ఇటీవల నేను చూచిన చిత్రములు

అరుంధతి - గత ఆదివారం చూసిన సినిమా. ఈమధ్య వచ్చిన రొడ్డకొట్టుడు సినిమాలకు ఇది భిన్నమైనది. ఈ సినిమాలో నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. పతలా దబరాను పెద్ద నొక్కుపడేలా బలమైన గరిటెతో వాయిస్తే వచ్చే శబ్దాన్ని ఒకసన్నివేశంలో వినిపిస్తారు కోటి. 'ఇప్పుడు మీరు భయపడాలన్నమాట' అని సబ్ టైటిల్ వేసివుంటే ప్రయోజనం వుండేదేమో. స్టీలు పాత్రల సంగతి వదిలేసి, సినిమాపాత్రల విషయానికొస్తే రొ'టీన్' పాత్రల్లో ఎప్పుడూ కనిపించే అనుష్కకు ఇదో వెరయిటీ. ఇందులో విలను వీరోయినును ఎలా అనుభవించి చంపాలనుకుంటాడో మాటిమాటికీ ఆమెతో చెప్పీ చెప్పీ చెప్పీ చివరికి అనుభవించకుండానే చచ్చిపోతాడు. ఒక అందమైన గుడ్డి నాట్యాచారిణిని పొడుగాటి కత్తితో రెండుపోట్లు పొడిచి, రక్తంలో ఆమె విలవిలలాడుతుండగా విలను ఏకాగ్రచిత్తంతో తనపనేదో తాను చేసుకుంటూ -సుఖపడుతూ పోతున్నావు, పోతూ సుఖపెడుతున్నావు, నీవెంత ధన్యవోకదా- అనే కవితాత్మకమైన డైలాగు చెప్పే దృశ్యం ఈ సినిమాలో హైలైట్. మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. గ్రాఫిక్సూ అవీ బాగున్నాయి. సినిమా చివరివరకూ మెదలకుండా చూశాను. ఖర్మ.

స్లమ్ డాగ్ మిలియనీర్ - నేనీ సినిమాకు వెళ్లడానికి ముఖ్య కారణం రహమాన్. ఇంకా నేపథ్యసంగీతానికి అందివచ్చిన అంతర్జాతీయ సినిమా అవార్డుల గురించి పత్రికల్లో జరుగుతున్న ప్రచారం. సినిమా చూసి బయటికొచ్చాక నాకనిపించింది - స్థానబలిమి కాని తన బలిమి కాదయా అని. ఇది ఆంగ్లచిత్రం కాబట్టి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందిగానీ, రహమాన్ ఇంతకంటే గొప్పగా చేసిన సినిమాలు వున్నాయి అనిపించింది. చాన్నాళ్లక్రితం కమలహాసన్ ఒక టీవీ ఇంటర్యూలో చెబుతుండగా విన్నాను - మన బతుకుబాటలు వాళ్లకు తెలియవు, కాబట్టి మన సినిమాలు వాళ్లకు అర్థం కావు, ఆస్కార్ అవార్డు మనది కాదు, అదెవరికివ్వాలో నిర్ణయించేవారికి మన పద్ధతులమీద అవగాహన లేదు, అలాంటప్పుడు అది మనకు రావాలని ఆశించడంలో అర్థంలేదు అని. భారతీయసంగీతం పునాదిగా పైకెదిగిన రహమాన్ అంతర్జాతీయవేదికపై గౌరవాన్నిపొందితే సంతోషించే అభిమానకోటిలో నేనూ ఒకడిని. నేపథ్యసంగీతం విషయాన్ని పక్కనబెడితే, ఈ సినిమాలో పెద్ద(పిల్ల)ల నటన కంటే చిన్నపిల్లల నటన బాగుంది. భారతజాతిని కించపరిచే సన్నివేశాలున్నాయన్నవాళ్ల ఆరోపణ అర్థంలేనిగోల అనిపించింది. ఇంకొకడి మీదపడి యేడవనేల? భారతప్రజను కించపరిచే సన్నివేశాలు ఈమధ్య విడుదలైన తెలుగుసినిమాల్లో పుష్కలంగా దొరుకుతాయి.

ఎ వెన్స్‌డే (ఒక బుధవారము) - చివరిదాకా చూపుతిప్పుకోనివ్వలేదు. ఈ సినిమా చూసినవెంటనే - టైడ్ ప్రకటనలో మాదిరిగా 'అవాక్కయ్యారా?' అని అడిగితే ఔనని చెబుతారు. తప్పక చూడవలసిన చిత్రం. వాహ్ అనిపించిన చిత్రం. ఇది భారతీయసినిమా అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించనవసరంలేని చిత్రం అనిపించింది.

గత రెండుమూడు వారాల్లో నా సినిమా సుఖదుఃఖాలు ఇవీ.

సినిమా మాటలకేంగానీ, ఇదిగో ఈ దాక్షిణాత్య సంగీత ష్రెక్ విద్వాంసుణ్ణి వీక్షించండి. నిరుడు కంటబడినాడు. మళ్లీ చూద్దామనీ అందరికీ చూపిద్దామనీ వెతుకుతూనే వున్నాను. ఎన్ని రకాలుగా వెతికినా దొరకలేదు. ఈరోజు తనంతట తానే మళ్లీ కనబడినాడు. ఎవరు సృష్టించారోగానీ వారికి జోహార్లు.కచేరి చివరలో ఎంత వినయంగా నమస్కరిస్తాడో చూడండి!

కామెంట్‌లు

Kathi Mahesh Kumar చెప్పారు…
బాగుంది. నవతరంగానికి రాయొచ్చుకదా!
krishna rao jallipalli చెప్పారు…
అనే కవితాత్మకమైన డైలాగు...12/10
రానారె చెప్పారు…
థాంక్యూ మహేశ్ గారూ! సినిమా నిర్మాణంపై ఏ అవగానా లేకుండా, ఒక సాధారణ ప్రేక్షకునిగా నా అభిప్రాయాలు నా బ్లాగులో రాసుకుంటే బాగుంటుందిగానీ నవతరంగం పత్రికలో రాయదగిన సరుకు నాదగ్గర లేదండి.

కృష్ణారావుగారూ, ఆ దృశ్యాన్ని చూసిన ఆనందంలో 'రక్తపు మడుగులో రేపు' అనే శీర్షికతో భవిష్యత్తులో గుండెనుపిండే అఘోరాకవిత రాయొచ్చు 'వదల బొమ్మాలీ వదల' అని మొదలు పెట్టి. :-)
Kathi Mahesh Kumar చెప్పారు…
@రనారె: నవతరంగంలో రాసేవాళ్ళూ నిపుణులు కాదు లెండి. సాధారణ ప్రేక్షకులూ,సినిమాని అభిమానించి ప్రేమించేవాళ్ళు. కాబట్టి ఆ కోవలో మీరూ చేరారు. నవతరంగానికి స్వాగతం.
Kiran Mmk చెప్పారు…
స్లమ్ డాగ్ మిలియనీర్ గురించి మీ అభిప్రాయాలతో 100% ఎకీభవించాను. I never understood the opposition to the movie esp. by folks who did not even watch it (see gollapudi's http://koumudi.net/gollapudi/about_slum_dog.html). Your review is 10/10.

అరుంధతి చూడలేదు - చూడబోను.

A Wednesday was a fine piece of work, even though I will claim: అవాక్కు అవలేదు :) I look forward to the Telugu version by Kamal and Venkatesh. If anybody can follow/better NShah, it is KHasan. Your review 7/10.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము