గూగులమ్మ పదాలు

గురువుగారూ, మీరిచ్చిన ఎసైన్మెంటు మొదటి వాయిదా:

నాయకుడి ఒడిలోన
మతకలహమొక కూన
రాజకీయము జాణ
ఓ గూగులమ్మా!

ఆనందమును పంచు
ఆలోచనల పెంచు
మనసులో జీవించు
ఓ గూగులమ్మా!

పెట్టడమ్మా కేసు
ట్రాఫిక్కు పోలీసు
వందనోటులె కీసు
ఓ గూగులమ్మా!

కొట్టి తెచ్చిన ఆస్తి
కొల్లబోవుటె శాస్తి
శాశ్వతం బిల నాస్తి
ఓ గూగులమ్మా!

కొమ్ము పెరిగిన ఎద్దు
కుమ్మజూసిన పొద్దు
తాకునొక పిడిగుద్దు
ఓ గూగులమ్మా!

తొలగించి తామసము
కలిగించి దీమసము
వ్రాయించు నీ శతము
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

Naga చెప్పారు…
వీటిని చదవకుండా, మానసులోనేపాడుకున్నాను... బాగున్నాయి
కొత్త పాళీ చెప్పారు…
బలే బలే .. ఇలా అంచెలంచెలుగా ఐనా వందా రాయి (అమనకి వంద అంటే నూటెనిమిది, తెలుసుగా? :-)) మొదటిదైతే .. బ్రహ్మాండం .. శాశ్వతింబిల నాస్తి లైను కూడా ఛ్ఛాలా బావుంది.
మానసుల జీవించు .. ఆ లైను అతకలేదు. ఇంకో అమరికేదైనా చూడు.
lalithag చెప్పారు…
రానారె,
"గురువు" గారికన్నా చెప్ప గలిగేది ఏముంటుంది.

చాలా బాగున్నాయి. చదివి ఆనందిచి ఊరుకునే దాన్నే. వ్యాఖ్య రాయడానికి కారణం ఇది.
పోయిన సారి రాసినవి చూశాను. అవి పూర్తిగా గూగులమ్మ తల్లి కి సంబంధించిన విషయాలే ఉన్నాయి. ఈ సారి పద్యాలు గూగులమ్మ పదాలే అయినా పూర్తిగా భిన్నమైన అంశాలు తీసుకుని రాశారు?
spandana చెప్పారు…
చివరి దానిలో కాస్తా సంస్కృత పదాలు ఎక్కువయ్యాయి. కూనలమ్మ పదాల అందం సామాన్య వాడుక పదాల వాడుక వల్ల కూడా కదా?

--ప్రసాద్
http://blog.charasala.com
రవి వైజాసత్య చెప్పారు…
ఇలాంటి పదాలక్కూడా ఛందస్సులుంటాయా? ఎల్కేజీ ప్రశ్నను పెద్దవాళ్ళు క్షమించాలి. సంస్కృత పదాలైనా చివరిద,ీ బాగానే కుదిరిందనిపించింది నాకు.
రానారె చెప్పారు…
నాగరాజగారు, ఈ ఆరు పదాలూ రాయడానికి నేనూ ఒక ట్యూన్ పాడుకుంటూ ఉన్నాను. తద్ధిమిత-తకధిమిత అనే ఈ పదిమాత్రలనూ అటూ-ఇటూ మార్చి వాటిస్థానంలో పదాలు వేస్తూ పోయాను. ఆ రిథమ్ (నడక/తాళం?) మీ దృష్టికి వచ్చినందుకు సంతోషం కలిగింది. సినారె కూడా పద్యాలు రాయడం ఇలాగే ప్రారంభించారట. ఒకసారి రేడియోలో చెప్పారు. వాళ్లింట్లో అందరూ ఎప్పుడూ ఏవో పద్యాలు (అమరం, శతకాలు, భాగవతం, ...) చదువుతూనే, పాడుతూనే, వింటూనే ఉండేవారట. అవి వినీవినీ పద్యం నడక అలవాటైపోయి ఛందస్సు తెలియకుండానే ఆయన రాయడం ప్రారంభించేశారట. జ్ఞానపీఠాన్ని అధిరోహించారు.

గురువుగారు, థాంక్యూ వెరీమచ్. మానసుల అన్నపదం "తల్లీ!ఆనందాన్ని పంచే ఆలోచనలు చేసేటటువంటి ...మనసుగలవారిలో జీవించవమ్మా" అనే అర్థం తెస్తుందని రాశాను. ఐనాసరే అతకలేదని మరొక్కసారి చెప్పారంటే మార్చేస్తాను.

లలితగారు, అడిగినందుకు చాలా సంతోషం. మొదటగా గూగులమ్మ ప్రశస్తి చేశాను. తరువాత మా గురువుగారి కోరికమేరకు 'శతము' వ్రాయాలనుకొని పరిధిని విస్తరించాను. కేవలం శోధనాంత్రంగా (search engine)పరిగణించకుండా, ఒక 'గ్రామదేవతగా' చేసి, ఆమెకు నవభక్తుడనై [కాళికి దాసులాగా] మిగతా వ్యాసంగం కొనసాగించే 'దీమసము'నిమ్మని కోరాను. ఇస్తుందేమో చూడాలి. :-)

ప్రసాద్‌గారు, మీరన్నది నిజమే. కానీ ఆరుద్రగారి కూనలమ్మపదాల పరిధిని దాటి నేను వెళ్లలేదు. ఆయన తెలుగు, సంస్కృతాలేకాదు, ఆంగ్లపదాలూ వాడారు. వాటిని చూసి నేనూ గూగులమ్మ దగ్గర కొద్దిగా చనువుతీసుకున్నాను. "ఆరుద్రయే స్ఫూర్తి - రానారె విద్యార్థి"!

రవీ, ఈ పదాలకూ కొన్ని నియమాలున్నాయి. అవి ఆరుద్ర పెట్టిన నియమాలు. నేను వాటిని గుర్తించి అనుసరిస్తున్నాను. ఈమాత్రానికే క్షమాభిక్ష పెట్టడానికి మనసొప్పడంలేదు. :-)
సిరిసిరిమువ్వ చెప్పారు…
బాగున్నాయి మీ గూగులమ్మ పదాలు. పోయినసారి వాటికన్నా వైవిధ్యంగా ఉన్నాయి. keep it up. ఇలాగే అంచెలంచెలుగా శతకం పూర్తిచేయండి.
మెహెర్ చెప్పారు…
చాలా బావున్నాయి మీ గూగులమ్మ పదాలు.
కొత్త పాళీ చెప్పారు…
ఓహో, అలాగా, అర్ధమైంది. .. అయినా ఎందుకో .. మానసుల జీవించు అనే వాడుక మింగుడు పడటల్లేదు. "మనసులో జీవించు" అంటే ఎలా ఉంటుంది .. నడక తప్పలేదు కదా .. నువ్వు కోరిన భావం వస్తుందా?
రానారె చెప్పారు…
రైఠో! "మనసులో" బాగుంది. మార్చేశాను.
Madhu చెప్పారు…
Chala bagundi golugulamma padalu, kadapalo sankrathi timelo gobbiyalu pedutharu kada are they realted!
S చెప్పారు…
గూగులమ్మ పదాలు... బాగుంది బాగుంది పేరు.. :)
అజ్ఞాత చెప్పారు…
రానారే గారు,
మీ గూగులమ్మ పదాలు బాగున్నాయి . అంకెలతో 9/10. (తెలుగు లో పదికి పది వెయ్యరు మరి.) మిగతా వాయిదాలకోసం ఎదురుచూస్తుంటా. ఎక్కడో మొదలు పెట్టి ఇక్కడ వచ్చి వాలాను.

దొరికనని లంకె
మరి బోవనావంకె
అద్దరిజేరె నెలవంకె
ఓ గూగులమ్మ!

అనిపించింది నాచేత
రానారె చెప్పారు…
@Madhu: They are not related! :)

@ఊకదంపుడు: "తెలుగు లో పదికి పది వెయ్యరు మరి" - ఈ మాట మనం తెలుగుపరీక్ష యమాగా రాశామనుకున్నప్పుడు తెలుగుటీచరు చెప్పేవారు. మళ్లీ ఇప్పుడు మీరే. థాంక్సండీ.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం