మాలపల్లి - ముందుమాటలో ముందుమాటలు

మా ఊళ్లో భలే భలే మాటలు వినబడతావుంటాయి. మచ్చుకు ...

"ఒక్క ముక్క అర్థమైతే నీ యడంకాలిమెట్టుతో కొట్టు"

ఈ మాట ఎప్పుడుబడితే అప్పుడు వినబడదు. నువ్వేదైనా లొడలొడా చెప్తాండావనుకో. అవతల మనిషికి నువ్వేదో చానా ముఖ్యమైన సంగతే చెప్తాండావని అర్థమయ్యి, ఏమి చెప్తాండావో మాత్రం అర్థం కాకండా వుందనుకో. పో..ఇంచేపు వింటాడు. అప్పుడుగూడా అర్థం కాకపోతే, నువ్వు మాట్లాడ్డం ఆపి ఒక్కరవ్వ అవకాశం ఇచ్చినప్పుడు ఇదో ఈ మాట అంటాడు - పూర్తి నిజాయితీతో.

ఐతే ఈ మాట ఇప్పుడెందుకు చెప్తాండానంటే, ఈరోజు నేనూ ఈమాటే అన్న్యా గాబట్టి. ఎవురితోనంటే కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుతో. సచ్చి ఏలోకానుండాడో నా మాట మాత్రం ఖచ్చితంగా యినే వుంటాడు.

ఎందుకన్న్యాను అంటే ఆయన అట్టా మాట్లాణ్ణాడు మరి. ఎక్కడ? ఉన్నవ లక్ష్మీనారాయణపంతులవారి 'మాలపల్లి'కి ముందుమాట మాట్లాడతా ఆయనేమన్యాడో మీరే వినండి (పుస్తకం నుండి యథాతథం) -

"శ్రీమహాభారత సాహిత్యేతిహాసములు మావవధర్మ పరిణామమునందు దివ్యపర్వములు, కర్మపరాయణమైన ప్రవృత్తి ధర్మపరమైన జ్ఞానపరిణామమును పొందుట పురుషార్థము, విశ్వసాహిత్యము, పురుషార్థ సిద్ధికి సాధనముగాగల విధమును, కావ్యకళాది రూపములను, మహాత్ముల స్వానుభవము విశదము చేయుచున్నది. వేదవ్యాసుడు సనాతన సంస్కృత సాహిత్యమును మహాభారత కావ్యరూపమునను, ధర్మార్థ కామమోక్షములకు, కర్మ ధర్మ బ్రహ్మజిజ్ఞాసారాధనపరమైన, మానవ ధర్మపరిణామ సాధనముల ననుగ్రహించెను. ధర్మపరిణామములకు ప్రవృత్తి వివృత్తి యోగారూఢములైన భారత సంగ్రామము లనవరతము సంభవములు. ధర్మసంగ్రామములు కురుక్షేత్రము లందువలెను సామాన్య సంసార గృహక్షేత్రములందును మానవధర్మ పరిణామమునకు సంభవములు. ఆదిపర్వము మహాకావ్య కళా విషయములందువలెను సామాన్య కావ్యకళా విషయములందును మానవ ధర్మపరిణామమునకు సాధనములు. మహాభారతేతిహాసములందువలెను సామాన్యేతిహాసములందును శ్రీకృష్ణార్జునులు, ధర్మరాజ దుర్యోధనులు, కర్ణార్జునులు, సంజయ ధృతరాష్ట్రులు, భీష్మద్రోణులు, అశ్వత్థామాభిమన్యులు, కుంతీ గాంధారులు, ద్రౌపదీ సుభద్రలు, విదుర దుశ్సాసనులు, భీమ కీచకాదులు మానవధర్మ పరిణామమున కనంతమైన నామరూపములను సంభవించుచుందురు."


ఒక వాక్యం అర్థం కానిదే తరువాతి వాక్యం జోలికి పోలేకపోవడం బళ్లోనుంచి నా బలహీతన. ముందుమాట చదవకపోతే వచ్చిన నష్టమేమి? పుస్తకాన్ని మొదటి పేజీనుంచి చివరిపేజీవరకూ అదే వరుసలో వదలకుండా చదవడం నా పద్ధతి. మధ్యమధ్యలో చదవడం నావల్ల కానిపని. ముందుమాట అని దానికి పేరుపెట్టి ఒక పెద్దమనిషి నాలుగు మాటలు చెబుతూవుంటే పెడచెవినపెట్టడం ఎలాగ?

నేను మరీ మొద్దును కాను. సంస్కృతాంధ్రాలను అదేపనిగా అధ్యయనం చేసినవాణ్ణి కాకపోవచ్చు. విస్తారంగా చదివినవాణ్ణి కాకపోవచ్చుగానీ గ్రాంధికం చదవడం నాకిదేమీ మొదటిసారి కాదు. అయ్యా! నేను చదువుతుతున్నది తెలుగు పుస్తకం. అందులోని తెలుగు వాక్యాలు నాకు అర్థంకాకపోవడమేమిటి!? అనే బాధతో "ఒక్క ముక్క అర్థమైతే నీ ..." అంటూ పుస్తకాన్ని పక్కనపడేశాను.

వెంటనే మళ్లీ చేతికి తీసుకున్నాను. పూర్తిగా కాకపోయినా ఒక మోస్తరుగా నాకర్థమయిందేమిటంటే - "భారతంలో చెప్పిన 'కర్మలు చేయుటయందే నీ కధికారము గలదు' అన్న ముక్క మనసుకు ఎక్కాలంటే విశ్వసాహిత్యం కొంత పనికొస్తుంది. భారతయుద్ధం లాంటివి సామాన్యల ఇళ్లలో నిరంతరం జరుగుతూనే వుంటాయి - మనుషుల్లో మార్పును కలిగించేందుకు. భారతంలోని వివిధ పాత్రల స్వభావాలున్న మనుషులు ఎప్పుడూ మన చుట్టూ ఉంటూనే ఉన్నారు." నేను సరిగానే అర్థం చేసుకున్నానా?

ఈ పుస్తకానికి కాశీనాథుని నాగేశ్వర్రావుగారు వ్రాసిన పదిపేజీల ముందుమాట వుంది.

కామెంట్‌లు

జీడిపప్పు చెప్పారు…
బాగుంది బాగుంది. చెప్పేదేదో అందరికీ అర్థమయ్యే సులభమయిన, సరళమయిన భాషలో చెప్పచ్చు కదా. ఏమిటో ఆ చాదస్తం!!
మాలతి చెప్పారు…
మాలపల్లి చదువుతున్నప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నానండి. అందులో మరొక విశేషం ఆ నవలని వాడుకభాషలో వ్రాయబడిన నవలగా చెపడం. అది ఎవరికి వాడుకభాష అని నా సందేహం.
రాఘవ చెప్పారు…
మీరు అర్థం చేసుకున్న భావం కరెస్టే. ఐతే, వ్యావహారికంలో చెప్పాలంటే... ఆయన భావం ఇదీ!

"భారతం (అందులోని 18 పర్వాలూ) మానవధర్మాన్ని ఆవిష్కరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పనులనీ ధర్మాన్నీ విశదపరిచే జ్ఞానాన్ని పొందడం పురుషార్థం. ప్రపంచంలోని సాహిత్యం అలాంటి పురుషార్థాన్నే 7కాక, కావ్యం, కళ, మహాత్ముల అనుభవాలు మొదలైనవి అందిస్తుంది. వ్యాస భగవానుడు భారతం ద్వారా సాహిత్యాన్నే కాకుండా ధర్మార్థకామమోక్షాలు సాధించడానికి అవసరమైన పనిముట్లు అందించారు. ధర్మాధర్మాలతో కూడిన యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి కురుక్షేత్రంలోనే కాక మామూలు సంసారుల ఇళ్లలో కూడా జరుగవచ్చు. మహాకావ్యాలే కాక సామాన్యకావ్యాలు కూడా ధర్మానుష్ఠానానికి కావల్సిన సాధనాలు అందిస్తాయి. మహాభారతంలోలాగే తతిమ్మా ఇతిహాసాల్లో కూడా కృష్ణార్జునులు మొదలైనవాళ్లు వేరే వేరే పేర్లతో కనబడుతూనే ఉంటారు."

ఒక ఉచిత సలహా. దీనిని మీరే చదివి రికార్డు చేసి రెండు రోజుల తర్వాత వినండి. అప్పుడు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అర్థమౌతుంది. :)
రానారె చెప్పారు…
రాఘవా,
నెనర్లు. :)

తె.తులిక గారూ, మీ మాటను నేనొప్పుకోవడం లేదు, మన్నిచండి. మాలపల్లి నవల 'ముందుమాట' వాడుకభాష కాకపోవచ్చునేమోగానీ, నవలంతా సులభంగా అర్థమయ్యే వాడుకభాషే! పైగా ఆ నవల రాసేటప్పటికి వాడుకభాషలో వ్రాతలకు పండితలోకంలో గౌరవం తక్కువగా వుండేదట కదా. ఆ వాతావరణంలో ఇదొక తొలినాళ్ల ప్రయత్నం కావచ్చు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం