మంచిపేరు - చెడ్డపేరు - సౌఖ్యం

... అందులో ఆయన నా మస్తిష్కంలో జరుగుతున్న మధనాన్నే ప్రస్తావించారు.

మనం చూసే సినిమాల్లో సాధారణంగా హీరో పేదవాడైనా ధనికుడైనా మంచివాడు. అతడికి అమాయకురాలైన చలాకీ చెల్లెలు, ఒక తల్లి, ఒకరిద్దరు ప్రియురాళ్లు ఉండే అవకాశాలు ఎక్కువ. అతడు మంచికి మారుపేరు, నిజాయితీకి నిలువుటద్దం. ఆత్మాభిమానం అతని అందం. అందరికీ తలలో నాలుక, ఆపద్బాంధవుడు వగైరా వగైరా.

అతని మార్గం కఠినం. కష్టపడి పని చేసి సంపాదిస్తాడు. అవసరంలో ఉన్నప్పుడు ఆ సంపాదనే నలుగురికీ పంచుతాడు. నిజంగానే మంచివాడే అయినా, "నువ్వు చాలా మంచివాడివి నాయనా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అంటే ఇబ్బందిగా మొహమాటంగా కదిలి అంతా "మీ అభిమానం" అని సిగ్గును అభినయిస్తాడు.

అతనికి చెల్లెలు గుర్తుకొస్తుంది. అదే సమయంలో ఏ పొలంగట్టునో, కాలేజీలోనో, సందు చివరో విలన్‌గానీ వాడి కొడుకుగానీ ఈమెను చూస్తాడు. తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. దగ్గరికెళ్లి "నువ్వూ పారేసుకో" అంటాడు. అన్నయ్య నేర్పిన ఆత్మాభిమానంతో ఆ చెల్లెలు వాణ్ణి దులిపేస్తుంది.

"ఎంత పొగరు" అంటాడు విలన్‌గాడి చెంచా. స్థితప్రజ్ఞుడిలా సర్వజ్ఞుడిలా పోజిచ్చి "పొగరేరా ఆడదానికి అందం" అని చెంచాగాడికి తత్వంబోధిస్తాడు విలన్. చెంచాగాడు తన్మయత్వం పొందుతాడు. ఆ తరువాత జరిగేవన్నీ దేవుడు చల్లగా చూస్తూవుంటాడు. చివరాఖరులో జ్యోతిమాలినితో అత్యవసర సమావేశంలో ఉన్న విలన్‌ను హీరో వెంబడించి చంపుతాడు. ఒకోసారి విలన్ "నేను మారిపోయాను, నాకు బుద్ధొచ్చింది" అని బతికిపోతాడు. చివర్లో దేవుడు పోలీసులను పంపుతాడు. "ఫోర్నాట్టూ అరెస్ట్ దెమ్" - అనే డైలాగ్‌తో సుఖాంతంగానీ శుభంగానీ జరుగుతుంది.

ఇందులో విలన్‌కు చెల్లెలు, తల్లి, తమ్ముళ్లూ ఉండే అవకాశాలు తక్కువ. ఉన్నా, వాళ్లు సేఫ్. హీరోనుంచీ వాళ్లకు ఏ ప్రమాదమూ లేకపోగా, ఒకోసారి విలన్ చెల్లెలు/కూతురు ఆపదలో ఉన్నప్పుడు మన ఆపద్బాంధవుడు అక్కడ ఉద్భవించి ఏదో ఒక బాంధవ్యానికి పునాదివేసి వెళ్లిపోతాడు.

ఎటు చూసినా విలన్ అనుభవించే సౌఖ్యం హీరోకు ఉన్నట్లు కనిపించదు. ఏ పురాణం తిరగేసినా ఇలాంటి కథలే ఎక్కువ.

*******

జీవితం చిన్నది, యవ్వనం మరీ చిన్నది, ప్రాణం నీటి బుడగలాంటిది కాబట్టి ఈ జన్మలో మనం దండుకోగలిగినంత సుఖాన్నీ దండుకొందాం - అని అర్థం వచ్చే ఫిలాసఫీ ఈ తరం యువతలో ఎక్కువగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. "ఈ వయసులో కాకపోతే మరి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, కానీయ్ వోయ్" అనేరకం తత్వబోధ వీకెండ్ పార్టీల్లో ప్రతిసారీ వినిపిస్తుంది. మరికొంత 'ముందుకెళ్లడానికి' సందేహింస్తున్న ప్రౌఢలూ ప్రౌఢులూ "దాసః అహం" అనేయడానికి పార్టీలకు మించిన తరుణం దొరకదు.

సిగరెట్ ముట్టనన్నవాడికీ, మందు కొట్టనన్నవాడికీ ఈ తత్వాలకు సమాధానం అంత సులభంగా దొరకక చాలా ఇబ్బందిపడతాడు. ఒకోసారి అక్కడున్న సీనియర్ తాత్వికుల హేళనకు గురియౌతుంటాడు. ఇవన్నీ మనకు అనుభవాలే. కామిగాక మోక్షగామి గాడు -- అని పెద్దలమాట. ఈ ఒక్క ఆర్యోక్తిని పట్టుకుంటే చాలు. బాగా ముందుకెళ్లిపోవచ్చు.

కానీ అలా ముందుకెళ్లేకొద్దీ మనల్ని విలన్ అంటారు. ఒకప్పటి స్నేహితులే మన విలనావతారాన్ని చూసి జంకుతారు, భయపడతారు, దూరమౌతారు. పెద్దలంతా మనకు "తప్పు నాయనా, బాగుపడరా" అంటారు మనమేదో చెడిపోయినట్టు. ఒంటరితనం ఆవహిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన ఒంటరి తనాన్ని సౌఖ్యాతిరేకంతో పూడ్చిపెట్టే ఆత్మీయులు తోడవుతారు. ఆ సహవాసంలో జీవితం మునుపటికన్నా ఎన్నోరెట్లు ఉత్తేజభరితమౌతుంది. "తప్పు చేస్తున్నావు బాబూ" అంటూ బయలుదేరే శ్రేయోభిలాషులను మన మిత్రబృందంతో అవలీలగా ఎదుర్కొనవచ్చు. మనం అనుభవించే సౌఖ్యంలోని మజా తెలిసినవాళ్లుకారు మన శ్రేయోభిలాషులు - అనిపిస్తుంది. పప్పుసుద్దలుగానూ, మడిగట్టుకొని కూర్చునే ఛాందసులుగానూ, జీవితాన్ని అనుభవించడం చేతకానివాళ్లుగానూ, బుద్ధిమంతులమనిపించుకోవాలనే యావలో అష్టకష్టలనూ భరించే అర్భకశిఖామణులుగానూ - మన శ్రేయోభిలాషులు మన కంటికి కనిపిస్తారు. మన చుట్టూ ఉన్న మనుషుల్లో చాలామంది ఇదే రకం సన్యాసిజీవులే. వాళ్ల పాట్లకు ఒకోసారి నవ్వూ, ఒకోసారి చికాకూ, ఒకోసారి జాలి - మనకు కలుగుతాయి.

కానీ మనకన్నా మనల్నిచూసి ఏడ్చేవాళ్లే ఎక్కువగా ఉంటారు. వీళ్లంతా మనల్ని "విలన్" అంటారు. మనం మైనారిటీ కాబట్టి మన సైన్యాన్ని పెంచుకోవాలి అనిపిస్తుంది. "చూడండి మేం ఎంతమందిమి ఉన్నామో, మీరు కొందరే మడిగట్టుక్కూర్చున్నారు" అని అనగలగాలి అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి కాంక్ష వాళ్లలోనూ రగలడం వల్లనే కొత్తగా వచ్చిన ఆత్మీయులు మనతో అంతగా అల్లుకుపోయారేమో! అంటే ఇది ఆపద్బాంధవ్యమేగానీ నిజమైనది కాదు. ఎప్పుడూ పొగలోనో మత్తులోనో జోగుతూ ఎవరినో ఒకరిని హేళనచేసి తృప్తిపడటం, ఎవరిని ఎలా ఏడిపించారో ఎలా ఏడిపించాలో మాట్లాడుకోవడమే. అందరిలోనూ ఏదో భయం ఉంటుంది. అపనమ్మకం ఉంటుంది. ఆ భయాన్ని మరచిపోవడానికి అందరూ జతగూడి సమయం గడపడం తప్ప, మనసులో ఏం జరుగుతోందో బయటికి చెప్పుకోవడం జరగదు.

"మామా పార్టీ" అనగానే "ఓఖే!!" అని గట్టిగా అవడం, కలవడం. కుదురుగా ఏమైనా ఆలోచిస్తూ కూర్చుంటే మనల్ను చూసి పక్కనోడికి భయం. ఆ భయం పోగొట్టుకోవడానికి "ఏంది మామా అట్టున్నావ్, దా, పార్టీలో ఎట్టుండాల? తాగాల, అరవాల, ఎగరాల, ఎంజాయ్ చెయ్యాల" అంటూ మాట్లాడటానికి మనకు అవకాశమివ్వకుండా జనంలో కలిపేస్తాడు. "ఎందుకు మామా అట్లుండావ్, చెప్పరా" అని అడగడు. ఒకవేళ అడిగినా - మనం చెప్పే సమాధానం పార్టీకి మరింత ఊపునివ్వాలని ఆశిస్తాడు, అలా కాకపోతే, ఎవ్వడూ వినడు. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయ్, మనసులో రేగే ఆలోచనలను వక్రీకరించకుండా బయటికి చెప్పుకోవడానికి తగిన తోడు లేదు. అసహనమూ అశాంతీ పెరుగుతున్నాయ్. మనం విలన్‌గా మారక ముందు మనకా స్నేహితులు ఉండేవారు. మనసులోనిది బయటకు రాకముందే మనం ఏం ఆలోచిస్తున్నామో పసిగట్టే నిజమైన ఆత్మీయులు ఉండేవారు. మనసులోని మధనాన్ని సావధానంగా సాహానుభూతితో విని తమకు తోచిన నాలుగు మంచి మాటలు మనకోసం మనతో చెప్పేవారు.

********

దీన్నిబట్టి అర్థమైం దేమిటంటే విలన్‌కు కూడా కష్టాలుంటాయన్నమాట. పైకి కనబడవు. మన పరిస్థితే ఇలా ఉంటే పీకల్లోతు విలనీలో కూరుకుపోయినవాడు, వాడికెన్నుంటాయో. మనమీద ఎవరూ ఆధారపడలేదు, మనమెవ్వరినీ చేరదీయలేదు, ఎవరిపంచనా చేరనూలేదు. మన స్నేహితులు మనల్ని మళ్లీ ఆహ్వానించవచ్చు. కానీ విలన్ పరిస్థితేమిటీ? విలన్‌కు ఇప్పటికే చాలామంది శత్రువులున్నారు. తన బతుకు ఎంత అసౌకర్యంగా ఉందో బయటకు చెబితే, వాడు చేరదీసినవాళ్లే వానికి శత్రువులౌతారు. కాబట్టి, మనసులో తాను చేస్తున్నది అర్థరహిత జీవనమని జ్ఞానోదయమైనా తన బాహ్యశత్రువులకు, అంతశ్శత్రువులకూ, వెన్నుపోటుగాళ్లకూ, అవకాశవాదులకూ అందరికీ భయపడుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, తన చుట్టూ ఉన్నవారు మనమీద మరింతగా ఆధారపడేలా చేస్తూ, మనశ్సాంతిని కోల్పోయి బతుకుబండిని నడుపుతుంటాడు. ఒక్క నిముషం కూడా హాయిగా నిద్రపట్టదు.

మానసిక ప్రశాంతత లేనప్పుడు భౌతికమైన సుఖాలలోకూడా ఆనందం అనుభవించలేమని ఇప్పుడు విలన్‌కు అనుభవపూర్వకంగా తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని మందమతి.

మనం కాలమతి అన్నమాట.

కానీ హీరో సుమతి. శత్రువులు లేరు. మనసెరిగిన స్నేహితులు, కుటుంబసభ్యులు. హాయిగా ఇంటిబయట మామిడిచెట్టుకింద మంచమేసుకుని నిద్రపోగలడు. మంచిపేరు, చెడ్డపేరు అనేవి పట్టించుకోడు. మంచిపేరు కావాలనుకుంటే హీరోకు హాయిగా నిద్రపట్టదు. చెడ్డపేరు తెచ్చుకున్న విలన్‌మాదిరిగానే.

*******
సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలు ఒక చెఱువులో నివసించేవి. కరువొచ్చి చెఱువు ఎండిపోతుందని ముందే గ్రహించి, మిగతా రెండు చేపలను హెచ్చరించి మరో సురక్షిత నీటిప్రాంతానికి ఎదురీదుకుంటూ వెళ్తుంది సుమతి. చెఱువుకు మిగతా వాగులతో సంబంధాలు క్షీణిస్తున్న సంగతిని కాస్త ఆలస్యంగానైనా గ్రహించి క్షేమంగా అక్కడినుండి సర్దుకుంటుంది కాలమతి. చెఱువు ఎండిపోయే దశలో కొంగలకు ఆహారమౌతుంది మందమతి. చిన్నప్పుడు చదువుకున్న కథే. ఆ కథ మార్కులకోసం మాత్రమే కాదుకదా!

కామెంట్‌లు

spandana చెప్పారు…
అద్భుతమైన వ్యాసం. చక్కగా ముగింపు ఇచ్చారు.

--ప్రసాద్
http://blog.charasala.com
సిరిసిరిమువ్వ చెప్పారు…
మానసిక విశ్లేషణా????
ఈ మూడు చేపల కథ నిన్నో మొన్నో ఎవరి బ్లాగులోనో చదివిన గుర్తు. ఇంతకీ ఇందులో కాలమతి ఎవరో??
అజ్ఞాత చెప్పారు…
ముగింపు బాగా అనిపిస్తోంది. కథనం చాలా బావుంది. ఆలోచనా విధానం ఆసక్తికరంగా ఉంది.

ఈ టపా ఇంకొన్ని సార్లు చదవాలి.

కామి అంటే అక్షరాలా కామి అవ్వడం గురించి కాదేమో అని నాకనిపిస్తుంది. మనసు ఆ మార్గం ద్వారా ప్రయాణించితే కాని మోక్షం కాంక్షించే స్థితికి చేరుకోదు అని సూచన కావచ్చు అనిపిస్తోంది. మీ విశ్లేషణలో కూడా నాకు అదే భావం కనిపించింది.

Very interesting, hmmm... ఎక్కడో ఇంకొంచెం వివరించాలనో, విభేదించాలనో అనిపిస్తోంది. దానిని మాటలలో పెడ్దామనుకున్న ప్రతిసారీ మళ్ళీ main idea తో ఏకీభవించడం వల్ల అది తుడిపేస్తున్నాను.

ప్రస్తుతానికి నాకర్థమైన ప్రధానోద్దేశానికి సమర్థనగా అనుకోకుండా ఒక రోజు నాకు కనిపించిన ఈ మాటలు చెప్పాలనిపిస్తోంది :
"Submission to passion is Human Bondage
But the excercise of reason is Human Liberty."
అజ్ఞాత చెప్పారు…
రానారె,

గొప్పగా చెప్పావయ్యా! కలకాలం చల్లగా వుండు...
-నేనుసైతం
రానారె చెప్పారు…
@ ప్రసాదుగారు, టపా పోస్టుచేసిన కొద్ది నిముషాల్లోపలే మీ వ్యాఖ్య చూసి ఆశ్చర్యం కలిగింది.
@ సిరిసిరిమువ్వగారు, ఈ రెండు టపాలు రాయడం వెనక గల ప్రేరణ ఏమిటంటే - గోపీచంద్ గారి "అసమర్థుని జీవయాత్ర" అనే అసాధారణ రచనను ఇటీవలే చదివాను. ఆ పుస్తకం చదువుతూన్నపుడు కలిగిన కొన్ని వేల ఆలోచనల దారాల్లో ఒకదాన్ని పట్టుకొని ఈ టపా పొట్లం కట్టేశాను. ఈ టపాలో వ్యక్తపరచిన సందేహాలతో చాలాకాలంపాటు కొట్టుకులాడిన వారెవరైనా కాలమతులే.
@ లలితగారు, మీ వ్యాఖ్య చదివి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ వ్యాసం చదివి వ్యాఖ్యానించాలనుకున్నపుడు మీ మస్తిష్కంలో ఏమి జరిగిందో చాలాబాగా చెప్పారు. కామిగాక ... అన్న మాటను వ్యంగ్యానికి వాడుకున్నాను. అంతవరకూ చెబుతూవచ్చిన విషయానికి మరికొంత బలాన్నివ్వడానికని ఆ మాటను మామూలు జనం సరదాగా ఎలా తీసుకుంటారో అలా తీసుకుని "ముందుకెళ్లాను". దీన్ని ఇంకోసారి చదవాలన్నారు కదా, "అసమర్థుని జీవయాత్ర" చదివినపుడు నాకు అనిపించిందీ "ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివినా కొత్త ఆలోచనలు పుడుతూనే ఉంటాయి" అని. 61 సంవత్సరాల క్రితం రాయబడిన నవల అది. ఏ కాలానికి చెందిన మనుషులైనా నేర్చుకోవలసిన విషయాలున్నాయందులో. దీన్ని గురించిన ఒక చర్చను లేవదీద్దామనుకొంటున్నా సాహిత్యం గుంపులో. మరిన్ని విషయాలు తెలుస్తాయి కదా అని. థాంక్యూ.
@ నేనుసైతంగారు, "అంతా మీ అభిమానం" అని సిగ్గును అభినయించకుండా, మీ దీవెనను సంతోషంగా స్వీకరిస్తున్నాను :)
rākeśvara చెప్పారు…
Basic assumption of the essay : Hero and Villan are mutually exclusive (that is they exist in two different people).
Wrong!

There is a hero in every person! There is a villan in every person!
Not completely right, but will do !

Also,
there is also thing called 'harmless fun'. In anything in life one can strike a balance.

ఇది నా అభిప్రాయం మాత్రమే.
రానారె చెప్పారు…
@ రాకేశ్వరా, మీరు చెప్పిన "Wrong, Right, Also"లన్నింటికీ నా మద్దతు ఉంది :)
రాధిక చెప్పారు…
బాగా వర్గీకరించారు.ఇలాంటివి చెప్పడం లో ఆరితేరిపోతున్నట్టున్నారు.నాకిష్టమయిన వాటిలో అసమర్ధుని జీవయాత్ర ఒక్కటి.ఇలా పోల్చవచ్చో లేదో నాకు తెలీదు గానీ చాలా మంది చెప్పే గొప్పనవలల్లోని మైదానం నాకెందుకో అంత గొప్పగా అనిపించలేదు.అసమర్ధుని జీవయాత్ర చదువుతున్నంత సేపూ ప్రతీ వాక్యం దగ్గరా నేను సమాధానం వెతుక్కుంటూ,నాకు తోచిన సమాధానం చెప్పుకుంటూ మళ్ళా మొదటికొచ్చి మొదలు పెడుతూ.... అలా ఎన్నాళ్ళు చదివానో నాకే తెలీదు.
చైతన్య చెప్పారు…
ముగింపు బాగుంది రాముగారు...
మీ మొదటి వ్యాసం చదివిన వారెవరికైనా కాసేపు విలన్ లా మారిపోతేనేం అనే ఆలోచన వస్తుంది....
కాని అలాంటి ఆలోచన ఎంత తప్పో ఈ రెండో భాగం చదివిన తర్వాతా తెలుస్తుంది...
మంచి ఆలోచన రేకెత్తించే అంశాన్ని ఎన్నుకున్నారు :)
అజ్ఞాత చెప్పారు…
రానారె గారు,
మంచి పుస్తకం అంటగట్టారు. ఇప్పుడే teluguone లో మొదలు పెట్టా చదవడం. మీ టపా మీద వ్యాఖ్య రాసేటప్పటికి నేను ఆ పుస్తకం చదవక పోవడం మంచిదయ్యింది. నిజాయితీగా నాకు తోచింది, ఒట్టి మీ టపాలోని అంశం మీదే రాసేశాను, ఇంకే ప్రభావాల గురించిన ఆలోచన లేకుండా.
మంచి కాలక్షేపమే దొరికింది నాకు. నా మనసులో ఆలోచనలతో, నన్ను ప్రభావితం చేసిన వాతావరణంతో ఒకప్పడు నేను పడిన తగాదాలు గుర్తుకు వస్తున్నాయి. అంతా చదివి చూడాలి ఏమనిపిస్తుందో.
రానారె చెప్పారు…
రాధికగారు, అసమర్థుని జీవయాత్రలోని "సీతారామారావు" ప్రతిమనిషిలోనూ ఏదో ఒక్క రూపంలోనైనా ఉంటాడనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని మళ్లీ ఒకసారైనా చదవాలి. గోపీచంద్ గురించి నాకు పెద్దగా తెలీదుగానీ, ఇది చదివాక ఆయన ఒక గొప్ప తాత్వికుడు అనిపిస్తాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత మనదేశంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తానూ మారలేక, అర్థంచేసుకోలేక, స్వతహాగానూ, అనువంశికంగానూ వచ్చిన కొన్ని బలహీనతలను జయించలేక అతడు పడే అవస్థ, తన తోటివారిని పెట్టే హింస, అతని ఆలోచనలు, అతని మేనమామ ఆలోచనలు, రామయ్యతాత చెప్పే ఆలోచనలు ఇవన్నీ కలిపి ఒక్కసారి చదివితే నాకు చాలా కొద్దిగా మాత్రమే అర్థమయింది. ఇది చదివిన విజ్ఞులతో మాట్లాడితే మరిన్ని కోణాలు తెలుస్తాయి.

థాంక్స్ చైతన్యగారు!

కంప్యూటరు తెరమీద ఈ పుస్తకాన్ని తదేకంగా చదవడం అంత సులభం కాదేమో. లలితగారు, కావాలనుకుంటే దీని ప్రతిని మీరు ఇక్కడినుండి తెప్పించవచ్చు.
అజ్ఞాత చెప్పారు…
రానారె గారు,
ధన్యవాదాలు.

నేను ఆ పుస్తకంతో పాటు ఇంకొన్ని కూడా AVKF Booklink ద్వారా కొనాల్సినవి ఉన్నాయి.
ఇంతలో http://praveengarlapati.blogspot.com/ లో online ఈ పుస్తకం చదవొచ్చు అని తెలిసి, దానిని చదివి బుర్ర వేడెక్కించుకున్న వారి టపాలు చదివినందున, ఆత్రంగా చదవడం మొదలు పెట్టేశాను. చదువుతుండగా మీ టపా గుర్తుకొచ్చి, ముందే చదివుంటే బహుశః వ్యాఖ్య వేరేలా రాసే దాన్నేమో అనిపించి చెప్పాను.
రాజశేఖర్ చెప్పారు…
రానారె గారు..
చాలా చక్కగా విశ్లేషించారు. మొదటి వ్యాసం చదివిన వెంటనే రెండవ భాగం కూడా చదవగలగడం వల్ల సస్పెన్స్ లేకుండా హ్యాపీగా ఉంది.
మూడు చేపల కథతో పోల్చి మీరు ఇచ్చిన ముగింపు అదిరింది :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము