ఒక ట్రావెలాగుడు - మొదటి టపా


అంత వరకూ "ఎడారి" అనే పదం వినబడగానే యేండ్ల తరబడి వానల్లేక ఎండిపోయిన ఇసుక పర్ర కనుచూపు మేర పరచుకొని వున్న దృశ్యం మనసులోకి వచ్చేది. ఇంటర్మీడియట్‌లో వుండగా రంగీలా సినిమా వచ్చింది. మా బ్యాచ్ మొత్తం ఒక ఆదివారం టౌన్లోకి వెళ్లాం. పోస్టర్లు, కటౌట్లు చూశాం. అది తెలుగు సినిమా కాదని తెలిసింది. అప్పుడు నాకు హిందీ రాదు. ఇప్పుడొచ్చునా అనేది అప్రస్తుతం. ఆ చిత్ర దర్శకుడు తెలుగువాడని తెలిసింది. "కళారాధనకు భాష ఒక అడ్డుగోడ కాకూడదని" అక్కడికక్కడే పోస్టర్ల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం జరిగిపోయింది. మాలో చానామందికి హిందీ రాకపోయినా సరే థియేటరుకు వెళ్లి చూశాం.


ఎక్కడున్నాం? ఆఁ... ఎడారి. ఎడారి అనగానే "తేరీ.... ఎయ్ సీ అదా పే... తో ఫిదా హమ్ హై ..." పాటలో చూసిన ప్రాంతాలు మనసులోకి వచ్చేవి (మెలకువలో మాత్రమే కాదు).

ఇంటర్మీడియట్‌లో వుండగానే బోటనీ అనబడు వృక్షశాస్త్రములో ఎడారి మొక్కల గురించి చదువుకొన్నాం. వీటిలో సైకస్ చెట్టు ఒకటి. కానీ అక్కడ చదివినవాటిలో నాగజెముడు, బ్రహ్మజెముడు, తంగేడు, తుమ్మ, ఈత, తాటి ఇట్లా చాలా వరకూ చెట్లను వీరబల్లె చుట్టుపక్కలలోనే చూసివుండటం చేత "పాపం ఎడారి మొక్కలు అక్కడ బతకలేక కడపజిల్లాలో బతుక్కుంటున్నాయి. కరవుసీమ అయినా ఆశ్రితులనెప్పుడూ పోనాడలేదు." అని కుడిచేత్తో ఎడమభుజం చరుచుకొని సంతోషించాను. సైకస్ చెట్టును కూడా తిరుమలకు నడిచి వెళ్లినపుడు దారిలో చూశాం. తలకోనలో కూడా చూశాం. ఆ తరువాత కొన్నాళ్లకు జీన్స్ అని ఒక బ్రహ్మాండమైన(!?) సినిమా వచ్చింది. అందులోనుండి "సైకస్ చెట్లలో దావూద్ పక్షి నాతో అన్నది ఐ లవ్ యూ ..." అని ఒక శ్రావ్యమైన తెలుగుపాట వినవలసివచ్చింది. దావూద్ ఇబ్రహీం వుండేది దుబాయిలో అంటారు కదా తెలిసినవాళ్లు! దుబాయి, సౌదీ, కువైట్ ఇవన్నీ ఎడారి ప్రాంతాలని

అంతకు ముందే వినివున్నాం. సైకస్ చెట్లలో దావూద్ పక్షి వుండటంలో ఆశ్చర్యమేముంది! అది దావూద్ పక్షి కాదంటారా? ఏమో మరి నాకు తెలీదు, ఆ పాటను అర్థం చేసుకోవాలంటే విఖ్యాత పక్షిశాస్త్రవేత్త పద్మవిభూషణుడు సలీంఅలీతో సహవాసం కావాలేమో!

ఆ తరువాత చంద్రబాబునాయుడి హయాంలో సాధారణ విద్యార్థులకు కూడా కంప్యూటర్లు అందుబాటులోకొచ్చినాఁక కళారాధనాతిశయపారవశ్యపరంపరానుగతంగా చూసిన పలు రకాల చిత్రరాజములలో ఒకటైన "గాడ్స్ మస్ట్ బి క్రేజీ" లో చూపినట్లు వుండొచ్చు ఎడారి అనిపించింది. ఆ మధ్య

డిస్కవరీ ఛానెల్లో ఎడారిని గురించిన ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని చూసినాఁక కొంత తెలిసింది - ఎడారి అంటే కేవలం ఇసుక కాదు, ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, రకరకాల జీవజాతులు వుంటాయని.

నాలుగు వారాల కిందట థాంక్స్ గివింగ్ డే సందర్భంగా నాలుగు సెలవు దినాలు వరుసగా (గురు,శుక్ర,శని,ఆది) దొరికినాయి. ఒక నలుగురైదుగురు సహోద్యోగమిత్రులం కలిసి ఆ నాలుగురోజులూ ఎక్కడికైనా వూరేగుదామని అనుకున్నాం. వూరేగడమంటే ఎంతసేపూ వాహనంలోనే కూర్చొని

ఏదో అట్లా దిగి చూసి మళ్లా బండెక్కడం కాకుండా, వొంటికి కాసింత శ్రమ కలిగించే కార్యక్రమాలేవైనా వుంటే బాగుంటుందనిపించింది నాకు. నాలాంటి ఆలోచనలే వున్న మిత్రులు కొందరు దొరికారు. వారిలో ఒకాయన ఇప్పుడు తనకంత శక్తి లేదని అనుకొంటున్నవాడు. ఇంకొకాయనకు అంత

శక్తి లేదని ఆయన తప్ప మిగతావాళ్ళం అనుకొన్నాం. బయలుదేరే సమయం వచ్చేసరికి కొన్ని కొత్త చేతులు కలిసినాయి. కొందరు చేయూతనిచ్చినారు. కొందరు చేయి మాత్రం ఇచ్చినారు. అనగా హ్యాండిచ్చారన్నమాట. మొత్తానికి లేనిపోని మలుపుల తరువాత నలుగురం తేలి, "పెద్ద

వంపు" (బిగ్‌బెండ్ నేషనల్ పార్క్) వెళ్లాలని నిశ్చయించాం.

అక్కడ దక్షిణపు అంచు (South rim) అని ఒక ఎత్తైన పర్వతశిఖరం వుంది. ఎక్కిదిగడానికి దాదాపు 15 మైళ్లు (24-25 కి.మీ.) నడవాల్సివుంటుంది. మధ్యలో ఎక్కడా నీటి సౌకర్యం లేదు గనుక దండిగా నీళ్లు మోసుకెళ్లాలి. పర్వతసింహాలు (Mountain lions) తిరుగుతూ

వుంటాయట. ఒక గుడారం, నిదుర సంచీ (sleeping bag), కొంత తిండి కూడా తీసుకెళ్లి రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన తిరిగి రావాలనేది నా కోరిక. సుందర పర్వత ప్రాంతాలను చూస్తూ దానిపైకి ఎక్కి అక్కడినుండి చుట్టూ కనిపించే దృశ్యాన్ని చూడాలని నా ఉబలాటం

(అదృష్టవశాన ఆ రోజు వాతావరణం నిర్మలముగా వుంటే). ఏకో నగచ్ఛత్ అన్నారు కదా పెద్దలు. అంచేత నాతోపాటు ఇంకెవరైనా వస్తారా అన్నాను. ఇద్దరు రాలేమన్నారు. కొద్దిగా కదిలించి చూశాను. రామన్నారు. ఈవిషయంలో నాతో సమానమైన ఉత్సాహం చూపిన మిత్రుడు ఇంకొక్కడు

మాత్రమే. వాడే నా ఆశాదీపం. అగ్ని కాదు దీపం మాత్రమే. మిగతా ఇద్దరూ వాయుదేవుడు, వరుణుడు. ఈ దేవుళ్లిద్దరూ కలిసి నా ఆశాదీపాన్ని ఆర్పేయకుండా కాపాడుకోవడం ఆ క్షణం నుంచే నా పని అయింది.

ఇటు సౌకర్యవంతమైనదీ అటు శక్తివంతమైనదీ అయిన ఒక నాజూకు నాటు రకం వాహనాన్ని కుదుర్చుకొని బుధవారం సాయంత్రం కాకముందే బయలుదేరాం. థాంక్స్‌గివింగ్ రోజు కనుక రోడ్లన్నీ కార్లతో ట్రక్కులతో నిండిపోయి కనిపించాయి. నగర పొలిమేరలు దాటినా రద్దీ తగ్గలేదు. వద్దురా

బాబూ, ఈ పద్ధతి అంత మంచిది కాదు, రోడ్‌రేజ్ కు కారణమౌతుంది, తరువాత దృశ్యం అంత బాగుండదు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పక్క కారులో ఆడవాళ్లెవరైనా వుంటారేమోనని ఆశగా మెడను సాగదీస్తున్నాడు ముందు వరుసలో డ్రైవరు పక్కన కూర్చున్న కొత్తగా

వచ్చిన సాయిమిత్రుడు (సాయి అనగా సాఫ్టువేర్‌ యింజనీరు). ఈమధ్యే హ్యూస్టన్‌లో పెళ్లాం పిల్లలు గల ఒక అమాయకుణ్ణి హైవే‌ ట్రాఫిక్‌లో కారునడుపుతుండగా తమ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశాడనేకోపంతో కాల్చి చంపిన సంగతి చెప్పాం. మళ్లీ ఒకసారి చెప్పి చూశాం - వాళ్లకు చిరాకు

పుడితే తుపాకి గురిపెట్టి ఒక్క నొక్కు నొక్కుతారు, ఒకటి కంటే ఎక్కువ కూడా నొక్కవచ్చు, మరీ అట్లా చూపునిలపవద్దు బాబూ - అని. సాయిమిత్రుడు ఏం చేశాడనుకున్నారు? ఐహిక విషయాల పైన స్థితప్రజ్ఞత సాధించి నిశ్చలమనస్సుతో లోకరీతిని గమనిస్తున్న యోగిపుంగవునిలాగ

చూస్తూ, "వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఆడదీ సెల్‌ఫోన్లో మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తోంది చూశారా!" అంటూ ఒక మహోన్నత సత్యాన్ని ఈ లోకానికి వెల్లడించాడు. ఆ సత్యవాక్కును విన్నంతనే మా కడుపుల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం నిండినట్టు అనిపించింది. కక్కలేక మింగలేక అన్నట్టు

మొహామొహాలు చూసుకుంటూ కనుగుడ్లు మిటకరిస్తూ మిన్నకుండిపోయాం.

శాన్ ఆంటోనియో దాటినాఁక రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో భోజనం కోసం ఆ శివార్లలోని ఒక చైనా రెస్టారెంట్లో ఆగాం. నాకు అప్పటికే తలనొప్పి మొదలైనట్లు అనిపించింది. ఒక సూపు, ఇంకొక పెరుగుతో చేసిన వంటకమేదో అడిగాన్నేను. సూపు తింటుండగానే నా తలనొప్పి

మాయమైపోయింది. ఆ పెరుగు వంటకం నా దగ్గరకొచ్చేసరికి కడుపు నిండిపోయింది. ఔషధం లాంటి ఆ సూప్ చేసినందుకు ఆ పేద(!?)రాసిపెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్పి ప్రయాణం ఆరంభించాం. నేను బండిని నడప గలనన్నాను. పొద్దున నడుపుదుగానీ నిద్రపొమ్మన్నాడు మా డ్రైవింగ్

మెషిన్. అర్ధరాత్రి దాటాక ఒక మార్గశ్రాంతస్థలం (rest area) లో ఆగి, బండిలోపలే నిద్రకోసం ప్రయత్నించాం. వాహనం బయట విపరీతమైన చలి. 31F చూపిస్తోంది మా బండిలోని ఉష్ణమాపకం. అంత చలి వుంటుందని నాకు తెలీదు. ఒట్టి చలి మాత్రమేకాదు, దానికి తోడు హోరు మని

ఈదురుగాలి. మాగన్నుగా నిద్ర పట్టకనే బండిలో చలి పెరిగిపోయింది. ఇంజను నడిపి హీటరును వాడుకోవలసి వచ్చింది. ఎట్లాగో రెండు మూడు గంటలు నిద్రపోయామనిపించాం.

అంతలో ప్రకృతి పిలిచింది. అందరమూ ఆ పిలుపుకు జవాబిచ్చాక బండి నడుపుదామని చూస్తే నా చేజోలె (wallet) కనిపించలేదు. అంతవరకూ బండిలో మా బ్యాగుల మీద పడి నిద్ర పట్టీ పట్టక నాకు తెలిసిన యోగాసనాలన్నీ వుపయోగించి రకరకాలుగా మెలికలు తిరగడంతో అదెక్కడో

పడిపోయింది. కొంతసేపు వెతికి చూస్తే కనపళ్లా. ఆ చలికి బయట కూడా కొంతసేపు వెతికి చూస్తి. లాభం లేదు. బండిలోనే ఎక్కడో పడిపోయుంటుందని నా నమ్మకం. కానీ అది జేబులో లేకుండా బండి నడపడం కుదరదు. నా లైసెన్సు అందులోనే వుంది కాబట్టి. ఎక్కువ సమయం వృధా

చెయ్యకూడదని "ఇట్ల కాదుగానీ... బయల్దేరదాం, బాగా తెల్లారినాఁక కార్లో వెతుక్కుంటాను" అన్నాను. నా మంచిమిత్రులు మళ్లీ ఒకసారి బండి దిగి వెతికి బయటెక్కడా పడిపోలేదని రూఢిపరచుకొని బయల్దేరారు.

లైసెన్సు, అప్పుబిళ్లలూ గట్రా అన్నీ ఒకెత్తు, ఆ వాలెట్టుతో నా అనుబంధం మరొక ఎత్తు. అది ఒకవేళ నిజంగా దొరక్క పోయినా నేను సంతోషంగా వుండాలి అని నా మనసును సిద్ధం చేసుకుంటూ వున్నాను. అప్పుడే లేచిన నిర్నిద్రా వదనాలతో మిగతా ముగ్గురు. మా బండి నిశ్శబ్దంగా

సాగిపోతూ వుంది. వచ్చే ఇబ్బందేమిటంటే మా నలుగురితో బండి నడపగలవారం ముగ్గురం, ఇప్పుడు నన్ను మినహాయిస్తే మిగిలిన ఇద్దరే నాలుగురోజులపాటు డ్రైవింగు చేయవలసి వస్తుంది. కేవలం రానూ పోనూ దూరం రెండువేల కి.మీ. పైమాటే. నావల్ల వాళ్లకు ఇబ్బంది కలుగుతోందే

అనుకుంటూ వున్నాను. అంతలో సాయిమిత్రుడు - డూ యూ మైండ్ సమ్ మ్యూజిక్? అన్నాడు. కానీయరా బాబూ, నాకూ మ్యూజిక్కే కావాలి అన్నాన్నేను. వాడు కానిచ్చాడు.

తెలతెలవారుతుండగా ఫోర్ట్ స్టాక్‌(టన్) దాటుకున్నాక ఒక ఇంధనకేంద్రంలో ఆగాం. టీ/కాఫీ తాగుదామని దిగారు మావాళ్లు. అక్కడ మా సాయిమిత్రుడు బండి దిగగానే అతని సీటు కిందనే దొరికింది నా ఐదువ. ఇంకేముంది నేనూ మార్గదర్శిలో చేరాను. తూర్పుదిక్కున గుడ్డిసుక్క

(గురుగ్రహం) ప్రకాశవంతంగా కనబడుతోంది. కెమెరా తీసి దాన్ని క్లిక్కుదామని తయారయ్యేలోపల గుడ్డిసుక్క మీదికి మేఘాలొచ్చేశాయి. తాగాలని అనిపించకున్నా లోపలికెళ్లి ఒక కాఫీ కొన్నాను. కలుపుకొనేటప్పుడు అది చెయ్యిజారింది. జారి సరిగ్గా చెత్తబుట్టలో పడింది. నా అదృష్టానికి

మురిసి, బహుశా నాకిప్పుడు కాఫీ మంచిదికాదేమో అని ఒక పెద్ద చాకొలెట్టు కొనుక్కొని బయటికొచ్చాను.

మమ్మల్ని టెక్సాస్ పడమటి భాగాన నిలిపిన "అంతర్రాష్ట్ర ప్రధానరహదారి-10"కి అక్కడితో టాటా చెప్పి, దక్షిణ సరిహద్దున గల బిగ్‌బెండ్ దిశగా చేర్చే రహదారి-385 పైకి మళ్లాం. కనుచూపుమేర వంపు లేని రహదారి. దారికి ఇరుపక్కలా జెర్రిపోతు కుబుసం రంగులో విశాలమైన ఇసుకనేల. విసిరేసినట్లు జీవకళ లోపించిన చిన్న చిన్న పొదలు. చలికాలం కనుక జీవకళ మరీ తక్కువగా వుంది. అది చిహువహువన్ ఎడారి. ఆ ప్రకారంగా నేను ఎడారిని మొట్టమొదటిసారి చూడటం

తటస్థించింది. తిన్నని ఆ రోడ్డుమీద ఎటు చూసినా మన బండి తప్ప ఇంకేమీ కనబడదు. ఎప్పుడో ఒకసారి ఒక కారో ట్రక్కో ఎదురుగా వస్తూ కనబడుతుంది. ఎక్కడో దూరంగా ఒకటి రెండు చిన్న కొండలు. సూర్యుడు వేగంగా ఆ కొండలపైకి ఎగబాకుతున్నాడు. మేఘాలు ఆయనకు

దారినిస్తున్నట్లు తప్పుకుంటున్నాయి. ఆ రహదారి(385)పై వేగమితి గంటకు 70 మైళ్లు. టెక్సస్‌లో వేగమితికి నాలుగైదుమైళ్లు కూడుకొని వాహనాలను నడుపుతుంటారందరూ. నేనూ 75లో వెళ్తున్నాను. అంతకు మించితేనే తప్ప పోలీసులు కూడా మన జోలికి రారు. అంత చదునుగా

విశాలంగా వుండి మానవ నివాసపు ఆనవాళ్లు కనబడని భూమిని చూడటం నాకది రెండో మారు. మొదటిసారి చూసింది టెక్సాస్ పశ్చిమోత్తర భాగంలోని పాలోడ్యూరో లోయ‌ ప్రాంతాల్లో. కానీ అక్కడ మానుష సంచారం చెదురుమదురుగా కనిపించింది. ఇక్కడ అటువంటి ఛాయలు లేవు.

ఆ మార్గాన సుమారు యాభై అరభై మైళ్ల దూరం వెళ్లాక అమెరికన్ తనిఖీ కేంద్రం వచ్చింది. అది రోడ్డు పక్కన ఒక ఇంధనకేంద్రం లాంటి చిన్న ఆగారం. మేమక్కడ ఆగాం. చలికి తలుపులు మూసుకొని లోపల కూర్చున్నారు అందులోని అధికారులు. కొంతసేపు చూశాం ఎవరైనా తనిఖీకి

వస్తారేమోనని. మాలో ఒకడు బండిదిగి వెళ్లి తలుపు తట్టాడు. ఒక అధికారి బయటకు వచ్చి - మీరొచ్చేటప్పుడు తనిఖీ చేస్తాం వెళ్లండి - అన్నాడు(ట). "వచ్చేటప్పుడు" అంటే మళ్లీ కొత్తగా అమెరికాలో అడుగుపెడుతున్నట్లే. అదిన్నీ మెక్సికో నుండి. వీసా వగయిరా పత్రాలన్నీ సరిగా వుండాలి.

ఇందాక నా చేజోలె(wallet)ను జారవిడిచినట్లు కాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పాసుపోర్టును "అర్థేచ నాతి చరామి" అని ఒళ్లుకు దగ్గరగా పెట్టుకోవాలి. పాసుపోర్టు చేజారడమంటే హిమవన్నగమున ప్రవరాఖ్యుని కాలి పసరు కరిగి పోయినట్లు కాదుకదా వ్యవహారం బహుత్ రసవత్తర్

కావడానికి!

అక్కడి నుంచీ మళ్లీ దాదాపు డెబ్బై మైళ్ల దూరం వెళ్లాక, పెద్దవంపుకు స్వాగతం (వెల్‌కమ్ టు బిగ్‌బెండ్) అని ఒక పెద్ద ఫలకం కనిపించింది. ఆ తరువాత కొంత దూరం వెళ్లాక వేగమితి డెబ్బై నుంచి నలభైకి దిగిపోయింది. అది ఇంకా ఇంకా తగ్గి సున్నకు చేరాక, రోడ్డుపక్కనున్న

ప్రవేశమందిర క్రంత నుండి ఒక తలకాయ బయటికి పొడుచుకొచ్చి ఆ ఎడారిలోకి మేము అడుగు పెట్టినట్లుగానూ వారం రోజులు అక్కడ తిరుగుటకు

అనుమతింపబడినట్లుగానూ ఒక రసీదు ఇచ్చి, అది బయటకు కనబడేలాగా మా వాహనం ముందుభాగాన వాయునిరోధకమునకు(windshieldకు) అతికించుకొమ్మని చెప్పి మా సందర్శనం సుఖప్రదం కావాలని చిరునవ్వుతో ఆశీర్వదించింది. పెద్దొంపు వనమునకు(Bigbendకు)

మా ప్రవేశం ఆ విధంగా జరిగింది.

మరికొన్ని మైళ్ల దూరం లోనికి ప్రయాణించినాఁక సందర్శకుల ప్రధాన కేంద్రం కనిపించింది. అది పెద్దొంపు(బిగ్‌బెండ్)కు మధ్యలో కొద్దిగా వుత్తరదిక్కున వుంది. మేము చూడదలచిన, ఉండదలచిన, ఎక్కదలచుకున్న ప్రాంతాల నకషా (map) సంపాదించి, వాతావరణ వివరాలు అక్కడి స్వచ్ఛంద కార్యకర్తనడిగి కనుక్కొని, మా క్షేమాన్ని, ఆనందాన్ని కాంక్షించిన మరొక ఆశీర్వాదాన్ని, చిరునవ్వునూ అందుకొని అక్కడ నుండి బయల్దేరాం.

స్వచ్ఛందకార్యకర్త మాటలను బట్టి ముందుగా రియోగ్రాండి/గ్రాండె/గ్రాండ్ (Rio-Grande) గ్రామానికి సమీపంలో మొదటిరోజు బస(camp site) చేయడం మంచిదని, సందర్శకుల ప్రధాన కేంద్రం నుండి 20-25 మైళ్లు ఆగ్నేయ (South-East) దిశగా ప్రయాణించాం. నకషా చూసి అక్కడ మా బసను గుర్తించి బండి దిగాం. బయట విరీతమైన చలి, ఈదురుగాలి. అప్పటికి సమయం ఉదయం పదకొండు గంటలు. ఆ రోజు గురువారం. పొద్దున్నే కాఫీ తాగడంతో మావాళ్లు ముగ్గురికీ నకనక. నాకూ దాదాపు అంతే. కాకపోతే నేను తాగలేదు గనుక కొంచెం

తట్టుకోగలిగాను. ఆలస్యం చేయకుండా వెంటనే తెచ్చుకున్న చిన్న ప్రోపేన్ సిలిండరును బయటకు తీసి, దానికి బర్నరును బిగించాడొక సాయి (సా.యి అనగా? మొదట్లోనే చెప్పాను కదా!). కప్‌నూడ్‌ల్స్ బయటకు తీసి వాటినెలా వండుకుతినాలో సూచనలు చదివాడింకో సాయి. రెండు

అరలీటరు సీసాల నీళ్లను గిన్నెలో పోసి ఉడికించాలని ప్రయత్నించాం. ఆ చలిగాలికి నీళ్లేం ఉడికేలా కనిపించలా. అందరమూ సిలిండరు చుట్టూ కూర్చొని చేతులడ్డంపెట్టి మొత్తానికి వేడెక్కించాం. నూడ్‌ల్స్‌కు కొంచం ఉప్పు మిరియాలపొడి కలిపి, అది చల్లారేలోగా తినేయాలని గబగబా తింటుంటే

నా సామిరంగా దివ్యంగా వుండింది. అదొక దివ్యౌషధమైనట్లు, మాలో ఉదయంనుంచీ ఉడిగివుండిన జవసత్వాలు తిరిగి వొంట్లోకొచ్చేశాయి. వెంటనే గుడారాలు వేసేశాం. అవి గాలికి ఎగిరిపోకుండా రెండు పెద్ద రాళ్లను తెచ్చి లోపలవేసి మళ్లీ బండెక్కాం.


దగ్గరలోనే Rio-Grande నది. ఈ నది ప్రత్యేకత ఏమిటంటే ఇది అమెరికా-మెక్సికో దేశాలమధ్య చాలా భాగానికి సహజసిద్ధ సరిహద్దుగా సేవలందిస్తోంది. సేవలందించడమేమిటి అంటారా? ... serves as a natural boundary ...ని అనువ'దించా'. నది పెద్ద లోతేమీ లేదు.

ఈదుకుంటూ అటూయిటూ వెళ్లిరావొచ్చనిపించింది. కొన్ని చోట్ల నడిచి దాటొచ్చు. అక్కడికి సమీపంలో ఒక మెక్సికన్ గ్రామం వుంది. గ్రామస్తులు తమ హస్తకళలను సందర్శకులకు అమ్మి, వచ్చిన డాలర్లతో బాగానే బతికేవాళ్లంట. ఒసామా పుణ్యాన జరిగిన 9/11 సంఘటన తరువాత

ప్రపంచవ్యాప్తంగా జరిగినట్లుగానే అక్కడా భద్రత కట్టుదిట్టమైపోయింది. దాంతో వారి జీవితాలు ... (సశేషం)

కామెంట్‌లు

అనిర్విన్ చెప్పారు…
వామ్మో, సానా పెద్ద టపా. బాగుండాది. పూర్తిగా సదవనేదు. ఆదివారం నాడు మళ్ళొస్తా.
Rajendra Devarapalli చెప్పారు…
అయ్యా,ఈ ఎడారి మీద ఏమి మాట్లాడాలన్నా నాకు కనీసం ఒక పదిరోజులు గడువు కావాలి,చదివేందుకు 3 రోజులు,ఫొటోలను చదివేందుకో నాలుగు రోజులు,ఏమన్నా రాసేందుకో 3 రోజులు మొదటి మూడు వాక్యాల్లోనే గుండె చిక్కబట్టింది.ఇంతకీ వ్యాసం మధ్యలో అలా ఫొటో లను ఎలా అమరుస్తారు లేదా పేరుస్తారు చెప్పగలరా?
Chari Dingari చెప్పారు…
చాలా బాగుంది....మరిన్ని ట్రావెలాగులు తొడుక్కుని రండి............ఇంతకు...మీరు కూడా సా.యి. యేనా?
రవి వైజాసత్య చెప్పారు…
లాగుడంటే..ఇంత లాగుడనుకోలేదయ్యా రామనాధా. రియోగ్రాందే ఒడ్డున కుర్రాడుదాకా చదివా.. ఎయ్ సీ అదా పే ఏడారి ప్రాంతాలలో ఏఁవిటి కనిపించాయేమిటి?? మరీ అంతలా గుర్తుండి పోయాయి ;-)
ramya చెప్పారు…
బాగుంది ఆసక్తి గా చదువుతూంటే గబుక్కున మధ్య లో ఈ భాగం ఐపోయింది. ఇక రెండో భాగానికి వెడతా.
cbrao చెప్పారు…
కాదరయ్యా-అదిరిందయ్యా-ఈ ఎడారి ప్రయాణం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము