చదువుల గీర్వాణి ... పలికినా అపశృతుల్ ...
రాత్రి 'జెమిని' వార్తలు చూస్తున్నాను - నా మిత్రుని ఇంట్లో. ఒకానొక సరస్వతీదేవి చదువుతోంది. ఒక గ్రామంలో ఒక ముదుసలి పెద్దాయన ఎనిమిది భాషలను చదవడమూ రాయడమూ చేయగలడట. ఆయనపై "జెమిని టీవీ కదనం " అంది సరస్వతీదేవి. "కదనమా?!" అనుకుంటూ వున్నాం. అది ముసలాయనపైనా కదనమే అయింది. పెద్దాయన పాపం రెండు మాటలన్నా సరిగా చెప్పీచెప్పకనే ఆయన మాట కట్టు . వార్తల్లో ఆ తరువాత - రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు. అసలే కరవు సీమ. అందులో ఉన్నట్టుండి భారీవర్షాలు, కాలువల్లో మనుషులు గల్లంతు. అలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతంపై ఆ 'చదువులతల్లి' ప్రత్యేక కదనమట . తరువాత ఇంకెవరిపైనో మళ్లీ కదనం . అది కూడా ఇరాక్‌పై బుష్ కదనం కన్నా అధ్వాన్నంగా ముగిసింది. "థూ యీనె@$#$^&* కమిట్‌మెంట్ లేని కథనాలూ, కమిట్‌మెంట్ లేని జర్నలిజం ..." అని మా మిత్రుడేదో గొణిగాడు. ఆ వార్తలమ్మ విన్నారేమో, ఏకంగా బంగాళాఖాతంలో వాయుగుండంపైనే కదనం ప్రటించేశారు. అవాక్కయ్యారా!?