దందచందాల భక్తిసంగీతం

సౌమ్యగారి బ్లాగులోని "ఓ బ్లాగు చూడు జనురాలా, నా ప్రేలాపన పర్యవసానంగా నామీద దండెత్తకుడి" అనే తమాషా మాటను చూసి రాస్తునాను. తెలుగు మాండలికాలలో మనం పెద్దగా గుర్తించనిది - కిరస్తానీ మాండలికం. ఇదంటే ఒకప్పుడు నాకు ఒళ్లు మండేది. హైదరాబాదులో చదువుకునేటప్పుడు ఒక రోజు అలా రోడ్లమీదపడి నడుస్తూ ఉంటే, స్వస్థత సభలు జరుగుతున్న చోటు నుండి ఒక ఆవేశపూరిత ప్రసంగం వినవచ్చింది. ఆ గొంతులోని ఆవేశానికి ఒళ్లు గగుర్పొడిచింది. పక్కనే నడుస్తున్న ఒక క్రైస్తవ క్లాసుమేటునితో అన్నాను - "ఏమయ్యా, మీవాళ్లు అందరిలాగా మాట్లాడరా, కనీసం నీలాగా అయినా" - అని. "మీవాళ్లతో పోలిస్తే ఇదే నయం పోవయ్యా" - అన్నాడు. :-) ఏదో ఉడుక్కుంటున్నాడులే - అనిపించింది వెంటనే.

మాటలు మానేసి నడుస్తూ ఉండగా... నాకు దీపావళి, వినాయక చతుర్థి మొదలైనప్పటి నుంచీ మనవాళ్లు చేసే (లౌడుస్పీకర్ల) మోత గుర్తొచ్చింది. పిల్లలు, ముసలివాళ్లు, అనారోగ్యంలో ఉన్నవారు - వీళ్లంతా ఆ పండగరోజుల్లో పరమపదించి పుణ్యలోకాలకు చేరుకునేందుకు దోహదపడే టపాసులు, కొత్తగా భక్తి పాటల పేరిట పుట్టగొడుగుల్లాగ పుట్టుకొస్తున్న నరకాసుర, మహిషాసుర సీడీలూ కేసెట్లు ... వీటితో పోల్చితే స్వస్థతసభలే నయం కదా అనిపించింది. ముస్లిం సోదరులు ఇంకా సైలెంటు. రోజూ స్పీకర్లు వాడినా, అది కొంతసేపే. చాలామంది పాడే నమాజు వినసొంపుగా కూడా ఉంటుంది.

మన దేవాలయాల్లోనూ, ప్రతి సందులోనూ పోటీలుపడి వెలసిన రాజకీయ దందాల (బలవంతపు చందాల) వినాయకుని పందిళ్లలోనూ, ముందు కొంతసేపు అక్కినేని నాగార్జజున నటించిన అన్నమయ్య అనెడి చిత్ర రాజము నుండి కొన్ని భక్తిపాటలు. వీటిలో "ఏలే ఏలే ...మరదలా, కొంటె లీల లింక కోలో బావా ..." మరియు "ష్..!హా!! ఆ పనియేదో ఇపుడే తెలుపనీ .. వలపనీ... ఓం హహ్హ!" అనే భక్తిపాటలు ముఖ్యమైనవి. తరువాత, "మన పేటకు అయ్యప్ప మేస్తిరీ...ధిన్నాక్కు ధిన్నాక్కు...". సరే, అయ్యప్ప, గణపతి అన్నదమ్ములేకదా, అలాగే అనుకుందాంలే అని సరిపెట్టుకుంటే, మెల్లగా "ఆటకావాలా పాటకావాలా, అచ్చమైన అయప్పసామి మాల కావాలా" అంటూ ఒక మాంఛి రీమిక్సు భక్తిగీతం. పరిస్థితి కాస్త కాకెక్కినాఁక, "ఎందుకీ ముసుగులో గుద్దులాట" అనిపించి, "వెయ్‌రా అన్నయ్య పాటలు" అంటాడొక చందా యువనాయకుడు. మధ్యమధ్యలో ఆటవిడుపుగా ఒక అరగంటసేపు "తననాన నానా తననాన నానా ... శ్రీవెంకటేశం శిరసానమామీ ..." అని డబ్బాలో గులకరాళ్లేసి గువ్వలతోలే భక్తిసంగీతం.

ఘంటసాల పాడిన భక్తిగీతాలేమౌతాయో, ఏసుదాసు పాడినవి ఏమౌతాయో, బాలమురళి పాడిన రామదాసు కీర్తనలెక్కడ దాక్కుంటాయో, సుబ్బులక్ష్మిగారివి, ..... వీటన్నింటికీ నేటి మన దందా'ధర్మ'కర్తలు అజ్ఞాతవాసం విధిస్తారేమో! పాపం విధి వంచితలై, విభవము వీడి ఎక్కడికో వెళ్లిపోతాయి.

ఇదంతా ఆలోచించిన తరువాత మెల్లమెల్లగా కిరస్తానీ మాండలికం మీద జుగుప్సతొలగి, గౌరవం ఏర్పడసాగింది. కాస్త గ్రాంధికం, కాస్త వ్యావహారికం, కాస్త అప్రాచ్యం కలిపి ఎంతైనా ఒక ప్రత్యేకమైన తెలుగు శైలిని సృష్టించారు కదా అనిపించింది. ఇజ్రాయేలు, బెత్లెహాము, పౌలుభక్తుడు మొదలైన పదాలతో నేను ఒక భక్తిపాట పాట కూడా రాసి, ఎందుకైనా మంచిదని వెంటనే చించేశాను.

కామెంట్‌లు

Dr.Pen చెప్పారు…
రానారె...నాలో రేగే ఆలోచనలన్నీ నీ బ్లాగులో చూసుకోవచ్చు సుమా!అన్నట్టు కిరస్తానీ(క్రిస్టియన్ వికృతి)మాండలికం గురించి నీవన్న మాటలు నిజమే అయినా ఈ ప్రశ్న ఎన్నో రోజులుగా నాలో ఉంది. నాకు తోచినంతలో అప్పటి కాలంలో తెలుగులో అనువాదం చేయాలంటే ఒక్క బ్రాహ్మణ పండితులకే సాధ్యం (అవును మరి 1890 వరకూ చదువుకొన్న పట్టభద్రులలో 90% వారే!) అనకొనే వాన్ని. నీ టపా చదివాక "తల్లీ గూగులమ్మా"అని తలంచగానే నా ఊహ నిజమేనని ఈ పుట ప్రసాదించింది.

http://books.google.com/books?id=Zzqhuyb2ePgC&pg=PA37&dq=first+telugu+bible+translation&as_brr=1

అందులో మతం మార్చుకొన్న 'ఆనందరయ్యరు' అన్న పండితుడు మరో నలుగురు బ్రాహ్మణ పెద్దలతో కలిసి అనువదించారని చెప్పబడింది.ఆ కాలం నాటి భాషే నేటికీ నిలిచి ఉంది. ఇక్కడ అమెరికాలో బైబిలు ప్రచురణలో ఎన్నో వినూత్న మార్పులు (ఉదా. టీన్ బైబిల్) వచ్చినా మన క్రైస్తవులు మాత్రం ఆ కాలం నాటి తెలుగునే ప్రమాణపూర్వకంగా తీసుకోవడం వల్ల, ఆ భాషే అందరి నోళ్లలో నాని ఇలా మరో మాండలికం తయారయ్యింది. కాకపోతే 'కాకిపిల్ల కాకికి ముద్దు' అన్నట్టు ఎవరి మాండలికాలు వారికి ముద్దు!

ఇక సందర్భం వచ్చింది కాబట్టి మరో మూడు ముక్కలు..."ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను." యోహాను సువార్త 1:1. కొత్త నిబంధనలోని ఈ ప్రారంభ వాక్యం నాకెంతో నచ్చింది. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు: దేవుడు అన్న మాట(లేదా) ఆలోచన లేకుంటే దేవుడే లేడని. అలా "వాక్యము దేవుడై ఉండెను" అన్న వాక్య ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీని పై కొ.పా, నా.ప, దార్ల, జాన్ మొదలైన బ్లాగు పెద్దలు, మనలాంటి పిన్నలూ వ్యాఖ్యానించ గలరని మనవి.
రవి వైజాసత్య చెప్పారు…
10/10..ఒకటే కితకితలు..విహారి తొంగిచూస్తున్నాడు..
అంతా విహారిమయం..జగమంతా విహారిమయం
Sriram చెప్పారు…
మా తాతగారి ఊళ్ళో రామాలయం నుంచి భలే వాడివీ శ్రీరామా వంటి భక్తి పాటల మధ్యలో "శివ శివయననేలరా...కౌగిలిలోనే కైలాసముండ" పాట కూడా వినిపించేది...`:)
rākeśvara చెప్పారు…
"ఆటకావాలా పాటకావాలా, అచ్చమైన అయప్పసామి మాల కావాలా"
యూగాట్టాబీకిడ్డింగుమీ సుమీ :)

అన్నట్టు సీరియస్లీ ఎక్కినాఁక అన్నచోట ఁ ని సరిగా వాడారా ? ఎందుకంటే, నేనొకసారి ఎదో వాడాలిగా అని ఁ వాడితే, కొలిచాలగారి దగ్గర నుండి ఓ తాంత్రక మెయిల్ వచ్చింది :)
కానీ మీకు ఇది సరైన ప్రయోగమని యకీనైతే, చెప్పండి నేను కూడా ఈ ప్రయోగం మొదలు పెడతా.
నాకెందుకో ఁ వాడి నాకేదో తెలుగు బాగొచ్చని తెగ ముఱిసిపోతాను (ఱ కూడా అందులో భాగమే).
చిన్నప్పుడు తెలుగులో మార్కులు సరిగారానందుకని మా తెరపిష్టు తేల్చిచెప్పాడు. :)
రాధిక చెప్పారు…
మా ఊరిలో విజయదశమికి పెట్టే పాటల వల్ల తాతయ్య ఎంత అవస్త పడేవారో నేను కళ్ళారా చూసాను.అలాగే సరిగ్గా అది పిల్లల అర్ధసంవత్సర పరీక్షల సమయం.ఆ సమయం లో నేను,తమ్ముడు చెవులలో దూది పెట్టుకుని చదువుకున్న రోజులు కూడా అస్సలు మర్చిపోలేను.ఇంకా దారుణమేమిటంటే పక్క పక్క వీధుల్లో పోటీగా నిలబెట్టిన దేవీ విగ్రహల దగ్గర వున్నవారు ఈ స్పీకర్ పాటల విషయం లో కూడా పోటీ పడి సౌండ్ ని పెంచుతూ పోయేవారు.ఏ పాటా వినడానికి వుండేది కాదు.అదో నరకం.ఇక కూటముల సంగతికొస్తే వినాయక చవితికి,విజయదశమికి సాయంత్రం ఆపేస్తారు పాటలు.కానీ ఈ కూటములు అర్ధరాత్రి చేస్తారు.అమ్మో...అప్పుడు పడ్ద బాధ తలచుకోవాలని కూడా అనిపించదు.
గుళ్ళో తెల్లవారు ఝామునే పాటలు వేసేవారు.పొలాలకు వెళ్ళేవారికి,పాలు పితికే వారికి అదొక మేలుకొలుపు.పరీక్షలప్పుడు కూడా పాటలప్పుడు లేపండి అనేవాల్లం.చిన్నప్పుడు బానేవుండేది ఆ రాగయుక్తమయిన పాటలు వినడానికి.తరువాత తరువాత సినిమాపాటల రీమిక్సు సాంగులు వెయ్యడం ప్రారంభించారు.ఇంకేమి చదువుతాము.నిజం చెప్పాలంటే ఆ రీమిక్సు సాంగులు వినే కవిత్వం రాయడం ప్రారంభించాను.ఒక సినిమా పాట తీసుకుని ఏదో ఒక దేవుడి మీద రాసేదానిని.అలా అలా ఇలా అయిపోయా.
S చెప్పారు…
ఒక్కో మాండలీకం అవి ఉపయోగించే వాళ్ళకి నచ్చుతుంది మరి! కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లూ! [:)] ఇప్పుడు మీకు రాయలసీమ మాండలీకం నచ్చుతుంది...ఇక్కడో నేస్తానికి శ్రీకాకుళం మాండలీకం... కిరస్తాని వాడే వాళ్ళకి అదీ... హైబ్రీడు గా రాయలసీమ,తెలంగాణం, కోస్తా, కుసింత తమిళ ప్రభావం - కలిసి మాట్లాడే నా బోటి వాళ్ళకి పైన చెప్పిన మాండలీకాలన్ని అమ్యూజింగానూ, నాది మాత్రం - "మీవాళ్ళతో పోలిస్తే ఇదే నయం" అన్నట్లు గానూ అనిపిస్తాయి :))
S చెప్పారు…
@ismail garu
-ఈ విషయం చాలా ఆసక్తి కరంగా ఉంది..ఆనందయ్యరు విషయం...ధన్యవాదములు!
PS: రానారే గారూ...ఇది మీ బ్లాగనుకోలేదు! నేనెప్పుడూ యార్నార్ బ్లాగు చూస్తూ వస్తున్నా ఈ మధ్య!
రానారె చెప్పారు…
డాక్టరుగారు, కిరస్తానీమాండలికం అన్నది నేను కల్పించిన పదం మాత్రమే. అది అలా ఉండటానికి కారణం ఏమిటో మీరు చెబితే తెలిసింది. కృతజ్ఞతలు. "వాక్యము దేవుడై ఉండెను" గురించి మీరొక నాలుగు సొంతవాక్యాలు రాయాలని మా కోరిక.

రవీ, నిజం చెప్పాలంటే ఈ టపాపై విహారి ప్రభావం ఉంది. భలే పట్టేశావు.

శ్రీరాం, మంచి పాటను గుర్తు చేసినట్లున్నాను. :)

రాకేశ్వరా, యకీనుందా అని నిలేస్తే చెప్పలేనుగానీ, ఎవ్వరూ ఇంతవరకూ తప్పుబట్టలేదు. ఎవరైనా చెబితే తెలుసుకుందామని నాకూ అనిపిస్తోంది. మహాభారతం ప్రాజెక్టులో పద్యాల యూనీకోడీకరణంలో చూసి నాకు కలిగిన అవగాహనకొద్దీ అరసున్నల వాడకం చేస్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు సున్నను ముక్కుతో మింగేసే పదాల్లో అక్కడ అరసున్నతో పూరిస్తాను.

రాధికగారూ, పరీక్షలప్పుడు వీధుల్లో పండగలపేరిట స్పీకర్లు వాడటం వలన దెబ్బతిన్నవాళ్లలో నేనూ ఒకడిని.

సౌమ్యగారు, 'రాయలసీమ మాడలికం' నాకిష్టం మాత్రమే కాదండి, నాకు తెలిసినది కూడా అది మాత్రమే. రాయలసీమలోనే ఎన్నెన్నో మాండలికాలు. ఈ విషయం ఈ నెల పొద్దులో నేను రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించాను చూశారా?
కొత్త పాళీ చెప్పారు…
అరసున్నా వాడకానికి నాకు తెలిసిన ఒక నియమం .. మాట మధ్యలో సున్నా వచ్చే చోట వాడుకలో సున్నాని మింగేస్తే రచనలో దాన్ని అరసున్నతో సూచిస్తారు. ముఖ్యంగా పద్యాలు రాసేప్పుడు ఇది పనికొస్తుంది. అక్కడ గురువు కావాలంటే సున్నా వాడాచ్చు, లఘువు కావాలంటే అరసున్న .. ఇలాగ.
ఎక్కినాక లో సరిగ్గా వాడినట్టే అనిపిస్తోంది.
విజయవాడలో మాకు మాండలికాల సంగతేమో గాని అన్ని మతాల తాకిడీ ఎక్కువగానే ఉండేది. దసరాల టైములో .. మా ఇంటి దగ్గిర కొందమీద ఇంకో చిన్న దుర్గమ్మ గుడి ఉంది .. రాత్రి ఎనిమిది దగ్గర్నించి పదిదాకా భజన సంఘం చేరి .. ఆనాటి ప్రఖ్యాత సినిమాపాటాల ట్యూనులో కట్టిన భక్తిగీతాలు వినిపించేవారు. తద్వారా, ఓలమ్మీ తిక్కరేగిందా, ఆరేసుకోబోయి .. ఇవన్నీ తులసిమాలలేసుకుని యోగినులైపోయాయి :-)
కిరస్తానీ భాష గురించి .. ముఖ్యంగా డాక్టరుగారు ఉదహరించిన వాక్యం గురించి వేరే బ్లాగాలి.
రాంనాథా, టపా చాలా బాగుంది.
అజ్ఞాత చెప్పారు…
నమాజు వినసొంపు. స్వస్థత సభలు నయం. ఆహా! మీ సెక్యులర్ టపాకు జోహార్లు.
నాకైతే ఈ మాటలు రాజకీయనాయకులు చెప్పినట్టుంది. hypocrisy లేకుండా మీరు
ఈ మాట చెప్పిఉంటే గాంధీతో సమానం.
రానారె చెప్పారు…
అలాగైతే నేను గాంధీతో సమానమే. ఈమారు మీరు మీ పేరుతోనే వ్యాఖ్యానించవచ్చు. ధన్యవాదాలు.
రానారె చెప్పారు…
థాంక్యూ గురువుగారు. అరసున్నా విషయంలో నేనుకూడా మీరు చెప్పిన నియమమే పాటిస్తున్నాను - ఇన్స్టింక్టివ్‌గా. వాడుకలో సున్నాను మింగేసేచోట్ల అరసున్నా. పద్యాల్లో ఇలా ఉపయోగించుకోవచ్చన్నది మాత్రం నాకు కొత్త సంగతి.
కొత్త పాళీ చెప్పారు…
"అలాగైతే నేను గాంధీతో సమానమే. ఈమారు మీరు మీ పేరుతోనే వ్యాఖ్యానించవచ్చు."

బాగా చెప్పావ్. కాస్త విమర్శనాత్మకమైన వ్యాఖ్య రాయాలనంగానే "యనానిమసు" ముసుగువెంక దాక్కోవడమెందుకో. అంత జంకు ఐతే అసలు ఆ వ్యాఖ్య రాయకుండానే ఉండచ్చుగా!

అయినా అంత వ్యంగ్య మెందుకు. హిందువులైతే ఇతరమతానికి చెందిన దేన్నీ మెచ్చుకోకూడదా? ఇదెక్కడి కుతర్కం?? బంజారా హిల్స్ రోడ్ నం 12 అమృతా బిల్డింగ్స్ లో ఉంటున్నప్పుడు మా బిల్డింగ్ ఉన్న కొండ కింద ఒక మసీదుండేది. ఆ మసీదు ముయెజ్జిన్ పిలుపు నాకు చాలా శ్రావ్యంగా ఉండేది. బర్కత్పురాకి మారినాక దాన్ని మిస్సయ్యేవాణ్ణి. ఏనారబరులో మా యోగా గురువు గారు అప్పుడప్పుడూ ముస్లిము భక్తి గీతాలను నేపథ్యసంగీతంగా ఉపయోగించేవారు (http://kottapali.blogspot.com/2007/03/blog-post_11.html) చాలా శ్రావ్యంగా ఉంటాయి కూడా. Ocean of Remembrance అనే ఆల్బం ఉంటుంది చూడండి.
రానారె చెప్పారు…
నాకు తెలిసి నమాజుకు సంబంధించి ప్రతి ఒక్కరికీ ఏవో జ్ఞాపకాలు తప్పకుండా ఉండే ఉంటాయి. చిన్నప్పుడు బళ్లోనుండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చినప్పుడు, నమాజు వినబడిందంటే తొందరగా తినేసి బయటపడాలని ఆదుర్దా. సాయంత్రం నమాజు చాలా బాగున్నట్టనిపించేది. ఆ సమయానికే బడి వదిలేస్తారు కాబట్టి. ఈనాటికీ మసీదులో నమాజు చదివడాన్నిబట్టి పొలాల్లో పనిచేసేవారికి సమయమెంతైందో సరిగ్గా తెలుస్తుంది. రోజూ చదివే మనిషి కాకుండా ఇంకో సాయిబు ఎవరైనా చదివితే నచ్చేదికాదు. ఈరోజు ఆ మనిషికి ఏమైందబ్బా అనిపించేది. ఇట్లా ఎన్నో కలిసినపుడు, నమాజు వినసొంపే మరి. వారాల తరబడీ వీధికొక్క మైకుసెట్టు పెట్టి చెవుల తుప్పు ఊడగొట్టడంకన్నా ఎక్కడో ఒకచోట జరిగే స్వస్థత సభలను భరించడం నయమే. ఇందులో రాజకీయాన్నీ, సెక్యులరిజాన్నీ, హిప్పోక్రసీనీ చూసే కళ్లకు "అలాగైతే నేను గాంధీతో సమానమే" అని చెప్పవలసి వచ్చింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము