Tuesday, August 05, 2008

వినాశ కాలే ...

ప్రస్తుతం టెక్సాస్ గుండా ఒక హరికేన్ ప్రయాణిస్తూవుంది. ఈ తెల్లవారుజామున తీరాన్ని దాటిందట. ఈదురు గాలుల వలన పెద్ద ప్రమాదం లేకపోయినా హ్యూస్టన్ మహానగర పరిసరాల్లోని కొన్ని కౌంటీలకు దీని ప్రభావం వల్ల వరదలొచ్చే అవకాశం వుంది కనుక జాగరూకులై వుండండి అని రేడియో, టీవీ, ఇంటర్నెట్టు, బయటర్నెట్టుల్లో నిన్నంతా ఒకటే హోరు. మా కచేరీకి సెలవు ప్రకటించే అవకాశం వుండవచ్చని ఒక అధికారిక వేగు కూడా అందింది. అధికారిక వేగులకు మామూలుగా పట్టే చెత్తబుట్ట యోగం దీనికీ పడుతుందనే అంచనాలతో దాన్నే ఉద్యోగులంతా ఫార్వర్డు చేసుకుని రసీదులు కూడా అందుకున్నారు.

నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు మా వాహనమోహన్ నాకు ఫోన్ చేసి, 'రేపటి కోసం తిండీ నీళ్లూ సిద్దం చేస్కున్నావా' అన్నాడు.

"మరీ అంత 'యమ'ర్జన్సీ అంటావా?" అన్నాను.

"ఏమో ఎవరు చూశారు! మంచినీళ్లు, చిరుతిళ్లు మాత్రం కొని దగ్గరపెట్టుకో. కావాలంటే నేనే కొంటా నీకోసం. ఇప్పటికే వాల్‌మార్టు, ఫియెస్టాల్లో మంచినీళ్ల బాటిళ్లు, కేన్లు మాయమయ్యాయి. గ్యాస్ స్టేషన్లలో చిన్నచిన్న క్యూలు తయారైనాయి. ఈ రాత్రికి బాగా వాన పడుతుందంటున్నారు. రెండ్రోజుల పాటు కరంటు పోయినట్లు వూహించు, నీకే అర్థమౌతుంది." అన్నాడు.

ఉన్నట్టుండి కరంటు లేకపోతే ఇక్కడ బతుకు ఎలా వుంటుందో నేను చూళ్లేదు. 'ఆఁ ఇదంతా అతి జాగ్రత్తలెమ్మ'నుకున్నా, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాత్రం నాపై ఎవ్వడూ జాలిపడడనిపించింది.

"నేనక్కడికి వచ్చేలోగా ఇంకా ఏమేమి దొరక్కుండాపోతాయో యేమో, మీతోపాటు నాకూ కొన్ని మంచినీళ్లు కొనిపెట్టు" అని చెప్పాను. మనకు తోలు కొంచెం మందమే.

నగఱ పౌఱుల పరిస్థితి ఎట్లా వుందో చూద్దామనే హుషారుతో బయటికొచ్చాను. ఇంటి బయట ఆకాశం నిశ్శబ్దంగా వుంది. గాలి కదలికే లేదు. తీరప్రాతం కనుక గాలిలో తేమ మాత్రం విపరీతంగా వుంది. తుఫాను ముందర ప్రశాంతత కాబోలు - అదెట్లా వుంటుందో నాకూ తెలీదు. వాహనానికి టాంకు నిండా ఇంధనం నింపి పెట్టుకుందాం ఎందుకైనా పనికొస్తుందనుకొని నేను బయల్దేరేటప్పటికి రాత్రి పదిన్నర గంటలు దాటింది. రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా వున్నాయి. నిర్వాహన్యంగా అనాలేమో. నిష్కార, నిష్ట్రక్క, నిర్బైక, నిర్యస్యువీమయంగా అని కూడా అనేస్తా ఇదే ఊపులోనే. :)

నేరుగా వాల్మార్టుకే వెళ్లాను. జనం హడావుడిగా ఏవో కొనేస్తున్నారు. మంచినీళ్లు ఖాళీ అయిపోయాయి. పురాతన కాలం నాటి నీళ్ల బాటిళ్ల ప్యాకులు కొన్ని కనిపించాయొక మూల. కలిగినదేదో కనులకద్దుకొని - అన్నట్టు వాటిని కొని బయటపడ్డాను.

ఇంధనకేంద్రం దగ్గర క్యూ కాదు గదా, ఒక్క వాహనమూ లేదు. గ్యాసు అయిపోయిందా అనుకున్నాను. కావలసినంతుంది. కనీసం గ్యాసు ధర కూడా కొత్తగా యేమీ పెరగలేదు.

ఈరోజు కురిసే వానతో మా ఇంటికి వరద నీళ్లొస్తాయనుకున్నాను. వాతావరణ సూచన వింటూ నిద్రపోయాను. తెల్లారితే కుండపోతగా వాన కురుస్తూవుంటుంది అని ఊహించుకున్నాను. ఒక విపరీతమేదో జరిగితే, కొంత వెరయిటీగా, ఎడ్వంచరసుగా వుంటుందని ఆశపడిన నాకు, ఉదయం లేవగానే కనపడింది మబ్బుపట్టిన ఆకాశం మాత్రమే. చివరికి ఈరోజు కచేరీకి సెలవు కూడా లేదు. నాకు నిరాశే మిగిలింది.

వినాశకాలే విపరీత బుద్ధిః అన్నారు పెద్దలు - విపరీతబుద్ధులు పుట్టిన వానికి వినాశకాలం దాపురించినట్టు అనే అర్థంలో. కానీ వినాశకాలం దాపురించినట్టు తెలియగానే నాకు కొన్ని విపరీత బుద్ధులు పుడుతుంటాయి. ఐతే ఈ వినాశ కాలం నా చుట్టూ వున్న ప్రాంతమంతటికీ. ఈ ప్రాతపు జనాభా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన (నేను ఆశించిన) వినాశనం, బెదిరించి బెదిరించి (ఊరించి ఊరించి) చివరకు రాకుండానే పోయిందే అని ఉసూరుమన్నాను. ఇలాంటి మనిషిని నేనొక్కణ్ణే అనుకోవడానికి వీల్లేదు. రుజువు ఈ వీడియో.


3 comments:

Anonymous said...

నరేంద్ర భాస్కర్ S.P.
నమస్తే!
మీర్రాసినట్టు ఇలాంటి బుద్ధి ప్రతిమనిషికీ ఉంటుంది అనుకుంటా,
మా అగ్రికల్చర్ డిగ్రీ లో పంట పొలాల పరిశీలనా పర్యటనలు సాధారణం, ఒక సారి ఇలాగే ఒక పర్యటన నిమిత్తం మా విభాగం కళాశాల బస్సు లో భాగ్య నగరం నుండి 100 కి.మీ దూరంలో, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ యొక్క పిల్ల కాల్వలో బొక్క బోర్లా పడింది, ఐతే అదృష్టవ్శాత్తూ ఎవ్వరికీ ఏమి కాలేదు, కానీ మా సహాధ్యాయి ప్రసాద్ కొద్ది సేపటి తర్వాత పగలబడి నవ్వుతూ కనిపించాడు, ఏంట్రా? ఆ నవ్వేంటి అని అందరమూ అడిగితే వాడు చెప్పిన సమాధానం " నాకు ఇది ఒక చాలాకాలపు కోరిక మామా! నా జీవితంలో ఒక పెద్దో/చిన్నో యాక్సిడెంటు జరగాలి కానీ నాకు మాత్రం ఏమీ కాకూడదు" చాలా చిత్రమైన కోరిక అనిపించినా- ఇది మనిషికి ఉన్న ఒక అతిపురాతన కోరిక-మరణాన్ని జయించాలి అనేదాన్ని సున్నితంగా గుర్తుచేస్తుందనుకుంటాను
నెనర్లు

అశ్విన్ బూదరాజు said...

అబ్బా నేను చివరిలో సడన్ గా ఆపేశారు, ఇక ఆ హురికేన్ వస్తుంది,"గాలివానలో వాన నీటిలో ..." అన్న టైటిల్ తో మరో టపా ఉంటుందని అనుకున్నాను :-). ఇలాంటివి వాటిలో చిన్నప్పుడు అమ్మ వర్షం పడేటట్టు ఉంది, డాబా పై బట్టలన్నీ తీసుకు రా అని పంపించేది, మనకసలే బద్దకం, అయినా వర్షం అని చచ్చేటట్టు తీసేవాడిని. తరవాత అది పడి చచ్హేది కాదు

రానారె said...

నరేంద్ర భాస్కర్ గారు,
మీరు చెప్పిన సంఘటన యమా నవ్వించింది. ఒక మాంచి టపా కట్టి మీ బ్లాగులో పెట్టండి గుర్తుగా వుంటుంది.

అశ్విన్,
"గాలివానలో వాన నీటిలో ..." అన్న టైటిల్‌తో మరో టపా రాయాలంటే ఏ దాసరి నారాయణరావో నా జయప్రదను పెళ్లిచేసేస్కోవాల్సిందే. :)

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.