Sunday, May 31, 2009

కినుకును యొక్క లోన్లోపలను

చిట్టచివరికి
చిట్టచివరికు
చిట్టచివరకు
చిట్టచివరకి


వీటిలో రెండోది ఎవరూ వాడరనుకుంటా. అది తప్ప మిగిలిన మూడూ వాడుకలో చూస్తున్నాను. ఐతే నాలుగోది నేను వాడను. ఎందుకంటే నాకది ఎలా అనిపిస్తుందంటే, ఒక ఉదాహరణతో చెబుతాను.

ఒక చిన్న పిల్లవాడు మరొకడిని బెదిరిస్తున్నాడు. ఏమని?
"అమ్మకు చెబుతా వుండు!" అని. వీడు తెలుగుహిందువుల పిల్లోడు అనిచెప్పవచ్చు.

ఇంకొక చిన్నపిల్లోడు మరోకడిని బెదిరిస్తున్నాడు. ఏమని?
"అమ్మకి చెబుతా వుండు!" అని. వీడు తెలుగుసాయిబుల పిల్లోడు అనిపిస్తుంది. "అమ్మా కీ చెప్తా" అన్నట్టుంటుందిది. మావూళ్లో సాయిబులు ఎవరో కొందరు తప్పితే మంచి తెలుగు మాట్లాడతారు. మంచి తెలుగంటే నాకు మంచి అనిపించిన తెలుగు. నేను చిన్నప్పటినుంచీ విన్న తెలుగు.

బ్లాగులు చదవడం మొదలుపెట్టిన తరువాత అకారానికి, ఉకారానికీ పక్కన ఈ "కి"కారమును ముస్లిమేతర తెలుగులు కూడా వాడటం ఎక్కువగా చూస్తున్నాను. చదివినప్పుడల్లా నాకు ఇబ్బందిగా వుంటుంది.


"ప్రియమైన అమ్మానాన్నలకు" అని రాస్తాం మావైపు వాళ్లం.
"ప్రియమైన అమ్మాన్నాన్నలకి" అని రాసేవాళ్లున్నారు. వీళ్లు మావైపువాళ్లు కానివాళ్లు.
"మీ నాన్నకు తెలుసా?" అంటాం మావైపువాళ్లం.
"మీ నాన్నకి తెలుసా?" అంటున్నారు మావైపువాళ్లు కానివాళ్లు.
కిన్ కున్ లకు కిన్‌షిప్ ఉంది, అవి దాయాదులేనూ, ఇంకా మాట్లాడితే సొంత అన్నదమ్ములే అనేవాళ్లు అనొచ్చు. నా మాటలవల్ల కినుకను వహించవద్దని మనవి. నేను పేచీ పెట్టుకోదలచుకోలేదు. ఎందుకంటే "నాన్నకు" అనడం కంటే "నాన్నకి" అనడం తక్కువ శ్రేష్ఠమైనదని నా భావన కాదు. కానీ అకారం పక్కన ఇకారం వికారంగా వుంటుందనీ ఉకారమే బాగుంటుందనీ ధ్వనిలో ఒక తూగు ఉంటుందనీ నా ఆరోప్రాణం అనగా "సిక్త్ సెన్స్" గట్టిగా అరిచి మరీ చెబుతుంది ప్రతిసారీ. ఎందుకలా అరుస్తుందటే చిన్నప్పటినుంచీ నేను విన్నది అకారం పక్కన ఉకారమే కనుక. "నాన్నకి" అనడం సాయబులు వచ్చీరాని తెలుగురుదూ మాట్లాడినట్టుగా ధ్వనిస్తుంది. బ్లాగులు నాకు పరిచయం చేసిన నా హితులూ సన్నిహితుల్లో కూడా కొందరున్నారు "నాన్నకి" అనేవాళ్లు.

చాసోకు అని రాస్తాన్నేనైతే. అంటే ఓత్వం పక్కన ఉకారం.
చాసోకి అని రాయను.


రానారెకి అనడం బాగుంటుంది. అంటే ఎత్వం పక్కన ఇకారం.
రానారెకు అనడం అంత బాగుండదు నాకు.

నాలాగా ఈ కికారపు బాధపడేవాళ్లెవరైనా ఉన్నారేమోనని రాస్తున్నానిది. అంతకుమించి ఇంకేమీ లేదు.

9 comments:

రవి said...

మీకీ టపా, మాకీ చాలా నచ్చిందీ హై.

ఇక పోతే, నేను గమనించిన సూత్రాలు కొన్ని. మీరు ఎత్తి చూపిన "కి" వాడకం, కాస్త తమిళనాడు సరిహద్దులో ఉన్న వారి (చిత్తూరు, నెల్లూరు) అలవాటేమో అని చిన్న సందేహం నాకు. అలానే మా అనంతపురం లో కూడా కొన్ని పల్లెటూళ్ళలో ఉన్న మాండలికం కూడానూ అని ఓ నమ్మకం.

నా మొదటి సందేహానికి కారణం ఇది. "నాకు" , "నీకు" తమిళంలో అనువదిస్తే "ఎనక్కు", "ఒనక్కు" అవుతుంది. అయితే చివర్లో ఉన్న "క్కు" రాసేప్పుడలా రాస్తాం కాని, పలకాలంటే, "క్క్" అన్న హలంతంతో పలికి, చివర్లో మరీ గొడ్డలితో నరికి తెగ్గోయకుండా, సరిగ్గా ఓ లిప్త సాగదీయాలి. అంటే, "క్కి" "క్కు" మధ్యలో - అంటే ఇకారానికి, ఉకారానికి మధ్యలో అంతమయేలా పలకాలి. ఆ అలవాటే మీరు ఘోషించే "కి" కి ....సారీ, "కి" కు నాంది. ఇది నా అనుకోలు మాత్రమే.

అన్నట్టు, ఆ దురలవాటు నాకు ఉంది.

కొత్త పాళీ said...

ముందో కంఫెషను .. నేనూ కీ మనిషినే!
హమ్మయ్య, అదయిపోయిందగనక ఇక మిగతా విషయాల్లోకెళ్ళొచ్చు.
భలే రీసెర్చి మొదలెట్టారు. :)
తమరికి తీరిక కాస్త ఎక్కువగా చిక్కుతున్నట్టుంది. అదే నిజమయితే, ఆ తీరికలో ఒక కథ రాస్తే సంతోషిస్తాము గదా, ఇలా కీలకి ఈకలు పీకే బదులు?
@రవి .. అది దురలవాటు కానే కాదు!

చంద్ర మోహన్ said...

కి, కు రెండూ షష్టీ విభక్తులే కానీ, ఒక్క ఇకారాంత శబ్దాలపక్క మాత్రమే 'కి ' వాడడం బాగుంటుంది. ఇతర శబ్దాల పక్కన (రానారె సహా!) 'కు ' నే వాడడం శిష్ట సంప్రదాయం. అల్లసాని పెద్దన చెప్పిన - "పూత మెఱుంగులున్ బసరు పూప పదంబులు... " అన్న ఉత్పల మాలిక చివరి పాదం " ... సారె సారెకున్" అని అంతమౌతుంది.

vookadampudu said...

హుం...
ఇంత కధ ఉందీ ...
మాట్లాడేటప్పుడూ ఎక్కువ "కి" వస్తుందేమో ...
పైగా .. సంభాషణ మీద కూడా ఉంటుందేమో...

1అ) మా అమ్మకు చీరకొనటానికి వెళ్ళాలి, బయల్దేరు.

1ఆ)చీరకొనటానికి వెళ్ళాలి, బయల్దేరు.
ఎవరికి
మా అమ్మకి


2అ) వచ్చే వారం ఆగ్రాకు వెళ్దామా

2ఆ) వచ్చే వారం విహారయాత్రకి వెల్దామా
ఎక్కడికి
ఆగ్రాకి..అటు "కి" "కు" లకూ, ఇటు కధకూ ఉపయోగపడే వస్తువిచ్చాను. తర్వాత మీ ఇష్టం :)
అన్నట్టు ఇంకా ఇక్కడ రాకేశుడి వ్యాఖ్య లేదేమిటీ

భైరవభట్ల కామేశ్వర రావు said...

"నా", "మీ", "నీ" , "మా" అనే సర్వనామాల తర్వాత ఎప్పుడూ "కు" వస్తుంది. ఇవికాక వేరే ఏ ఇకారాంత పదం తర్వాతైనా ఎప్పుడూ "కి" వస్తుంది, "కు" రాదు(ఉదాహరణ: "గుడికి", "పెళ్ళికి"). మిగతా పదాలకి "కి" అయినా "కు" అయినా రావచ్చు. ఇది ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుందనుకుంటాను (మేం ఎక్కువగా "కి" వాడతాం). ప్రాచీన కావ్యభాషలో "కు" వచ్చేది.

Vamsi M Maganti said...

కరాకనాకరెకకు కకీకత్వోకత్తకకాకలకతో కపికనికబకడికంది కకాకబకట్టి కకకదేకనికపకక్క కవకస్తే కబాకగుంకటుంకదో, కకి కదేకని కపకక్కకన కవకస్తే కబాకగుంకటుంకదో కతెకలికయకడాకనికకకయికనా కవ్యాకకకరకణం కయికప్పుకడే కతికరకగకమోకత కవెకయ్యాకలి...కకాకబకట్టి కైంకతే కసంకగకతుకలు కచికత్తకగింకచకవకలెకను...కమకళ్ళీ కవకస్తా, కవకచ్చి కకి కగుకరింకచి కచెకబుకతా ...

aswin budaraju said...

7

రాఘవ said...

నాకూ కామేశ్వరరావుగారు చెప్పినట్టే చదువుకున్న గుర్తు. ప్రథమ మధ్యమ పురుషలకి కున్, ప్రథమేతరేకారంతాలకి కిన్, మిగతా అన్నిటికీ కిన్ కానీ కున్ కానీ రావచ్చూ అని. బాలవ్యాకరణంలో సూత్రం కూడా ఉందనుకుంటాను.

రానారె said...

రవిగారూ: తమిళనాడు సరిహద్దుకాదు, కర్ణాటక సరిహద్దు అనండి. మీకి మాకి అనేది కర్ణాటక సరిహద్దులోని తెలుగోళ్లే అనుకుంటాను. తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరుజిల్లా జనం ఇట్లా మాట్లాడగా నేను వినలేదు.

గురూగారూ: ఈ నెలలోపు ఒక కథ రాస్తున్నాను. 'ఏదో రాసేయాలని రాసినట్టుగా వుంది' అనిపించుకోకపోతే చాలు. అదే విజయం. మీ ప్రోత్సాహానికి నెనరులు.

చంద్రమోహన్‌గారూ: పెద్దనగారి శిష్ట సంప్రదాయమే కొనసాగుగాక. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

ఊకదంపుడుమహాశయా: అమ్మకు చీర కొనడానికి ఆగ్రాకు విహారయాత్ర అనే వస్తువుతో కథ అల్లడం అంత సులువుగా లేదు! :-)

కామేశ్వరరావుగారు, రాఘవగారు: మీ మాట ఫైనల్ జడ్జిమెంటు.

వంశీగారు: కవాకమ్మో..కవాకయ్యో! :-)

అశ్విన్: నెనర్లు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.