కవితల విద్యామంత్రి కపిల్

అలవోకగా కవితలు చెప్పగల విద్యామంత్రి మన కేంద్రప్రభుత్వంలో కొలువుదీరి వున్నాడంటే దేశానికిది శుభసూచికగా కనిపిస్తోంది. అదిన్నీ, పొంగిన ఆ కవితలను ఆయన తన జేబువాణి/చరం/సెల్‌ఫోను/మొబైల్‌లో సంక్షిప్తసమాచార(ఎస్సెమ్మెస్)పరిభాషలో రాసుకుంటారట.

మంత్రి నోట మంచి భవితకు బాటలు పరచబోతున్నాయనిపించే మాటలు వినవస్తున్నాయి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల గోల ఇక ఉండబోదనే మాట వింటున్నానుగానీ, మన విద్యావిధానాన్ని సవరించబోవడంలో మంత్రిగారి దార్శనికత మరియు శ్రద్ధ ఏపాటివో ఈ వీడియో చూశాక కొంత అవగతమయింది.

అన్నింటికంటే నన్ను సంతోషపెట్టిన విషయం - పని చేసే మంత్రి ఒకరుండటం. పనిని ఇష్టంగా చేసే మనిషి కావడం. అందులోనూ కవితలు చెప్పగలగడం. మంత్రిగారి పనులకు మంచి అభినందనలే వస్తున్నట్టున్నాయి! ఈ వ్యవహారాన్ని మీరు దగ్గరగా గమనిస్తున్నారా?



మాతృభాష ప్రాముఖ్యాన్ని మంత్రిగారు నొక్కిచెబుతున్నారు. బాగుంది. హిందీ కూడా నేర్చుకొమ్మంటున్నారు. ఇది మాత్రం ఇబ్బందిగా వుంది. దీన్ని ఐచ్ఛికం చేస్తే బాగుండును. ఆంగ్లం ఎలాగూ అవసరమే. రాజ్యాంగం అనుతించదుగనుక దేశానికంతటికీ ఒకే విద్యాబోర్డు సాధ్యం కాదంటున్నారు - భిన్నత్వం భారతదేశానికి చాలా ముఖ్యమైనదంటూనే.

భాషల విషయంలో మంత్రిగారి ధోరణి ఫర్లేదు. గణితం, విజ్ఞానశాస్త్రం వంటి విషయాల్లో కామన్ బోర్డు సాధ్యమేనేమో. కానీ చరిత్ర విషయంలో ఒకే విద్యాబోర్డు కుదరదు. ఉదాహరణకు రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి మొదలైనవి పంజాబు పిల్లకాయలకు అదేపనిగా పాఠాలుగా చెప్పడం ఏం బాగుంటుంది, వాళ్ళ ప్రాంతపు చరిత్ర వాళ్లకు బోలెడంతుండగా?

విదేశీ విద్యాసంస్థలనూ దేశంలోకి అనుమతిస్తాం అని కూడా అంటున్నారు!

పిల్లలకు విద్య భారంగా మారకుండా, విద్యార్జన ఒక సరదా వ్యాపకమనిపించేలా మారుస్తామంటున్నారు. పన్నెండో తరగతి పూర్తిచేసిన ప్రతిభావంతులైన విద్యార్థులను పెద్దసంఖ్యలో విశ్వవిద్యాలయాలకు పంపించగలగటం తన ముఖ్యమైన లక్ష్యంమంటున్నారు. బీ.ఏ - లా అంటున్నారు. ఉద్యోగావకాశాలంటున్నారు. మంత్రిగారు ఈ విషయాలు చాలా లోతుగానే ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది.

ఆలోచించడమేకాదు, అనడమే కాదు, త్వరత్వరగా అమలు చేస్తున్నారు కూడా.

నాకు తెలుసుకోవాలనిపిస్తున్నదేమిటంటే, మంత్రిగారు చేస్తున్న ఈ పనులపై న్యాయమైన విమర్శలేమైనా ఉన్నాయా, అన్నీ ప్రశంసలేనా? కనీసం రాజకీయ విమర్శలు కూడా ఏమీ లేవా? అన్నది.

కామెంట్‌లు

మేధ చెప్పారు…
ప్రస్తుతానికి నాయకులందరూ, తమ తమ పనుల్లో బిజీగా ఉన్నట్లున్నారు! అందుకనే ఏ విమర్శలు కనిపించడంలేదు.. నాకు నచ్చిన మరొకటి, వందరోజుల స్టేటస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేసారు!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు