సుషుప్తి - విముక్తి

ధృవపు ఎలుగుబంటి గురించి చదువుకున్నవిషయాల్లో నాకు గుర్తున్నది - సుదీర్ఘమైన - దాని 'సుషుప్తావస్థ'. ధృవపు ఎలుగుబంటి ఒకవిధమైన నిద్రాణావస్థలో గడపవలసివచ్చే తీవ్రమైన చలికాలం మాదిరిగా నాక్కూడా ఒకవిధమైన నిశ్శబ్దంలో గడపవలసివచ్చే కాలం ఒకటున్నట్టుంది.

తీవ్రమైనచలిలో బయట తిరిగితే ఒంట్లోని కొవ్వునిలువలు త్వరగా కరిగిపోయి, ధృవాల్లో ఆ తరువాత ఆహారం దొరక్క ఎలుగుబంటికి కష్టకాలం దాపురిస్తుంది. అందుకే అది నిద్రపోతుంది. నిశ్శబ్దావస్థలో వుండవలసినప్పుడు మాటల్లో పస వుండదు, మాట్లాడితే ప్రమాదం జరిగే అవకాశమే ఎక్కువ కనుక అంతర్ముఖుడిగా వుండడమే శ్రేయస్కరం.

చలికాలాన్ని తట్టుకొనేందుకు వలసిన కొవ్వును శరీరంలో నిలువచేయడానికి తగినంత తిండిని ముందుగానే కష్టపడి సంపాదించి ఆరగించి, సుషుప్తికి సిద్ధమౌతుంది ఎలుగుబంటి. నిశ్శబ్దావస్థ నుండి బయటకు రావడానికి ఆలోచనల్లో స్థిరత్వం కోసం కష్టపడవలసి వస్తుంది నాలాంటివాడికి.

కాసిన్ని సూర్యకిరణాలు పరచుకొంటే చాలు నిద్రలేస్తుంది ధృవపుఎలుగు - Introvert గా కనిపించే Extrovert. ఆలోచనల్లో కాసింత ముసురుకమ్మితే చాలు నిశ్శబ్దంలోకి జారుకుంటాడు నాలాంటివాడు - Extrovert గా కనిపించే ఇంట్రొవర్తులపు గానుగెద్దు. ఆలోచనల ముసురును, మనోనేత్రపు గంతను తొలగించుకోవడానికి ఎంతకాలం పట్టినా నిశ్శబ్దంగా వుండటమే శ్రేయస్కరమేమో!

కామెంట్‌లు

ఆత్రేయ కొండూరు చెప్పారు…
బాగా రాశారు. కానీ తిండి నైతే కొవ్వు చేసి దాచుకుంటుంది దేహం
ఆలోచనలు ఎక్కువైతే, బుర్ర ఖజానాలో ఖాళీలు నిండుకుని
బట్టతల బయట పడుతుందేమో నన్న భయంతో ఎప్పటికప్పుడు
విదిలిస్తూ ఉంటాను. అలా దాచుకోవడం నావల్ల కాదు బాబూ !!
అజ్ఞాత చెప్పారు…
మీ వల్ల హైబర్నేషన్ ని తెలుగులో "సుషుప్తావస్థ" అంటారని
తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.
మీ టపా చదువుతుంటే, నా అభిప్రాయాలాను చదువుకున్నట్లనిపించింది.
నేనూ నిశ్శబ్ధావస్థలోనే ఉన్నాను కొద్ది నెలలుగా.
ఎప్పుడు మళ్ళీ జ్ఞానోదయం అవుతుందో తెలియదు.
కొత్త పాళీ చెప్పారు…
బాగుంది రాంనాథా!
ఆత్రేయ .. నిండుకుంది అంటే అర్ధం ఖాళీ అయింది అని. మీ ఉద్దేశం ఖాళీలు నిండి అని అనుకుంటా.
teresa చెప్పారు…
ఆహా!!
మితృలతో వన విహారాలూ, గాన కచేరీలూ, దూరవాణిలో ముచ్చట్లూ బాగానే నడుస్తున్నాయని వినికిడి. మీ నిదుర మబ్బులను తొలగించే మెరుపు తీగ వచ్చే వరకూ మేమిలా వెయిటింగూ..
అజ్ఞాత చెప్పారు…
8/10
కామేశ్వరరావు చెప్పారు…
మీ సుషుప్త్యావస్థ వెనక అసలు రహస్యం రాయలవారు మా చెవిలో ఎప్పుడో ఉదేసారు లెండి:-)
మీకు నా శుభాకాంక్షలు!
Unknown చెప్పారు…
మళ్ళీ నేనూ రాయడమెందుకు గానీ నాది కూడా సేం టు సేం కేసు. కాపీ పేస్టు :)
అజ్ఞాత చెప్పారు…
మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న సుషుప్తావస్త బాగా పనికొచ్చే రోజులు ముందున్నాయి. శుభాకాంక్షలు.
ఆత్రేయ కొండూరు చెప్పారు…
కొత్త పాళీ గారు మీరన్నది నిజమే. నిండుకుని అంటే ఖాళీ అయి అని. నేను రాసిన "ఖాళీలు నిండుకుని " అంటే బుర్ర ఖజానా ఆలోచనలతో నిండి పోయింది అని, ఖాళీలు మిగలలేదు అని. ధన్యవాదాలు
రానారె చెప్పారు…
@ఆత్రేయ, భవానిగార్లు - నా బ్లాగుకు స్వాగతం. :)
నవీనన్నా, చాన్నాళ్లక్కనిపిస్తున్నావు! పునఃస్వాగతం. :)
తెరెసా, భైవరభట్ల, ప్రవీణ్, రవిగార్లూ ... నెనర్లు. మీరేమో 'ఆహా మాకు తెలుసులే' అనేస్తున్నారు. ఈ టపాతో మెరుపుతీగకే కళ్లుబైర్లుకమ్మాయంట. :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము