Tuesday, August 12, 2008

మయాన అనగానేమయా?

ఎవరో పిలిస్తె వచ్చిందీ, ఎవరికోసమో పోతోందీ,
మయాన మజిలీ యేసిందీ, మయాన మజిలీ యేసింది
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే (౨)
పళ్ళు పదారూ రాలునులే .. పళ్ళు పదారూ రాలునులే

మొన్నామధ్యొకసారి మాటీవీలో 'పాడాలని వుంది' కార్యక్రమంలో ఒక పాప 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా' అనే పాట పాడింది. నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యంగారు ఆ పాట సాహిత్యాన్ని గురించి రెండుముక్కలు చెబుతూ ఈ నాలుగు పంక్తులనూ ఉటంకించి ఇక్కడ ఆత్రేయ 'మయాన' అనే పదాన్ని వేసినందుకు మురిసిపోయారు. మయాన అంటే ఏమిటో చూద్దామని బ్రౌణ్యములో వెతికాను కానీ అక్కడ దొరకలేదు. 'మయాన' అంటే 'మధ్యలో' అని ఈ పాట సందర్భానుసారం నాకు అర్థమయింది. నేను పుట్టక ముందు నుంచీ ఈ పాటను వింటున్నానుగానీ, ఇది మూగమనసులు సినిమాలోనిదని నాకిప్పుడే గూగులమ్మ ద్వారా తెలిసింది. నేనింకా 'మూగమనసులు' చూడలేదు.

మొన్న ఆదివారం చిన్న పని మీద రోడ్డునబడి చిరంజీవి పాటలు వింటూ వెళుతూ వుండగా 'మయాన' మళ్లీ తగిలింది. మెగాస్టార్ సగటు అభిమానులు చెప్పగలరా ఏ పాటలోనో? సగటు అభిమానులను ఎందుకు అడుగుతున్నానంటే వీరాభిమానులు చెప్పలేరని నా అనుమానం. సరే చిన్న క్లూ యిస్తా - ముద్దులే మెక్కుతూ మయాన వగలమారి మాటలా!? - అని సాహిత్యం. ఇప్పుడు చెప్పగలరేమో చూద్దాం.

ఈ రెండు పాటల్లో తప్ప ఈ పదాన్ని నేనెక్కడా వినలేదు, పుస్తకాల్లో చదవలేదు కూడా. చూడబోతే ఇదేదో మాడలిక పదంలా వుంది. దీని గురించి మీకు తెలిసింది చెప్పండి. ధన్యవాదాలు. :)

18 comments:

నాగమురళి said...

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా మామూలుగా వినిపించే పదం ఇది. (మిగతా చోట్ల కూడా వాడతారామో నాకు తెలియదు.) మధ్యలో అనడానికి మయాన అంటారు. ఆడు బాగానే ఉన్నాడు కదా, మయాన నీకేంటి? ఇలాంటి ప్రయోగాలు సంభాషణల్లో తరచుగా వినిపిస్తూ ఉంటాయి.

నాగమురళి said...

మీరు మూగమనసులు సినిమా చూడలేదా?? ఆశ్చర్యమేనే.

Illaiya said...

మయాన అనే పదము నేను అనేక సార్లు వినడం జరిగింది. మీరు పైన చెప్పినట్లుగా "మయాన" అంటే మధ్యలో అన్నది కరక్టే. మా ఊరిలోని (తెనాలి దగ్గరిలోని ఒక పల్లెటూరు) మాండలీకం లో ఇది చాలా సర్వసాధారణం. చాలా రోజుల తర్వాత ఈ పదం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

సూర్యుడు said...

అవును, మయాన అంటే మధ్యన అని, అది మా యాస బాస

Anonymous said...

మయాన అన్న పదాన్ని మరో అర్థంలో (సందర్భంలో) కూడా వాడతారు...
వాడుకలో ఉదాహరణలు -
1) వాడు ఆ మయాన ఎల్లిపోయాడు.
2) ఆ మయాన ఎల్లినోడు, నిన్ననే వొచ్చాడు.

- సిరి

రానారె said...

నాగమురళి, ఇళయ గార్లు చెప్పినదాన్ని బట్టి ఈ పదం ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో విరివిగా వాడకంలో వుందని తెలుస్తూ వుంది. మయాన సూర్యుడుగారి ఊరు కూడా గుంటూరు అనుకోవచ్చేమో.

నాగమురళిగారు, ఈమధ్యనే పనిగట్టుకొని కొన్ని పాత సినిమాలు మొదటిసారి చూశాను. మూగమనసులు ఇంకా చూళ్లేదు. :-)

సిరిగారు, మీరుదహరించిన వాడుకలు ఏ ప్రాంతంలోవి? ఇవే సందర్భాల్లో 'మయాన' బదులుగా 'మొయిన' లేదా 'మైన' అంటూ కడపజిల్లాలో మాట్లాడటం విన్నాను.
1. ఏమిరా ఆ మైన గస బోసుకుంటాండావు?
2. ఆ మొయిన పోయిన పోవడం అంతే! మల్ల యాణ్ణే గాని కనబళ్యా.
3. వొద్దురా వొద్దురా అని వొగ మొయిన మొత్తుకుంటాడా. రోంతన్నా నా మాట యింటే గదా!?

కొత్త పాళీ said...

మా అమ్మమ్మ వాళ్ళు కూడా (తెనాలి రేపల్లె మధ్యలో పల్లె) మయాన అని "మధ్య" వాడే చోటల్లా వాడేవాళ్ళు.

బొల్లోజు బాబా said...

మయాన అంటే మధ్యలో అనే అర్ధమే. అందులో ఏ సందేహమూ లేదు.
బొల్లోజు బాబా

సుజాత said...

రానారె,
మీరు చెప్పినట్టే 'ఆ మైన ' అనే మాట మా గుంటూరు వైపు వాడటం విన్నాను.

"ఇంక ఆమైన ఏమైందంటే.."(అప్పుడు ఏమైందంటే)
"ఆమైన మాట్లాడుతూ ఉంటే ఎలాగ చచ్చేది?"(ఆ రకంగా, లేక ఆవిధంగా) ఇలాంటి వాడుకలు ఇప్పుడూ చూడొచ్చు పల్లెలవైపు వెడితే!

రవి said...

రానారె గారు,

మీరన్నట్టు, ఈ పదం, కోస్తా జిల్లాల్లో ఎక్కువ వాడుకలో ఉన్నట్టుంది. మా అనంతపురం లోనూ, మీరు చెప్పిన 'మైన ' అన్నది వాడుకలో ఉంది, కానీ 'మధ్యన ' అన్న అర్థంలో కాదనుకుంటా.

"ఆ మైన సావ...తున్నాడుగా నా..." అని కాలేజీ రోజుల్లో అయ్యవార్లను తిట్టుకునే వాళ్ళం.

చిరంజీవి పాట పై మీ క్లూ మీరు కూర్చిన గడి క్లూ లా కష్టంగా ఉంది :-)

Anonymous said...

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నేనుదహరించిన వాడుక వినిపిస్తుంది. మీరన్నట్లు 'ఆ మైనా అనే వాడతారనుకుంటా. తర్వాత ఆలోచిస్తే, నేను పొరబడ్డాననిపించింది.

- సిరి

రానారె said...

రవి, చిరంజీవి పాట గురించి ఎవరూ మాట్లడలేదేమా అనుకుంటున్నాను. మీకింకో క్లూ - ఈ పాటలో మరో లైను చెప్పడానికి నేను జంకుతున్నాను. కానీ విశేషమేమంటే ఇదే సినిమాలో ఒక రామ భజన పాట కూడా వుంది. కోటి సంగీతం. 1995 విడుదల.

వికటకవి said...

నడిమయాన అన్నది చాలా ఎక్కువగా వాడతారు, నడిమధ్యలో అని చెప్పటానికి.

రవి వైజాసత్య said...

మయంగా అంటే మా ఊళ్లో ఉరువుగా, దండిగా, ఎక్కువగా అన్న అర్ధంలో వాడతారు.
మయంగాకు వ్యతిరేకపదం మోయినంగా (enough, apt, appropriate) అని నా ఆలోచన

రవి said...

అల్లుడా.. మజాకా.. సినిమా అని అర్థమయింది. (మా వూరి దేవుడు, అందాల రాముడు - రాముడి పాట, కోటి మ్యూజిక్ సరిపొయాయి). ఇక పాట - చిన్న పాపకేమొ చీర కాస్త చిన్నదాయెరా...ఇది అని నా అనుమానం. ఈ సినిమాలో లిరిక్స్ మొత్తం నాకు తెలీవు!

DSG said...

రానారె గారూ..

మీరు రాసిన 'ముద్దులే మెక్కుతూ మయాన వగలమారిమాటలా' అనే లైను 'అల్లుడా మజాకా' అనే సినిమాలో 'చిన్నపాపకేమో చీర కాస్త చిన్నదాయెర ' అనే పాట లోనిది...ఎంతో మంది చిరంజీవి 'వీర 'అభిమానులు 'సగటు ' అభిమానులుగా మారటానికి కారణం ఈ చిత్రమేననిపిస్తుంది.. అంతవరకు చిరంజీవి సినిమాలలో అశ్లీలత ఉన్నా ..ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు చూస్తే ఏదో ఒకటి చేసి సినిమాను హిట్ చెయ్యాలని చిరంజీవి తన అంతరాత్మను చంపేసుకుని చేసాడేమొననిపిస్తుంది..

అశ్లీలత, శౄంగారం అనేవి 'బూతు ' అనే మాటకు మన తెలుగు సినిమా వాళ్ళు వాడే euphemisms...ఈ సినిమా సౄష్టించిన controversy కి సమాధానంగా చిరంజీవి, ఈవీవీ, దేవి వర ప్రసాద్ కలిసి "ఇది బూతు కాదు " అని చెప్పటంతో చాల మంది 'సగటు ' అభిమానులు మామూలు ప్రేక్షకులుగా మారిపొయ్యారు..

రానారె గారు "ఈ లైను ఏ పాటలోదో చెప్పండి " అని అడిగిన పాపానికి నేను పల్లవి, అనుపల్లవి, చరణం పాడి మీ లౌడు స్పీకర్లు బద్దలు కొట్టినందుకు క్షమించండి...ఒకప్పటి వీరాభిమాని..ఎంతో బాధతో సగటు అభిమానిగ మారి...గత పదేళ్ళుగా తనకు నచ్చిన హీరొ ఒక్క sensible సినిమా కూడా తీయకున్నా అభిమానిస్తూ...మొన్నీమధ్య అతని రాజకీయ రంగ ప్రవేశం గురించి విని...కన్నీళ్ళ పర్యంతమై తన అభిమానానికి రాజీనామ ఇచ్చేసిన ఒక చిరభిమని Rant ఇది..

"ఇటువంటివన్నీ దయచేసి నీ బ్లాగులో రాసుకో బాబూ..నా e-space తినెయ్యకు " అని రానారె గారు అనేలోపు ముగిస్తూ

గౌతం (thotaramudu.blogspot.com)

రవి said...

ఓ నేను కరెక్టే అన్న మాట! గౌతం, బాగా చెప్పావు. ఎక్కడికెళ్ళావు బాబు, ఓ టపా వేస్కోవచ్చుగా నా లాంటి అభిమానుల కోసం (రానారె గారు, ఇది ఇక్కడ అడగాల్సింది కాకపోతే క్షమించాలి) - రవి

రానారె said...

రవి వైజాసత్య - 'మయంగా, మోయినంగా' లను ప్రయోగిస్తూ రెండు స్వంత వాక్యములను వ్రాయుడి. :)

గౌతమ్, రవిగార్లు - మీరు నా e-space ను కబ్జా చేసినా నాకేమీ అభ్యంతంరం లేదు. కావలసినంత e-బంజరుభూమి వుంది. దున్నుకుని బతుక్కుంటాను. :) 'వీర' కాకపోయినా, నేనూ అభిమానినే. నా అభిమానం కూడా ఈ'మయాన' పలచబడుతూ వుంది. :)

కొత్తపాళీ, బొల్లోజు బాబా, సుజాత, వికటకవిగార్లకు - ఈ పదం వాడుక గురించి తెలిపినందుకు చాలా థాంకులు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.