పోస్ట్‌లు

సాహిత్యం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వారవనిత - తిమ్మకవి

రసికజన మనోభిరామ రచనానంతరం ఆ కృతి చదివిన వారవనిత ఒకామె కూచిమంచి తిమ్మకవిని కౌగిలించుకొనగా ఆయన పెడమొగం పెట్టాడట. ఆప్పుడామె - 'చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలిం చితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య!' అని ప్రశ్నించిందట. దానికి తిమ్మకవి - 'అద్భుతమగు నట్టి బంగరపు బొంగరపుంగవఁబోలు నీ కుచ ద్వితయము ఱొమ్మునాటి యల వీపున దూసెనటంచుఁజూచితిన్' అని జవాబిచ్చాడట. ఇంతకూ ఈ మా'ట' నాకెవరు చెప్పారు? :)

షావుకారులో బహుదూరపు బాటసారి పయనం

నేనింతవరకూ షావుకారు సినిమా చూడలేదు. ఇప్పుడే యూట్యూబులో ఆ సినిమా క్లిప్పింగులు చూస్తూ... జైలు సన్నివేశానికి (రామారావు, నారాయణపాత్రధారి జైల్లో కలిసే సన్నివేశానికి) నేపథ్యంగా 'బహుదూరపు బాటసారీ' హార్మోనియం మీద [@ 4:30 ] విని ఆశ్చర్యానందాలు పొందాను. ఘంటసాల ఈ పాట సాహిత్యమూ, స్వరాలూ రెండూ కూర్చి పాడిన ప్రైవేటు రికార్డింగ్ మాత్రమే విన్నానిన్నాళ్లూ. బహుశా స్వరాలు కూర్చడం అయిన తరువాతే సాహిత్యం కూర్చివుంటాడనుకుంటా.

పొద్దుపోని యవ్వారం - 11

ఇంతకూ ఏమంటారు కొత్తపాళీగారు? ఈ వారాంతం తీరిక లేదంట! ఏమంట? శతజయంత్యుత్సవాలంట. ఉత్సవా-లు? ఎన్నేమిటీ? మూడు. ముగ్గురికి. వాళ్లు పుట్టి నూరేండ్లు నిండబోతున్నాయంట. ఎవరయ్యా ఆ త్రిమూర్తులు? కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, త్రిపురనేని గోపీచందు. వీళ్లకా? హహ్హహ్హహ్హ..!! ఎందుకు నవ్వుతావు? నేను పుట్టిన దశాబ్దం మొదట్లోనే మొదటి ఇద్దరికీ నిండిపోయాయన్నారు నూరేండ్లూ. అంతకు రెండు దశాబ్దాలముందే గోపీచందుకు నిండిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ నూరేండ్లు నిండబోతున్నాయంటూ పండగలు చేస్తున్నారంటే యేమనుకోవాలి? ???? కొ.కు. 1980లో, శ్రీశ్రీ 1983లో, గోపీ 1962లో మహాప్రస్థానం చేశారు. స్వర్గంలో కొత్తకొత్త కథలూ కవితలూ వినిపించడానికి. అసలు స్వర్గమూ అదీ అంటే హేతువాదులూ వీర నాస్తికులు వీళ్లొప్పుకోరేమో కూడా. మరీ విపరీతం మనిషివి నువ్వు. కొ.కు. 1909లోనూ, శ్రీశ్రీ - గోపీచందు లు 1910లోనూ పుట్టారు తెలుసా? ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పరచయితలూ మహాకవులూ వీళ్లు. ఐతే ఏమంటావు? మూడు మాటలు. 1. నీకు నుడికారం బాగా తలకెక్కిందని. 2. మహాకవులకు మరణం లేదనీ, వయసుతో నిమిత్తంలేదనీ. 3. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - వీళ్ల రాతలు చదవవోయ్ ...

ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ

అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి . కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు. ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే: అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి. ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?! మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?

వరసబెట్టి ఒక తొంభై కథలు ...

తెలంగాణ కథలు ... వరసబెట్టి ఒక తొంభై కథలు ... నూరేండ్ల ముందటి మాడపాటిహనుమంతరావు కథతో మొదలు. పీ.వీ.నరసింహారావు అరవైయేండ్ల ముందు రాసిన కథొకటి. దొరల గడీలు, దొరసానుల గారడీలు, పటేండ్ల పరువులు, పనివాండ్ల పరుగులు, పనిమంతుల కథలు, పనికి'రాని'వాళ్ల పాట్లు, కులాల - కులవృత్తుల వృత్తాంతాలు, సాయబుల ఇండ్లల్లో సమాచారాలు, అన్నల గన్నుల కథలు, అన్నల గన్న అమ్మల కథలు, భూనిర్వాసితుల కథలు, భూస్వామ్యానికి బీటలు, రజాకార్ల నాటి రాజకీయాలు, కాలం తెచ్చే మార్పును పసిగట్టగలిగిన గట్టిపిండాల కథలు, మార్పుకు తట్టుకోలేక 'మనాది'తో మగ్గినవాళ్ల కథలు, తెలంగాణ నుడికారపు మజా ఏమిటో రుచిచూపించిన కథలు ... గడచిన నూరేండ్లలో తెలంగాణ ప్రాంతంలో జన జీవనంలో మార్పుల క్రమాన్ని కళ్లముందు నిలిపే కథలు ... ఈ కథలన్నీ చదివాక తెలంగాణ సమాజపు వందేళ్ల చారిత్రక చిత్రం సజీవంగా నా ముందు నిలబడినట్లనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇది ఏ ఒక్కరిద్దరు చరిత్రకారులో రాసినవి కావు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి రంగాచార్య, చెరబండరాజు, మాదిరెడ్డి సులోచన, అప్సర్, కాలువ మల్లయ్య... ఇలా నాటి నుంచి నిన్నామొన్నటి వరకూ ఎందరో కథకులు ......

ఆకాశదీపం

వారం రోజులుగా ఆకాశదీపం అనే పదం నా తలలో తిరుగుతోంది. ఏదో సినిమాపాటలో విన్నాను! ఎన్నోసార్లు విన్నట్టే వుంది. గుర్తు రాలేదు. దాని అర్థమేమిటో నాకు తెలీదు. ఆకాశంలో చుక్కేమో అనుకున్నాను. లేకపోతే సూర్యుడా? గూగులిస్తే వెంటనే దొరికింది శ్రీశ్రీ కవిత. ఈ పదాన్ని శ్రీశ్రీ కంటే ముందు ఎవరైనా ఎక్కడైనా వాడారా? అసలు ఆకాశదీపమంటే ఏమిటి?

మాలపల్లి - ముందుమాటలో ముందుమాటలు

మా ఊళ్లో భలే భలే మాటలు వినబడతావుంటాయి. మచ్చుకు ... "ఒక్క ముక్క అర్థమైతే నీ యడంకాలిమెట్టుతో కొట్టు" ఈ మాట ఎప్పుడుబడితే అప్పుడు వినబడదు. నువ్వేదైనా లొడలొడా చెప్తాండావనుకో. అవతల మనిషికి నువ్వేదో చానా ముఖ్యమైన సంగతే చెప్తాండావని అర్థమయ్యి, ఏమి చెప్తాండావో మాత్రం అర్థం కాకండా వుందనుకో. పో..ఇంచేపు వింటాడు. అప్పుడుగూడా అర్థం కాకపోతే, నువ్వు మాట్లాడ్డం ఆపి ఒక్కరవ్వ అవకాశం ఇచ్చినప్పుడు ఇదో ఈ మాట అంటాడు - పూర్తి నిజాయితీతో. ఐతే ఈ మాట ఇప్పుడెందుకు చెప్తాండానంటే, ఈరోజు నేనూ ఈమాటే అన్న్యా గాబట్టి. ఎవురితోనంటే కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుతో. సచ్చి ఏలోకానుండాడో నా మాట మాత్రం ఖచ్చితంగా యినే వుంటాడు. ఎందుకన్న్యాను అంటే ఆయన అట్టా మాట్లాణ్ణాడు మరి. ఎక్కడ? ఉన్నవ లక్ష్మీనారాయణపంతులవారి 'మాలపల్లి'కి ముందుమాట మాట్లాడతా ఆయనేమన్యాడో మీరే వినండి (పుస్తకం నుండి యథాతథం) - "శ్రీమహాభారత సాహిత్యేతిహాసములు మావవధర్మ పరిణామమునందు దివ్యపర్వములు, కర్మపరాయణమైన ప్రవృత్తి ధర్మపరమైన జ్ఞానపరిణామమును పొందుట పురుషార్థము, విశ్వసాహిత్యము, పురుషార్థ సిద్ధికి సాధనముగాగల విధమును, కావ్యకళాది రూపములను, మహాత్మ...

పొద్దుపోని యవ్వారం - 9

దాశరథీ శతకం తెలుసా? శతకమొకటి వుందని తెలుసు ఎవర్రాశారో తెలుసా? కంచెర్ల గోపన్న పద్యాలేమైనా వచ్చునా? శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ అనే పద్యం వచ్చు ఇంకా? భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూ... ఆగక్కడ. గోపన్న కాళిందిలో కాలేశాడు !!!?? ఏమిటలా మిడిగుడ్లేసుకుని నన్ను చూస్తావు? ఆ పద్యాన్ని చూడు పద్యానికేఁ?! ఆ పద్యం ఎవరిగురించి? రామమూర్తిని గురించి కదా! రాముడు ముందా? భీముడు ముందా? త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కృష్ణునితోపాటే భీముడు ఎవరు ముందు? రాముడే. అయితే? అయితే గోపన్న ఏమన్నాడు? భండన భీముడు అన్నాడు. ఎవరిని? రాముణ్ణి! అంటే తప్పేముంది? తప్పా తప్పున్నరా?!! భీముణ్ణి రామునితో పోల్చితే... అందం, చందం, తల్లీ-బిడ్డా న్యాయం. నలుగురూ ఒప్పుకుంటారు. రామదాసు చేసిందేమిటి? ఎప్పుడో రామాయణంనాటి రాముణ్ణి మొన్నటి మహాభారతం భీమునితో పోల్చి, అవమానం చేసినాడుకదా! ఇదేమని అడిగినవాడు ఒక్కడూ లేకపోయినాడే!! నువ్వు బయల్దేరినావు కదా? అంటే, నీకిది తప్పుగా తోచలేదా? చూడు చిట్టితండ్రీ! భండనము అంటే యుద్ధమని తెలుసుకున్నావు, బాగుంది. భీముడంటే భారతంలో భీముడు కాదు నాయనా. భీ అనే సంస్కృతశబ్దానికి భయమనే అర్థముంది. భీమము ...

ఇది మన ఆశ్రమంబు ...

రాఘవగారు ( వాగ్విలాసము ) నాకు పంపియుండిన ఒక ఉత్తరానికి నేనీరోజు ఉదయమే జవాబిచ్చాను. అది ఆయనకు సంతోషం కలిగించింది. నాకొక మంచి పద్యం బహుమానంగా ఇచ్చారు. సదమల దివ్యభాష... అని మొదలవుతుందాపద్యం. బహుమానం కనుక భద్రంగా దాచుకోవాలి. ఇక్కడ ఆ పద్యం చెప్పడం సందర్భంగా వుండదేమో. ప్రభాతం ఇంత ఆనందంగా మొదలవడంతో ఆయనకు కృతజ్ఞతగా ఒక టపా రాస్తానని అడిగాను. రాసుకోమన్నారు. సదమల అనే ఆరంభం చూడగానే నా మనసులో, పుణ్యాత్ముడు ఘంటసాలగారు "ఇది మన ఆశ్రమంబు..." అంటూ వాల్మీకిమహర్షి ఆశ్రమానికి సీతమ్మను స్వాగతించే 'లవకుశ' పద్యం మెదిలింది. ఈపద్యం నాకెంతో ఇష్టం. వీరబల్లె హరిహరాదుల దేవళం మిట్టనుంచి లౌడుస్పీకర్లలో ఈ పద్యాన్ని ఎన్నిసార్లో వినివుంటాను. దీని అర్థం తెలీకపోవడానికి ఇందులో ఏముందిగనక? ఇది మన ఆశ్రమంబు ఇచటనీవు వసింపుము లోకపావనీ సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించూ నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువొందునమ్మరో ఈ పద్యాన్ని నేనిక్కడ రాయడంలో తప్పులు జరిగివుండవచ్చు. తెలిసినవారు సరిదిద్దితే సంతోషిస్తాను. ఇంతకూ ఈ పద్యంలో నాకు అర్థంకాని మాట "సదమల వృత్తి...

పొద్దుపోని యవ్వారం - 7

"ఇందాకటి నుండి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు!?" "... హహ్హహ్హ హ్హహ్హ " "వినిపించేలా నవ్వమని కాదు నా ఉద్దేశం" "నాలోనేను నవ్వుకోక, నీలో నేను నవ్వుకోలేనుకదా! ... హహ్హహ్హ " "సంతోషించాంగానీ, విషయం చెప్పు" "ఇప్పుడే సుబ్బరాయునింటికెళ్లొస్తున్నానూ, ఆ మొగుడూపెళ్లాల వాదు ..." "ఎవరూ, ఆ పిసినారి ఇంటికేనా?" "సరిగ్గా ఆయన భార్యకూడా ఆయన్ను ఇదేమాట అన్నది" "ఏ మాట?" "చీర కొందామని ఏడాది తరవాత అడిగాను , ముష్టి మూడువేలు, దానికీ ఏడుస్తారు, మీరు మహాపిసినారి - అంది" "భలే! ఉన్నమాటే అంది. తరువాత?" "నేనివ్వను, అంతగా కావాలంటే నీ పరపతినుపయోగించి నువ్వే తెచ్చుకో -అన్నాడు" "ఆవిడేమంది?" "నువ్వు ప్రాణంతోవుండగా పరపతులతో నాకేం పనీ - అంది!" "....!!?" "... అలాగే ఒక మగవాణ్ణి పిసి'నారి' అని ఆక్షేపించడం కూడా తమాషాగా లేదూ?" "$#^@&"

జగజ్జేత - చెంఘిజ్‌ఖాన్

" మానవునిలో వుండే బలహీనత లన్నింటిలోనూ, యితరుల బాధచూసి ఓర్చలేకపోవటం వంటి దురదృష్టకరమైన బలహీనత మరొకటి లేదు. ఏ రకం కిరాతుడిలోనైనా సరే, ఇది యే మూలనో ఒక మూల యింతో అంతో అణగి వుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాళ్లు, ఎంత లావు ధీశాలినైనా సరే, ఇట్టే కూలదీసివేయగలుగుతారు. తండ్రి, తను కోరిన వస్తువు ఇవ్వకపోతే, బిడ్డ అన్నం తినకుండా ఏడుస్తూ మంచంలో యెదుట పడుకుంటుంది. భర్త చెప్పినమాట వినేవాడు కాకపోతే, భార్య ఏడుస్తూ కూర్చుని వాణ్ణి లొంగదీస్తుంది. కానీయో దమ్మిడీయో పారవెయ్యకపోతే, మొండి బండాడు కత్తితో చెయ్యో కాలో కోసుకుంటానని మనని బెదిరిస్తాడు. పెళ్ళాంమీద కోపమొస్తే మొగుడు అన్నం తినకుండా మొండిచరిచి పడుకుంటాడు. ఈ రకంగా మానవునిలో వుండే యీ మహా దౌర్బల్యాన్ని ఆధారం చేసుకుని, వొత్తిడి తీసుకురావడంవంటి హిజాడ పని మరొకటి లేదు. న్యాయమైన పద్ధతిని ఎదుటివాడికి నచ్చచెప్పలేక, కొంతమంది ఇలాంటి నీచమైన పిరికిపద్ధతులు అవలంబించుతారు. " 12, 13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను - తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా మలచి, తెన్నేటి సూరి చేసిన సాధి...

లఘు కవితలు - సర్వలఘు కందము

కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ... కం. మిడిమిడి తెలివిడి తెగబడి వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్ దడదడ మని జడి కురిసెను గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!! ... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను. భాషందం బ్రతు కందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞ...

మయాన అనగానేమయా?

ఎవరో పిలిస్తె వచ్చిందీ, ఎవరికోసమో పోతోందీ, మయాన మజిలీ యేసిందీ, మయాన మజిలీ యేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే (౨) పళ్ళు పదారూ రాలునులే .. పళ్ళు పదారూ రాలునులే మొన్నామధ్యొకసారి మాటీవీలో 'పాడాలని వుంది' కార్యక్రమంలో ఒక పాప ' గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ' అనే పాట పాడింది. నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యంగారు ఆ పాట సాహిత్యాన్ని గురించి రెండుముక్కలు చెబుతూ ఈ నాలుగు పంక్తులనూ ఉటంకించి ఇక్కడ ఆత్రేయ 'మయాన' అనే పదాన్ని వేసినందుకు మురిసిపోయారు. మయాన అంటే ఏమిటో చూద్దామని బ్రౌణ్యము లో వెతికాను కానీ అక్కడ దొరకలేదు. 'మయాన' అంటే 'మధ్యలో' అని ఈ పాట సందర్భానుసారం నాకు అర్థమయింది. నేను పుట్టక ముందు నుంచీ ఈ పాటను వింటున్నానుగానీ, ఇది మూగమనసులు సినిమాలోనిదని నాకిప్పుడే గూగులమ్మ ద్వారా తెలిసింది. నేనింకా 'మూగమనసులు' చూడలేదు. మొన్న ఆదివారం చిన్న పని మీద రోడ్డునబడి చిరంజీవి పాటలు వింటూ వెళుతూ వుండగా 'మయాన' మళ్లీ తగిలింది. మెగాస్టార్ సగటు అభిమానులు చెప్పగలరా ఏ పాటలోనో? సగటు అభిమానులను ఎందుకు అడుగుతున్నానంటే వీరాభిమానులు చెప్పలేరని నా అనుమానం. సరే చ...

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

ఈ పాట గురించి గత అక్టోబరులో చిన్న చర్చ జరిగింది. అప్పట్లో ఆ వీడియో చూసి సంతోషపడి నాకొక వేగు (e-mail) పంపారు పరుచూరి శ్రీనివాస్ గారు. ఆ తరువాతి సంభాషణల సందర్భంగా కొన్నాళ్లకు ఈ పాట సాహిత్యాన్నీ, అటుపైన కొన్నాళ్లకు వోలేటి గారు స్వయంగా పాడిన రికార్డును పంపించారు. ఆ పాటను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో వుండేలా చెయ్యడానికి నాకీరోజు తీరింది. శ్రీనివాస్ గారికి అనేక కృతజ్ఞతలతో, మీకు సమర్పిస్తున్నాం __ :) గడచేనటే సఖీ ఈ రాతిరీ కడు భారమైన ఎడబాటునా ఈ మేఘవేళ ఏమో కదే చెలియ స్వామి దవ్వైనా నిదుర రాదాయెనే ఈ కడిమి వోలె ఎదురు చూచేనే సఖియా ఏకాకి నా బ్రతుకు చేదాయెనే రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం,సంగీతం: వోలేటి వెంకటేశ్వర్లు

చినచేపను పెదచేప

వెచ్చని నీటిలో చెచ్చెరలాడుతూ చేప పిల్లలు ఒంటి కాలిపై నిలబడి జపం చేసుకుంటూ ఓ తెల్లని కొంగ ముక్కును నీటిలో ముంచి కన్నీరు కారుస్తూ ఓ నీరాటం ఉక్కపోతగా ఓ ఉదయం సాగర తీరానికి సమీపంలో తదేకమై ఓ తటాకం ప్రియ సమాగమ మహాసంరంభాన విహ్వల నదీకన్యక విసిరేసిన తామస మా తటాకం మొసలి నీట మునిగింది కొంగ చెంగున లేచింది చేపల చెర్లాట చెదిరింది నిర్గుణ వాహిని విడిచిన జీవ చైతన్యపు నిరాలంబ తాపసిగా అదే తటాకం

ఆడదాని ఫార్ములా!

-- డాక్టర్రాజు : -) వేమనయోగి కూడా చెప్పలేని వేదాంత సారం!

ఇదోరకం నిరసన

1. UUUII 2. III 3. UIU IIIIUI UUUI 4. UI UU UI UI UI 5. IIUIUII III IUIUUI UUUI III III 6. UII UIUI IIUIIU IUUI UIU ఏమిటీ పిచ్చిగీతలు!???? పిచ్చాపాటీ మాట్లాడుకున్నంత సరదాగా .... ముత్యాలసరాలవంటి పల్లెపదాలను అల్లగలిగేందుకూ .... కూనలమ్మపదాలవంటి రసగుళికల్లోని మూలికలేమిటో తెలుసుకునేందుకూ .... వచనకవితా వనితలకు లయాత్మకమైన సొగసరి నడకలను నేర్పే మాత్రలను సంపాదించేందుకు .... తెలుగు ఛందస్సు మూలకాలను తేలికగా తెలుసునేందుకూ .... వెతుక్కుంటూ వచ్చిన అరుదైన అవకాశానికి జవాబులు ఈ పిచ్చిగీతలు.

ముత్యాల హస్తభూషణం

సత్తువున్నది సమయమున్నది పొత్తు జేయగ పొత్తమున్నది సొత్తు నీకిది శాశ్వతమ్ముగ చెత్త జోలికి పోకు మా! ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన తకిట తకధిమి తకిట తకఝణు తకిట తకధిమి తకిట తోం! ఈ నడక ను తెలుగువారికి నేర్పింది గురజాడ అప్పారావుపంతులు. కాకపోతే నేను ఆ పంతులుదగ్గర నేర్చుకోలేదు. సరళమౌ నా పలుకులోనే సరముగలదని తెలుసుకొంటిని నాకు తెలిపిన పంతులెవరో నీకు తెలుసని తెలుసునా? చాలా కాలం తరువాత ఈ మధ్య హస్తభూషణాలు ధరించడం మొదలుపెట్టాను. పదవతరగతి వరకూ అవీఇవీ అని లేదు, వీరబల్లె మండల శాఖా గ్రంథాలయంలో కనబడిన పుస్తకాలన్నీ చదివే అలవాటుండేది. బాలలమాసపత్రికలు, పురాణపండ రంగనాథ్ రచించిన బొమ్మల పంచతంత్ర భాగవత రామాయణాదులు, మహీధర నళినీమోహన్ చొప్పదంటు ప్రశ్నలు, వినువీధిలో వింతలు, ఆరుద్ర రాసిన చదరంగం పుస్తకం, ఎనిమిదోతరగతి నుంచి సపరి'వార'పత్రికలు, సరసమైన కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన కథలు, ముప్పైరూపాయలకు పాత విజ్‌డమ్ సంచికలు దండిగా కొనుక్కోవచ్చుననే ప్రకటన చూసి కొన్న పెద్ద కట్ట (చాలా ఉపయోగపడిన మరియు గుర్తుండిపోయిన ఒక వ్యాసం నాకు వీటిలో దొరికింది), ముక్కావారిపల్లెలో చదివేటప్పుడు మా ఇంగ్లీషు ఉపాధ్యాయ...

రానారె - ఓ ఇరవై ఉగాదుల తరువాత

చిత్రం

విజయా వారి విజయపతాక

నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల...