బ్లాగు నవ్వ

ఆ తరువాత నేను Little Prince వైపు కన్నెత్తికూడా చూడలేదు. తల పక్కకు తిప్పడానికి కూడా వీల్లేనంతగా ఆఫీసులో పని పెరిగిపోయింది.

నిజానికి ఇప్పుడు కూడా నేను పనిలో ఉండాలి. మరీ ఆటవిడుపు లేకపోతే పనిమీద కూడా మనసు నిలవదనే సాకుతో నాకు నేనే నచ్చజెప్పుకుని ఈ టపా రాస్తున్నాను. సాయంత్రానికి మెదడు అలసిపోతోంది. రోజులు క్షణాల్లాగడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినే నేనిన్నాళ్లూ కోరుకున్నది. బాగుంది కానీ, కూడలిలో తెగతిరిగే నాకు ఇప్పుడు కాళ్లు కట్టేసినట్లుంది. ఇంకొక ముఖ్యమైన రాతపని కూడా ఉంది. అదీ ముందుకు కదలడం లేదు.

సాయంత్రం కొంతసేపు "ప్రథమావిభక్తిరహిత సుగ్రీవాగ్రజసుతక్రీడ" ఆడుకోవడమూ అలసిపోయి మాంచి నిద్రలోకి వెళ్లిపోవడమూ. వంటచేసే ఓపిక అసలుండదుకనుక "కలిగినదేదో కనులకద్దుకొని కాలము గడిపే" ధన్యజీవనము చేస్తున్నాను. తలమునకలుగా పని, అలసిపోయేదాక ఆట, ఆదమరపుగా నిద్ర - ఇంతకన్నా ధన్యజీవనం ఇంకేమున్నది!

ఇంతకూ ఈ టపా పేరులోని నవ్వ అంటే ఏమిటో తెలుసా!?

కామెంట్‌లు

త్రివిక్రమ్ Trivikram చెప్పారు…
నీ ప్రశ్నకు నా సమాధానమేమిటో కూడా నీకు తెలుసోచ్. :)
మాలాంటి ముసలాళ్ళకి ఇలాంటి క్విజ్ లు పెట్టే దురదేంటి నాయనా.
రానారె చెప్పారు…
అందుకే మీరిద్దరూ గడి నిర్వాహకుడు-కూర్పరి పదవుల్లో వెలుగుతున్నారు :)
అజ్ఞాత చెప్పారు…
నాకీ నవ్వ కానీ ప్రథమావిభక్తిరహిత సుగ్రీవాగ్రజసుతక్రీడ కానీ ఏదీ తెలియలేదు.
చెప్పి నాకీ హింస తప్పించి పుణ్యం కట్టుకోండి.
అజ్ఞాత చెప్పారు…
అసలు సీన్ లోకి అంగదుడెందుకొచ్చాడు చెప్మా?
త్రివిక్రమ్ Trivikram చెప్పారు…
వెలుగులన్నీ కూర్పరివే! నేను నిమిత్తమాత్రుణ్ణి. "సుగ్రీవాగ్రజసుతక్రీడ"లాడే నిన్నూ తీసుకొచ్చి గడి కూర్పరి చెయ్యాలనుంది. ఇప్పుడు కాదులే! మీ ఆఫీసులో పని తగ్గాక.
రవి వైజాసత్య చెప్పారు…
నాకు మాండలికమింకా గుర్తుంటే నవ్వ అంటే దురదే కదా!!!
రానారె చెప్పారు…
ఔను. నవ్వ అంటే దురదే. కడపజిల్లాలోనే కొందరికి అర్థం కాదు ఈ పదం. నవ్వను జిల అనికూడా అంటారని నాకు ముక్కావారిపల్లె గురుకులంలో చేరిన తరువాతే తెలిసింది. నవ్వ, జిల, దురద - ఇంకా ఏమైనా ఉన్నాయా ?

ఇంతకీ, సాయంత్రాల్లో నేను ఆడే ఆటపేరు ఏమిటో గడులు నింపేవారు చెప్పనేలేదు!
త్రివిక్రమ్ Trivikram చెప్పారు…
తీట, గుల, దూల, కండూతి (కండువు, కండూయ),...ఇంకేమైనా?
'అంగద'కేళితో అలిసి సొలసి వాలి పోడానికి నీవు బాలుడివేమో కాని, 'పద'కేళికి అలిసిపోవడానికి నేను బాలుడ్ని కాను నాయనా, సుగ్రీవదూతాస్యదేవపతీ.
రానారె చెప్పారు…
ఆహా! ఆచార్యదేవులు మహబాగాసెలవిచ్చారు!! :-)))

కండూతి ఈ జాబితాలోనిదేనంటావా త్రివిక్రమ్!?
త్రివిక్రమ్ Trivikram చెప్పారు…
తేల్చి చెప్పడానికి బ్రౌణ్యముండనే ఉంది కదా?
రవి వైజాసత్య చెప్పారు…
మావూళ్లో జిల అంటారు. ఇక తెలంగాణలో గోకుడు అని అంటరు. ఇంతకీ ఈ అంగదకేళీ అంటే ఏంటీ?
రానారె చెప్పారు…
మరీ అలా నేరుగా అడిగేస్తే ఎలా చెప్తామండీ ;-?
"అంగద(జు కాదు)కేళి" అంటే తమాషాగా కోతికొమ్మచ్చి అనుకోండి. అలసిపోయేదాక రోజూ సాయంత్రంపూట ఆడేది ప్రస్తుతానికి ద-కేళీకాదు, జు-కేళీ కాదు. మరేమిటో ఆచార్యులు పసిగట్టేశారు. ఆయనమాటల్లోనే మీరూ వెదకండి. కార్యసిద్ధిరస్తు! :-)

భవదీయ
సుగ్రీవదూతాస్యదేవపతి.
కొత్త పాళీ చెప్పారు…
ఫుట్ బాల్ (సాకర్) అనుకుంటున్నా. అన్వయం మాత్రం నన్నడక్కండి.
అజ్ఞాత చెప్పారు…
కడప...చిత్తూరు మాండలికాల్లో తేడా ఉందా? నాకైతే అంతగా తేడా తెలియడం లేదు..."నవ్వ" అనేది ఒఠ్ఠి రాయలసీమ పదం అంటే నమ్మలేకున్నాను. నిజంగానే ఈ పదం సీమేతరులకు తెలియదా?
రానారె చెప్పారు…
కొత్తపాళిగారు ఒక అంగ ముందుకేశారు. ఫుట్‌బాల్ అంటే కాదనలేము. కానీ ఒక్క అంగ వెనక్కివేస్తే సుగ్రీవుని అగ్రజుడు 'వాలి' కనిపిస్తాడు. అతని 'బాలు'డు అంగదునితో మనకు ముఖ్యమైన పనులేమీలేవు. ఇంకా అర్థంకాలేదా!? అయితే చెబుతా - వాలిబాలుడు అనే పదంనుంచి (డు,ము,వు,లు - ప్రథమావిభక్తి నుండి) డు మినహాయిస్తే మిగిలే క్రీడన్నమాట.

నవీన్ - మదనపల్లె, అమెరికా - ఈ రెండూ కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలు నువ్వు తిరగాల్సి ఉంది ;-) చిత్తూరు, కడప జిల్లాల మాండలికాల్లో చాలా తేడా ఉంది. ఆమాటకొస్తే కడపలోనే ఒకటికంటే ఎక్కువ మాండలికాలు కనబడతాయి - కడప కనుమ అవతల ఇవతల.
రవి వైజాసత్య చెప్పారు…
మొత్తమ్మీద వాలీబాలనమాట. ఈ అంగదుడు నన్ను పెడదారి పట్టించి బాగానే లంకంతా తిప్పాడు..రెండు గంటల సేపు..
కొత్త పాళీ చెప్పారు…
రాంనాథా - చమత్కారం గిలిగింతలు పెట్టింది - మొదట్లోనే అర్థం కానందుకు నన్ను నేను కొంచెం తన్నుకున్నాను :-)

అప్పుడెప్పుడో ఒక అవధానంలో .. "క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్" వీటిని ఉపయోగించి రామాయణ పరంగా పద్యం చెప్పమన్నారు .. అందులో రాంఉడు వాలితో అంటున్నట్టు .."వాళీ! బాలుని వోలె పల్కెదేల?.." అని పూరించారు.
చదువరి చెప్పారు…
వాలీబాలా అది!!? ఎంత చమత్కారం!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము