చీకటి పడుతుండగా గుర్తొచ్చింది ఆరోజు మధ్యాహ్నం మేమేమీ తినలేదని. కడుపులకు ఇంత ద్రోహం చేశామని తెలిశాక అందరం సామూహికంగా పశ్చాత్తాపం చెంది, మాంఛి గాఠ్ఠి భోజనం దట్టించాలనుకున్నాం. ముందుగా వేడివేడిగా ఒక సూపు తాగాం. మా వాహనమోహనపితామహగారు వెంటనే బండ్లోంచి టమోటాలు, ఉల్లిపాయలూ, మిరపకాయలూ తీసి గబగబా తరిగేసి, గడగడా వణుకుతూ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి లాగా 'నాయినాహ్.. ఈ చలికి ఇక్కడే వుంటే..ఎంతోసేపు బతకన్నాయనాహ్, నే బోతున్నా..., నాయినాహ్' అంటూ బండెక్కాడు. హోరుమని గాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి మిగతా ఇద్దరూ గాలి చొరకుండా అడ్డునిలువగా, నేను ఒక గిన్నెలో కాస్త మంచినూనె పోసి, పితామహా తరిగిన ముక్కలన్నీ ఒక్కసారిగా దాంట్లో పడేసి ఉప్పు వేసి చాలాసేపు ఉడికించి వేడివేడి టమోటాబజ్జీ చేశాను. అదేవూపులో టోటిల్లాలనబడే చపాతీలను వేడిచేస్తూండగా ఒక్కొక్కరూ ఐదైదు తినేశారు. చివరగా నేను. నాకోసం పితామహా వడ్డించాడు. వేడివేడి టోటిల్లాల్లోకి టమోటా బజ్జీని చూడగానే నాకు నోరూరింది. కానీ చాలా చల్లగా అయిపోయిందది. అంతే కాదు, తియ్యగా కూడా అయిపోయింది. ఏమయ్యా సంగతి అని ఆరాతీస్తే, మా యువరాజులుంగారు ఉప్పు డబ్బాలో చక్కెర దట్టించి తీ