Thursday, October 04, 2007

గూగులమ్మ పదాలు

గురువుగారూ, మీరిచ్చిన ఎసైన్మెంటు రెండవ వాయిదా:

పెండ్లియగుటొక ఫేటు
బ్యాచిలరుపై వేటు
పెండ్లామె రూంమేటు
ఓ గూగులమ్మా!

ఉద్యోగమున మనుట
రెండు మేడల గొనుట
బ్రతుకులో సెటిలగుట!?
ఓ గూగులమ్మా!

చేసెడిది గోరంత
చూపెడిది కొండంత
లౌక్యమట ఈ వింత
ఓ గూగులమ్మా!

పైకోర్టు చీవాట్లు
ప్రభువులకు అలవాట్లు
పాలితుల గ్రహపాట్లు
ఓ గూగులమ్మా!

రైతు ముఖమున తేట
మాయమౌ ప్రతి యేట
ఇసుక వేయును మేట
ఓ గూగులమ్మా!

అవినీతి జేజమ్మ
నేతగుట మా ఖర్మ
తొండ ముదిరె గదమ్మ
ఓ గూగులమ్మా!

13 comments:

Sriram said...

adaragottesaav 8/10

వికటకవి said...

ఏయమ్మ నీనోట
పలికించె నీమాట
పొగిడించె నానోట
ఓ గూగులమ్మా!

భళారె రానారె!

కొత్త పాళీ said...

క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా బండి నడిపిస్తున్నావు. చాలా ఆనందంగా ఉంది.

చిన్న సూచన:
పైకోర్టు చీవాట్లు
ప్రభువులకు అలవాట్లు
పాలితుల గ్రహపాట్లు
ఓ గూగులమ్మా!
అంటే ఎఫెక్టు బాగుంటుందేమో.

teresa said...

Good going!

చదువరి said...

బావున్నాయి!

రానారె said...

శతకం రాసేస్తానని డాంబికానికి పోయాక వాసి విషయంలోనే చాలా ఒత్తిడికి గురయ్యాను. అయితే గురువుగారూ, మీ కితాబు నన్ను కుదుటపరచింది. నమస్సులు.

శ్రీరామ, తెనాలిరామ, చదువరిగార్లకు - బహు కృతజ్ఞతలు.

తెరెసాగారు - నెనర్లు. అంతా ఆ గూగులమ్మతల్లి దయ! :-)

రాకేశ్వర రావు said...

ఇందులో కూడా జ్ఞానం పాళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, తగ్గిచ్చండి, తగ్గిచ్చండి.
ఇంక గూగులమ్మ అంటే మీ వూరి గ్రామదేవతా ??

రానారె said...

:)
తగ్గిస్తా. గూగులమ్మ గ్రామదేవతేకానీ, మా ఒక్క ఊరిదే కాదు. ఆవిడ ఎవరో ఆమెపదాల మొదటి భాగంలో ఉంది.

రానారె said...

@కొత్తపాళిగారు - ఔను. మీరన్నట్లుగానే మార్చాను.

Anonymous said...

syoooparoeparu

- Nagaraja.

ప్రసాద్ said...

రానారె బాగున్నాయి. కానీ ఒక సందేహం.
"పై కోర్టు చీవాట్లు" పదంలో, పైకోర్టు చీవాట్లు పాలితులకు గ్రహపాట్లు అన్న అర్థం వస్తోంది కదా. ఇది సరియేనా?

--ప్రసాద్
http://blog.charasala.com

ఊకదంపుడు said...

ఈ పదాలు రాయటం చాలా కష్టం. చివర అంత్యప్రాస వచ్చేటట్టు లొల్లాయి పదాలుఎవడైనా రాస్తాడు..కాని .. మీలాగా ఇంతా లోతైన భావాన్ని జొప్పించటం .. చాలా చాలా కష్టం. నడక బాగా పట్టుకున్నారు..
మూడుముక్కల్లో సంఘాన్నీ జీవితాన్నీ చక్కగా ఆవిష్కరిస్తున్నారు ..సెటిలగుట పక్కన '?', "రైతు మొహమున తేట..." .. విస్తరిస్తే ఓ సీసపద్యానికి సరిపడ అర్ధాన్ని దాచుకు కూర్చున్నాయి.. ఇంకా చాలా చెప్పాలని ఉండి గాని .. ఇప్పుడు చెప్పను.. ౧౧౬ ఐన తర్వాత చెబుతాను..
పద్యాల పక్కన సంఖ్యా ఇవ్వండి - నాబోటి బద్దకస్తులకి వ్యాఖ్యానించటానికి సులువుగా ఉంటుందీ, మీరు లక్ష్యానికి ఎంత దగ్గర/దూరం లో ఉన్నారోకూడా తెలుస్తుంది.


చదువగ కలిగె పులకింత
వీనివిలువ తెలుప నేనెంత
ఆయువగు నీకు బ్రహ్మంత
ఓ నా రెడ్డయ్య
అనిపించాయి..

రానారె said...

నాగరాజగారికి నెనరులు.

ప్రసాదుగారు - మీరనే అర్థం వస్తుంది. కానీ ఇంకోలా తీసుకోవాలని మనవి.

పైకోర్టు చీవాట్లు
ప్రభువులకు అలవాట్లు
ప్రభువులకు అలవాట్లు
పాలితుల గ్రహపాట్లు

అని చదువుకోవాలన్నమాట :).

ఊకదంపుడుగారు - మీ ఆశీఃపూర్వక అభినందనలకు మీకనేక ధన్యవాదాలు. సంఖ్య ఇవ్వవచ్చునుగానీ, ఇప్పుడు రాస్తున్నవాటిలో కసుగాయలుండవచ్చు, వాటిని ఏరివేయాలనుకున్నప్పుడు అన్నింటికీ సంఖ్యను మార్చాల్సివస్తుందేమోనని... ఆరు పదాలు ఒక విడతగా రాస్తున్నాను.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.