిగా తడిసిపోయాయి. వాటిని తీసి పక్కనబెట్టి చేతులను లాగూలో పెట్టుకొని నడకవేగం తగ్గించాల్సి వచ్చింది. ఆశాదీప్‌తో పాటే నేను కూడా పరుగు ఆపేయాల్సి వచ్చింది.దారిపొడవునా చాలానే మంచి దృశ్యాలు చూశాం. పొద్దున మేం బయలుదేరిన చోటుకు ఇంకొక మైలు దూరంలో వున్నామనగా మేము నాటవుట్ బల్లెబాజీలమనే ధైర్యంతో కెమెరా బయటకు తీశాను. తడిస్తే తడిసిందిలెమ్మని అక్కడొకటీ అక్కడొకటీ క్లిక్కుమనిపిస్తూ వచ్చాను.

చివరికి గమ్యం చేరాం. చీసోస్ బేసిన్ సందర్శకుల కేంద్రం మూసివేయబడివుంది. అంటే సమయం మూడున్నర దాటింది. అక్కడి నేలంతా చక్కెరపాకం వానతో జారిపోతోంది. కొందరు పిల్లలు వారి తల్లిదండ్రుల వారింపులను పెడచెవినబెడుతూ అందులోనే ఆడుకుంటున్నారు.

సందర్శకులకేంద్రపు వసార కింద అరగంటసేపు నిలబడి, బట్టలకు అతుక్కున్న మంచును, వీపుమూట మీద పేరుకున్న మంచునూ దలుపుకుంటూ అక్కడ కదులుతున్న ప్రతివాహనాన్నీ గనించడం మొదలెట్టాం. అది మాదేనేమోనని. ఈదురుగాలికి ఎక్కువసేపు అక్కడ వుండలేకపోయాం. పక్కనే నేను ఇందాక చెప్పిన అంగడి వుంది. అందులో వేడివేడిగా కాఫీ కూడా దొరుకుతుంది. కానీ తడిసి ముద్దైన మమ్మల్ని అసహ్యించుకుంటారేమోనని నా బాధ. ఐనా ఫరవాలేదు ఇక్కడుంటే చలిగాలికి చచ్చిపోతాం, వెళ్లాల్సిందేనని ఆశాదీప్. కొద్దిగా నీళ్లోడాక లోనకెళ్లాం. కాఫీ కొంటున్నప్పుడు ఆ అంగడి ముసలమ్మ నన్ను చూసి - "నిన్న నువ్వు కొన్నదువ్వెన ఇదుగో" అంది. అప్పటిదాకా చూసుకోలేదు, దువ్వెన నిన్న సాయంత్రం అక్కడే పడిపోయింది. చాలా సంతోషం కలిగింది, ముఖ్యంగా నన్నావిడ గుర్తుపట్టినందుకు. నేను మా పరిస్థితి చెప్పాను. "అయ్యో, మీ మిత్రులు వాహనంలో వెళ్లిన ప్రాతం మొత్తం మెరుపువరదలు. అక్కడినుండి ఇక్కడికి రోడ్డుమార్గం మూసేశారు. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలీదు. ఫరవాలేదు, మీకిష్టమైనంత సేపు మీరిక్కడే వుండొచ్చు. రేపు మేం కూడా అంగడిని మూసేస్తున్నాం", అంది. రేపు అంటే ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు. "మీకిష్టమైనంత సేపు" అంటే మరో మూడున్నరగంటలు. (సశేషం)

కామెంట్‌లు

ramya చెప్పారు…
అయ్యో ఎమొరీ పైకి వెళ్ల లేదా!
ఎంత సేపు మీకేమౌతుందో అనుకున్నా పాపం మీ వాళ్లు.
తరువాత ఏం జరిగిందో చెప్పండి మరి.
రవి వైజాసత్య చెప్పారు…
అవునూ..తర్వాతేం జరిగింది? వాహనమోహను మీద బాగా చిరాకేసింది.
oremuna చెప్పారు…
బాగు బాగు
Naga చెప్పారు…
బాగుంది. అలాగే మీ ఫుటవ (photo) కూడా ఒక్కటి లాగిస్తే బాగుంటుంది...
రాధిక చెప్పారు…
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.
రానారె చెప్పారు…
రవి, చిరాకు పోయిందా? :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం