ఒక ట్రావెలాగుడు - రెండవ టపా

దాంతో వారి జీవితాలు దుర్భరమయ్యాయట. వాళ్లమ్మే వస్తువులను కొనడం చట్టరీత్యా నేరమని అమెరికా ప్రభుత్వం ప్రకటించడంతో సందర్శకులు చొరవగా కొనలేకపోతున్నారు. అయినా ఇప్పటికీ పెద్దగా నీళ్లు పారని

కొన్నికొన్ని చోట్ల నడిచి నదిని దాటి వస్తుంటారు మెక్సికన్లు. వచ్చి అక్కడున్న సందర్శకులతో 'ధర్మం చేస్తే పుణ్యఁవొస్తది - కర్మ నశిస్తది బాబూ' అంటూ చేయిజాచి అడుగుతారు. రాగి తీగతో తయారు చేసిన తేలు, మండ్రగబ్బ, కుర్చీ, తాబేలు, పీత లాంటి బొమ్మలను ఇలాంటివాటిని సరిహద్దు

ఈవల చెట్లకింద పెట్టి ఒక హుండీపెట్టి "తమ దయ-మా ప్రాప్తం" అనే భావం కలిగించేలాగ వాళ్లకొచ్చిన ఆంగ్లంలో ఏదో రాసిపెట్టి వెళ్లిపోతారు. నదికి ఆవలి ఒడ్డున ఒక మెక్సికో యువకుడు మోకాళ్లమీద కూర్చొని వెదురుటోపీ పెట్టుకొని ఆ టోపీపై ఒక చేయి పెట్టి కిందికి చూస్తూ

నిలబడివున్నాడు. మేమక్కడున్నంత సేపూ వాడు కదలనే లేదు. అదే భంగిమలో వున్నాడు. దారిద్ర్యంలో మనిషి మనఃస్థితి ఎలా వుంటుందో నాకు కొంత తెలుసు. ఆ గ్రామస్తులను తలచుకుంటే మా సంగతులు చాలానే మనసుకొచ్చినాయ్. మా పల్లెల్లో బిడ్డలను సరిగా చదివించనూ లేక, చేసే

సేద్యమూ గిట్టుబాటు కాక, ఈ ఎడారిలో చలికాలానికీ ఎండకాలానికీ మొండిగా తట్టుకొనే చెట్లమాదిరిగా మిగిలిపోయిన చిన్నపాటి రైతుకుటుంబాల మనఃస్థితులు గుర్తుకొచ్చినాయి. దుఃఖాత్ దుఃఖం క్షుదా - అన్నారు.

వచ్చి బండ్లో కూర్చుందామనుకుంటే దాని తాళంచెవి నాదగ్గర లేదు. పక్కనే ఒక గుట్టవుంది. గబగబా దాన్నెక్కి ఒక బండమీద కూర్చొని చూస్తున్నాను. చంపే చలిగాలి. చేతికి తొడుగులున్నాయి. కానీ అవి సరిపోవడం లేదు. ఆ మెక్సికన్ పిలగాడు గట్టోడే. వాడు తట్టుకోగలుగుతున్నాడు.

గాలి సుళ్లు తిరుగుతూ పైకి లేస్తోంది. ఆ గాలితో పాటే అమెరికాకు చెందిన దుమ్ము కూడా లేచి నదిని మీదుగా మెక్సికో తీరం దాటింది. ఈ పక్కనుంటే మన్ను. ఆ పక్కకుపోతే మశానం.

ఆ ప్రాంతమంతా సముద్రతల్పంగా (Seabed) వుండేదట - ఒకప్పుడు. అక్కడి రాళ్లు, మట్టి, కొండలు వేటిని చూసినా సున్నపురాళ్ల మాదిరిగా తేలికగావున్నట్టనిపించాయి.

తరువాత అక్కడినుంచి బయల్దేరి ఆఫ్-రోడింగ్ అనే పేరిట, ఎడారికి అడ్డంగా బండి నడిపే కార్యక్రమం. అందరూ అలా నడిపితే అసలే బతలేక ఇబ్బంది పడుతున్న అక్కడి చెట్లన్నీ చచ్చిపోతాయి కదా! అంచేత అప్పటికే కొందరు నడిపిన దారిలో నడపాలన్నమాట. దారంతా

గులకరాళ్లు, చిన్నా చితకా గుంతలూ గుట్టలు, ఇసుక అలా వుంటుంది. మాలో ఒక వాహనప్రేమికుడున్నాడు. ఆయన బండిని చాలా మెల్లగా నడుపుతున్నాడు. అంటే గంటకు 15మైళ్ల గరిష్ట వేగంతో. కొంచెం వేగంగా పోనీవయ్యా అంటే వీల్ అలైన్‌మెంట్ దెబ్బతింటుంది అన్నాడు.

అదేమన్నా పెళ్లి ఊరేగింపా లేకపోతే దేవుని మెరవణా అంత మెల్లగా పోవడానికి!? అబ్బా వీడి వాహనమోహం హననమవ్వా అని తిట్టుకున్నాం. అలాంటప్పుడు కొంచెం వెరయిటీగా తిట్టుకోకపోతే నిస్తేజం ఆవరిస్తుంది కదా! అదే బండిని అలాంటి రోడ్లో యిరగదీయొచ్చనేది మాలో ఒకడి

అనుభవం. అది విరిగిపోతే ఏంటి గతి అని వాహనమోహన్ వాదన. అంతేగాక మా అందరిలోనూ అత్యంత అమెరికా అనుభవమూ, వాహనచోదనాపితామహుడనే బిరుదమూ కలవాడనని అతనికి కొంత స్వాభిమానం. పితామహుణ్ణి సింహాసనం నుంచి తప్పించెయ్యాల్సిందే - అన్నాడు మాలో

ఒక యువరాజు. నేను తందాన అన్నాను. ఆతని అభిమానాన్ని బలంగా దెబ్బతీశామని మాకప్పుడు తెలియలేదు. ఆ ఘటన పితామహుడిని ఎంత బాధపెట్టిందో నాకు నిన్నంటే నిన్ననే తెలిసొచ్చింది. దాని ప్రభావంతో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను - నా ప్రవర్తన గురించి.

సర్లెండి ఆ గోల ఇప్పుడెందుకు. గంటకు పదీ పదిహైదు మైళ్ల వేగంతో కొంతసేపు ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వెళ్తున్నాం. సుమారు ఒక గంట సమయం గడిచింది. అక్కడ డ్రైవరును మార్చాం. కొత్త డ్రైవరు గతంలో ఆ బండిని యిరగదీసిన వా డగుట చేత రెట్టింపు వేగంతో వెళ్తున్నాం.

ఇంట్లో కళ్లెదుటే దోపిడీ జరుగుతుంటే నెత్తీనోరు బాదుకొని గగ్గోలు పెట్టే లోభిలాగా మా వాహనమోహన్ మెల్లగా వెళ్లమని నెత్తీనోరూ బాదుకుంటూనే వున్నాడు.


బండి జోరుగానే పోతోంది, ఎగిరెగిరి పడుతోంది, వెనుక దుమ్ము భారీగా లేస్తోంది. ఆ దుమ్ములో కిటికీ అద్దాలు తెరిచి ఫోటోలు తీస్తానంటాడు మా సా.యి. వద్దరా బాబూ ఈ దుమ్ముకు ఆస్తమావచ్చి అందరం ఇక్కడే పరమపదిస్తాం అని చెప్పగలిగాం. ఒకడికి ముగ్గురు చెబితేగానీ

వినే పరిస్థితి కాదు. అందరం అదే మూడ్ లో వున్నాం. అద్దాల్లోంచే ఫోటోలు తీస్తున్నాడు సాయి. అక్కడ అంతగా ఏముంది అంటే - అక్కడక్కడా ఒక సమాధి, ఒక చచ్చిపడిన పాము, కొన్ని దశాబ్దాల క్రితమెప్పుడో అక్కడే చెడిపోయి చిలుముపట్టి చెదలుబట్టి ఒకవైపుకు వాలిపడియున్న

జీ.ఎం.సీ ట్రక్కు, కొ్న్ని ఎముకలు, ఉన్నట్టుండి ఒక పూలపొద, చిన్ననీటి చెలమ, ఒక పాడుబడ్డ గాలిమర, రోడ్‌రన్నర్‌గా పిలువబడే నేలమీద రోడ్డుకడ్డంగా పరుగెత్తే పిట్ట, తలెత్తి భయపడకుండా వాహనాన్ని చూస్తూ నిలబడే దుప్పి, బెళ్లాయిలు (లేదా బెళ్లగువ్వలు), జావెలీనా అనబడే అడవిపంది, మాకంటే చాలా వేగంగా ఎదురొస్తూ ఒకటిరెండు ప్రత్యేక ఆఫ్‌రోడింగ్‌ వాహనాలు, వాటివెనక వచ్చే దుమ్మూ... వాటిని చూసి 'మనం మళ్లీ రావాలి - కొంచెం హుషారైన

మనుషులతో వారాలి - ఇలాంటి రోడ్లను తట్టుకునే శక్తివంతమైన వాహనంతో రావాలి' అన్నాను నేను పక్కనే ఉన్న యువరాజుతో. ಬರುಬೇಕು (బరుబేకు) అన్నాడు యువరాజు. 'హుషారైన మనుషులతో' అన్న మాట పితామహుని పుండుపై కారంచల్లిందని అప్పుడు మేమిద్దరమూ

గ్రహించలేకపోయాం. సమయమెంతైందో చూద్దామని నా సెల్‌ఫోను బయటకు తీశాను. మధ్యాహ్నం మూడున్నరైంది. సింగ్యులర్‌వారి జాలపు ఆనవాళ్లేమీ వున్నట్టులేదు. అసలు అక్కడ సాధారణ మొబైల్‌ఫోన్లు ఏవీ పనికిరావు.


'మనమెక్కడున్నాం' అని చుట్టూ చూసుకొంటే విశాలమైదానంలో చిన్నాచితకా(ముళ్ల)పొదలు కనుచూపుమేర విస్తరించగా, దిగంతాల్లో కొండలు పెద్ద వృత్తాన్ని ఏర్పాటు చేశాయి. ఆ వాతావరణాన్ని ఆకాశంలో బాగా పైనుంచి చూస్తే ఎలావుంటుందో ఊహించుకున్నాను. మా వాహనం పైన ఆకాశంలో రాబందులు కూడా తిరుగుతూవుంటే దృశ్యం చాలా కళాత్మకంగా వుంటుంది కదా అనిపించింది. :)


ఆ దారిలో కనిపించిన ఎన్నోరకాల చెట్లలో క్యాండిలిల్ల అనేదొకటి. కన్నడాంగ్లంలో కొవ్వొత్తిలేదు అని అర్థంవస్తుంది కదా అనుకొంటి. విషయమేమిటంటే దాన్నుంచీ మైనం ఉత్పత్తిచేస్తారట. అది పెరిగేది ఎడారి ప్రాంతంలో. అక్కడ పరిశ్రమ స్థాపించడానికి అనువైన నీటి సౌకర్యంకూడా

తోడయింది. తీవ్రమైన చలికాలంలో ఆ మొక్కెలావుంటుందో నేను వర్ణించి చెప్పడమెందుకు మీరే చూడండి.



ఉత్తరందిశగా అలాగే మరింత ముందుకెళ్ళాం. చాలాదూరమే వచ్చామనిపించాక ఒక గుట్టలాంటిది దిగి, మరో పెద్ద మట్టి గుట్ట దగ్గర ఆగాం. ఆ ప్రాంతం పేరు ఎర్న్‌స్ట్ టినాహ (Ernst Tinaja). అక్కడ బండి దిగి ఒక ఎండిన లోయ లోనికి నడక ప్రారంభించాం. మా వాహనమోహనుడికి ఛాయాగ్రహణమొర్రి వుంది. శుద్ధమైన తెలుగులో చెప్పాలంటే ఆయనొక ఫోటోగ్రఫీ ఎంథూజియాస్ట్ అన్నమాట. అంచేత బండి దిగగానే రఁయ్యిమని బయల్దేరాడు.

ఆ లోయను కూడా నీళ్లు ఏళ్లతరబడి కోసినట్లుంది.

అక్కడి రాళ్లు కూడా మెత్తని సుద్దరాళ్లు.

ఈ రాళ్లలో సహజసిద్ధంగాకోతకు గురై ఎర్పడిన లోతైన గుంతలున్నాయి. ఈ గుంతల్లో ఎప్పుడూ అంచులదాకా నీరుంటుంది. మంచినీటి చెలమ ఏదో వీటిని నింపుతుండవచ్చనేది ఒక నమ్మకం. ఈ ప్రాంతంలో నివసించే దుప్పులు, ఎలుగుబంట్లూ, కొండసింహాలు మొదలైన జంతుజాలానికి ఈ గుంతల్లోని నీరే ప్రాణాధారమట. మరీ ముఖ్యంగా వేసవిలో. ఈ నీటికోసం వచ్చే జంతువులను తినడానికి కాసుకొని కూర్చునే మాసాంహారజంతువులు, వాటి జీవన్మరణ సమస్యలూ ఇవన్నీ ఊహించుకోవచ్చు. ఈ గుంతకు అటూ ఇటూ కూజా మూతిలాగా వుంది చూశారా? టినాహ (Tinaja - 'జ' ను 'హ' గా పలకాలి) అనేది స్పానిష్ భాషలోని పదం. 'పెద్ద భౌగోళిక కూజా' అని దానికి అర్థం. హ్యూస్టన్ నుండి పెద్దొంపుకు బయల్దేరే ముందు ఇలాంటి సంగతులన్నీ గూగులమ్మనడిగి తెలుసుకొన్నాను.

పైనున్న బొమ్మలో రెండు గుంతలు కనిపిస్తున్నాయే, వాటిలో మొదటిది పక్కనున్న ఫోటోలో వుంది. ఎండాకాలంలో ఈ నీటి మట్టం తగ్గుతుందట. అప్పడు ఆ నీటిని అందుకోబోయి జారి గుంతలో పడి బయటకు రాలేక విగతజీవులైన జంతువుల కళేబరాలను బిగ్‌బెండ్ అధికారులు బయటకు తీసివేస్తుంటారట. ఇవన్నీ తెలిసిన నాకు ఆ సమీపంలోనే ఈ దృశ్యం కళ్లబడేసరికి ఇది పిశాచములతో నిశాచరుఁడు గజ్జె కదలించి యాడు రంగస్థలంబు. ఎన్నో యేండ్లు గతించి పోయినవి ... కానీ... అంటూ ఝాషువా రాసిన సత్యహరిశ్చంద్ర లోని కాటికాపరి పద్యం గుర్తుకొచ్చింది.

అక్కడినుంచీ తిరిగి వస్తున్నాం, మా బసకు దగ్గరలోని ఒక చిన్న కొండనెక్కి దానిపైనుండి ఒక మంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి. వస్తూ వుండగా కొండలమీద ఎండ పడి మెరుస్తున్న దృశ్యాన్ని చూడటానికే కొంతసేపు ఆగాం. విషయమేమిటంటే అది ఒక కొండ కాదు. ఒకదానికంటే ఎత్తైనది మరొకటిగా వరుసలలో ఒకదాని వెనుక ఒకటిగా పేర్చబడిన పర్వతాల శ్రేణి. ఒక్కొక్కటి ఒకో రంగు. వాటిలో ఒకదానిపైమాత్రమే సూర్యకాంతి పడి మెరుస్తూ కనిపించింది. త్వరగా మా వాహనాన్ని మేం గుడారాలు వేసిన గూడేనికి చేర్చి, అక్కడినుంచీ పరుగుపరుగున దగ్గరలోని కొండనెక్కడానికి వెళ్లాం. మధ్యలో రియోబ్రేవో నీళ్లతో ఏర్పడిన కొలను, దానిమీదుగా కొయ్యతో చేసిన వంతెన వుంది.



అక్కడినుంచీ సూర్యాస్తమయం కడు గొప్పగా వుంది. మామూలుగా కంటే బిగ్‌బెండ్‌లో సూర్యాస్తమయాలు ఎక్కువసేపు కనువిందు చేస్తాయని ఇక్కడికొచ్చేముందే అంతర్జాలంలో చదివియున్నాను. నేను అనుకున్నంతకంటే ఎక్కువసేపే వుందనిపించింది. నాకలా అనిపించడానికి కారణం బహుశా చలిగాలి కావచ్చు. ఆ కొండ అంచునుంచి కిందకు తోసేటట్లు హోరుమని గాలి. మామూలు గాలి కాదు. ఎముకలు కొరికే చలిగాలి. ఇంతకుమునుపు చెప్పానే, కొండల వరుస - ఆ వరుసలో ఒక్కో వరుసను దేదీప్యమానం చేస్తూ సూర్యుడస్తమించాడు. ఒకో శ్రేణి ఒకో రంగులో ...


సూర్యాస్తమయానికి చలి నా పాదరక్షల్లో దూరి మునివేళ్లను నమలడం మొదలెట్టింది. కొండమీదినుంచి పరుగెత్తుకుంటూ కిందకు దిగి ఇంటివైపు దూసుకెళ్తున్నాను.

మధ్యలో ఈ విలయాన్ని చూసి ఆగిపోయి ఒక్క క్లిక్కు క్లిక్కి, రయ్యిమని వచ్చి బండ్లో కూర్చొని హీటర్ ఆన్ చేశాను. చలికి చచ్చిపోయాయనుకున్న నా చేతివేళ్లు, కాలివేళ్లూ తిరిగి జీవం పోసుకోవడానికి అరగంట పట్టింది. ఇక్కడ చలివుంటుందని తెలుసుగానీ ఇంత చలిగా వుంటుందని నాకెవ్వరూ చెప్పలేదు. ఆ దారిలో పార్కురేంజరు వెళ్తూవుంటే ఆపి అడిగి కనుక్కున్నాను వాతావరణం ఎందుకిలావుందని. గత తొమ్మిదేళ్లలో బిగ్‌బెండ్‌లో శీతాకాలపు వాతావరణం ఇంత దయారహితంగా ఎప్పుడూ లేదన్నాడు.

ఈ~పా~దం... అనే పాట మెదిలింది - 'మయూరి' అనుకుంటాను సినిమా పేరు.

చీకటి పడుతుండగా గుర్తొచ్చింది ... (సశేషం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు