అకాలకృత్యములు

అనగనగా ఒక పల్లె. పల్లె మొగసాల ఒక పెద్ద చింత మాను. మాని పక్కగా పల్లె లోపలికి బండ్లబాట. ఆ మాని మొదలు చాటున ఒక కుక్కపిల్ల. ఎండి రాలిన చింతాకు దుగ్గు మీద పడుకొని బాట వెంబడి వచ్చీపోయే జనాలనూ ఎద్దులబండ్లనూ చూస్తూ, ఎండకు తావటిస్తోంది. ఉన్నట్టుంది కాళ్లతో దుగ్గును పక్కకు తోసి, ఒక ఎముకను నోట గరచుకుని మళ్లీ పడుకుంది. ముందరికాళ్లను ముందుకు చాపుకొని, మోర ఆ కాళ్లమధ్యలో పెట్టుకొని, నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా కరచుకొని విశ్రాంతిగా చప్పరిస్తూంది లేదా చప్పరిస్తోంది.

**** **** **** **** **** **** **** **** ****
చప్పరిస్తూ+ఉంది=చప్పరిస్తూంది - సవర్ణదీర్ఘసంధి
చప్పరిస్తా+ఉంది=చప్పరిస్తోంది - గుణసంధి

ఇప్పుడు రామాయణంలో ఈ పిడకల వేట చేయవలసిన అవసరం ఏమిటని మీకు అనిపిస్తూండవచ్చు. అక్కడికే వస్తున్నా. "చప్పరిస్తూ ఉంది" అని చెప్పడానికి 'చప్పరిస్తూంది' లేదా 'చప్పరిస్తోంది' అని కాక, 'చప్పరిస్తుంది' అని మనలో కొందరు రాస్తున్నారు. '...స్తూంది' లేదా '...స్తోంది' అన్నది వర్తమానాన్ని (ప్రస్తుతం జరుగుతున్నదాన్ని) తెలియజేసేదైతే, '...స్తుంది' అన్నది భవిష్యత్ కాల కృత్యము. అందుచేత ఎవరినీ ఇలాంటి అకాలకృత్యములను చేయనీయకండి. ఇదేమీ ఫ్యాషన్ కాదు. సరే, పిడకల వేట ముగిద్దాం.
**** **** **** **** **** **** **** **** ****

కరువు కాలం కావడంతో ఊళ్లో గొడ్లు చావడం ఎక్కువైంది. కాబట్టి ఎముకలకేమీ కొదవ లేదు. అయినా, ఎప్పుడో ఏడు రోజుల కిందట తెచ్చుకున్న దాన్నే ఎండిపోయినా ఇంకా కొరుకుతోంది. ఆ కుక్కపిల్లను అలా చూస్తూంటే - ఏదో ధ్యానంలో ఉన్నట్లుగా ఉంది.

ధ్యానం అంటే మనసులోకి ఏ ఆలోచనలను రానీయకుండా శ్వాస పైన దృష్టి నిలిపి, ముక్కు కొసపైన మనసును లగ్నం చేయడమనే చాదస్తపు హింసాత్మక ప్రక్రియ కాదు. మనసును వెంటాడే ఏదో ఒక విషయం మీద ఆలోచనలను చేస్తూ, తనను వేధించే సమస్యయొక్క ప్రాథమిక మూలాన్ని కనుగొనే ప్రయత్నం దిశగా, తాను చేస్తున్న ఆలోచనా స్రవంతిని నిష్పక్షపాతంగా గమనించడమనే సాధనే ఈ కుక్కపిల్ల చేస్తున్న ధ్యానం.

ఎముకను నోటికి కరచుకోవడంలోనే దానికి ఒక రకమైన ఆనందం ఉన్నదేమో అనిపిస్తుంది. ఎముక చుట్టూ ఉన్న మాంసపు పోగులను మెల్లమెల్లగా తెంపి లాలాజలంలో ఉరించి దిగమింగడమూ, చింతాకు దుగ్గులో దాచిపెట్టడమూ, అలా ఊళ్లోకెళ్లొచ్చి మళ్లీ బయటికి తీయడమూ, మెల్లగా కొరకడం, నోటితోనే ఎగరేసి పట్టుకోవడమూ, ఎముక చివరల గల మృదులాస్థికను కొరికి అందులోని మూలుగను ఆస్వాదించమూ, ఎముక పటిష్ఠతను తన దంతాల పటిష్ఠతతో సరి పోల్చుకోవడమూ, ఆ ఎముక తాలూకు జంతువు దేహదారుఢ్యానికి జోహార్లు చెబుతున్నట్లుగా సాగిలపడటమూ ... ఇలా ఎన్నెన్నో చేస్తూ మొత్తానికి ఏడురోజులు గడిపినా, ఆ ఎముకను వదిలిపెట్టబుద్ధి కానట్లుగా ఉంది దాని వ్యవహారం. ఎముక మొత్తాన్నీ చప్పరించేసి జీర్ణం చేసుకోవడం అసాధ్యమని దానికి తెలియకుండా ఉంటుందా!!?

**** **** **** **** **** **** **** **** ****

నేనేదైనా పుస్తకం చేత పట్టుకుంటే నా పరిస్థితీ సరిగ్గా ఇంతే. కాకపోతే, పట్టుకోవడమే చాలా అరుదుగా జరుగుతుంది, అది వేరే సంగతి. ఆ పుస్తకం నాచేతిలో ఇమడటమూ, దాని వాసన, ముఖచిత్రము లాంటి పటాటోపములనుంచీ, దాని తొలి ముద్రణ వివరాలు, కృతజ్ఞతలు, అంకితం, మా మాట, ముందుమాట, రచయిత పరిచయము, ఇతర రచనలు ... ఇలా అన్నీ ముగించి పాకంలో పడిన పిదప, అబ్బురపరచి ఆపివేసే చిన్నచిన్న పదప్రయోగాలు, శహబాసనిపించే సందంర్భోచితమైన వాక్యాలు, ఔరా అనిపించే కొన్ని నిత్యజీవిత సత్యాలూ, స్వానుభవంలోని కొన్ని పాఠాలూ, ఇవన్నీ 'రచయిత ఎలా రాయగలుగుతున్నాడో కదా' అనే ఆశ్చర్యాతిరేకాలు, వీటినుంచి నాలో పుట్టే పిల్లకాలువల వంటి ఆలోచనలు ...

వెరసి, కొన్ని నెలలు పడుతుంది నేనా పుస్తకాన్ని చదివాననిపించడానికి. అయినా, 'దీన్ని మళ్లీ ఒకసారి చదవాలి' అనుకొని, చదవకుండా ఉండటమే ఇంతవరకూ జరుగుతూ ఉంది (జరుగుతోంది/తూంది). గుట్టలు గుట్టలుగా పుస్తకాలను చదవగలవారి శక్తిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది.

కామెంట్‌లు

Unknown చెప్పారు…
ఈ మధ్య వివిధ వెబ్ సైట్స్ లో "ఆ సినిమా బాగ ఆడుతోంది" అని చెప్పటానికి "ఆడుతుంది" అని రాయటం చూస్తుంటే విసుగొస్తోంది. అలా రాయటం వల్ల జరుగుతున్న విషయాన్ని కాక జరగబోతున్న సినీ జ్యోస్యం చెప్తున్నట్లు ఆ వాక్యాన్ని మార్చేస్తున్నారు. ఎందుకో ఈ మధ్యే చూస్తున్నాం ఈ వింత ప్రేలాపన. దీన్ని వ్యాకరణపరంగా కూడా వివరించి చెప్పి సకాలకృత్యం చేసారు.
కొత్త పాళీ చెప్పారు…
స్తూంది, స్తోంది అనకుండా స్తుంది అండం తప్పే. కానీ నువ్వు చెప్పిన సంధులు సంస్కృత సంధులు. ఈ సందర్భంలో వర్తించే సంధులేవిటో చిన్నయ్యసూరి గార్ని అడగాలి.
రానారె చెప్పారు…
ఔన్నిజమే, మీరన్నదాకా నేనూ ఈ సంగతి ఆలోచించలేదు. సంస్కృతపదాలను కలిపేటప్పుడు మాత్రమే సంస్కృత సంధి సూత్రాలను వాడుతున్నామంటారా? చిన్నయసూరిగారి బ్లాగు చిరునామా (ఈ సంధులను గురించి వివరించిన పుస్తకం)మీకేమైనా తెలుసా?
రానారె చెప్పారు…
వసుంధరగారూ, ఇలాంటివి కనిపిస్తే వెంటనే చెప్పడం ద్వారా చాలావరకూ మేలు జరుగుతుందని నా అనుభవం. ఐతే, అందరూ నేర్చుకొని దిద్దుకొంటారనీ, సహృదయంతో స్వీకరిస్తారనీ అనుకుంటే మనం భంగపడటం ఖాయం. నాకు ఆ మాత్రం తెలీక కాదులేవో ... అనేవాళ్లూ ఉంటారు.
Sriram చెప్పారు…
"సంస్కృతపదాలను కలిపేటప్పుడు మాత్రమే సంస్కృత సంధి సూత్రాలను వాడుతున్నామంటారా?"
అంటారా కాదు. అప్పుడుమాత్రమే వాటిని వాడాలి. సవర్ణదీర్ఘ సంధీ, గుణసంధీ వచ్చే సందర్భాల్లో తెలుగుమాటలైతే కనక అకార,ఇకార,ఉకార సంధుల ద్వారా చూసుకోవాలి. అవి తెలుగు సంధులు కనక.

ఇంక ఈ స్తూంది,స్తోంది విషయంలో మనం సంధులను ఉపయోగించలేమని నా అభిప్రాయం. వీట్లని వ్యాకరణంలో ఏమంటారో నాకు తెలీదుకానీ ఇంచుమించుగా వెర్బ్ టెన్సు లనచ్చేమో. వచ్చు అనే క్రియకి భూత భవిష్య వర్తమాన కాలాలు - వచ్చింది, వస్తుంది, వస్తోంది. వీట్లని వచ్చు+ఇంది, వస్తు+ఉంది...ఇలా విడగొట్టి ఉత్పత్తి చెప్పలేం.

ఇంక చిన్నయసూరిగారి బ్లాగు బాలవ్యాకరణం పుస్తకం. పేరులో "బాల"ని చూసి మోసపోకండి. అది అంత సులభంగా కొరుకుడుపడేది కాదు. ఆంధ్రభారతిలోనో, డిజిటల్ లైబ్రరీ లోనో ఉంటుంది చూడండి.
రానారె చెప్పారు…
"సవర్ణదీర్ఘ సంధీ, గుణసంధీ వచ్చే సందర్భాల్లో తెలుగుమాటలైతే కనక అకార,ఇకార,ఉకార సంధుల ద్వారా చూసుకోవాలి." రెండు పదాలు కలిసి అ+ఉ=ఓ అయ్యే సందర్భాల్లో (గుణసంధి), ఆ పదాలు తెలుగుపదాలైతే అకార, ఇకార, ఉకారాలు సరిపోవేమో కదా?

"సంస్కృతపదాలను కలిపేటప్పుడు మాత్రమే సంస్కృత సంధి సూత్రాలను వాడుతున్నామంటారా?" (ఇది సవాలుచేసినట్లుగా కనిపిస్తూండవచ్చు.) ఇలా ఎందుకన్నానంటే, భాషవాడుక మొదలయ్యాక సూత్రీకరణలు మొదలై ఉంటాయి కదా..., సంస్కృతాన్ని విరివిగా తెలుగులోకి దిగుమతి చేసుకుని కలుపుకున్నాం కనుక, సంస్కృత సంధి సూత్రాలను అనుసరించియే తెలుగుపదాలను కలిపే దాఖలాలేమీ లేవా అని నాకు సందేహం వచ్చింది.
Suresh Kolichala చెప్పారు…
తెలుగు బ్లాగులకు, చర్చావేదికలకు, ఈమాట(ల)కు, దూరంగా ఒంటరి ఆశ్రమ జీవితం* గడపాలనుకున్న నన్ను మళ్ళీ ఈ అంతర్జాల మాయాజాలంలోకి లాగిన ఘనత ద్వానాశాస్త్రి గారిది; నా ఆంధ్రభూమి వ్యాసాన్ని సంపాదకీయం చేసి ఈమాటలో ప్రచురించిన పద్మ, పాణినీ గార్లది; ఆపైన "-స్తూ" "-స్తో" అంటూ noice చేసిన మీది. వేసుకోండి వీరతాళ్ళూ :)

"-స్తూ" "-స్తో" అంటూ మీరు మాట్లాడుతున్నది క్రియా పదాంశం (Verb Morphology)గురించి, క్రియా ప్రత్యయాల (Verb Affix ల) గురించి అని నా అనుమానం. తెలుగు క్రియల గురించి నాకు తెలిసిన కాస్తా చెప్పేస్తాను - సావధాన మనస్కులై తప్పులు లెక్కబెడుతూ ఆకర్ణించండి :)

తెలుగు, తమిళాది ద్రావిడ భాషలలో ప్రాచీన క్రియా కాలాలు (Tense) రెండే రెండు: past(భూత), non-past (భూతేతర). అంటే వర్తమాన (present), భవిష్యత్ (future), తద్ధర్మార్థాకాలకు (habitual) అన్నింటికీ non-past క్రియారూపాన్నే వాడేవారన్న మాట.

పాత తెలుగులో భూతకాల ప్రత్యయం -ఇతి.

(నేను) వచ్చితిని/ (మేము) వచ్చితిమి (1st person sig. pl.)
(నీవు) వచ్చితివి/ (మీరు) వచ్చితిరి (2nd person sig & pl.)
(వాడు/అది) వచ్చెను/ (వారు) వచ్చిరి (3rd person sig & pl.)

అప్పటి భాషలో భూతేతర కాల ప్రత్యయం -ఎద, -దు

(నేను) వచ్చెదను/ (మేము) వచ్చెదము (1st person sig. pl.)
(నీవు) వచ్చెదవు/ (మీరు) వచ్చెదరు (2nd person sig & pl.)
(వాడు/అది) వచ్చెను/ (వారు) వచ్చెదరు (3rd person sig & pl.)

ఆధునిక తెలుగులో ఇటువంటి క్రియలు స్థానంలో
వచ్చినాను (వచ్చాను)/వచ్చినావు (వచ్చావు)/వచ్చినాడు(వచ్చాడు)/వచ్చింది (భూత),
వస్తాను/వస్తావు/వస్తాడు/వస్తుంది (భూతేతర)
అన్న క్రియా రూపాలు వచ్చాయి.

వర్తమానంలో జరుగుతున్న Present-continuous (?) క్రియలకు మాత్రం శత్రర్థక క్రియా రూపానికి (durative participle కి) -ఉండు అన్న ప్రత్యయం చేర్చగా వచ్చిన పదాంశాన్ని వాడుతూ వచ్చారు. ఉదాహరణకు ఆధునిక తెలుగులో వచ్చు- అన్న క్రియకు శత్రర్థక క్రియా రూపం వస్తు-

(నేను) వస్తు + ఉన్నాను = వస్తున్నాను (I am coming)
(నీవు) వస్తు + ఉన్నావు = వస్తున్నావు (You are coming)
(అతడు) వస్తు + ఉన్నాడు = వస్తున్నాడు (He is coming)
(ఆమె/అది) వస్తు + ఉన్నది = వస్తున్నది (She/It is coming)
(ఆమె/అది) వస్తు + ఉంది = వస్తుంది/(She/It is coming)

"ఈ మధ్య కాలంలోనే భవిష్యత్ క్రియల కంటే భిన్నమైన వర్తమాన క్రియారూపాలు ఏర్పడడం మొదలైనది. అందుకనే తెలుగుతో సహా అనేక ద్రావిడ భాషలలో వర్తమాన కాలిక ప్రత్యయాలకు, భవిష్యత్కాలిక ప్రత్యయాలకు ఇప్పటికీ స్వల్ప భేదమే కనిపిస్తుంది" అని భద్రిరాజు గారి పుస్తకం చెబుతోంది. అంటే వర్తమాన కాలిక క్రియకు "వస్తూంది/వస్తోంది" ఈ మధ్య కాలంలోనే ప్రమాణం అయినట్టుగా తోస్తోంది(!).

తెలంగాణాలో పుట్టి పెరిగిన నాకు "వస్తూంది", "వస్తోంది" ఎందుకో ఇప్పటికీ అసహజంగానే అనిపిస్తాయి, వినిపిస్తాయి. వర్తమానానికి తెలంగాణాలో "వాడు వస్తున్నడు", "అది వస్తున్నది/వస్తుంది" అని చిన్నప్పటినుండీ వినటం వల్ల కాబోలు ఇప్పటికీ నేను అనాలోచితంగా "తోస్తుంది", "వస్తుంది" అని రాస్తుంటాను.

మళ్ళీ hybernation(శీతనిద్ర?) లోకి,
సురేశ్.
* ఆశ్రమ జీవితం అంటే గృహస్థాశ్రమ జీవితమే లెండి!
Ref: 1. Dravidian Languages: Bhadriraju Krishnamurti pp 319 (Chapter 7: The Verb (277-387))
2. పి. ఎస్. సుబ్రహ్మణ్యం: ద్రావిడ భాషలు (క్రియలు 290-430)
Sriram చెప్పారు…
"రెండు పదాలు కలిసి అ+ఉ=ఓ అయ్యే సందర్భాల్లో (గుణసంధి), ఆ పదాలు తెలుగుపదాలైతే అకార, ఇకార, ఉకారాలు సరిపోవేమో కదా?"

సరిపోతాయి. అకార,ఇకార,ఉకార సంధులకి దీర్ఘం రాడం ఒకటే లక్షణం కాదు.

ఉదాహరణకి ఉకార సంధి సూత్రం, "ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు" అని మాత్రమే.
వస్తువు+ఎక్కడ - వస్తువెక్కడ, వస్తువు+ఉంది - వస్తువుంది
ఈ రెండు చోట్లా కూడా ఉకారసంధి అనే చెప్పుకోవాలి.

ఈ సందర్భంగా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి ఒక వ్యాసం గుర్తొచ్చింది. ఆయన (ఇంచుమించు) ఇలా అంటారు.

"నేను బందరులో తెలుగు పండితుడిగా పనిచేసిన రోజుల్లో నన్ను ఒక తరగతికి తెలుగు వ్యాకరణం అధ్యాపకుడిగా నియమించారు. నేను సంవత్సరం మొత్తం మీద ఆ క్లాసు పిల్లలకి చెప్పింది ఒకటే పాఠం. "అకారానికీ, ఇకారానికీ మీకు కావస్తే సంధి చేసుకోండి లేకుంటే లేదు, ఉకారానికి మాత్రం ఎప్పుడూ సంధి చెయ్యాలి" అంతే. ఈ విషయం ఎవరో ఇన్స్పెక్టర్గారికి ఫిర్యాదు చేసారు.ఆయన నన్ను పిలిచి అడిగాడు. నేను, తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నది, ఇంతకన్న చెప్పడానికేమీ లేదు అని చెప్పాను."

ఇంక సంస్కృత పదాల గురించి: తత్సమ పదాలన్నింటికీ సంస్కృత సంధులు వాడుకోచ్చు. కానీ సంధి కలిసే చోట సంస్కృతానికీ,తెలుగుకీ తేడా ఉండదు.

ఉదా: మహా+ఉత్తుంగము - మహోత్తుంగము . ఇక్కడ తెలుగులో చివరలో ప్రధమా విభక్తిగా ము కలిసింది తప్ప, సంధి జరిగే చోట సంస్కృతానికీ తెలుగుకీ తేడా ఏమీ లేదు కదా.

@సురేశ్ గారూ...మీరిచ్చిన వివరాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. భూతేతరకాలాలన్నీ ఒకటిగా ఉండేవా! ఈ మధ్య కాలంలోనే భవిష్యత్ క్రియల కంటే భిన్నమైన వర్తమాన క్రియారూపాలు ఏర్పడడం మొదలైందా! ఈ మధ్య అంటే ఇరవయ్యో శతాబ్దమేనా?
Sriram చెప్పారు…
చిన్నయసూరిగారి బ్లాగు చిరునామా (ఈ సంధులను గురించి వివరించిన పుస్తకం)
http://andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/saMdhi.html
రానారె చెప్పారు…
సురేశ్‌గారు, మీరు ఆశ్రమాన్ని దాటి బయటికొచ్చి చెప్పారు గనక వేసుకున్నాను వీరతాడు. ఎప్పుడైనా అవసరమైతే మళ్లీ మిమ్మల్ని లాగడానికి అదే తాడునుపయోగిస్తా :) Someone else was/is making my-noise. I had no choice but to go for noice. భూతభూతేతరాలు మాత్రమే ప్రాచీన క్రియా కాలాలు అని చదివాక, తప్పులు లెక్కబెట్టేపని పెట్టుకోలేదుగానీ, సావధానంగానే విన్నాను - ఇది నేను ఇప్పుడే మీద్వారా తెలుసుకున్న విషయం కనుక. కొన్ని సందేహాలు:

1. "కుక్కపిల్ల తన నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా కరచుకొని విశ్రాంతిగా చప్పరిస్తూంది లేదా చప్పరిస్తోంది" అని వర్తమానంలో జరుగుతున్నట్లుగా నేను రాసిన వాక్యాన్ని అర్థం మారకుండా ప్రాచీన భూతేతర కాల ప్రత్యయం [-ఎద, -దు] ఉపయోగించి చెప్పాలంటే "చప్పరించెను" అనడం సరియౌనా?

2. అదే వాక్యంలో ఆధునిక తెలుగులోని -ఉన్నది అనే ప్రత్యయాన్నుపయోగిస్తే "చప్పరించుచున్నది" లేదా "చప్పరిస్తున్నది" అనవచ్చు, బాగుంది. కానీ -ఉంది ప్రత్యయాన్నుపయోగిస్తే "చప్పరించుతుంది" లేదా""చప్పరిస్తుంది" అవుతుంది. -చున్నది, -స్తున్నది అనేవి వర్తమానాలు (Present-continuous?). -తుంది, -స్తుంది అనేవి ఈ సందర్భంలో continuous కావుకదా అని నాగోల అనగా noice :) తెలంగాణ ప్రాంతాల్లో పెరిగి ఉంటే నేనీ గోల చేసేవాడిని కాదంటారా :-?

3. మీరు చెప్పిన తెలంగాణ ప్రాంతపు ఉదాహరణలో "వాడు వస్తున్నడు, అది వస్తున్నది" Present-continuousగా వినబడుతున్నాయికానీ, "అది వస్తుంది" అనగానే భవిష్యత్కాల క్రియగా వినిపిస్తున్నది/స్తున్నాది/స్తూంది/స్తోంది. ఇలా అనిపించడానికి కూడా నేనిలాంటి ప్రయోగాన్ని ఎన్నడూ వినియుండకపోవడమే కారణం కావచ్చునా?

సురేశ్‌గారూ, భాషాశాస్త్రంలో ఓనమాలుకూడా తెలియనివాణ్ణి గనుక ఇలాంటి సందేహాలు అడుగుతున్నాను. నాది దబాయింపుగా ధ్వనిస్త్...(ఎందుకొచ్చిన గొడన) ధ్వనిస్తూ ఉండవచ్చు. కాదని మనవి.

శ్రీరామా, ఆ లంకెననుసరించి బాలవ్యాకరణంలోని 'సంధి' పాఠాన్ని చూశాను. కృతజ్ఞతలు. చాలా విషయాలు, జ్ఞాపకాలూ నిద్ర లేచినాయి. వాటి గురించి చాలా సందేహాలున్నాయి. అవన్నీ పట్టుకుని మీ వెంటబడతాను. [ధర్మవరపుసుబ్రహ్మణ్యం చెప్పినట్లు - మెళ్లమెళ్లగా నాలెడ్జీ తగ్గించుకొని మేమూ ప్రిన్సిపాళ్లం కావాలికద బాబూ :-)] వస్తోంది=వస్తు+ఉంది అని విచ్ఛేదనం చేయడం సబబుకాదేమోనన్న మీ అభిప్రాయంతో ఇంకెవరైనా చేయి కలుపుతారేమో చూడాలి.

కొత్తపాళిగారు ఈ చర్చ ప్రారంభంలో ఒక్కమాట మాత్రం చెప్పి వదిలేశారు, తాంబూలాలిచ్చేశానన్నట్లుగా :-) ఈ విషయాలపై వ్యాఖ్యానించగల తాడేపల్లి, కారణిగార్లేమంటారో!?
కొత్త పాళీ చెప్పారు…
మెదలకుండా ఉన్నది .. కొంత టైములేకా, ఎక్కువగా .. ఇలాంటి విషయాల గురించి లోతుగా తెలియకా .. భాష వాడుక విషయంలో నాది instinctive approach విని, చదివి,అలాగే మనసుకెక్కి ఉన్న భాష అలాగే బయటపడుతూ ఉంటుంది. శాస్త్రీయంగా ఏం చెప్పారో పెద్ద పట్టించుకోను. కానీ ఒక మాండలికం, ఒక నుడికారం అచ్చంగా పట్టుకోవాలంటే .. రానారె .. నువ్వు పడే శ్రమ అర్ధమవుతోంది. సురేశ్, శ్రీరాములు చెప్పినవి కూడా బాగున్నై.
C. Narayana Rao చెప్పారు…
వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.

రెండు అక్షరాలమధ్య సంహిత- అంటే సంధి ఏర్పడే పట్టులను గూర్చి సంస్కృత వైయాకరుణులు ఈ విధంగా నిర్వచించారు

'సంహేతైక పదేనిత్యా/ నిత్యాధాతూప సర్గయో:/
నిత్యా సమాసే/ వాక్యేతు సా వివక్షామపేక్షతే/

పై విధి సంస్కృత భాషకు సంబంధించిందైనా, తెలుగు భాషకు గూడా చాలావరకు వర్తిస్తుంది.

[1]సంహేతైక పదేనిత్యా:
ఏకపదంలో అక్షరాలకు మధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
పుట్టి+ఎడు = పుట్టెడు
మూడు+అవ+మూడవ
గోరు+అంత=గోరంత
నిర్ణయ+ఇంచు=నిర్ణయించు
నిర్జి+ఇంచు=నిర్జించు

[2]నిత్యాధాతూప సర్గయో:/
సాధారణంగా తెలుగు ధాతువులన్ని 'ఉ ' అనే అచ్చుతో అంతమవుతాయి.కాబట్టి ధాతువులకు క్రియా ప్రత్యయాలు చేరేటప్పుడు ఆ ప్రత్యయాలు అచ్చులను ఆదిలో కలిగి ఉంటే ఉత్వసంధికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. పూర్వ పరాచ్చులు రెండింటి స్థానంలో పరాచ్చు ఆదేశంగా వస్తుంది.
ఇచ్చు+ఎను=ఇచ్చెను
కొట్టు=ఎను=కొట్టెను
చదువుతు+ఉన్నాను=చదువుతున్నాను
కొట్టు+ఇంచు=కొట్టించు
చేయు+ఇంచు=చేయించు
చదువు+ఇంచు=చదివించు
కొట్టు+అక=కొట్టక
తిట్టు+అక=తిట్టక


ఇక సంస్కృత పదాలతోబాటు ఉపసర్గలు(prefixes) కూడా తెలుగులోకి వచ్చాయి.కాబట్టి తత్సమ పదాల్లో సంస్కృతంలో లాగే ఉపసర్గలను శబ్దాలకు చేర్చేప్పుడు సంధి కార్యం నిత్యంగా జరుగుతుంది.
ప్రతి+ఏక=ప్రత్యేక
అభి+ఉదయం=అభ్యుదయం
సు+అగతము=స్వాగతము
అను+ఏషన=అన్వేషణ

[3]నిత్యా సమాసే/
సమాసంలోని పదాలమధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
చింత+ఆకు=చింతాకు
ఇల్లు+ఆలు=ఇల్లాలు
పీత+అంబరుడు=పీతాంబరుడు
రామ+ఆజ్ఞ=రామాజ్ఞ
సూర్య+ఉదయం=సూర్యోదయం

[4]వాక్యేతు సా వివక్షామపేక్షతే/
రచయిత తన ఇష్టాన్ని అనుసరించి వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాసుకోవచ్చు. లేకుంటే పదాలకు మధ్య సంధినియమాలను పాటించనూవచ్చు.
ఉదాహరణకు ఈ కింది వాక్యాన్ని చూడండి.
'ఒకడు పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు అనుకొందాం.'

ఈ వాక్యాంలోని పదాలకు మధ్య సంధి చేస్తే ఇలా ఉంటుంది:
'ఒకడు బరీక్షలో నుత్తీర్ణుడయినాడనుకొందాం. '
పై వివరణవల్ల తేలిందేమిటంటే వాక్య మధ్యంలో రెండు పదాలను కలిపి సన్నిహితంగా ఉచ్చరించడంగాని,రెండు శబ్దాలమధ్య కొంచెం కాలం ఆగి ఉచ్చరించడంగాని రచయిత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. సన్నిహితంగా ఉచ్చరిస్తే సంధి కార్యం జరుగుతుంది. పదాలను వ్యవధానంగా ఉచ్చరిస్తే సంధి రాదు.కాని వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాయడంవల్ల చాలా ఉపయోగం ఉంది.

ఇంగ్లీషు భాషలో 'MIRROR ' అనే మాట వాక్యంలో ఎక్కడైనా 'MIRROR' గానే వాడుతున్నాము.కాని తెలుగులో ' అద్దం ' అనే మాటను వాక్యారంభంలో ' అద్దం ' - అని రాస్తాము.కాని వాక్యమధ్యంలో ద్రుత ప్రకృతికం (నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నద్దం ' అని రాస్తాము. అలాగే సంధి రాని చోట 'య్ 'ని ఆగమం చేసి 'యద్దం ' అని రాస్తాం. సామాన్య పాఠకుడు దీని మూల రూపం ఏదో తెలియక తికమక పడతాడు.కాభట్టి వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 'ఉంది '- అనే క్రియా శబ్దాన్ని ద్రుతప్రకృతికం(నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నుంది '- అని, కళల(అచ్చు అంతంలో ఉండే శబ్దాలు)పై సంధి రాని చోట 'యుంది ' -అని రాయకుండా, 'ఉంది '- అని వాక్యమధ్యంలో రాయడం సబబు.అలాగే 'వ్ 'ఆగమం చేసి 'వుంది '- అని రాస్తే, పాఠకుడు మూలరూపం తెలియక తికమక పడతాడు.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.
("చక్కని తెలుగు రాయడ మెలా?" డా.వి.లక్ష్మణరెడ్డి,ఎమెస్కో, 1992)

P.S:రానారెగారూ, ఈ విషయాన్ని/ అంశాన్ని సాహిత్యం గుంపులో పెట్టండి. అందరూ సంప్రదించడానికి అవకాశం కలుగుతుందని నా అభిప్రాయం.


కారణి నారాయణ రావు
Suresh Kolichala చెప్పారు…
కొత్తపాళీ, Steve Pinker లు చెప్పినట్టు మనం భాషను instinctiveగా మాట్లాడుతాం. ప్రజలు మాట్లాడే భాషను (రచయితలు సాహిత్యంలో వాడే భాషను) సూత్రబద్ధం చేసేదే వ్యాకరణం కానీ వ్యాకరణాన్ని బట్టి భాష కాదు. అలాగని భాష ప్రమాణీకరణకు, ఎదుగుదలకు, భాషాతత్త్వాన్ని అర్థం చేసుకోవటానికీ ఉపయోగపడే భాషా సూత్రాలను, వ్యాకరణాలను తక్కవ చేసి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు.

However, I am not a big fan of తెలుగు సంధులు (ముఖ్యంగా అచ్చు సంధులు). నాకెప్పుడూ ఇవి సంస్కృత సంధులను చూసి తెలుగు పెట్టుకున్న వాతలని అనిపిస్తుంది. పదాలు అల్లుకుపోయే తెలుగు వంటి భాషలలోరెండు అచ్చులు కలిసినప్పుడు, మొదటి అచ్చును రెండవ అచ్చు పూర్తిగా dominate చేస్తుందన్న విషయం తెలిస్తే చాలని నా నమ్మకం. మిగిలినవి ధ్వని పరిణామాల ద్వారా వివరించవచ్చు. అందుకే నాకు బహుజనపల్లి, చిన్నయ్య సూరి తదితరులు prescriptive గా రాసిన వ్యాకరణాల కంటే భద్రిరాజు, గ్విన్ లు రాసిన descriptive grammar నచ్చుతుంది.

నేను నిన్న రాసిందాంట్లో ఒక తప్పు: పాత తెలుగులో భూతేతర ప్రథమ పురుష "వాడు/ఆమె/అది వచ్చును". కాబట్టి, రానారె వాక్యాన్ని "విశ్రాంతిగా చప్పరించును" అనవచ్చు. కానీ కథ చెబుతున్నప్పుడు కథలో present tense రచయితకు past tense అవుతుంది కాబట్టి "విశ్రాంతిగా చప్పరించెను" అనాల్సి వస్తుందేమో. నిజంగా రచయిత continuous మూడ్ తీసుకొచ్చే వాక్యమైతే durative participle వాడుతూ "విశ్రాంతిగా చప్పరించు సమయంబున ..." అని కూడా ఉండవచ్చు.

ఆధునిక తెలుగు భాషలో భవిష్యత్తు క్రియలో అమహద్వాచక (non-masculine) క్రియ మిగిలిన వాచకాల క్రియలతో పోల్చి చూస్తే irregular (అనియత?) గా కనిపిస్తుంది.

నేను వస్తున్నాను - వస్తాను (తెలం. వస్తాను/వస్తను)
నీవు వస్తున్నావు - వస్తావు (తెలం. వస్తావు/వస్తవు)
వాడు వస్తున్నాడు - వస్తాడు (తెలం. వస్తాడు/వస్తడు)
ఆమె/అది వస్తున్నది - వస్తుంది (తెలం. వస్తాది(!)/వస్తది)

తెలంగాణాలోభవిష్యత్తుకు వస్తడు, వస్తది అని వాడుతారు కాబట్టి "వస్తున్నది" అన్నా "వస్తుంది" అన్నా వర్తమానమే ధ్వనిస్తుంది. కానీ "వస్తాది" కాక "వస్తుంది" అన్నది శిష్టవ్యవహారికంలో ప్రమాణమై పోయింది కాబట్టి "వస్తు + ఉన్నది" కాస్తా "వస్తోంది" (వస్తు ఓంది) గా పరిణామం చెందిందని చెప్పవచ్చేమో.

మీ ఆశ్రమంలో సేదదీరనిచ్చినందుకు కృతజ్ఞతలతో,
సురేశ్.
--
- Instinctive గా నాకు ఏ భాష మీదా పట్టులేదు. కాలేజీలో చేరిన కొత్తలో నేను పట్టిపట్టి మాట్లాడే తెలుగు విని, నా మాతృభాష తెలుగు కాదని అనుకున్నారట. శాస్త్రీయంగా చదువుతేనైనా భాషాపరంగా నాకున్న పరిమితులను కొంతైనా పూడ్చుకోవచ్చుననే ఆశతోనే భాషాశాస్త్రాన్ని చదవడం మొదలు పెట్టాను!
- వార్తయంద జగము వర్తిల్లుచున్నది అన్న శత్రర్థక (present-durative) క్రియల వాడుక భారతంలోనే ఉంది. అయితే, వస్తూంది, వస్తోంది అర్వాచీనమనే (20cent?) నాకనిపిస్తున్నది.
- "వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనపడుతుంది" ఇక్కడ "కనపడుతుంది" వర్తమానమా, లేదా భవిష్యద్వాచకమా?
రానారె చెప్పారు…
కారణిగారు సూచించినట్లు - క్రియాశబ్దాలను విసంధిగా రాయడం వల్ల చెప్పదలచుకొన్న విషయంలో స్పష్టతను ఉంటుందన్నది నేను గ్రహించిన సంగతి.

కొలిచాలగారి పై వ్యాఖ్యలో మొదటి పేరాలోని విషయంతో నేనూ ఏకీభవిస్తాను. రెండో పేరాలో చెప్పినట్లు తెలుగు సంధులు వాతలయి ఉండవచ్చునేమో కూడా!

ఈ కథలోని కుక్కపిల్ల, ఫలానా చెట్టునీడన, ఫలానా రోజు మధ్యహ్నం, ఎముకతో విశ్రాంతిగా కాలక్షేపం చేసిన దృశ్యరూపాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్న భావాన్ని పాఠకులకు కలిగించడం ఎలా? "కుక్కపిల్ల ఎముకను చప్పరించును" అన్నది "సూర్యుడు తూర్పున ఉదయించును" అన్నట్లుగా ఒక జగమెరిగిన సత్యాన్ని మళ్లీ నేను చెప్పినట్లు ఉంటుంది "వార్తయంద జగము వర్తిల్లుచున్నది" కూడా ఇలాంటిదే కదా? జగము వర్తిల్లడమును గురించి ఒక మనిషికి చెబుతున్నాడు గనుక ఇందులో Continutity మాత్రమేకాక, past కూడా ఉందికదా.

కుక్కపిల్ల-ఎముక విషయంలో రచయితకు అది past tense కావచ్చు. కానీ దాన్నలా చెప్పదలచుకోవడం లేదు. "విశ్రాంతిగా చప్పరించెను" అన్నది ఇమడదు. Durative participle వాడుతూ "విశ్రాంతిగా చప్పరించు సమయంబున ..." అన్నప్పుడు వాక్యాన్ని పూరించాలంటే సరిగ్గా అదే సమయంలో ఇంకేదో జరగాలి. కానీ ఏమీ జరగలేదు. వాక్యాన్ని ముగించడం ఎలా? కొలిచాలగారుదహరించిన కన్యాశుల్కంలోని "వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనపడుతుంది" అనే వాక్యం - ఆ సన్నివేశపు నేపథ్యం తెలియని వారికి continuous tense అనిపిస్తుందా అని సందేహం. అంతేగాక, ఆ నాటకాన్ని అచ్చువేయించిన వారిలో ఎవరైనా ఈ వాక్యాన్ని "కనపడుతూంది, -తోంది" అని ఎవరైనా రాశారేమో తెలుసుకోవాలనుంది.

"విశ్రాంతిగా చప్పరిస్తూ ఉంది" లేదా "చప్పరించుచూ ఉంది" అని విసంధిని వాడటమే ఉత్తమమేమో!
---
ఒక బస్సుకోసం ఇద్దరు వ్యక్తులు హైదరాబాదులోని ఒక బస్టాపులో ఎదురు చూస్తూ ఉన్నారనుకుందాం. బస్సింకా రాలేదు. మామూలుగా అదెప్పుడొస్తుందో ఒకాయనకు తెలుసు. ఇంకొకాయనకు ఆ బస్సు వెళ్లపోయిందేమోనని సందేహం. తెలిసిన వ్యక్తిని అడిగాడు:
" అన్నా, బస్సు ..."
"వస్తుంది వస్తుంది"
కాసేపట్లో వస్తుంది కూర్చోమన్నట్లా? లేక వస్తూ ఉంది, సంచీ పట్టుకొని ఎక్కడానికి సిద్ధమైపొమ్మనా?
---
సురేశ్‌గారు, మా ఆశ్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆతిథ్యానికి మేమెప్పుడూ సిద్ధమే. ఆశ్రమానికి పునఃస్వాగతం.
rākeśvara చెప్పారు…
అది జూన్ మాసం, ఒక అందమైన రాత్రి, నేను మా విశ్వవిధ్యాలయ గ్రంథాలయంలో కూర్చుని చాట్ కి
ఎవరు దొరుకుతారా అని చూస్తుంటే, రానారె రానే వచ్చారు. ఎదో మాట్లాడుతుండగా నేను వస్తుంది అన్నా.
దానికి రానారె విరుచుకు పడ్డారు. వస్తోంది అనాలి అని.
నేను అలాంటి ప్రయోగం ఎప్పుడూ వినలేదు. అన్నా.
డాండూండాష్ అని వాదించి బెదిరించారు. నేను పెద్దలు, సరే మీరే ఒప్పు అని ఒప్పుకున్నా.
కానీ కాదు! :)

తెలుగులో రెండే కాలాలు ఉంటాయని నాకు చిన్నప్పటినుండి బాగా గుర్తు. Simple past అనేది చాలా మంచి tense కానీ అది ఆంగ్లానికే పరిమితం. అని నేను చిన్నప్పుడు ఆంగ్ల వ్యాకరణ క్లాసులో అనుకున్నా.
నాకు తెలిసినంత వరకూ మా మాండలికంలో ఐతే, నేనెప్పుడూ వస్తుంది అనేది simple past కి వాడతారు, అందులో ఏ తప్పూ లేదు.

సురేశ్ గారు చెప్పిందానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ మధ్య simple past కూడా భాషలో చోటుచేసుకోవడం మాత్రం నాకు తెలియదు.

ఇక సంధుల విషయానికొస్తే, శ్రీరాం అన్నట్టు, గుణ, సవర్ణధీర్ఘలు సంస్కృత పదాలకే వాడాలన్నిది నేను మొన్నే ఎక్కడో చదివా, పైగా అది only makes sense, కాదా.

సంగ్రహం ఎఁవటంటే,
౧) మీ టపాతో నేను ఎక్కడా ఏకీభవించకున్నాను.. :(
౨) నా బ్లాగులో మాత్రం "నిజమే ఎప్పటికీ గెలుస్తుంది" :)

ఇక ఎవరో మహానుభావులు అన్నట్టు,
భాష వ్యాకరణాన్ని అనుసరించదు. వ్యాకరణమే భాషని అనుసరిస్తుంది.

disclaimer- పైన చెప్పినవన్ని నాకు తెలిసినవే, నా ప్రావీణ్య పరిమితులు నాకు బాగా ఎరుకే. తప్పులుంటే మన్నించగలరు.
Suresh Kolichala చెప్పారు…
రానారె గారు: మీరు రాసిన దాంట్లో నేను ఒప్పుకోని విషయాలు తక్కువే. 1) అన్య భాషా ప్రభావంతో, తెలుగుభాష పదాలల్లుకుపోయే తన సహజ లక్షణాన్ని కోల్పోయి, తెలుగు వాక్యాన్ని పూర్తిగా విడి విడిగా (విసంధులుగా) రాసే పరిణామం ఏర్పడవచ్చునని నేనింతకుముందెక్కడో చెప్పినట్టు గుర్తు. 2) మీ వాక్యాన్ని ప్రాచీన తెలుగులో durative participle వాడుతూ "విశ్రాంతిగా చప్పరించుచున్నది/చుండెను" అని కూడా రాయొచ్చన్న విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. అయితే మహాభారతం లాంటి ప్రాచీన గ్రంథాలలో శత్రర్థకాన్ని (durative participleని) సంక్లిష్ట వాక్యాలలో (Compound sentence) అప్రధానక్రియగానే తప్ప సాధారణ వాక్యాలలో (simple sentence) ప్రధాన క్రియగా (main verb) వాడడం చాలా తక్కువ (కాదంటే మీరు ఉదాహరణలు చూపించాలి). 3) బస్సెప్పుడొస్తుందో తెలుసినాయన మాట్లాడే భాష తెలంగాణా అయితే, ఆయన "వస్తుంది, వస్తుంది" అంటే "it is coming" అని "వస్తది,వస్తది" అంటే "it will come" అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
రానారె చెప్పారు…
వ్యాఖ్యానించిన మీ అందరికీ అనేక ధన్యవాదాలు - సురేశ్‌గారితో సహా. చాలా విషయాలు తెలిశాయి. నేను తెలుసుకొన్న మరొక్క సంగతి ఏమిటంటే - విజ్ఞులైన పర్యవేక్షకులు ఎవరూ లేనప్పుడు 'డాండూండాష్ అని వాదించి బెదిరించ'రాదు. ఆలా చేస్తే కొందరు పిల్లకాయలు 'పెద్దలు, సరే మీరే ఒప్పు అని ఒప్పుకున్నా' ఒప్పుకున్నట్లు నటిస్తారు :-)
rākeśvara చెప్పారు…
రానారె,
నథింగ్ పర్సనల్ అండి, నాలుగు నెలల క్రితం కంటే నాకు తెలుగు పరంగా ఆత్మవిశ్వాసం పెరిగింది, అంతే. :)

గోదావరిలో
వస్తున్నాది it is coming
వస్తుంది - it will come & it comes
వత్తది, వత్తాది, వద్ది... - it will come & sometimes it comes
(తెలుగు నేర్చుకోవడం కష్టఁవే :)
S చెప్పారు…
నేను కూడా ఇలాగే మళ్ళీ చదవాలి అనుకుని చదవని పుస్తకాలు ఎన్నో... చదువుతూ మధ్యలో ఆపేసి మళ్ళీ చదవలేక పోయినవి ఇంకెన్నో! ప్రపంచం లో మరీ పుస్తకాలెక్కువైపోయాయి! చా! :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము