పోస్ట్‌లు

ఆగస్టు, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

అకాలకృత్యములు

అనగనగా ఒక పల్లె. పల్లె మొగసాల ఒక పెద్ద చింత మాను. మాని పక్కగా పల్లె లోపలికి బండ్లబాట. ఆ మాని మొదలు చాటున ఒక కుక్కపిల్ల. ఎండి రాలిన చింతాకు దుగ్గు మీద పడుకొని బాట వెంబడి వచ్చీపోయే జనాలనూ ఎద్దులబండ్లనూ చూస్తూ, ఎండకు తావటిస్తోంది. ఉన్నట్టుంది కాళ్లతో దుగ్గును పక్కకు తోసి, ఒక ఎముకను నోట గరచుకుని మళ్లీ పడుకుంది. ముందరికాళ్లను ముందుకు చాపుకొని, మోర ఆ కాళ్లమధ్యలో పెట్టుకొని, నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా కరచుకొని విశ్రాంతిగా చప్పరిస్తూంది లేదా చప్పరిస్తోంది. **** **** **** **** **** **** **** **** **** చప్పరిస్తూ+ఉంది=చప్పరిస్తూంది - సవర్ణదీర్ఘసంధి చప్పరిస్తా+ఉంది=చప్పరిస్తోంది - గుణసంధి ఇప్పుడు రామాయణంలో ఈ పిడకల వేట చేయవలసిన అవసరం ఏమిటని మీకు అనిపిస్తూండవచ్చు. అక్కడికే వస్తున్నా. "చప్పరిస్తూ ఉంది" అని చెప్పడానికి 'చప్పరిస్తూంది' లేదా 'చప్పరిస్తోంది' అని కాక, 'చప్పరిస్తుంది' అని మనలో కొందరు రాస్తున్నారు. '...స్తూంది' లేదా '...స్తోంది' అన్నది వర్తమానాన్ని (ప్రస్తుతం జరుగుతున్నదాన్ని) తెలియజేసేదైతే, '...స్తుంది' అన్నది భవిష్యత్ కాల ...

కిమ్ కర్తవ్యమ్

ముఖ్యమంత్రి: "పాకిస్థాను, బంగ్లాదేశులలో మనకు నిఘావ్యవస్థలేదు. ఈ వైఫల్యం పోలీసుయంత్రాంగానిది కాదు." -- నేరం నాది కాదు, ఆకలిది. ప్రధానమంత్రి: "తీవ్రవాద బాధితులకోసం శాశ్వత సహాయ నిధిని ఏర్పాటు చేస్తా." -- ఏంజేస్తున్నావే కోడలా? ఉలగబోసి మల్లా ఎత్తుకుంటాండా అత్తమ్మా. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల అధికారి: "రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి." -- మొక్కై వంగనిది మానై వంగునా!? "ఈ ఘోరకలికి ముఖ్యమంత్రిగా నేను నైతికబాధ్యత వహిస్తున్నాను." -- 'నీతి' బీరకాయలో 'నైతికం' "సంయమనం పాటించినందుకు ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు." -- సర్కసులో మచ్చికైనందుకు అడవిజీవాలకు రింగుమాస్టారి ఆనందం ప్రతిపక్షం: "వైయ్యెస్, గద్దె దిగిపో!" -- తాత పోతే బొంత నాది ప్రజారక్షణ విపత్కరమైన పరిస్థితిలో పడినప్పుడు రక్షకుల వ్యవహారశైలి ఇది. తప్పించుకోజూడటం ప్రభుత పలాయనవాదానికి చిహ్నమైతే, దాన్ని ఆపి, నిలబెట్టి ప్రజాక్షేమం దిశగా మార్గదర్శనం చేయవలసిన ప్రతిపక్షం వహిస్తున్న పాత్ర 'గోతికాడ నక్క'. అందరూ అందరినీ వేలెత్తి చూపుతున్నారు - నాతో సహా. న్యూ...

జేజేలు - బొటనవేలు

వాలీబాల్ అనేది జట్టుగా ఆడవలసిన ఆట. ఆ జట్టులో ఒకడికి స్వార్థం ఉందంటే ఇంకొకడికి బొటనవేలు విరుగవచ్చును. లేదా విరిగినంత పని జరగొచ్చును. ఆ ఇంకొకడిని నేనే కాబట్టే ఈ బాధ. మా జట్టులో ఒక పుణ్యాత్ముడు కొత్తగా వచ్చి చేరాడు. పుణ్యాత్ముడికి ఇంతకుముందెప్పుడూ ఈ ఆట ఆడిన అనుభవం లేదు. ఆమాటకొస్తే ఏ ఆటా ఆడిన అనుభవం లేదు. అక్కడే వచ్చినట్లుంది చిక్కు. ఒకటిన్నరేళ్ల ముందు నేనూ మొదటిసారిగా వాలీబాల్ ఆడాను. నేనూ మొరటుగానే మొదలెట్టాను. తోటి ఆటగాళ్లు మరియు ప్రత్యర్థులు నా ఆటను మెరుగుపరచుకోవడం గురించి ఏ సలహా చెప్పినా కళ్లకద్దుకొని దానిగురించి ఆలోచించి ఆటకు దిగే ముందు కాసింత సాధనకూడా చేసి త్వరగానే "నేనూ మార్గదర్శిలో చేరాను". అనగా వీడుంటే మనం ఓడిపోతాం అనే స్థాయి నుంచి తొందర్లోనే ఫరవాలేదు అనే స్థాయికొచ్చాను. అనుభవానికి కాస్త మెరుగులు పెట్టుకొంటూ కేంద్రంలో (వెనుక వరుస మధ్య స్థానంలో ముఖ్యంగా ) బాగా ఆడగలననిపించుకొన్నాను - ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టు మహావృక్షమన్నట్లుగా. నాతోపాటే చేరిన మిగతా జనాలు కూడా వివిధ ఇతర స్థానాల్లో మా స్థాయిలో నిపుణులుగానే తయారయ్యారు. ఆట రంజుగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో కొంత పాతనీరు పో...

పట్టుమని పది అనబడు టాప్ టెన్ టెల్గూ బ్లోగ్స్

వీవెన్ చెప్పిన నిబంధనల ప్రకారం , నాకు నచ్చిన వరుసలో, వెంటనే గుర్తొచ్చిన మొదటి పది తెలుగు బ్లాగులు 1. విహారి - హాస్యం సృష్టించగలగడం ఒక వరం. దానికి పాత్రుడైన సిద్ధుడీతడు. 2. కొత్తపాళి గారు తాము - విన్నవీ కన్నవీ - చెప్పే తీరు. 3. సత్యశోధన - బహుముఖములైన, ఆసక్తికరమైన విషయాలు. 4. అంతరంగం - చరసాలలో ఉన్నట్టుంటుందా? అప్పుడప్పుడూ భగ్గుమంటూంటుంది. 5. సంగతులూ సందర్భాలు - శ్రీరాముని సంగీతసాహిత్య సమలంకృతం. 6. తెలుగునేల - నాగరాజాగారి హాస్యాభిరుచి, కాసింత ఆధ్యాత్మికత మొదలైనవి 7. ఋ ౠ ఌ ౡ - రాకేశునికే ప్రత్యేకమైన శైలిలో వ్యంగ్యము, భాష, భావనలు. 8. అవీ-ఇవీ - ఏవైనా సరే చదవదగ్గవే అయిఉంటాయి. 9. నా మదిలో - తెలుగులో మొట్టమొదటి సాంకేతిక బ్లాగు. అంతటితోనే ఆగిపోలేదు. 10.కలగూరగంప - మంచి భాష. వివిధవిషయాలపై ఆసక్తికరమైన టపాలు. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఉన్నట్లనిపించేది. ఇవిగాక: పడమటి గోదావరి రాగం - హాస్యం తోటరాముడు - ఇది ఒక నాటుబాంబు. ఈమధ్య ఎందుకో విశ్రాంతి తీసుకొంటోంది. ఇంకా కొన్నింటిలో అప్పుడప్పుడూ చమక్కుమనే మంచి టపాలు వస్తూనే ఉంటాయి. కానీ అవి ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. వచన కవితలను ఆస్వాదించే విషయంలో నేను బలహీనుడిని. ...

కోరస్సు

"కోరస్సని ఒక మనిషున్నాడయ్యా! ఆడవాళ్లు పాడినట్టు పాడతాడు, మగాళ్లు పాడినట్టు పాడతాడు, పదిమంది ఒకేసారి పాడినట్టుకూడా పాడతాడు!! కోరస్సు ముందు ఎంతపెద్ద పాటగాళ్లైనా దిగదుడుపేననుకో!!!" -- ఆకాశవాణి కడప కేంద్రంలో కాంతిరేఖలు అనే కార్యక్రమంలో దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ఒక సోమవారం ఉదయం ప్రసారమైన ఒకానొక హాస్యనాటికలోని ప్రధాన పాత్ర చెప్పిన ఈ మాటను సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఎవరిమీదైనా ప్రయోగిస్తుంటాం. నిలయంలో పనిచేసే ఒక ఎనౌన్సరు తానే రాసి, మరొకరో, ఇద్దరో సహోద్యోగులతో ప్రతి సోమవారం ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమం తెరలుతెరలుగా నవ్వులు పంచుతుండేది. నాకు ఆ రచయిత పేరు గుర్తురావడంలేదు. అందులో పాల్గొనే స్త్రీ పాత్ర పేరు మంజులాదేవి. అప్పటికి ఆమె కుమారి మంజులాదేవి. చిన్నవయసులోనే చాలా సహజంగా ఆ పాత్రల్లో నటించడం, ముఖ్యంగా హాస్యాన్ని పండించడం మామూలు విషయం కాదుగనక ఆమెపేరు గుర్తుండిపోయింది.