పోస్ట్‌లు

గూగులమ్మ పదాలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గూగులమ్మ పదాలు

ఎనిమిదో విడత... ******* తెలవారి యలబారి యీదు టొకటే దారి ట్రాఫిక్కు గోదారి ఓ గూగులమ్మా! అడుగులో అడుగిడుచు ఒయ్యారముగ నడచు ట్రాఫిక్కు యను పడుచు ఓ గూగులమ్మా! బ్రహ్మోత్సవపు పథము జగన్నాథుని రథము ట్రాఫిక్కు అనుదినము ఓ గూగులమ్మా! ట్రాఫిక్కు నిగళమ్ము కార్+అడవి గరళమ్ము దా రెపుడు సరళమ్ము? ఓ గూగులమ్మా! ట్రాఫిక్కు సమవర్తి యమధర్మమె స్ఫూర్తి పడబోకు కక్కుర్తి ఓ గూగులమ్మా! జరా మరణము లేని శివుని శిరమున వేణి ట్రాఫిక్కు మహరాణి ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

ఏడో విడత... ******* బుద్ధి మాంద్యుల చేత అర్థ మాంద్యపు వాత సబ్‌-ప్రైము తలరాత ఓ గూగులమ్మా! మాంద్య మార్థిక మగుట ఉద్యోగులకు నొసట హృద్రోగముల చెమట ఓ గూగులమ్మా! పింకు స్లిప్పుల సెగకు జంకకుండా వెదుకు సద్యోగములె దొఱుకు ఓ గూగులమ్మా! స్లంపు వేళల జనము జంపు చేయుట శుభము అంటబోదట అఘము ఓ గూగులమ్మా! కొత్త విద్యల నేర్పు శక్తులన్నిటి కూర్పు మాంద్యమున ఓదార్పు ఓ గూగులమ్మా! కఠినమౌ ఈ జగతి ఓర్మి గల్గిన సుమతి పొంద గలడట సుగతి ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

ఆరవ విడత... ******* పిట్ట పోరున తీర్పు పిల్లి జూపిన నేర్పు బెమ్మ దేవుని కూర్పు ఓ గూగులమ్మా! ఉర్విజనులకు స్పార్కు నూత్న వర్షపు మార్కు వుండబోదిక డార్కు ఓ గూగులమ్మా! తాత చేయును డేటు తొడిగి సూటూబూటు పడతి దొరకుటె పాటు ఓ గూగులమ్మా! మయుని మించిన మాల్సు స్వీటు గొంతుల కాల్సు నయా”గారపు ఫాల్సు ఓ గూగులమ్మా! తెలుగు బ్లాగుల టెక్కు జాలమందున నిక్కు వేసుకో ఓ లుక్కు ఓ గూగులమ్మా! ప్రణయ జీవుల చెంత వర్ణ భేదపు చింత మనుజ లోకపు వింత ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గురువుగారూ, అందుకోండి అయిదో విడత పదాలు. ***** ఐపి వున్నది గనుక వేంకటేశ్వరు డింక వీడవచ్చును శంక ఓ గూగులమ్మా! వంశ చరితల శంస జెంత గూడి రిరంస రంతు సినిమా హింస ఓ గూగులమ్మా! పంచెకట్టు పరికిణి పాతరికపు చెలామణి జీన్సె నేటి ధోరణి ఓ గూగులమ్మా! హొంత యగు యిల్లాలు పొంత నుండిన చాలు సొంత మౌను సుఖాలు ఓ గూగులమ్మా! జనమ నిచ్చిన ఇంతి జలము నిడచిన గొంతి 'కర్ణతల్లి'ట కుంతి ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గూగులమ్మపదాలు నాలుగవ భాగం : **************** పని లేనిదే పాట పనికి పాటకు బీట బతుకు దెరువుల తేట ఓ గూగులమ్మా! కవిత రాసినవాడు కర్మకాండల నాడు కాళిదాసయినాడు ఓ గూగులమ్మా! పాలకుడు సిరిరాజు పాఠకుడు కరిరాజు మకరి ఈ కవిరాజు ఓ గూగులమ్మా! రెండు పదముల రాశి ద్విపద యగుటంజేసి నేను కవితా పిపాసి ఓ గూగులమ్మా! 'నిరంకుశ' కవి తోటి పాఠకజన 'మావటి' నిరంతరమూ పోటి ఓ గూగులమ్మా! తీవ్రముగ తలపోయ కవిత కుంకుడుగాయ ఆడించు తలకాయ ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గురువుగారూ , నమస్తే. మీరిచ్చిన ఎసైన్మెంట్ మూడవ భాగం పూర్తి చేశాను. ఎప్పటిలాగే క్షీరనీరన్యాయం చేయవలసిందిగా విన్నపం. అంతు కానని తనిమ విన్నాణముల ప్రథిమ అంతర్జాల గరిమ ఓ గూగులమ్మా! అడిగినంతనె క్వెయిరి కొరికి ఇచ్చెడి శబరి ర్యాండమాక్సెసు మెమొరి ఓ గూగులమ్మా! సాఫ్టు'వేరు'న పురుగు క్లైంటు మెదడున పెరుగు సృష్టి కర్తకు పరుగు ఓ గూగులమ్మా! బుఱ్ఱ గలుగుటె కీడు సీరియలు చేంతాడు రామ కీర్తన పాడు ఓ గూగులమ్మా! గద్ద లందరు చేరి పండించుకొను శేరి ప్రభుత్వంపు కచేరి ఓ గూగులమ్మా! తెలియ లేను సర్వము నీ మహిమ ల ఖర్వము చొరనీయకు గర్వము ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గురువుగారూ, మీరిచ్చిన ఎసైన్మెంటు రెండవ వాయిదా: పెండ్లియగుటొక ఫేటు బ్యాచిలరుపై వేటు పెండ్లామె రూంమేటు ఓ గూగులమ్మా! ఉద్యోగమున మనుట రెండు మేడల గొనుట బ్రతుకులో సెటిలగుట!? ఓ గూగులమ్మా! చేసెడిది గోరంత చూపెడిది కొండంత లౌక్యమట ఈ వింత ఓ గూగులమ్మా! పైకోర్టు చీవాట్లు ప్రభువులకు అలవాట్లు పాలితుల గ్రహపాట్లు ఓ గూగులమ్మా! రైతు ముఖమున తేట మాయమౌ ప్రతి యేట ఇసుక వేయును మేట ఓ గూగులమ్మా! అవినీతి జేజమ్మ నేతగుట మా ఖర్మ తొండ ముదిరె గదమ్మ ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గురువుగారూ, మీరిచ్చిన ఎసైన్మెంటు మొదటి వాయిదా: నాయకుడి ఒడిలోన మతకలహమొక కూన రాజకీయము జాణ ఓ గూగులమ్మా! ఆనందమును పంచు ఆలోచనల పెంచు మనసులో జీవించు ఓ గూగులమ్మా! పెట్టడమ్మా కేసు ట్రాఫిక్కు పోలీసు వందనోటులె కీసు ఓ గూగులమ్మా! కొట్టి తెచ్చిన ఆస్తి కొల్లబోవుటె శాస్తి శాశ్వతం బిల నాస్తి ఓ గూగులమ్మా! కొమ్ము పెరిగిన ఎద్దు కుమ్మజూసిన పొద్దు తాకునొక పిడిగుద్దు ఓ గూగులమ్మా! తొలగించి తామసము కలిగించి దీమసము వ్రాయించు నీ శతము ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

ఇందుకూరి వారు కొలిచారు తొలిమారు దేవతగ నీ పేరు ఓ గూగులమ్మా! నిన్ను తలవని వాడు ఇంజనీరే కాడు ఇకపైన మనలేడు ఓ గూగులమ్మా! తలచినంతనె నీవు ప్రత్యక్షమౌతావు జగమెల్ల నీ తావు ఓ గూగులమ్మా! గాలించి లోకాలు గుదిగుచ్చి విషయాలు చేయుచుంటివి మేలు ఓ గూగులమ్మా! పలుకంగ నీ పేరు మా పనులు నెరవేరు గ్రామదేవత తీరు ఓ గూగులమ్మా! నుడువంగ నీ కీర్తి ఆరుద్ర యే స్పూర్తి రానారె విద్యార్థి ఓ గూగులమ్మా !