గూగులమ్మ పదాలు

గురువుగారూ, నమస్తే.
మీరిచ్చిన ఎసైన్మెంట్ మూడవ భాగం పూర్తి చేశాను.
ఎప్పటిలాగే క్షీరనీరన్యాయం చేయవలసిందిగా విన్నపం.

అంతు కానని తనిమ
విన్నాణముల ప్రథిమ
అంతర్జాల గరిమ
ఓ గూగులమ్మా!

అడిగినంతనె క్వెయిరి
కొరికి ఇచ్చెడి శబరి
ర్యాండమాక్సెసు మెమొరి
ఓ గూగులమ్మా!

సాఫ్టు'వేరు'న పురుగు
క్లైంటు మెదడున పెరుగు
సృష్టి కర్తకు పరుగు
ఓ గూగులమ్మా!

బుఱ్ఱ గలుగుటె కీడు
సీరియలు చేంతాడు
రామ కీర్తన పాడు
ఓ గూగులమ్మా!

గద్ద లందరు చేరి
పండించుకొను శేరి
ప్రభుత్వంపు కచేరి
ఓ గూగులమ్మా!

తెలియ లేను సర్వము
నీ మహిమ లఖర్వము
చొరనీయకు గర్వము
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

teresa చెప్పారు…
అఖర్వము అంటే ఏమిటి?
రానారె చెప్పారు…
తెరెసా గారు, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఉపయోగిస్తాడీ పదాన్ని. "... వారి గర్వము సర్వమూ ఖర్వము గావించెద. ఆ కౌరవుల, యాదవుల కట్టగట్టి నేల మట్టుబెట్టకయున్న నా మహిమ యేల ..." ఇలా సాగుతుంది ఆయన ఆవేశం. "కుమారా కుమారా నీకిది తగదంటిని గదరా" అంటూ సూర్యకాతమ్మ వచ్చేదాకా! :)

అఖర్వానికి లంకె ఇచ్చాను చూడండి.
గిరి Giri చెప్పారు…
మరి ఉత్పలమాల, చంపకమాలలెపుడు పూయిస్తారు?
teresa చెప్పారు…
Thank you ranare. అఖర్వానికి అర్థం ఆలోచించే గొడవలోబడి మీ పదాలు బాగున్నాయని చెప్పడం మర్చిపోయాను. well done!
teresa చెప్పారు…
ranare- Are you sure that dialogue is from mayabazar? I am not.. నర్తనశాల కావచ్చేమో..
braahmii చెప్పారు…
క్షీరవిప్లవమా, బాగు బాగు,మధురం మధురం
బాలవాక్కు
చదువరి చెప్పారు…
"కొరికి ఇచ్చెడి శబరి" - ఎంత చక్కగా నప్పిందో!! ఫలితాల రంగూ రుచీ వాసనా చూసాకే కదా గూగులు వాటిని ఒక వరసలో నిలబెట్టేది!
కొత్త పాళీ చెప్పారు…
రాంనాథా, పవిత్ర మాయాబజారు డవిలాగుల్ని తప్పుగా ఉటంకించటమంత దోషం మరొకటి లేదు! "నా గర్వము సర్వము ఖర్వము చేశావు" అని యస్వీ రంగారావు కీచకుడి పాత్రలో సైరంధ్రితో అంటాడు నర్తనశాల సినిమాలో. నువ్వు ఉటంకించిన మాయాబజారు ఘట్టంలో ఘటోత్కచుని మాట "విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాట తప్పుటయేగాక తుఛ్ఛకౌరవుల పొత్తు గలుపుకుని జగదేక ప్రతాపవంతులైన మాజనకులనే తూలనాడిరిగా, యాదవులు! ఎంత మద మెంత కావరమెంత పొగరు! అంతకంత ప్రతీకార మాచరించి కౌరవ యాదవుల కట్టగట్టి నేల మట్టుబెట్టకున్న నా మహిమ యేల?" అనేసి పద్యం అందుకుంటాడు. హిడింబిగా సూర్యకాంతం "కుమారా" అని పిలవదు, "సుపుత్రా" అని పిలుస్తుంది.
నీ ఈ దోషానికి ప్రాయశ్చిత్తం ఏవిటో ఆలోచించాలి :-)
రానారె చెప్పారు…
ఆలోచించాను. ఈ రెండు పవిత్ర సినిమాలనూ వరుసగా కనీసం పదేసిసార్లు చూడాలి. సరిపోకపోతే మళ్లీ చూడాలి. :) నేనొక పని చేసుండాల్సింది - ఘటోత్కచుడు అని కాక, యస్వీరంగారావు డవిలాగిది అని చెప్పుంటే ఇలా దొరక్కపోదును.
braahmii చెప్పారు…
మీ ప్రాయశ్చిత్తం నాకు నచ్చలేదు. (బోడి నీకు నచ్చేదేంటి అనకండేం) వెనకటికో పతివ్రత మొగుడిని బెదిరించిందట- ఏమనంటే- మీ తప్పు ఉంటే మీరే పోతారు, నా తప్పు ఐతే నా పసుపుకుంకుమలే పోతాయని.అలా ప్రాయశ్చిత్తం పేరు చెప్పి, 20సారులు ఎంజాయ్ చేసేద్దామనే...చూసిన ప్రతిసారీ కొత్త విషయాలతో టపాలు రాసేట్టయితేనే మీరు ఆ సినిమాలు అలా చూడడానికి అనుమతి.

రెండు రోజులనుంచి ఇలా వాగాలని ప్రయత్నం, అనుకోని పనులు వెంటాడటంతో ఇప్పటికి ఇలా ఆ ముచ్చట తీరింది. కూనలమ్మతో గూగులమ్మ పోటి బాగుంది.
బాలవాక్కు
rākeśvara చెప్పారు…
చాలా బాగున్నాయి పద్యాలు ...
రానారె చెప్పారు…
గిరిగారు- పూయించాలనే వుంది. కానీ ఆ పూలపంటను సాగుచెయడమెలాగో ఇంతవరకూ తెలుసుకోలేదు నేను. ఈ విషయంలో పెద్దరైతు మీరే.

తెరెసాగారు- ధన్యవాదాలు. మీరే రైటు.

బ్రాహ్మీగారు- కూనలమ్మతో పోటీ పడటమంటే పంచతంత్రం కథలో లాగా హంసతో కాకి పోటీపడినట్లే. అయితేగియితే పోలిక పెట్టొచ్చుగానీ పోటీకి తావేలేదు. ప్రాయశ్చిత్తం ఎవరికీ నచ్చలేదు గనుక మానేస్తున్నాను. :)

చదువరిగారు- ఆస్వాదించారు. థాంక్యూ. పోతే, కొరకడమంటే "క్వెయిరీకి సమాధానంగా ఇవ్వవలసినది ఇదేనా కాదా" అనే మీమాంస RAM వేదికగా జరుగుతుంది అని నేను రాయడం. తర్కానికి దిగితే కాదని గట్టిగానే వాదించొచ్చు. ఔననీ వాదించవచ్చు. ఇలాంటివేం పెట్టుకోనందుకు మీకు నెనర్లు. :)

రాకేశ్వర- ధన్యవాదాలు.
చైతన్య చెప్పారు…
భలే ఉందండీ మీ పద్యం :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము