మంచిపేరుకూ సుఖానికీ యడమెంత!?

ఈ కథ చెప్పే ఒక మాట: మన బ్లాగులలో తెవికీకి లింకులిద్దాం. లింకు అక్కడ లేకపోతే మనమే తెవికీలో ఒక పేజీ సృష్టిద్దాం. ఈ టపాలోని గొల్లపూడి పేజీ నేనే సృష్టించాను. తెవికీ వాడకాన్ని అలవాటు చేసుకుందాం.

గొల్లపూడి మారుతీరావుగారు నటించిన తొలి సినిమా "ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య". ఆ సినిమా పేరు ఆయన పోషించిన పాత్రను ఉద్దేశించి పెట్టారనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన చెప్పే మాటలు బలే ఉంటాయి. ఒకేఒకసారి ఎప్పుడో పన్నెండు పదమూడేళ్ల క్రితం చూసినా అందులోని రెండు సన్నివేశాలు నాకు పదేపదే గుర్తొస్తూంటాయి.

ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని తనవద్దకు వచ్చిన ఒక పేదమధ్యతరగతి యువతిని ఇంటర్యూ చేస్తూ ఆమెపై చేయివేసి కాంక్షగా చూసి, ఆమెతో చెంపదెబ్బతిని, ఆమె ఆత్మాభిమానానికి ముచ్చటపడి, ఆమె సంస్కారానికీ ధైర్యానికీ పరీక్షపెట్టిన పెద్దమనిషిగా అభినందించి ఆమెకు ఉద్యోగం ఇవ్వడం - మొదటి సన్నివేశం. పెద్దమొత్తంలో సొమ్ము ఆమెచేతికిచ్చి ఆఫీసులో దాచమని చెప్పి, దాన్ని తానే కాజేసి, నింద ఆ అమ్మాయిపై మోపి, పోలీసులకు ఫోన్ చేస్తానని కోపం నటిస్తూండగా వద్దని బ్రతిమాలుకుంటున్న ఆమెపై మళ్ళీ చేయివేసి, ఆ నిస్సహాయురాలిని తనగదిలోకి తీసుకెళ్లడం - రెండవ సన్నివేశం. అప్పుడే కౌమారం దాటిన నాకు, ఆ సన్నివేశంలో ఆమె పరిస్థితికి విపరీతమైన సానుభూతి ఒకవైపు, అతడు పొందే సుఖానికి ఈర్ష్య మరోవైపూ కలిగి, మొత్తానికి అదొక పసందైన సన్నివేశం అనిపించాయి.

ఈ సన్నివేశాలు గుర్తొచ్చినప్పుడు చాలా ఆలోచనలు కలిగేవి. ఆమెను తలచుకొంటే అయ్యో పాపం అనిపించేది. అలాంటి గోముఖవ్యాఘ్రాన్ని ముక్కలుముక్కలుగా నరికే అవకాశం ఆమెకు లభించాలని కోరుకొనేవాణ్ణి. అతలోనే - ఆతడు అదృష్టవంతుడు అనిపించేది. అతడు సాధిచిన పైచేయి, ఆ తీయని విజయం, అహో, అనిపించేవి. నాకూ అలాంటి అవకాశం కలిగితే భలే ఉండుననిపించేది. వెంటనే ఆ ఆలోచన వచ్చినందుకు నామీద నాకే అసహ్యం కలిగేది.

నేనంత దుర్మార్గంగా ఆలోచించిన పాపానికి నాకేదైనా తీవ్రమైన శిక్షపడితే తప్ప ప్రాయశ్చిత్తంలేదు అనిపించేది. అలాంటి శిక్షపడితే అందుకు నేను అర్హుడనేనని, కాబట్టి దాన్ని అనుభవించడానికి మానసికంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించేవాణ్ణి. నేను మంచివాణ్ణా లేక గోముఖవ్యాఘ్రాన్నా!? అని సందేహం కలగేది. కలగగానే భయంవేసేది. ఛ ఛ నేను మంచివాణ్ణే, మంచివాణ్ణి నేను, నేను మంచివాణ్ణి, మంచివాణ్ణే నేను అని మూడునాలుగుసార్లు అనుకొని ఆందోళన తగ్గించుకొనే ప్రయత్నం గట్టిగా చేసేవాణ్ణి.

కానీ ఆ సినిమాలో గొల్లపూడి మారుతీరావు అనుభవించిన విజయానందమూ, ఆ సౌఖ్యమూ అతడు మంచివాడిగా ఉంటే లభించేవేనా. ఆయన చాలా మంచివాడే అయివుండి, ఒకవేళ అతని మంచితనానికి మెచ్చి ఆ అమ్మాయే అతన్ని కోరివచ్చినా, లొంగదీసుకోవడంలోని కిక్కు ఏదీ ...!? చిరంజీవినే తీసుకుందాం. ఆ సినిమాలో అతడు చాలా మంచివాడు. ఏంలాభం? ఒకతే పెళ్లాం. ఆ పెళ్లాంతో కూడా ఎప్పుడూ పేచీలే. మారుతీరావు చూసినన్ని అనుభవాలు చిరంజీవి చూసే అవకాశాలు లేవు, రావు గాక రావు. చిరంజీవికి మంచివాడనే పేరుమాత్రం ఉంటుంది. సుఖం లేని మంచిపేరు - అవసరమా? అసలు చిరంజీవికి అలాంటి పనులు చేసే ధైర్యం లేదేమో. ఉన్నా అందులోని మజా తెలిసినవాడు కాదేమో. దొరికిపోతే జీవితం దుర్భరం అన్న భయమేమో. మారుతీరావుకు ఆ భయం ఉన్నట్లు లేదు. దేనికైనా చాకచక్యం కావాలి. ప్చ్... ఏమిటి చాకచక్యం? ఎందుకు చాకచక్యం? అవసరంలో ఉన్న ఒక అందమైన అసహాయురాలిని ఇరికించి పళ్లికిలించడానికా? అంతకన్నా నీచం మరొకటి ఉందా? పేదరాలికి ఆత్మాభిమానం ఉండకూడదా? అందంగా ఉండడం నేరమా? అందాన్ని ఆరాధించాలి. ప్రతిదాన్నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నించకూడదు. రావణునికి చూడు ఏం గతి పట్టిందో. ఏం గతి పట్టిందంటా? పోరాడి చచ్చాడు అంతే కదా. రాముడి గతి చూడు. అతడేం సుఖం అనుభవించాడు? సీతను దక్కించుకున్నాక కూడా ఆమెతో కలిసిబతికే అదృష్టం లేకుండా చేసుకున్నాడు. ఎందుకు? మంచివాడనిపించుకోవాలనే బలహీనత వల్ల. అంతేనా? అది బలహీనతా? ఐతే అందరూ అతడిని ఎందుకు ఆదర్శప్రాయుడన్నారు? ఎందుకో తెలుసుకోవాలి. ఏదేమైనా రావణాసుడు బ్రతికినన్నాళ్లూ రాజాలా ఉన్నాడు. కోరింది దక్కించుకున్నాడు. సుఖపడ్డాడు. ఒకరోజు చచ్చాడు. చచ్చాడు కాదు, వీరమరణం పొందాడు అనాలి. స్వర్గస్తుడే అయినాడు. చచ్చినా బతికినా వానికి సుఖమే. అదీ రాజాబతుకు అంటే. అది మంచిదేనా ...

ఇలా గొల్లపూడి మారుతీరావుగారు చాలా రోజులపాటు నా బుర్రను గిర్రున తిప్పారు. ఒకసారి ఆయనే నా సందేహాలన్నింటికీ సమాధానం చెప్పారు. ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను ఆయన "జీవన కాలమ్" శీర్షికన వ్యాసాలు రాసేవారు. అప్పట్లో మాకు పేపరు తెప్పించేంత లేదు. మా బళ్లోగానీ, ఎవరింట్లోనైనాగానీ, ఎక్కడైనా సరే నాకెప్పుడు ఆ పత్రిక కనబడినా ఆ కాలమ్ కోసం వెతికి చదివేవాణ్ణి. అలా ఉండగా ఒకసారి ఒకానొక చిరిగిన కాగితం పొట్లంలో "జీవన కాలమ్" కనబడింది. అందులో ... (సశేషం)

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
ఇలా suspenseలో ఆపేస్తే ఎలా?

మీరు పడిన సంఘర్షణని అలా నిజాయితీగా ఎలా రాయ గలిగారు? గాంధీ గారి జీవిత చరిత్ర మీకు స్ఫూర్తినిచ్చిందా?

మీరలా రాస్తుంటే నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. మా అన్నయ్యను మేము సత్య హరిశ్చంద్రుడు అనే వాళ్ళం. చిన్నప్పుడు హాస్టలులో తోటి విద్యార్థులు తెలియకుండా మాంసం తినిపిస్తే, తెలిసాక, అగరు బత్తి వెలిగించి నిప్పు రవ్వలు నాలుక మీద వేసుకుని శిక్షించుకున్నాడు.

గాంధీ గారి విషయంలో నేను పూర్తిగా చదివాక అభిప్రాయం మార్చుకుంటానేమో తెలియదు. అంత వరకూ, ఆయన తన చిన్ననాటి గాంధీ మీద అంత judgemental గా ఉండడం అన్నది నాకు చాలా కష్టమైన విషయం.

మీరు తర్వాతి భాగం కూడా త్వరగా రాయండి. మీకు దొరికిన సమాధానమేమిటో తెలుసుకోవాలని ఉంది.
అవును చాలా నిజాయితీ కావాలి ఇలా రాయాలంటే.
మా ఆఫీసులో మంచివాడు అంటే చేతకానివాడు అని చెప్పినట్టు.
కొత్త పాళీ చెప్పారు…
ముఖ్యమైన పాయింటు మిస్సయ్యావు మిత్రకేసరీ. చిరంజీవి అంత మంచాడు కాబట్టే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సుందరాంగితో ..ఇందువదన కుండరదన .. అని గెంతుకుంటూ .. ఇప్పటికీ తన కూతురి వయసున్న పిల్లలతో "సర్వ సౌఖ్యాలూ" అనుభవిస్తున్నాడు.
మారుతీరావు సినిమాల్నించి రిటైరై ట్రావెల్ ఏజెన్సీ నడుపుకుంటూ జీవన కాలాలూ, బతుకు భారాలూ రాసుకుంటున్నాడు.
నీతి - మంచివాడిగా ఉంటేనే అనేఖ సినిమాల్లో సౌఖ్యాలు దక్కును!
రాధిక చెప్పారు…
మంచి పేరుకు సుఖానికి మధ్య ఎడం నా ద్రుష్టిలో తృప్తికి ఆనందానికి వున్న తేడా అంత.
rākeśvara చెప్పారు…
ఎమో నండి రానారె,

నేనైతే "తప్పుచేసా" అనే భావనతో బతకడం కంటే నరకం వేరేదీ లేదు అని భావిస్తా..
అలా అంటే తప్పుచేసే వాడికి మనస్సాక్షి ఉండదు కదా అంటారు, మనస్సాక్షి లేకుండా మనుషులుండరని నా ఉద్దేశం. అలాంటి మనుషులున్నా వారికంటే దురదృష్టవంతులు లేరు.
"సింహం గడ్డి తినదు"

మీ నిజాయితీకి జోహార్లు

@కొత్తపాళీ
సారు మీరు నిజ జీవితానికి, నటనా జీవితానికి లంకె పెట్టి, పెద్ద పప్పులో కాలే వేసారు, అని నా భావన.
అజ్ఞాత చెప్పారు…
మనిషి తప్పులు చేయడం వలన అతని ధ్యాస ఆయా విషయాల్లో చిక్కుబడిపోతుంది. ధ్యాస సృష్టికి మూల శక్తి కాబట్టి వాడు తన భవిష్యత్తును ఉన్నత మార్గాన సృష్టించుకోలేకపోతాడు. ఇది ఎంత భయంకరమో కనీసం ఊహకు అర్థమయినా చాలు. ఇక ఆలోచనల్లో ఎంత దుర్మార్గంగా ఉన్నా పట్టించుకోవలసిన అవసరం లేదంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం. వాక్కు అన్నింటి కన్నా అతి ముఖ్యమైనది, పట్టించుకోవలసినది. (సశేషం:)
Sriram చెప్పారు…
రానారె, శభాష్! గొప్ప విషయాన్ని ఇంత సరళంగా రాయగలగడం నీకే చెల్లింది. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నా...
చైతన్య చెప్పారు…
సశేషం అని చెప్పి suspence లో పడేసారు...

మీ వ్యాసం చదివిన తర్వాత, ఎప్పుడో ఎక్కడో చదివిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది...
"ఎక్కువ శాతం మంది మనుషులు తమ సొంత వ్యక్తిత్వం తో, తమకి నచ్చినట్టు జీవించటం కంటే, ఎదుటివారితో మంచి అనిపించుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట"

ఐనా 'తప్పూ', 'ఒప్పూ' అనేవి relative terms అని నా అభిప్రాయం... ఒకరికి తప్పు అనిపించింది వేరొకరికి ఒప్పు కావచ్చు, అలాగే వేరొకరికి ఒప్పు అనిపించింది మనకి తప్పు కావచ్చు.

ఇంత సున్నితమైన విషయాన్ని, చాలా చక్కగా వివరించారు...

గమనిక : రెండవ పేరా లో, రెండవ లైన్ లో...'బలే' అని ఉంది...అది 'భలే' అయిఉంటుంది అనుకుంటాను.
నాలుగవ పేరా లో, మూడవ లైన్ లో...'అతలోనే' అని ఉంది... అది 'అంతలోనే' అయిఉండాలనుకుంటాను.
అజ్ఞాత చెప్పారు…
బలవంతం గా ఎదుటి వ్యక్తి ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా మనక్కావల్సింది సాధించుకోవాలనుకోవటం రాక్షస ప్రవ్రుత్తి...అలాంటి రాక్షసుడు ప్రతి మనిషిలో దాగుంటాడు...ఏదో ఒక సందర్భం లో బైటకు వస్తాడు...మంచితనానికి దీనికి సంబంధం లేదు...మనస్ఫూర్తిగా ఇచ్చిపుచ్చుకోవటం లో వున్న ఆనందం ఒక్కసారి అనుభవిస్తే ఎవరూ ఎవరినించి బలవంతం గా ఏదీ లాక్కొవాలని ప్రయత్నించరు అని నా అభిప్రాయం
అజ్ఞాత చెప్పారు…
మీ నిజాయితీ కు అభినందనలు... మీ టపా చూస్తుంటే ( చదువుతుంటే) 'చలం' పుస్తకం చదువుతున్నట్లు ఉంది.ఇలాంటి సంఘర్షణలతోనే...జీవితంలో ఎంతో అశాంతి తో ఉన్నాను. రెండో భాగం కోసం (మీకు దొరికిన సమాధానం కోసం) ఎదురు చూస్తున్నా.
అజ్ఞాత చెప్పారు…
ఈ విధమైన తర్కమే...ఉపేంద్రను..ఉపేంద్ర సినిమా తీయడానికి ప్రేరేపించింది. అటువంటి వింత కాన్సెప్టును ఉన్నదున్నట్టుగా (పచ్చిగా) చిత్రీకరించడం ఒక్క ఉపేంద్రకే సాధ్యమైంది. కాకుంటే అందులో కమర్షియల్ అంశాలు జోడించడంతో దానిని ఉత్తమ సినిమా అని చెప్పలేము. లేదంటే అటువంటి స్క్రీన్ ప్లే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పాఠంగా ఉండవలసింది.
spandana చెప్పారు…
ఇంచుమించు ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి భావసంచలనం సహజమే అయినా నిజాయితీగా నాలో ఇలా కలిగేది అంటూ హృదయంలో జరిగే మంచీ-చెడుల యుద్దాన్ని ఇంత బాగా రాయడం మీకే చెల్లుతుంది.
సస్పెన్సు ముడి ఎప్పుడు విప్పుతారా.. ఆ సమాధానం ఏమిటా అని ఉత్సుకతగా వుంది.

--ప్రసాద్
http://blog.charasala.com
Unknown చెప్పారు…
నిజమేనయ్యా రానారె పైన అందరూ అన్నట్టు ఇలాంటి భావావేశాలు ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి.

ఇలాంటి సీన్లు చూసినప్పుడల్లా నాకు విరక్తి కలుగుతుంది ఫ్రాంక్ గా చెప్పాలంటే, అలాగని ఇంకే ఇతర స్కిన్ చో నాకు నచ్చదంటే నేను నన్ను మోసం చేసుకున్నట్టే.

చెడుని దాచుకుని, మంచిని పైకి చూపించడం అందరూ చేసేదే, అందులో వింతేమీ లేదు. కానీ అప్పుడప్పుడూ మనకు కలిగే ఎక్స్ట్రీం థాట్స్ నుంచి మనల్ను మనం రక్షించుకోవాలి. అది అవసరం కూడా.
రానారె చెప్పారు…
అందరికీ వందనం.

లలితగారు, ఇందులో భయపడటానికీ దాచిపెట్టడానికీ ఏమీ లేదు కదా! గాంధీగారి జీవితచరిత్ర తెలుగు అనువాదం ఒకసారి చదివానుగానీ, అది దీనికి ప్రేరణ కాదు. గొప్పగొప్ప పనులు చెయ్యగలిగితే అప్పుడు గాంధీమార్గం అనుసరించానని చెప్పగలనేమో :)

సత్యసాయిగారు, మంచివాడు ఎప్పుడూ చేతకానివానిలాగే కనబడడని నా నమ్మకం. మంచివాణ్ణనిపించుకోవాలనుకునే వ్యసనపరుడు చేతకానివాడౌతాడు - అనిపిస్తుంది నాకు.

కొత్తపాళిగారు, నేను మిస్సైన పాయింట్ సశేషం లో ఉందేమో చూశారా!

రాధికగారు, మీ మాట అర్థమయ్యీకానట్టుంది :)

రాకేశ్వరా, మీమాటే నాదీ.

నాగరాజాగారు: శేషం వ్యాసేన పూరయేత్, మరి మీ వ్యాఖ్యో?

శ్రీరామా, థాంకులు. ఇప్పుడు చూడండి.

చైతన్యగారు, మీరు చెప్పిన మొదటి విషయం రెండవభాగంలో ప్రస్తావించాను. రెండవ విషయాన్ని ఇటీవలే ఒకచోట రాశాను.

Anonymous గారు, సత్యం చెప్పారు.

రాజుగారు, అశాంతికి కారణం వెతికే ఉంటారు. "నేను బాధ పడుతున్నాను" అని మనకు తెలిసిన తరువాతకూడా బాధ పడుతూనే ఉండటం సాధ్యంకాదుకదా!

నవీన్ గార్లూ, మీరు హైదరాబాదుకు బదిలీ కావాలని నా ఆకాంక్ష ;)

ప్రసాద్ గారూ, టపా రెండోభాగం పోస్టుచేసిన నిముషంలోపే వ్యాఖ్యరాసి నన్ను ఆశ్చర్యపరిచారు.

ప్రవీణ్, నువ్వుకూడా ఈ మాత్రానికే ధైర్యంకావాలంటున్నావా?

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము