సాయం సమయం సెక్సు

'తెలుగుతో పాటు ఇంగ్లీషు చందమామ కూడా చదవండ్రా, మీ ఇంగ్లీషు మెరుగవుతుంద'ని ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె) లో మా ఆంగ్ల గురువు చెప్పారు - సెలవులకు ముందు. ఆమె సలహాను మరిచిపోకుండా రాజంపేటలో బస్సు మారేముందు చందమామలు కొన్నాను. తెలుగు చందమామను బస్సులో చదివితే వాళ్లూవీళ్లూ అడుగుతారని సంచిలో దాచిపెట్టి, ఇంగ్లీషు చందమామను హస్తభూషణంగా అలంకరించుకొని, రాయచోటి బస్సులో కూర్చున్నాను - దానిజోలికీ దాన్నిచదివే నా జోలికీ ఎవరూ రారని. ఆ ఇంగ్లీషులో కథ చదవడం చాలా కష్టంగా వుంది.

బొమ్మలన్నా ఒకసారి చూద్దామని పేజీలు తిప్పుతూ, ఒక బొమ్మను చూసి ఆగిపోయాను. ఆ బొమ్మ వెనుక కమామీషు ఏమిటో కనుక్కుందామనే బలమైన కుతూహలం కలిగింది. ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద రాతిని దొర్లించాలని శ్రమపడుతుంటాడు, ఆ రాయి కదలదు. ఇదంతా ఆ పిల్లవాని తండ్రి చూస్తూవుంటాడు. ఇదీ ఆ బొమ్మ. దాని పక్కన నాలుగే నాలుగు ఇంగ్లీషు ముక్కలున్నాయి.

"నిజంగా నువ్వు నీ బలాన్నంతా ఉపయోగిస్తే, ఆ రాయి కదులుతుంది"

"నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను"

"లేదే! నీ పక్కనున్న మనిషి సాయాన్ని నువ్వు అడగనేలేదే! సమయం వృధా చేస్తున్నావు."

అది జోకనుకుని చదివాను. నవ్వు రాలా. ఇంగ్లీషు సరిగ్గా తెలిసినవాళ్లకు ఇందులోని చమత్కారం అర్థమౌతుందనుకుని అంతటితో వదిలేశాను. ఆ తరువాత ఆ పుస్తకం పోయింది. ఆ ఇంగ్లీషు మాటలు నాకు గుర్తులేక, వాటి అర్థమేమిటో నేనెరినీ అడగలేదు. ఇది అప్పుడప్పుడూ గుర్తుకొస్తూనే వుంటుంది.

**********

నాల్రోజుల మునుపు Annapolis అనే సినిమా డీవీడీ చూడాల్సొచ్చింది. సినిమాలో, ఒక యువకుడు నావికాదళంలో చేరడానికి శిక్షణ పొందుతుంటాడు. జట్టుగా సమిష్టిగా పనులు నిర్వర్తించడమే కదా సైన్యం ముఖ్యంగా నేర్చుకోవలసింది? కానీ మన హీరో మాత్రం 'నాకు సాయం అక్కర్లే'దంటూ వుంటాడు. అతని సహచరుడు, ఒక సందర్భంలో, చాలా తీక్షణంగా చెబుతాడు,"Help is like sex. Take it from whoever and whenever you can get it!"

ఈ డైలాగ్‌ను వినగానే నా సంగతే ఆలోచనకొచ్చింది. నేనుంటున్నఇంటికి అతి దగ్గరలో ముగ్గురు మిత్రులుండేవాళ్లు. వాళ్లంతా ఇళ్లు ఖాళీ చేసి, దేశం విడిచి, దూరంగా వెళ్ళిపోయారు. నేనొంటరినయ్యాను. బాడుగ ఒప్పందం గడువు జూలై నెలాఖరున తీరిపోతుండటంతో నేను ఇల్లు మారాలనుకొన్నాను. నా దగ్గరి మిత్రులిద్దరు నన్నే అడిగారు, ఎప్పుడు మారుతున్నావో చెబితే ఆరోజు వచ్చేస్తాం, అన్నీ ఒక్కసారిగా మోసేద్దాం అని. అందుకు కృతజ్ఞతలు తెలియజేసి, అక్కర్లేదులెమ్మన్నాను. కచేరీ(ఆఫీసు)కి దగ్గరగా మరో చోట ఇల్లు చూసుకున్నాను. ఆగస్టు మొదటినుంచి కాదు, జూలై చివరి వారం నుంచే కొత్తింట్లో వుండొచ్చు. ఆ వారం రోజులకూ అద్దె చెల్లించాను. వారం రోజులూ, తీరికగా నా సరంజామాను నేనొక్కణ్ణే కొత్తింటికి చేర్చుకున్నాను. నేను కొత్తగా చేరేచోట నాకు తెలిసినవాళ్లు చాలా మంది ఉన్నారు. పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఏం బావుకుంటున్నాడు, వాడెంత వాడి బతుకెంత వరైరాలన్నీ పుష్కలంగా పట్టించుకునే పక్కా భారత పరివారంలో నేను దిగబోతున్నానని తెలుసు. వారం ముందే చేరుతున్నానని తెలిసి, నువ్వు బిందాస్, కూల్ అన్నారు కొందరు. కేర్నాట్, హట్కే అన్నారు కొందరు. అనుభవించురాజా అన్నాడొకాయన.

మొత్తానికి మరో బాడుగింట్లో దిగాను. దిగిన వారాంతం, అదే ఆవరణంలో వుంటున్న నా మిత్రుని ఇంట్లో, నేనొక్కణ్ణే Annapolis చూస్తున్నాను - మిత్రుడు మరో సహోద్యోగికి సాయం చెయ్యడానికని నగరం నడిబొడ్డుకు వెళ్లిపోవడంతో.

'సాయం సెక్సులాంటిది, వీలైనంత అందుకొ'మ్మనే మాట అప్పుడే వినడం జరిగింది. భలే వుందే ఈ డయలాగు! ఇల్లు మారినప్పుడు అందివచ్చినా సాయం వద్దన్నాన్నేను. నా పద్ధతి మంచిదా కాదా ... అనుకుంటూ ఆలోచించాను.

వీలైనంతవరకూ ఎవరికీ జవాబుదారీ కాకుండా బతకాలనుకుంటాన్నేను. సుమారైన కష్టం వచ్చినా ఒంటరిగా ఎదుర్కొనేందుకు, లేదా ఆ కష్టకాలాన్ని ఓర్చుకునేందుకు, మానసికంగా శారీరకంగా సిద్ధంగా వుండాలనుకుంటాను. 'నీకు ఫలానా సాయం చేశాన్నేను' అని నాకు గుర్తుచేసే అవకాశం వీలైనంతవరకూ ఎవరికీ లేకుండా చూసుకోవాలనుకుంటాను. నేను పెరిగిన పరిస్థితులు, అనుభవాలు నేనిలా అనుకోవడానికి ప్రధాన కారణం కావచ్చు.

అట్లా బతకాలంటే - మొదటగా, ఎవరికీ ఏమీ బాకీ పడకుండా చూసుకోవాలి కదా. ఎవరినైనా సాయం అడిగితే వాళ్లకు బాకీ పడినట్టే! అంతగా అడగాల్సొస్తే, సాయం చేసి మరచిపోయేవాళ్లనే అడగాలి. చేసిన సాయాన్ని గుర్తు చేసుకునేవాళ్లను అడక్కూడదు. మనకు గుర్తు చేసేవాళ్ల జోలికి అసలే పోకూడదు. ఎవరెలాంటివాళ్లో ముందుగానే ఎలా తెలుస్తుంది? మహాత్మా గాంధీ ఏమన్నాడు? ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలన్నాడు. కాబట్టి వీలైనంతవరకూ మన పనులు మనమే చేస్కుందాం. ఈ విధమైన విపరీతాలోచన ఎప్పుడో నా మెదడులో గడ్డకట్టుకుపోయింది.

ఒక దగ్గరి మిత్రుడున్నాడు. ప్రతి పనికీ సాయం కోరతాడు, పెద్దగా శ్రమ చెయ్యకుండానే పనులు తన మిత్రపరివారంతో జరిగిపోతుంటాయి. 'బొత్తిగా ఒళ్లుబరువు మనిషి, ఎప్పుడైనా ఒక్కడే వున్నప్పుడు శ్రమ చెయ్యాల్సొస్తే ఎట్లా తట్టుకోగలడు! అలత తెలీకుండా జీవితం గడుపుతున్నాడు' అని నేను అనుకునేవాణ్ణి గానీ, అతడు ఒంటరిగా ఎప్పుడూ లేడు! పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ రాలేదతనికి. వచ్చినా సాయం కోరే, సాయం సంపాదించే విద్య తెలిసి వున్నవాడు. కాబట్టి మానసిక శారీరక దార్ఢ్యం కోసం పెద్దగా పరిశ్రమ అక్కర్లేదతనికి - జన జీవన స్రవంతిలో కలిసి వున్నంతవరకూ.

నా పద్ధతిలో ఏం జరుగుతోంది? నేనెవరి సాయమూ కోరడం లేదు. నన్నూ ఎవరూ పెద్దగా సాయం అడగలేదు. నా బతకు నేను బతుకుతున్నానని సంతోషించాలా? జన జీవన స్రవంతి నుంచి విడిపోయి, నా సెల ఇసుకలో ఇంకిపోతోందనుకోవాలా? మొదటిది నిజమేకానీ, రెండోదీ అంతకంటే నిజమే. ఉన్నట్టుండి సాయం కావాలంటే చేయడానికి మనకెవరూ పరిచయస్తులు వుండరు. కొత్తవారి సాయం పొందే విద్యలో మనకు సాధన లేదు!

సాయం కావాలా అని మనతో ఎవరైనా అన్నప్పుడు ఔనండీ అనడమే మంచిదేమో!

'అందివచ్చిన సాయాన్ని పొందలేకపోతే సమయం మించిపోతుంది - సెక్సు విషయంలో వయసు మీరిపోయినట్లే!' అనాలనుంది కానీ, బోధలు ఎందుకులెండి ఎవరి బాధలు వారివి. అందుకే ఈ టపా పేరు అలా పెట్టాను. ఎవరికి కావలసిన అర్థం వాళ్లు వెతుక్కునే సౌలభ్యం వుంది కదా ఇందులో! ;-)

కామెంట్‌లు

మెహెర్ చెప్పారు…
:)

బాగుంది — శీర్షిక ఆశపెట్టిన సరుకేమీ లేకపోయినా (:P)

కొన్ని టెంకిజెల్లలు తిన్నాకా, అబ్బే ఒంటికాయి సొంటికొమ్ములా వుంటే లాభం లేదూ అని తెలుసుకుని, సాధ్యమైనంత వరకూ సాయం అడిగితే విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నాను, అంతే విచ్చలవిడిగా అడిగి పుచ్చేసుకుంటున్నాను. పెద్దగా పరిచయం లేని వాళ్ళని సాయం అడగాలన్నా (బుల్లి బుల్లివే అనుకోండీ), "నాకు సాయం చేసే అరుదైన అవకాశం ఇస్తున్నాను, మంచి తరుణం మించిన దొరకదు, పండగ చేసుకోండి" అన్నంత దర్జా చూపిస్తూ అడిగేతాను.

కానీ అడిగితేనే సాయం చేసే చండాలపు అలవాటుంది నాకు. లోపల్లోపల అడగండీ అడగండీ అని ఉబ్బిపోతుంటాను గానీ, ఓ పట్టాన "సాయం కావాలా" అని అడగటానికి నోర్రాదు. అదేంటో! "అహ వద్దు" అంటే మాటపోతుందని భయమేమో.
తమిళన్ చెప్పారు…
cut & paste not working

nenu coment ni lekhini lo type chesi ikkada paste cheddmante kudaradam ledu...why?

any way 9/10

okka mark enduku thaggindante '' HITLU PENCHUKUNE VUDHREKAPOORITHA TITLE TRICK''
kanthisena చెప్పారు…
'తెలుగుతో పాటు ఇంగ్లీషు చందమామ కూడా చదవండ్రా, మీ ఇంగ్లీషు మెరుగవుతుంది'

ఈ గొప్ప సత్యాన్ని ప్రకటించిన మీ గురువుగారు ధన్యులు. మా నాన్న 35 ఏళ్ల క్రితం ఇదే మాట మరోలా చెప్పారు.

'చందమామ చదవండిరా జ్ఞానమొస్తుంది.' ఆయన ఏ క్షణంలో ఆ మాట అన్నారో గాని అప్పటినుంచి చందమామ మా జీవితాలతో అల్లుకుపోయింది. చివరికి అదే చందమామలో ప్రస్తుతం పనిచేస్తున్నంతగా చందమామ మాతో ముడిపడింది.

మీ గురువు గారు తెలుగు చందమామతో పాటు భాషా జ్ఞాన కోసం ఇంగ్లీషు చందమామను కూడా చదవమనడం నిజంగా గ్రేట్.

కానీ మీరు ఇంగ్లీష్ చందమామ కొని కూడా పోగొట్టుగోవడం విచారం. మా బాల్యంలో కాని తర్వాత కానీ ఇంగ్లీష్ చందమామ చదివే

అవకాశం మాకు లేదు. తెలుగు చందమామ తెప్పించుకుని చదవటమే ఆరోజుల్లో గొప్ప కార్యం.

'రాజంపేటలో బస్సు మారేముందు చందమామలు కొన్నాను.'

మా ఊరికి చాలా దగ్గరే ఉన్నట్లున్నారు. మాది రాయచోటి - సుండుపల్లె మండలం.

వీలైతే ఆన్‌లైన్ చందమామ లింకు మరియు చందమామ చరిత్రపై నా కొత్త బ్లాగ్ లింకు చూడండి

www.telugu.chandamama.com

blaagu.com/chandamamalu.

చాలా రోజులుగా బ్లాగ్ లోకంలో మీ గురించి వింటున్నా, చూస్తున్నా కాని మీతో టచ్‌లోకి వచ్చింది లేదు.

మీ బ్లాగు వైవిధ్యపూరితంగా ఉంది. తప్పక చూస్తాను.

k.Raja Sekhara Raju.

email: krajasekhara@gmail.com
కొత్త పాళీ చెప్పారు…
గడుసువాడివే :)
Srinivas చెప్పారు…
మంచి టాపిక్.

ఇచ్చిపుచ్చుకోవటాల్లోనే సంఘజీవనమూ, మనుషుల మధ్య సంబంధాలూ నిలబడుతాయనుకుంటాను. మీరు సాయం తీసుకోకపోతే రేపు మీ సాయం ఎవరడుగుతారు? అడగడానికి మొహామాటపడితే అది వేరే విషయం గానీ వాళ్ళే అడిగినా మొహమాట పడటంలో అర్థం లేదు.

మన పల్లె జీవొతాల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. మనిషికి మరో మనిషి తోడంటే అదో ధైర్యం. బహుశా ఒంటరిగా బయటకొచ్చి చదువుకుని అలవర్చుకున్న నాగరిక లక్షణం అయ్యుండవచ్చు. నాగరికం ముదిరిన కొద్దీ మనిషికి ఒంటరితనం తప్పదు కాబోలు.

సాయాల్ని దుర్వినియోగపర్చేవాళ్ళూ ఉంటారనుకోండి - అది వేరే విషయం.
ఉమాశంకర్ చెప్పారు…
మంచి విషయం ..

నాలో ఏమైనా లోపముందా అని నన్ను నేను చాలా తరచుగా ప్రశ్నించుకునే వాటిల్లో ఈ "సాయం అడగటం" ఒకటి..ఎవరైనా సాయం అడిగితే సంతొషంగా చేస్తాను..కానీ నాకోసం అయితే అడగలేను..చివరికి నేను సాయం చేసినవారిని కూడా అడగలేను.. అడిగాక అంతర్లీనంగా నాలో ఏర్పడే "కృతజ్ఞతతో కూడిన బాధ్యత" లాంటి ఫీలింగుని నా మనస్సు భరించటం ఇష్టంలేకపోవటం కావచ్చు. పైగా వాళ్ళని కలిసినప్పుడల్లా ఏదో పెద్దరాయిని బలవంతాన మోస్తున్నట్టు ఉంటుంది..అలానే సాయం చేసాక మరికొంతమంది మనమీద ఏదో హక్కు ఉన్నట్టు ప్రవర్తిస్తారేమో అన్న భయం..( అలాంటివాళ్ళూ ఉన్నారు మరి)..

స్వోత్కర్ష లా ఉందా? ఇలా కాకుండా ఇంకోలా రాసి చదూకుంటే ఏదొ మీకు "ఉచితసలహా" ఇచ్చి చేతుకు దులిపేసుకున్న అర్ధం ధ్వనించిందండీ.. అందుకే వ్యాఖ్య తిరగరాయాల్సొచ్చింది.. :)

బైదవే.. 10/10
అజ్ఞాత చెప్పారు…
10/10. రాయల సీమ నుంచి ఒక రాజన్న కవి ఇంకొక రానారే నే. నువ్వు చాలా బాగా రాస్తావు.
ఊకదంపుడు చెప్పారు…
మొన్న గ్రహణం అప్పుడు, కొంత మంది పెద్దలు, ఏమిటి శాస్త్రం చెప్పింది గాడిదగుడ్డు, గ్రహణ సమయం లో బోజనం చేయండి - మేం చూస్తాం ఏమౌతుందో అని చెప్పారు -
శీర్షిక చూశి - అలాంటివిషయమే అనుకొంటె మీరు మరీ చందమామ కధ చెప్పేశారు.
సెక్సు సంగతి నాకు తెలీదు గానీయండి, సాయం విషయం లో మీ పద్ధతే సరి.
rākeśvara చెప్పారు…
http://andam.blogspot.com/2009/08/x.html
కాలనేమి చెప్పారు…
ముక్కావారి పల్లెలో చదూకున్నారా మీరు... మాది రాజంపేటే. నలంద స్కూల్ వినే ఉంటారు. అదే మా స్కూలు :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము