మినీ మీనాక్షి

గత ఆరు వారాల్లో ఐదుసార్లు వెళ్లాను దేవళానికి. ఇప్పుడు మనం కలసిమెలసి తిరగడానికి దొరికిన సావాసగాళ్లు భక్తులయిరి. దేవళాలకు పోకూడదని నియమమేదీ లేదుగానీ, గత ఆరు వారాలు మినహాయిస్తే అంతకు ముందు ఐదేళ్లలోనూ మొత్తం కలిపితే ఐదుసార్లకు మించి దేవళానికి వెళ్లివుండనేమో. గుళ్లో ఆహ్లాదకరంగా గాలి వీస్తూ వుంటుంది. జనం ఎక్కువగా వుండరు. ఆ మెట్ల మీద కూర్చుని వుంటే హాయిగా వుంటుంది. దేవుళ్లవిగ్రహాల ముందు నిలబడే సమయం కంటే ఆ ఆవరణంలో మెట్లమీదే నేను ఎక్కువ సమయం గడిపాను.

ఈ ఐదుసార్లలో రెండోసారి దేవళానికి పోయినప్పుడు చిన్న తమాషా జరిగింది. వెళ్లగానే కాళ్లూచేతులూ కడుక్కొని, ముందుగా వినాయకుని విగ్రహం ముందు నిముషం పాటు నిలబడి చేతులు కట్టుకుని కండ్లు మూసుకున్నాను. ఒక గంటసేపు మంచి నిద్రపట్టినప్పుడు కలిగే హాయి కలిగింది. మళ్లీ రెండుసార్లు వెళ్లినప్పుడు అక్కడే నిలబడితే అలాగే అనిపిస్తుందేమోనని చూశాను. అనిపించలేదు. ఐదోసారి జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నేనసలు దేవుళ్లవిగ్రహాలజోలికే పోలేదు. పాలరాతి రాధాకృష్ణులకు పక్కగా ఒకమూల మెట్లమీదే కూర్చుండిపోయాను మావాళ్ల దర్శనాలు, దండాలు, దక్షిణలు, ప్రదక్షిణలు పూర్తయిందాక.

విగ్రహాలకు ఇనుపకడ్డీల తలుపులు. ఆ ఊచల్లోనుంచే ఆ కంతల్లోనుంచే విగ్రహాలను చూడాలి. లోపల వినాయకుడు పార్టులు పార్టులుగా కనిపిస్తాడు. పూర్తిగా చూడాలంటే కళ్లుమూస్కోడమే మార్గం. ఇంక, ఆ పక్కన ఆంజనేయుడు, ఆయన కాళ్లదగ్గర "DO NOT TOUCH" అని రాసిపెట్టిన తాఖీదు. "ఫోరా! ఆంజనేయుడేమి నీ నాయన సొమ్మా?" అనాలనిపిస్తుంది నాకది చూడగానే. నేను ఆంజనేయుని పాదాలను తాకి దణ్ణంబెట్టుకుంటానని కాదు, ఏ విగ్రహం పాదాలనూ తాకాలనుకోను. కానీ, ఆ తాఖీదును చూడగానే "ఊఁహుఁ, ఈ ఆంజనేయుడు మనోడు కాదు" అనిపిస్తుంది. అక్కడ ఉండబుద్ధిగాదు. పక్కకొచ్చేశాను. ఇందుకే నాకా విగ్రహాలముందు నిలబడాలనిపించదు.

ఇంతకూ ఈ దేవళం పేరు మీనాక్షీ దేవాలయం. గర్భగుడిలో ప్రధాన దేవత ఆమే. ఆమెకు కుడిపక్క శివుడు, యడం పక్క శ్రీనివాసుడు! మొదట్లో గమనించలేదు. ఈమధ్య పదేపదే వెళ్లి చూడగా చాలా కొత్తగా అనిపించింది. గర్భగుడిలోనే మరోవైపున ఒక చిన్న విగ్రహం. దానికింద విష్ణుదుర్గ అని రాసివుంది. అక్కడ, శ్రీనివాసుని పక్కన ఖాళీగా వున్న ఒక పూజారి దగ్గరకువెళ్లి, "స్వామీ, చిన్న సందేహం. దుర్గ అంటే పార్వతికదా, విష్ణుదుర్గ ఎవరు స్వామీ, పురాణాల్లో ఎక్కడుందీమె" అని అడిగాను. అంతలో ఇంకో స్వామి అటుగా రావడం చూసి, ఈయన "మామా! ఇవను యేనో కేక్కరారు" అన్నాడు. ఆ మామస్వామి పలకకుండా శ్రీనివాసునికి హారతిచ్చి వెళ్లిపోయాడు. నేను వెళ్లిపోకుండా ఈ స్వామిని చూశాను. "దుర్గాదేవికే విష్ణుదుర్గ విశేషంగా వుంది" అన్నాడు. థాంక్యూ స్వామీ అన్నాను పెద్ద అర్థమైనట్టు.

గత శనివారం దేవళం ఆవరణంలో బట్టలు, నగలు, శాటిలైట్ టీవీ, తినుబండారాలు మొదలైనవి అమ్మకానికి పెట్టి చిన్నపాటి జాతరే జరిపారు. ఇంకా టపాసులు కూడా పేల్చారు. కాదు కాదు, పేల్పించారు. అదే వృత్తిగా గల అమెరికనులచే, ఫైరింజను సమక్షమున, భక్తులంతా ప్రేక్షకులైయుండ ఆకాశంలో టపాసులు శబ్దాలు, నిప్పురవ్వల మిలమిలలు. పిల్లలు చప్పట్లు కొట్టారు. పెద్దలు కూడా కొట్టి కొట్టించి ఆనందించారు. నేనూ కొట్టి ఆనందించాను. అంతా పది నిముషాల్లో సమాప్తం. ఈ పద్ధతే బాగుంది కదా మన పద్ధతికన్నా అన్నాను పక్కకు తిరిగి. ఇందులో ఏముందీ ఆనందం? వాడు కాల్చాడు మనం చూశామంతేకదా! అన్నాడు మిత్రుడు. పాయింటే అన్నాను.

నేను హ్యూస్టనుకు వచ్చినప్పటినుంచి చూస్తున్నాను ఇక్కడి స్కూలుబస్సులను. చిన్నపిల్లల బస్సులు కదా, వాటిలోపల ఎట్లా వుంటుందో చూద్దామంటే కుదర్లేదు. మొన్న శనివారం కుదిరింది.

జనం ఎక్కువగా వచ్చారు గనుక, అన్ని వాహనాలను నిలపడానికి ఆలయంలో స్థలం చాలదని, సమీపంలోని ఒక పాఠశాల ఆవరణంలో నిలిపించి, అక్కడినుండి ఆలయానికి జనాన్ని స్కూలుబస్సుల్లో తరలించారు. మేము నడిచే వచ్చాము. వెళ్లేటప్పుడు మాలో ఒకాయన నడవలేనన్నాడు. క్యూలో నిలబడ్డాము.

భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి నైసుగా నడచిన నార్తు బామ్మ ఒకామె, విదేశపర్యటనల్లో ప్రధాని పెళ్లాం లాగా చిరునవ్వు నవ్వుతూ, భర్త, కొడుకు/కోడలు, మనవరాండ్రతో సహా వచ్చి నేరుగా క్యూ తలలోకే చేరిపోబోతూ వుంది. క్యూలో అరగంటపైగా నిలబడి అక్కడికి చేరిన నాకు ఆమెను చూస్తుంటే చెప్పరాని అసహ్యం కలిగింది. ఆమె పెద్ద మనవరాలు బహుశా పదీపదకొండేండ్లపిల్ల, చాలా ఇబ్బందిగా మొహం పెట్టి, క్యూ తోకను చూపుతూ "క్యూ ఈజ్ దేర్" అంది. "దేర్ హోజాయ్ గీ" అంది బామ్మ సకుటుంబంగా చెరగని చిరునవ్వుతో క్యూ తలలోకి చొరబడిపోతూ. ఆ పాప వాళ్లవ్వను ఒక చూపు చూసిందీ.., మీనాక్షమ్మ ఇక్కడే వుందిరా అనిపించింది నాకు.

కామెంట్‌లు

రవి చెప్పారు…
>>ఆయన కాళ్లదగ్గర "DO NOT TOUCH" అని రాసిపెట్టిన తాఖీదు. "ఫోరా! ఆంజనేయుడేమి నీ నాయన సొమ్మా?" అనాలనిపిస్తుంది నాకది చూడగానే.

నేను కొరియాకెళ్ళినప్పుడో బుద్ధ మందిరం వెళితే, అక్కడ ఒకామె మమ్మల్ని ఆటకాయించింది. విదేశీయులు-లోపలకి వెళ్ళకూడదని. ఆమెకు చెప్పాము, "తల్లీ, సాక్షాత్తూ మీరు పూజించే బుద్ధుడే మా దేశం తాలూకు అని." ఆమె కాదని వాదించింది. బుద్ధుడు చైనా వాడంది! కాసేపు వాదించి, బయటకొచ్చేశాము. అక్కడ బుద్ధుడి విగ్రహం - చైనా వాళ్ళ లాగే ఉన్నదనుకోండి, చిన్న చిన్న కండ్లు, చట్టి ముక్కు, ఇట్లాగ.
బ్లాగాగ్ని చెప్పారు…
ఇంతకీ సదరు మీనాక్షమ్మ క్యూ మొదట్లో బామ్మతో సహా జొరబడిందా లేక తానొక్కతీ క్యూ చివరికెళ్ళి నించుందా? రెండోది జరిగితేనే ఆపిల్ల మీరిచ్చిన బిరుదుకు అర్హురాలని నా అభిప్రాయం :)
Unknown చెప్పారు…
నేను గుడికి వెళ్ళేది ఆ ప్రశాంతత కొఱకే. అయితే పట్టణాల్లో అదీ దొరకట్లా.
అందుకే మానుకున్నా.

నమ్మవు కానీ నా ఇంజినీరింగు రోజుల్లో నేను రోజూ గుడికి వెళ్ళేవాడిని. దేవుడి కోసం కాదు కానీ హాయిగా ప్రశాంతంగా ఆ పదిహేను నిముషాలు రోజుకి గడపగలిగేవాడిని.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము