పోస్ట్‌లు

పద్యము లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వారవనిత - తిమ్మకవి

రసికజన మనోభిరామ రచనానంతరం ఆ కృతి చదివిన వారవనిత ఒకామె కూచిమంచి తిమ్మకవిని కౌగిలించుకొనగా ఆయన పెడమొగం పెట్టాడట. ఆప్పుడామె - 'చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలిం చితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య!' అని ప్రశ్నించిందట. దానికి తిమ్మకవి - 'అద్భుతమగు నట్టి బంగరపు బొంగరపుంగవఁబోలు నీ కుచ ద్వితయము ఱొమ్మునాటి యల వీపున దూసెనటంచుఁజూచితిన్' అని జవాబిచ్చాడట. ఇంతకూ ఈ మా'ట' నాకెవరు చెప్పారు? :)

లఘు కవితలు - సర్వలఘు కందము

కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ... కం. మిడిమిడి తెలివిడి తెగబడి వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్ దడదడ మని జడి కురిసెను గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!! ... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను. భాషందం బ్రతు కందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞ...

ముత్యాల హస్తభూషణం

సత్తువున్నది సమయమున్నది పొత్తు జేయగ పొత్తమున్నది సొత్తు నీకిది శాశ్వతమ్ముగ చెత్త జోలికి పోకు మా! ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన తకిట తకధిమి తకిట తకఝణు తకిట తకధిమి తకిట తోం! ఈ నడక ను తెలుగువారికి నేర్పింది గురజాడ అప్పారావుపంతులు. కాకపోతే నేను ఆ పంతులుదగ్గర నేర్చుకోలేదు. సరళమౌ నా పలుకులోనే సరముగలదని తెలుసుకొంటిని నాకు తెలిపిన పంతులెవరో నీకు తెలుసని తెలుసునా? చాలా కాలం తరువాత ఈ మధ్య హస్తభూషణాలు ధరించడం మొదలుపెట్టాను. పదవతరగతి వరకూ అవీఇవీ అని లేదు, వీరబల్లె మండల శాఖా గ్రంథాలయంలో కనబడిన పుస్తకాలన్నీ చదివే అలవాటుండేది. బాలలమాసపత్రికలు, పురాణపండ రంగనాథ్ రచించిన బొమ్మల పంచతంత్ర భాగవత రామాయణాదులు, మహీధర నళినీమోహన్ చొప్పదంటు ప్రశ్నలు, వినువీధిలో వింతలు, ఆరుద్ర రాసిన చదరంగం పుస్తకం, ఎనిమిదోతరగతి నుంచి సపరి'వార'పత్రికలు, సరసమైన కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన కథలు, ముప్పైరూపాయలకు పాత విజ్‌డమ్ సంచికలు దండిగా కొనుక్కోవచ్చుననే ప్రకటన చూసి కొన్న పెద్ద కట్ట (చాలా ఉపయోగపడిన మరియు గుర్తుండిపోయిన ఒక వ్యాసం నాకు వీటిలో దొరికింది), ముక్కావారిపల్లెలో చదివేటప్పుడు మా ఇంగ్లీషు ఉపాధ్యాయ...

ఆకాశవాణి కడప కేంద్రం. ఈనాటి ...

... సమస్యాపూరణం కార్యక్రమంలో మేమిస్తున్న సమస్య " రామా రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా! " మీ పూరణలు ఏప్రిల్ 19వ తేదీలోగా మా కేంద్రానికి చేరేలా పంపగోరుతున్నాం. మా దూరవాణి సంఖ్యలు: 91-8562-240335, 91-8562-240342.

విజయా వారి విజయపతాక

నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల...

గురుః దేవో నారాయణః

కం. సుందరమై జగమంతయు గంధపు పరిమళము నింపు కాంచనమయమౌ కందము నీకై కూర్చితి నందుకొనవయా మదీయ కవనాచార్యా ! సర్లేగానీ ఇంతకూ ఆ కందమెక్కడ అంటారా!? తెలుగు పద్యరీతుల్లో కందపద్యాన్ని కడు రమ్యమైనదని చెబుతారు కదా! ఆ మాటను పట్టుకొని అటు కందమునూ, ఇటు దాని మూలాలను నాకు తెలియపరచిన మా గురువుగారినీ గుర్తుచేసుకుంటూ ఈ పద్యం రాశాను. పద్యం చెప్పడమే సరిగా అలవడని నాలాంటివాడి చేతిలో కందంకూడా కందిపోయి అంత అందంగా కనిపించకపోవచ్చు. మొదట్లో కాస్త కష్టమనిపించినా పద్యపు నడకను పట్టుకున్నాక అలవోకగా చెప్పవచ్చునట. చదువరులకు కూడా కందపద్యం చాలా బాగుంటుంది-ట. సుమతీశతక పద్యాలన్నీ కందపద్యాలే. నాలుగు పద్యాలనైనా ఖూనీ చెయ్యందే రాసే విద్య రాదుకదా. అందులో భాగంగా ఇటీవలే నేను చేసిన ఖూనీ సుజనరంజన మైనది. అక్కడే మన కేవీయస్ చెప్పిన పద్యాలు కూడా ఉన్నాయి. అవి బాగున్నాయి.

బ్రౌను మహాశయునికి కందపు కైమోడుపు

కం . అంధతమసము న నుండిన గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్ ఆంధ్ర నిఘంటువు కూర్చిన సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!

ఇంటికెడితేను టీవీని పెట్టినారు!

మొన్నటిదాకా రేడియోలో సమస్యాపూరణం పద్యాలు వింటూ, "మన స్థాయి కాదులే" అనుకునేవాణ్ణి. జీవితసత్యాలనూ సన్మార్గాలనూ సరళమైన పద్యాలుగా అల్లి, పద్య ప్రక్రియను పామరుల నాలుకల మీదకు తెచ్చిన తెలుగు వైతాళికుడు మహానుభావుడు వేమన. సుజనరంజని వారి ప్రయత్నం ఇదే దిశలో ఉంది. కానీ, వారిచ్చిన సమస్యను నా స్థాయిలోనే పూరించినా ప్రోత్సహించి ప్రచురించినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మరోసారి కొత్తపాళిగారికి ధన్యవాదాలు.

గురుభ్యో నమ:

ఆ.వె కొత్తపాళి యొకటి కోరినంతనె వచ్చి చిత్తగించె నాదు చిన్ని కోర్కె! ఆటవెలది మదిని ఆంతర్యమేమిటో తేటతెల్లమాయె తెలిసికొనగ!! ఆ.వె నీరు తడుపలేదు నిప్పు కాల్పగలేదు హార్టువేరు చెడును "సాఫ్టు" చెడదు! ఆత్మ సాఫ్టువేరు అన్నాడు రానారె ఆలమేల! అన్ని ఆశలేల!? నాలుగు పాదాలలో యతి, గణాలు: 1 వ పాదం యతి - [నీరు - నిప్పు] నీరు - UI తడుప - III లేదు - UI నిప్పుకాల్ - UIU(ర) పగలేదు - IIUI(సల) 3ఇన 2ఇంద్ర 2 వ పాదం యతి [హార్టు - సాఫ్టు] హార్టు - UI వేరు - UI చెడును - III "సాఫ్టు" - UI చెడదు! - III 5ఇన 3వ పాదం యతి [ఆత్మ - అన్నాడు] ఆత్మ - UI సాఫ్టు - UI వేరు - UI అన్నాడు - UUI(త) రానారె - UUI(త) 3ఇన 2ఇంద్ర 4వ పాదం యతి [ఆల - ఆశ] ఆల - UI మేల - UI అన్ని - UI ఆశ - UI లేల - UI 5ఇన స్వాతి గారికి, కొత్తపాళీ గారికి, తెవికీ కి కృతజ్ఞతలతో.

ఉత్పలమాల - గురువు - లఘవు

భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ! చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా నరికేసినట్లున్నాను. ఇలా కాదుగాని ఒక మహాప్రయత్నం చేసి ఛందోబధ్దంగా నాలుగు పాదాలు ఒకేపొడవులో వుండేట్టుగా నిలబెట్టాలని మొదలుబెట్టాను. మనం చిన్నప్పుడు అంటే తొమ్మిది, పదవ తరగతుల్లో చదువుకుని మరచిపోతామేమో నని కొంచెం బెంగపడిన ఛందస్సు పునరావలోకనం. పద్యంలో ఒక తప్పున్నా ఛందస్సు చెడిపోతుంది కదా. నాకు తెలిసి ఈ పద్యం నేను తప్పులు లేకుండా రాసినానని గట్టి నమ్మకం. ముందుగా - "యమాతారాజభానసలగం" అనుకొన్నాను. ఎక్కడో విన్న వాసన తగులుతోందా? లేక ఏమిటిది కపాలమాంత్రికుని మహామంత్రం లాగ వుందే అంటారా? తెలుగు వర్ణమాల నేర్చుకోవడంలో ఓనమాలు ఏమిటో (ఈ కాలంలో అఆఇఈ ఏమిటో), తెలుగు ఛందస్సు నేర్చుకోవడంలో "యమాతారాజభానసలగం" అల...