Thursday, July 31, 2008

గడచేనటే సఖీ... ఈ రాతిరీ...

ఈ పాట గురించి గత అక్టోబరులో చిన్న చర్చ జరిగింది. అప్పట్లో ఆ వీడియో చూసి సంతోషపడి నాకొక వేగు (e-mail) పంపారు పరుచూరి శ్రీనివాస్ గారు. ఆ తరువాతి సంభాషణల సందర్భంగా కొన్నాళ్లకు ఈ పాట సాహిత్యాన్నీ, అటుపైన కొన్నాళ్లకు వోలేటి గారు స్వయంగా పాడిన రికార్డును పంపించారు.

ఆ పాటను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో వుండేలా చెయ్యడానికి నాకీరోజు తీరింది.
శ్రీనివాస్ గారికి అనేక కృతజ్ఞతలతో, మీకు సమర్పిస్తున్నాం __ :)గడచేనటే సఖీ ఈ రాతిరీ
కడు భారమైన ఎడబాటునా
ఈ మేఘవేళ ఏమో కదే చెలియ
స్వామి దవ్వైనా నిదుర రాదాయెనే
ఈ కడిమి వోలె ఎదురు చూచేనే సఖియా
ఏకాకి నా బ్రతుకు చేదాయెనే

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం,సంగీతం: వోలేటి వెంకటేశ్వర్లు

12 comments:

vikaTakavi said...

ఇంతకు మునుపు పాడిన దాని మీద టెంపో తగ్గిపోయే సరికి కొత్తగా ఉంది. ఏదేమైనా పంచుకున్నందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.

రానారె said...

వికటకవిగారు,

ఈ పాటను మొదటిసారి వినగానే నా స్పందన కూడా సరిగ్గా ఇదే.టెంపో పెంపుతో పాటు 'సఖియా' లో 'యా' మాయమయింది మల్లాది రవికుమార్ మెలోడీలో. ఓలేటిపాట వినగా వినగా నచ్చుతుంది. శ్రీనివాస్ గారితో నేనన్నమాటలు (కాపీపేస్టు):
"... చాలాసార్లు విన్నాను. కొంచెం హిందూస్తానీ గాత్రంలా గంభీరంగా వుంది. తాళానికి తగ్గట్లుగా లెక్కపెట్టినట్టు ఒకో అక్షరాన్నీ పలికుతూ 'శాస్త్రోక్తంగా పాడితే ఇలా వుండాలి' అన్నట్టుగా పాడారు. అదొక అందం. వినగా వినగా మెల్లగా మనసులోకి ఇంకిపోయే రకంగా వుంది. ఇక, మల్లాది రవికుమార్ పాటలో తాళం కాస్త వేగంగా వుంటూ లలిత గీతంలా వుంది. మల్లాదివారు పాట సాహిత్యాన్ని సరిగా ఉచ్చరించలేకపోయారు. కానీ ఈ గోంతులోని మెలొడీ అంత సులభంగా మనసును వదిలిపోదు. ఒక పామరునిగా ఇది నా అనుభూతి. చాలా అరుదైన రికార్డు కాబట్టి, మీ అనుమతి కూడా వుంది కాబట్టి, బ్లాగుకెక్కిస్తాను. వుంటారు కదా - మనలాగే విని ఆనందించే మానవులు. :)"

దానికి ఆయనన్నారు (ఇందులో పెద్ద దాచాల్సిందేమీ లేదని అనుమతి లేకుండా చెప్తున్నాను):
"1950వ దశకంలో బడే గులాం అలీఖాన్ గారు దక్షిణభారత దేశ పర్యటన/జైత్రయాత్ర చేసినప్పుడు చాలామంది కర్నాటక విద్వాంసులు ఆయనకు "గులాం" అయిపోయారు. సుబ్బులక్ష్మి, GNB, వగైరా ... ఘంటసాల గారైతే ఏకంగా ఆయన్ను పిలిచి 2-3 నెలల పాటు తన యింట్లో పెట్టుకున్నారు. (వ్యతిరేకించినవారు కూడా వున్నారనుకొండి.)
ఆ ప్రభావంలో పడినవారిలో ఓలేటి కూడా ఒకరు.

పోతే, ఓలేటి వారికున్న మారుపేరు: ఛోటా అలీఖాన్ :-)."

Vamsi M Maganti said...

రానారె - rare gem, wonderful.. Thanks to you and sreenivas gaaru...pls correct the lyric ఈ మెఘవేళ

రానారె said...

వంశీగారు, చాలా థాంకులు. మీరు చెప్పాక చూస్తే, అదొక్కటే కాదు చాలా తప్పులున్నాయి, చూసుకోలేదు. ఇప్పుడు సరిచేశాను.

వికటకవి said...

ఆహా, ఇప్పుడు మళ్ళీ వింటుంటే అంతా హిందుస్తానీ మయమే అనిపించింది.

నాగరాజా said...

నెనర్లు. హిందుస్థానీనే అయినా, గాత్రంలో కొన్ని కర్ణాటక సంగీతపు ఛాయలు కనిపిస్తున్నాయి... వెరసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. చాలా బాగుంది.

Vamsi M Maganti said...

అసలు ఈ టపాకు మరింత స్పందన ఆశించా, అది తప్పు అని చక్కగా తేలింది....కొద్దిరోజులు పోయాక అసలు వోలేటి వెంకటేశ్వర్లు ఎవరు అన్న ప్రశ్న రాకపోతే అదే పదివేలు....పోనీలే - రానారె, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉన్నంత కాలమయినా ఆ కళామతల్లి ఆత్మ క్షోభ పడకుండా ఉంటుంది

Sreenivas Paruchuri said...

వంశీ గారు: వోలేటి గారి గొంతు కాస్త ప్రౌఢంగాను, ఆయనపై హిందుస్తానీ ప్రభావం కాసింత యెక్కువ కావడం వల్ల అందరికీ నచ్చుతుందని నేననుకోను.

నేను మాత్రం ఆయనకు వీరాభిమానిని. ఆయన పాడిన శాస్త్రీయ సంగీత మన్నా, లలిత సంగీతమన్నా! "తలనిండ పూదండ" (దాశరధి, ఘంటసాల గొంతులో మీకు బాగా తెలిసిన పాట), ఆశా నా ప్రాణసఖీ, మనసౌనే ఓ రాధా!, ... అన్నమయ్య పాటలు (ముఖ్యంగా "ఆకటి వేళల అలపైన వేళల చేసెద హరినామమే"), ... భజన్లు గొప్పగా వుంటాయి. తమిళులు పడి చచ్చేవాళ్ళు ఆయనంటే. నేను మద్రాసులోచదువుకునేరోజుల్లో మా instituteలో ఒకాయన - బాగా సంగీతంగురించి తెలిసిన తమిళుడు -ఎప్పుడూ అనేవాడు "divine-voice సార్, ఆయన గొంతు తరచుగా వినే అదృష్టం మాకు లేదు అని" కానీ ఈ పెద్ద మనిషికేమో మధ్యాహ్నం మంచి భోజనం చేసి, (విజయవాడలో) ఏదో ఒక సినిమా హాల్లో మాటినీ షో చూస్తే చాలు. అదే జీవితం అన్నట్లుగా గడిపాడు.

-- శ్రీనివాస్

సుజాత said...

శ్రీనివాస్ గారు,
వోలేటిగారి స్వరం గురించి బాగా చెప్పారు. కొంచెం 'భారంగా ' ఉండే ఆయన గొంతు నాకు చాలా ఇష్టం! ఆయన పాడిన హనుమాన్ చాలీసా దాదాపు చాలారోజుల క్రితం విజయవాడ రేడియో లో పొద్దున్నే భక్తి రంజని లో మంగళవారం వినడం గొప్ప devine feeling ని ఇచ్చేది.ఇప్పుడు తల్చుకుంటుంటే నే ఆ స్వరం హిందుస్థానీ సోయగాలతో చెవుల్లో రింగుమంటోంది.

సత్యసాయి కొవ్వలి said...

రానారే- ఈమధ్య మీ బ్లాగులు సరిగా చూడక/చదవక చాలా కోల్పోయా. అందులో ఈటపా ఒకటి. ఓలేటివారి గొంతు, ఆయన సంగీతంలో వచ్చిన లలితగీతాలు- క్రేజ్. అందులో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మీరా సంగీతరూపకంలోని పాటలు మర్చిపోలేనివి. ఆకాశవాణి ఆరికార్డులు అమ్ముతారని విన్నా. కానీ ఇంకా రెడీకాలేదన్నారు ఆమధ్యడిగితే. అవీ, ఇంకా శ్రీనివాసుగారి భాండాగారంనుండి ఇలాంటివేమైనా బయటికి వస్తాయేమో చూడండి.

Wanderer said...

నాకో మిత్రుడు మీ బ్లాగ్ కి దారి చూపించాడు. కడచేనటే చెలియా అన్న మాటలు కనబడి ఆగిపోయాను వశీకరణ మంత్రం వేసినట్టు. ఈ పాటని రిపీట్ మోడ్ లో రాత్రి తెల్లవార్లూ విన్న రోజులున్నాయి. పదిమందితో పంచుకుంటున్నారు మీరు, సంతోషంగా ఉంది.

రానారె said...

చెప్పలేనంత సంతోషంగా వుందండీ. సంవత్సరం తరువాత ఈ పాట/టపా మీ లాంటి ఒక సంగీతాభిమాని కళ్లబడింది. ఓలేటి పాటను మల్లాది గొంతులో విన్నారా?

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.