Wednesday, August 08, 2007

కోరస్సు

"కోరస్సని ఒక మనిషున్నాడయ్యా! ఆడవాళ్లు పాడినట్టు పాడతాడు, మగాళ్లు పాడినట్టు పాడతాడు, పదిమంది ఒకేసారి పాడినట్టుకూడా పాడతాడు!! కోరస్సు ముందు ఎంతపెద్ద పాటగాళ్లైనా దిగదుడుపేననుకో!!!" -- ఆకాశవాణి కడప కేంద్రంలో కాంతిరేఖలు అనే కార్యక్రమంలో దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ఒక సోమవారం ఉదయం ప్రసారమైన ఒకానొక హాస్యనాటికలోని ప్రధాన పాత్ర చెప్పిన ఈ మాటను సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఎవరిమీదైనా ప్రయోగిస్తుంటాం.

నిలయంలో పనిచేసే ఒక ఎనౌన్సరు తానే రాసి, మరొకరో, ఇద్దరో సహోద్యోగులతో ప్రతి సోమవారం ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమం తెరలుతెరలుగా నవ్వులు పంచుతుండేది. నాకు ఆ రచయిత పేరు గుర్తురావడంలేదు. అందులో పాల్గొనే స్త్రీ పాత్ర పేరు మంజులాదేవి. అప్పటికి ఆమె కుమారి మంజులాదేవి. చిన్నవయసులోనే చాలా సహజంగా ఆ పాత్రల్లో నటించడం, ముఖ్యంగా హాస్యాన్ని పండించడం మామూలు విషయం కాదుగనక ఆమెపేరు గుర్తుండిపోయింది.

6 comments:

ప్రసాద్ said...

రామా మీకు రామ్ (ROM/RAM) ఎక్కువే!
ఎప్పుడో వున్న డైలాగు ఇంకా గుర్తుండటమే!

--ప్రసాద్
http://blog.charasala.com

త్రివిక్రమ్ Trivikram said...

పదిహేడేళ్ళ కిందటా? నిజంగానే నీకు రా'ము చాలా ఎక్కువ యర్రపురెడ్డి రామా! :D (రచయిత పేరు: సుభాన్?)

ఒక చిన్న అనుమానం: స్త్రీ పాత్ర గురించైతే తెలియదుగానీ పాత్ర(గాత్ర)ధారి తెలుసు. ఎంతసేపైనా వినాలనిపించే మంజుల స్వరం గల సార్థకనామధేయురాలు కుమారి మంజులాదేవి ఇప్పటికీ 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ పైనే పనిచేస్తోంది. ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసేటప్పుడైనా, ఫోన్-ఇన్ ప్రోగ్రాముల్లోనైనా, ఆమె సంభాషణాచాతుర్యం అమోఘం. గతంలో కాంతిరేఖల్లో ప్రసారమైన సాహితీస్రవంతి (గొప్ప గొప్ప రచయితలు రాసిన కథలు, నవలలు చదివి వినిపించే కార్యక్రమం)లో ఆమె, వనజ, నాగులారపు విజయసారథి లాంటి వాళ్ళ కథాశ్రవణం విన్నవాళ్ళెవరూ మర్చిపోలేరు.

ఒకసారేమైందంటే అభిరుచి ఫోన్-ఇన్ లైవ్ ప్రసారాలు మొదలుపెట్టిన కొత్తల్లో ఒక శ్రోత ఫోన్ చేసి ఒక పెద్ద హీరో సినిమాలోని ద్వంద్వార్థాల పాట వినిపించమని కోరగా మంజుల వెంటనే "అలాంటి పాటలు వినిపించమండీ" అని చెప్పేసింది. అది అర్థంకాని ఆ శ్రోత "ఆ పాట లేదాండీ?" అనడిగితే "ఉంది. కానీ అలాంటి పాటలు వెయ్యం. కావాలంటే అదే సినిమాలో నుంచి వేరే పాటేదైనా అడగండి వినిపిస్తాం." అని చెప్పేసింది. ఇక్కడ హైదరాబాదులోనేమో F.M. రేడియో అనౌన్సర్లు "నా దాని పొడవు నాలుగంగుళాలు" అంటున్నారని తెలుగు బ్లాగుల్లోనే కొంతకాలం కిందట చదివాను. :(

కొత్త పాళీ said...

అవును, కోరస్సు నిజంగా గొప్ప సింగరు!!:-))

రానారె said...

ప్రసాదుగారు, కొన్నికొన్ని మాటలు మనకు అట్లాగే గుర్తుండిపోతాయి. మనల్ని బాగా నవ్వించినవీ ఏడిపించినవీ తొందరగా మరపు రావు కదా!

త్రివిక్రమ్, ఔనౌను ఆయన పేరు సుభాన్. థాంక్యూ. మీ అనుమానం సమంజసమే. నేను చెప్పింది పా(గా)త్రధారి గురించే. 1999లో కాంతిరేఖలు కార్యక్రమంలో జనార్ధనరెడ్డి చదివిన సన్నపురెడ్డి కథ 'దిగంబరం' గురించి ప్రస్తావించాను 'పొద్దు'లో ఒకచోట. వనజకూడా మంచి ఎనౌన్సరే(ప్రయోక్త అనవచ్చా?) కానీ ఆవిడ "ఆకుష్వాణి కడప కేంద్రం" అని పలుకుతారు. బెంగుళూరుకు కడపరేడియో సరిగా అందదు. విని చాన్నాళ్లైంది. ఆ మధ్యనే యువవాణి కార్యక్రమంలో ఒక కొత్త ముస్లిం యువకుడు పనిలో చేరాడు. శ,షలను పలకడంలో తేడా చూపించలేకపోయాడుకానీ అతను కూడా చాలా ప్రతిభ, ఉత్సాహమూ కలవాడుగా కనిపించేవాడు. తక్కోలు మాచిరెడ్డి, నాగులారపు విజయసారధిగార్ల హయాంలో సాహిత్యానికి ప్రాముఖ్యం ఇవ్వడంతోబాటు ఫోనిన్ కార్యక్రమాలు కూడా పెంచారు, వ్యాపార ప్రకటనలను ఆకర్షించడంలో కొంతవరకూ సఫలమయ్యారు.

కొత్తపాళిగారు, మీకు తెలిసే ఉండాలి - అందరికన్నా ఎక్కువ పాటలు పాడిన గాయకుడు కోరస్సే. :-))

Nagaraja said...

అవునవును కోరస్సుకు అప్పుడప్పుడు శిరస్సును వంచాల్సిందే! ఎంత పెద్ద పాటగాడైనా!!

S said...

ఇలాంటిదే మరో జోకు... ఎవరో చెప్పడం కాదు నేనే అనుకునేదాన్ని... చిన్నప్పుడు దూరదర్శన్ తప్ప వేరే వచ్చేది కాదు... అప్పుడు వారాంతం లో వచ్చే సినిమా గురించి అడ్వర్టైస్మెంట్ ఈ ఫార్మాట్ లో ఉండేది... ఫలానా సినిమా... ఫలానా తేది... తారాగనం... హీరో, హీరోయిన్ తదితరులు... అనో లేక హీరో, హీరోయిన్ మొ.. అనో. నేను చాన్నాళ్ళు ఈ తదితరులు, మొ ఎవరో గానీ, అలా ప్రతిసినిమాలో ఎలా ఉంటారో అనుకునెదాన్ని. కోరస్ గురించి కూడా...ఆడియో కేసెట్ల పైన... బాలు అండ్ కోరస్, చిత్ర & కోరస్ ఇలా ఉంటే - మరీ రేడియో పాత్ర లా కాదు కానీ... ఎందుకో...కోరస్ అబ్బాయి అని ఫిక్సై, వీడేంటి ప్రతి పాట లోనూ ఉంటాడూ? అనుకునేదాన్ని అప్పట్లో.... కొన్నాళ్ళు పట్టింది నాకు ఈ పదాల అర్థాలు తెలీడానికి...తలుచుకుంటే నవ్వొస్తుంది.. మీ టపా చూడగానే అదే గుర్తు వచ్చింది నాకు :)

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.