ఒక ట్రావెలాగుడు - ఐదవ టపా

ఈ మారు పెద్దావిడ చెప్పింది - "వద్దు. వద్దు. నన్నడిగితే వద్దంటాను." చూశావా అన్నట్టుగా చూశారు మిత్రులిద్దరూ. పక్కకు పిలిచి చెప్పాను, ఇందాక ఆ పెద్దాయన ఏమన్నాడో. అంతలో ఆశాదీపం నాదగ్గరకొచ్చి "మనం మాత్రం వెళ్తున్నాం, ఏమంటావు", అన్నాడు. 'అదిరా మొనగాడు' అనిపించింది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ మాత్రం రిస్కున్న పని చేయడంలో వున్న మజా కోసమే నేను ఇంత దూరం రావడం.

వెంటనే వాహనంలోకి వెళ్లి వీపుమూట ను సిద్ధం చేసుకుని బయల్దేరాం. నా అత్యుత్సాహాన్ని గమనించిన పితామహ అన్నాడు - "పంతం పట్టినట్టు అలాగే ముందుకు వెళ్ళకండి. వెనక్కి మళ్లవలసివస్తే వెనక్కు మళ్లండి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి." అనే మాటలతో మనసు దోచాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకొన్నాను. సరేనన్నాను. సాయంత్రం మూడున్నర-నాలుగు గంటలకల్లా మేము బయలుదేరుతున్న ప్రాంతానికి తిరిగి రావాలనీ, ఆలోగా ఇతర ప్రాంతాలను చూడటానికి వాళ్లిద్దరూ వాహనంలో వెళ్లి, మాకోసం తిరిగి రావాలనీ నిర్ణయం జరిగింది. 'కడసారిది వీడ్కోలు - కన్నీటితొ మా చేవ్రాలు' టైపులో మాకు ఒళ్లు జలదరించే వీడ్కోలు అందింది. మాది మూర్ఖత్వమా అని మళ్లీ ఒకసారి అనిపించింది. ఆశాదీపాన్ని అడిగాను. అలా అనిపించినప్పుడు వెనుదిరుగుదాం పదమన్నాడు.

ఒక కూడలికి వచ్చాం. ఎమొరీ పీక్ 4.3 మైళ్లు అని ఒక ఇనుపముక్క కనబడింది. ఆ దిశగా అడవిలోకి వడివడిగా అడుగులేశాం. అరగంట సేపు మనుషులెవరూ మాకు కనబడలేదు. చుట్టూ చూస్తూ వెళ్తున్నాం.

అడవిసింహాలు కనబడితే ఏం చేయాలో ఒక ఇనుపరేకుపై రాసి పెట్టారొకచోట.
మొదటి సూచన - "భీతిల్లకండి".
రెండవ సూచన - "పారిపోకండి".
మూడవది - "పిల్లలుంటే వారిని ఎత్తుకొనండి."
నాలుగవది - "దగ్గరదగ్గరగా చేరి, ఎత్తుగా నిలబడండి."
ఐదవది - "కర్రలు పైకెత్తి చూపిస్తూ మీ సత్తుకొద్దీ గట్టిగా అరవండి."
"చివరిగా, ఈ ఘటనను పార్కు రేంజరుకు తెలియజేయడం మరువకండి".

అవి చదివాక నాకు చాలా ఆలోచనలు మొదలయ్యాయి. మేమున్నది ఇద్దరమే. ఇద్దరిలోనూ ఆశాదీప్ భారీకాయుడు, బలంగా కనిపిస్తాడు. పెద్ద మూట మోస్తున్నాను గనుక నేను కూడా భారీగానే కనిపిస్తూ వుండవచ్చు. డిస్కవరీ ఛానల్లో చూసినదాని ప్రకారం సింహాలు గుంపులుగుంపులగా

వేటాడతాయి. కానీ ఎక్కువగా రాత్రిపూటే వేటాడతాయి. ఇది మిట్ట మధ్యాహ్నమే కానీ మబ్బుగా వుంది. మెల్లగా తుంపర్లు పెరుగుతున్నాయి. ఒకచోట ఆగి సంచీలోంచి పాలిథీన్ చొక్కా తొడుక్కున్నాం.

గుంపులుగా పదిమంది జనం వెళ్లారు. హెల్లో అన్నారు. మాట కలిపాం. వాళ్లు నిన్న సౌత్‌రిమ్ పైన బసచేసి పొద్దన దిగబడి వస్తున్నారు. వాళ్లకది మూడోసారట. ఈ వాతావరణంలో మేం వెళ్ళిరావడం కుదురుతుందంటారా అనడిగాం. ఫరవాలేదు వెళ్లొచ్చన్నారు. మళ్లీ జాగ్రత్త అన్నారు. మా సందేహమూ సస్పెన్సూ అలాగే వుంది. మేం ముందుకే సాగాం.

ఉండుండి చల్లగా గాలి వీస్తోంది. వీచినప్పుడు చెట్ల కొమ్మల నుండి జలజలా నీటిచుక్కలు రాలి మీద పడుతున్నాయి. కొండవాలు వచ్చింది. ఒకచోట మాకు కుడివైపున దట్టమైన పొదలు, చెట్లు. ఎడమ వైపున లోతుగా వాలు. పది పదహైదు మీటర్లు కనబడుతోంది. ఆ తరువాత దట్టంగా మంచు. నాకనిపించింది - "ఇప్పుడొక సింహం ఈ గుబుర్లలోనుంచి నా మీద దూకి ఎడమవైపున్న వాలులోకి తోసిందంటే నేనెలా తప్పించుకోగలను" అని. అదే మాటను ఆశాదీప్‌తో చెప్పాను. "కష్టమే" గుంభనంగా అన్నాడు ఆశాదీప్. కొద్దిసేపాగి అన్నాడు, "మనం కనీసం ఐదుమందైనా జట్టుగా రావాలి ఇంలాటి చోట్లకు". నిజమే. సంచీలో చేతికి అందుబాటులోనే ఒక చాకు వుంది. ఒకసారి కింద పడ్డాక చాకును చేతికి తీసుకునే అవకాశం వస్తేకదా అనిపించింది.

మధ్యమధ్యలో కొంత మంది ఎదురొచ్చారు. వారిలో ఆ ప్రాంతాన్ని బాగా ఎరిగిన వారొకరు వాళ్లదగ్గరున్న మంచి నకషా ఇచ్చారు మాకు. అందులో మేం ఎక్కడున్నామో చూపించారు. దాన్నిబట్టి మేం ఎంతదూరం వచ్చామో తెలిసింది. అయినా, మేము శిఖరానికి చేరినా ఆ ఎత్తునుంచీ కనిపిస్తుందని చెప్పబడుతున్న అద్భుత దృశ్యం మంచువల్లనూ , మేఘాలవల్లనూ మేము చూడలేం. కానీ ముందుకే వెళ్లాలనిపిస్తూ వుంది. కొండ వాలున వున్నామని తెలిసినప్పుడల్లా సింహాలు గుర్తొస్తాయి. అసలు సింహాలకు ఆహారం తక్కువైతేకదా మనుషులమీద పడాలి. ఈ కొండనిండా కావలసినన్ని దుప్పులున్నాయి. ఈ ఊహతో మీదపడి చంపుతాయనే ఆందోళన పోయింది. వెంటబడవు కనుక, సింహాలు కంటబడితే బాగుండుననిపించింది.

ఒకచోట వున్నట్టుండి రంగురంగుల ఆకులచెట్లు కనబడ్డాయి. మ్యాప్పిల్ చెట్లంటారు వీటిని. వాటి ఆకులు రాలి ఆ మార్గం భలే అందంగా మారిపోయింది. క్లిక్కుమనిపించాలని ఆగాను. కెమెరా తడిసిపోకుండా కాపాడుకోవడం కష్టం కావడంతో దాన్ని వీపుమూటలోకి తోసేశాను. చినుకులు పడుతూనే వున్నాయి. గమనించలేదుగానీ ఆకలి బాగా పెరిగిపోయింది.

అక్కడ ఆగి మా వెంట తెచ్చుకున్న రొట్టెముక్కలు తింటుండగా ఇద్దరు ఆడపిల్లలు దిగివస్తున్నారు. (సశేషం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం