సీరియల్‌మా అమృ'తంగ'మయ

మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తున్న ధారావాహికల్లో ఒకే ఒక్కదాన్ని మాత్రం 'సీరియల్' అని పిలిచి అవమానించకూడదు. దానిని 'అమృతం' అని గౌరవించాలి. ఇది ఒక హాస్యామృతం. కామెడీ బంగారం. దీనిలోని 'సర్వమూ' అమృ'తంగ'మయం.

తెలుగు సినిమాల్లో కాస్తోకూస్తో వైవిధ్యం గలవి నిర్మిస్తున్న ఒకే ఒక దివ్యసుందరమూర్తి - ఆహ్హా... ఆతడెవ్వరయ్యా అంటే - గుణ్ణం గంగరాజు. వారానికొక ఎపిసోడ్ - నాణ్యతలో లోపం రాకుండా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూరావడం తెలుగు టీవీ హాస్య ప్రధాన ధారావాహికల చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సంభాషణల్లో విరుపులు, చురకలు, చమత్కారాలను ప్రతీ ఎపిసోడ్‌లోనూ తీసుకురావడమంటే 'మాటలు'కాదు. ఈ శ్రమ చేయడానికి గొప్ప అభిరుచి కావాలి.

అమృతంలోని హాస్యం ఆరోగ్యకరమైనది. సున్నితమైనది. అంతర్లీనంగా చిన్న నీతికథలా కూడా ఉంటుంది. మనలోనూ మన తోటి మనుషుల ప్రవర్తనలోనూ బయటపడే చిన్న బలహీనతలు ఈ ధారావాహికకు ముడిసరుకు. పాత్రలమధ్య పరస్పర సహానుభూతి ఉంటుంది. తీవ్రమైన విద్వేషాలుండవు. ఇందులో ఎవరూ శాశ్వతంగా విలన్లు కారు.

మన హాస్యనటుల్లో మంచి ఉచ్చారణ గలవారు అతికొద్దిమంది. వారిలో ఒకరైన విలక్షణ నటుడు హనుమంతరావు ఇందులో ముఖ్య పాత్రధారి. ఏమాత్రం ఎక్కువా కాకుండా తక్కువా కాకుండా 'అంజి/ఆంజనేయులు' పాత్రధారిగా ఈయన సన్నివేశాలను పండించే తీరు ఆంధ్రప్రేక్షకులకు తెలిసిందే. ఇతర పాత్రధారులందరూ ఈయనకు దీటుగానే నటిస్తున్నారు. కల్యాణి మాలిక్ సంగీతం కూడా చెప్పుకోదగినది.

"Everybody Loves Raymond" చూసినప్పుడల్లా... తెలుగులో కనీసం ఇలాంటి సీరియళ్లను కాపీ ఐనా కొట్టరే మనవాళ్లు అనిపించేది. కాపీ ఏం ఖర్మ, సొంతంగా కాస్త మెదడును ఉపయోగించి మనవాళ్లు నిర్మిస్తున్న ఒకే ఒక నాణ్యమైన ధారావాహిక 'అమృతం'.

జస్ట్‌యెలో పేరున పనిచేస్తున్నవారందరికీ ఆయురారోగ్యైశ్వర్యానందాలు చేకూరుతూనే ఉండుగాక! తెలుగు సినిమాలలోనూ టీవీ కార్యక్రమాలలోనూ సృజనాత్మకత పెంపొందుగాక.


అమృతంలో 'శోకవనం'
అనబడు ఈ అంకాన్ని అప్‌లోడ్ చేసినవారు విడెన్స్‌డన్



అమృతంలో 'లాడెన్ మాసం'
అనబడు ఈ అంకాన్ని అప్‌లోడ్ చేసినవారు ఐడిల్‌బుర్ఱ

కామెంట్‌లు

రాధిక చెప్పారు…
నాకు అప్పాజీ సార్వాడి పాత్ర,సర్వర్ పాత్ర కూడా చాలా ఇష్టం.
అజ్ఞాత చెప్పారు…
గవ్ అన్న. నేనుభి మస్తుగ నవ్వుకుంట గీ అమృతంచూసి. ఈ సీరియల్ల అందరి ఆక్టింగ్ మంచిగ కొడుతుందె.
spandana చెప్పారు…
అవును. ఈ ఒక్క అమృతం కోసమే నేణు జెమినిని ఆపేయకుండా కొనసాగిస్తున్నా!

--ప్రసాద్
http://blog.charasala.com
వెంకట రమణ చెప్పారు…
నాకు భయంకరంగా నచ్చిన కార్యక్రమాలలో ఇది ముందుంటుంది. ప్రతివారం మిస్సవ్వకుండా చూస్తూనే ఉంటా..
అజ్ఞాత చెప్పారు…
తమిళ సర్వర్ సుందరంకి తోడుగా ఆంధ్రా ప్రాంతం నుంచి ఇంకో సర్వర్ ను తీసుకొస్తాడు అమృతం. సుందరం అమృతాన్ని "సార్వాడు..సార్వాడు" (Sir వాడు) అని అనడం చూసి మనోడు అమృతాన్ని "సార్వాడు గారు, సార్వాడు సారు, సార్వాడు గారండీ" అని పిలుస్తాడు" అమృతం పేరు సార్వాడేమో అని. భలే ఉంటుంది ఆ అంకం. విదేశాల్లో ఉన్న తెలుగోళ్ళందరూ ఖచ్చితం దీన్ని మిస్సవుతున్నారు. అన్ని ఎపిసోడ్లు ఎక్కడైనా దొరికితే...DVDల్లో రాసేసుకోవచ్చు. అంత బాగుటుంది ఒక్కొక్క ఎపిసోడు. అందరూ తమకు నచ్చిన అంకమేదో నెమరేసుకుంటే...మిగిలినవాళ్లు చదివి గుర్తు తెచ్చుకొని సంతోషిస్తారు :)
అజ్ఞాత చెప్పారు…
అన్నట్టు చెప్పడం మరిచా....సరిగ్గా జెమినీలో అమృతం సీరియల్ అయిపోయాక.. ఈ-టీవీ2లో "మాయా బజార్" అనే సీరియల్ వస్తుంది. అది ప్రస్తుత రాజకీయాలపై విసుర్లతో, సెటైర్లతో నిండి ఉంటుంది. ఇది కూడా గత నాలుగు సంవత్సరాలుగా జనాలను నవ్విస్తూనే ఉంది. చూడని వాళ్ళు ఈ ఆదివారం మిస్సవకుండా చూడండి. మిస్సయితే..శనివారం ప్రొద్దున్నె 11:30కు మళ్ళీ వేస్తాడు. ఇందులో రాజకీయ నాయకులను నేరుగా అనకుండా మారుపేర్లు పెట్టి ఏకిపారేస్తాడు..ఉదాహరణకు

పంచెకట్టు భక్తవత్సలం = రాజశేఖరరెడ్డి
అమ్మతల్లి = సోనియా గాంధీ
గొడ్డలి పార్టీ = టీఆరెస్స్
బాణం పార్టీ = భాజాపా
జనం పార్టీ = కాంగ్రెస్సు

ఇలాగన్నమాట............
రానారె చెప్పారు…
@నవీన్ - "విదేశాల్లో ఉన్న తెలుగోళ్ళందరూ ఖచ్చితం దీన్ని మిస్సవుతున్నారు." - మిగతావారి సంగతేమోగానీ మేము మాత్రం మిస్ కావడంలేదు. శాటిలైట్‌ ద్వారా నేరుగా ఇంట్లోకి వస్తుంది.

వెంకటరమణగారుపయోగించిన విశేషణం 'భయంకరంగా' నవ్వించింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము