నేను చూసిన మహిళా దినోత్సవ ప్రహసనం!

అధ్యక్షా! (YSR)

ఇక్కడొక మాట చెప్పుకోవాలీ. మా ఆఫీసులో ఒక రోజు ఉన్నట్టుండి ఆడవాళ్లంతా చీరల్లో వచ్చారూ. ఏదో తేడాగా ఉందే అని నా సీనియర్ టీంమేట్ ఒకామెను విషయమడిగితే "ఈ రోజు విమెన్స్‌డే, తెలీదా" అన్నారధ్యక్షా.

"అయితే మీ ఐక్యతా, సత్తా, చూపడం కోసరం ఇలా చీరల్లో వచ్చారా, బాగుంది, ఇంకేం చేస్తున్నారూ!?" అనడితే, "టీ టైం నుండి మీటింగ్. ఓన్లీ లేడీస్. మీరు మాత్రం పనిచెయ్యాల్సిందే. తర్వాత ఫోటోలు తీసుకొంటాం. తర్వాతేముందీ బస్సులెక్కి ఇళ్లకుపోతాం" అని ఆంగ్లంలో సమాధానం.

నేను మొహం మాడ్చుకొని, "అంతేనా!! నిజంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకోసం కాదన్నమాట. ఆల్రెడీ ఆనందంగా ఉన్నవాళ్ల ఆటవిడుపన్నమాట ఈ మహిళా దినోత్సవం", అన్నట్టుగా అంటే - "అరె ఏ కౌన్ రే, ఏ కౌన్ సా జమానాకా రే, భగవాన్, ఇస్ కో లేజాకే జరా సమ్‌ఝవోనా" (నాకు హిందీ రాదు, తమాషాగా ఉంటుందని నాకొచ్చిన హిందీ రాశాను) అన్నట్లు ఆ చుట్టుపక్కలున్న మరికొందరు చీరాంబరధారులైన మహిళామూర్తులు ఒకరి మొహాలోకరు చూసుకొని నన్నీసడించుకొన్నారు.

ఆ తరువాత నాతోటివారలైన ఇతర పురుష పుంగవులు - "ఈ పిల్ల చీరలో భలే ఉందికదా!, ఆవిడ చీరలో ఇంతకుముందున్నంత లావుగా కనబడట్లేదు కదూ!, ఆహా మొత్తానికి భలే ఉందిరా మహిళా దినం. వాళ్లకు పండగ. మనకు కనులపండగ. చీరలే చీరలు. రంగురంగుల..." ఇలా రకరకాలుగా అనుకొంటూ ఆనందిస్తుంటే వారితో మాటలుకలిపి సంభాషణలను మరింత రంజుగా మార్చడానికి మంచి అవకాశమున్నా, మనసంగీకరించక పక్కకొచ్చేశాను. అది నేను ఉద్యోగంలో చేరాక చూసిన మొదటి మహిళలదినం.

తర్వాతి సంవత్సరం చీరల్లో వచ్చిన పెళ్లికాని పిల్లలను చూసి "ఈ పిల్ల నా ఇంట్లో ఇలా తిరుగుతుంటే ఎలా ఉంటుందో"నని రింగుగింగుల రంగుల పగటికలల్లో ఊహించే ప్రయత్నాలు చేస్తూ రోజు గడిపేశాను. క్రితం లాగా మనసు భారంగా లేదీసారి.

ఇక మూడో సంవత్సరం ఇదిగో హ్యూస్టన్‌లో ఇక్కడున్నాను. ఆ ఆత్మవంచనా దినోత్సవం ఇక్కడ జరగలేదు. రోజూలానే మహిళలంతా వచ్చారు. చక్కగా పనిచేసి వెళ్లిపోయారు.

అయ్యా...! (అమ్మా అంటే అదేదో బూతన్నట్లు అసెంబ్లీలో అభ్యంతరపెట్టారోమారు, ఎందుకొచ్చిన గొడవ)
కాబట్టి మహిళా దినాలు, వారాలూ, నెలలూ చేసుకోవలసిన అక్కరలేదూ. నిజంగా ఏమైనా మేలు చేయాల అనుకొనే వాళ్లకు వీటితో పనిలేదు. ప్రతిరోజూ మహిళా దినమే, ఉత్సవమే. అగచాట్లలో ఉన్నవాళ్లను అగచాట్లలోనే పెట్టే ఉత్సవాలకు పాడెగట్టండీ. అని మనవిచేస్తున్నానధ్యక్షా.

కామెంట్‌లు

Unknown చెప్పారు…
ఈ పిల్ల నా ఇంట్లో ఇలా తిరుగుతుంటే ఎలా ఉంటుందో"నని రింగుగింగుల రంగుల పగటికలల్లో ఊహించే ప్రయత్నాలు చేస్తూ రోజు గడిపేశాను.

అన్నా ఇది ఇంటూనే పోర్లు చీరలు కట్టుకుని ఎంత అందంగా ఉంటారో అని కలల్లోకి వెళ్ళిపోయా...
మిగతాదేదీ తలకెక్కలే.
కొత్త పాళీ చెప్పారు…
బిడ్డా! నీచూపునాగట్టుకొనేంతవరకే ఆ చీరల తళతళలూ, ఫెళఫెళలూ. నువ్వు తాడు గట్టాక, నీ ముక్కుకి తాడేసి ఆమె ఇంటో అడుగు బెట్టాక నేపాళమాంత్రికుడి బురకాల్లాంటి నైటీల్లోనే నీకు దర్శనాలు!! జర బద్రం కొడుకో!!! లైట్ తీస్కో.
ప్రతిదానికీ ఒక దినం పెట్టడమెందుకో నాకు అర్థం కాదు.సమాజాన్ని అడ్డంగా నిలువుగా విభజించే రాజకీయం ఇది. మనుషుల్ని మనుషులుగా కాక వోటర్లుగా వోట్‌బ్యాంకులుగా చూడ్డం ఈ యుగ లక్షణంలా ఉంది.
రాధిక చెప్పారు…
నాయనా..రామూ ఎక్కువ ఆశ పడొద్దు.కొత్తపాళీగారు చెప్పింది అక్షరాలా నిజం.ఎదో షో చేయడానికి తప్పించి అస్తమానూ చీరలెందుకు కడతాం బాబూ.ఈ దినాలన్నీ ఎదో రొటీన్ కి భిన్నం గా సంథింగ్ స్పెషల్ కోసం అన్నట్టు వుంటాయి.అంతకన్న ఏమీ లేదు.
రానారె చెప్పారు…
అభిప్రాయాలు తెలిజేసిన చేతన, తాడేపల్లిగార్లకు కృతజ్ఞతలు. వ్యాఖలు రాసినవారికి: కొత్తపాళీగారూ, చేదునిజం. లైట్‌తీస్తో అన్నారా!? లైటు మీరిచ్చారుగా, తీసుకొంటాను :) ప్రవీణ్, నీకూ ఆ లైటు వెలుగు అవసరమున్నట్టుంది :)) రాధికగారూ, నమస్తే :)))
dhrruva చెప్పారు…
6/10

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము