లఘు కవితలు - సర్వలఘు కందము

కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ...


కం.
మిడిమిడి తెలివిడి తెగబడి
వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్
దడదడ మని జడి కురిసెను
గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!!

... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను.

భాషందం బ్రతుకందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞులైన తమకు వివరించనవసరం లేదు. మా గురువుగారు అదే కందం మీద చదువరిగారి బ్లాగులో ఏడాది క్రితం ఒక పేరడీ రాశారు. (ఈ లంకెను అనుసరించి, ఆ టపాలో కొత్తపాళీగారి రెండో వ్యాఖ్యను చూడండి).

పై రెండు టపాలనూ, అందలి వ్యాఖ్యలనూ చదివిన వేడిలో ఈ టపా రాసి చలికాచుకున్నాను.

కామెంట్‌లు

రాఘవ చెప్పారు…
కలియుగము ముగియుట! హి హి హి :D

చలి పులి నెదిరిచి నిలువగ చనువుగ లఘువుల్
సులువని తవఁరిటు పలుకగ
తలచుట విని మరి చదివితె తల తిరిగెడినై.
Unknown చెప్పారు…
భాషందం బ్రతుకందం,
మీమ్మల్ని ఫాలో అవ్వటానికి ఈ రోజునుండీ నేను చందస్సు మళ్ళీ మొదలపెడదామనుకుంటున్నాను రానారె గారు
రానారె - అచ్చంగా ఇదే పరిస్థితి నాది కూడా, ఈ మధ్య వస్తున్న కొన్ని "అందమయిన" కవితలో, తవికలో చదివి - కాకపోతే దక్షిణధృవ దెసలో - బుఱ్ఱ వేడెక్కటం, గోక్కోవటం, అనుభవించాలో ఆక్రోశించాలో ..లో..లో..లో..లో..లో..లో..


"కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ..."
rākeśvara చెప్పారు…
మీరు ఇలా నా మీద మీ బ్లాగులో అవహేళన చేస్తూ వ్రాసిన ఈ పద్యాన్ని, అలానే నేనన్నమాటలకు పెడార్థం తీయడం, అలానే నా బ్లాగుపశీర్షికకు పెడర్థాలు తీసి దుష్ప్రచారం చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఈ మధ్య అందరూ అందర్ని ఖండిస్తున్నారుగా బ్లాగులోకంలో .. నేను కూడా ఎవరినైనా ఖండిస్తే ఓ పనైపోతుందని ఆలోచించి.. వేరే ఎవరైనా అయితే ఊరుకోరని.. ఇదిగో ఇలా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

"ఘోర యడవి పందిని చంపినవాడే నిజమైన బంటు
సర్వ లఘువు కందము వ్రాసినవాడే సహజమైన కవి"
అన్నారు పెద్దలు.
రానారె చెప్పారు…
గురూజీ అన్నట్లు 'కందములకేమి వందైనా వ్రాయవచ్చు వడిగా, ఛందమున వ్రాయుచునే యందముగా వ్రాయవలెను'. ఆ అందం (elegance) నాకు అబ్బలేదని నా బాధ. కనీసం నన్ను వెక్కిరించడానికో మరో కారణంగానో నాలుగు మంచి పద్యాలు రాల్తాయని నా ఆశ. రాఘవ ఒకటి రాల్చారు. పద్యాల సందడి పునరావృతమై సరైన విషయాల మీద చమత్కారంగా ఎవరైనా కందాలు రాస్తే చదువుకుని ఆనందించవచ్చు కదా!

అశ్విన్ - మీ సెన్స్ ఆఫ్ హ్యూమరుకు ఛందస్సు తోడైతే నిజంగా మంచి మంచి పద్యాలు బయటకొస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి.
రానారె చెప్పారు…
ఎమోటైకాన్లను పద్యంలో ఉపయోగించిన తొలి వ్యక్తి మీరేనేమో రాఘవా! :)
rākeśvara చెప్పారు…
@ రాఘవ
:D అనేది గురువౌతుందా లఘువౌతుందా ? :D
కామేశ్వరరావు చెప్పారు…
ఎమోటైకాన్ల సంగతి నాకు తెలీదు కాని, "హి హి హి" అన్నది చదవగానే నాకు వికటకవి పద్యం ఒకటి గుర్తుకొచ్చింది:

ఈ కడజాతి నాతి కిహిహీ! మహిదేవుడు చిక్కెనంచు నన్
రాకకు బోకకున్ జనపరంపర కెంపగు జూడ్కి జూచి యం
బూకృత మాచరించుటకు బుద్ధి దలంక గలంక ముక్త చం
ద్రాకృతి బొల్చు నీ ముఖమునం దమృత స్థితి గాంచి మించుటన్
అజ్ఞాత చెప్పారు…
రక్షించారు రాకేశా. రానారే హేళన, నిరసనా, మీ టపా లో నేనొత్తిన సర్వలఘు కందవ్యాఖ్యకనుకున్నాను. :(

రాఘవగారి భావసఙ్ఞ మనకోసమే, గణాలకోసం కాదు, చూడండి.
త్రు..వ్వట బాబా... పద్యానికి - ఎమోటికాన్ వేసి "వ్రాశే" హాస్య సన్నివేశం, తెనాలి రామకృష్ణ చిత్రం లో ఉంటుంది.
ఊకదంపుడు
రాఘవ చెప్పారు…
ఈ :D ఉంది చూచారూ, ఇది ఛందోజాతిమాత్రావర్ణాదులకతీతమైన స్వరూపం :)
రాఘవ చెప్పారు…
కామేశ్వర్రావు మేష్టారూ
ఎందులోదండోయ్ ఆ వికటకవి ప్రయోగం? చూడ్డానికి చాటువులా లేదే?
నేనింకా బోల్డెంత సంబడపడ్డాను హిహిహి ని పద్యంలో ఇరికించాక, ఇదేదో వెరైటీగా ఉందే అని! నీళ్లు చల్లేశారు :(
కామేశ్వరరావు చెప్పారు…
ఇది పాండురంగమాహాత్మ్యంలోని, నిగమశర్మ కథలోదే. ఆ కవి "ప్రయోగాన్ని":-) తెలీకుండానే మీరూ చేసారని సంతోషించక, అలా నిరుత్సాహ పడతారేం? పైగా మీరు దానికో "విశేషణాన్ని" :D కూడా తగిలించేరాయె!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు