టింగురంగని సందేహాలు

ముల్లు:

"ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు - ఎక్కడో గుచ్చావు చాపముల్లు"

అన్ని వర్గాలనూ కదిలించిన పాట. "సుప్రీం హీరో మఱియు మెగాస్టార్ అయిన మిమ్మల్ని... నిన్నగాకమొన్న చిత్రసీమలో అడుగుపెట్టిన నగ్మా 'బే' అనడమేమిటి? ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేకున్నాను." అని ఒక అభిమాని తన రక్తంతో లిఖించి చిరంజీవికి పంపించాడని 'ఇండియా టుడే'లో చదివాను ఆ కాలంలో.

"ఏం పాటలో ఏం ఖర్మో, రాబోయే కాలంలో ఇంకా ఏమేం వినాల్సొస్తుందో!" -- మరో వర్గం

"ఏం పాట!! నా సామిరంగా... ఏమి స్టెప్పులూ...!!!" -- ఇంకో వర్గం

నాకు మాత్రం ఇవేవీ పెద్దగా పట్టలేదు. ఈ పాటలో 'స్‌సోడాకొట్టు అలా అలా విస్కీకొట్టు ఇలా ఇలా' అనేటప్పుడు బాలు గొంతు తాగిన చిరంజీవి గొంతుమాదిరే వుంటుందికదా అనుకుంటే, చిత్ర కూడా తాగినట్టు పాడటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పుడు మనం ఏడో తరగతి - ఎనిమిదో తరగతి ఆ మధ్యలో ఉన్నాం. సినిమాలు అందనంత దూరంలో ఉండేవి. పాటలు మాత్రం ఊర్లో వినబడుతూ ఉండేవి. కొన్నాళ్లకు రేడియోలో కూడా వచ్చాయి.

చాపముల్లేమిటి చాపముల్లు? చేపముల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. చేపముల్లయితే ఎవరో గుచ్చడమేమిటి? నమిలేటప్పుడో మింగేటప్పుడో అదే గుచ్చుకుంటుంది. కాబట్టి చా౨పముల్లే అయివుంటుంది అనుకున్నాను. ఈత చాపలకు ముళ్లుండే అవకాశం ఉంది. మామూలు చాపలనయినా గరుకు నేలమీద ఈడిస్తే ఆ పుల్లలు చెదిరి ముళ్లుగా మారతాయి. గుచ్చుకొంటాయి. వీటిని కూడా ఎవరో గుచ్చడమేమిటి?

~~~~~~
దరువు:

ఛమకు ఛమకు ఛాం పట్టుకో పట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
సరే అలాగే పట్టుకుందాం

ఝణకు ఝణకు ఝాం చుట్టుకో చుట్టుకో చంపెదరువులే వెయ్య
చుట్టుకుందాంలేగానీ, ఈ చంపెదరువులేమిటి? ఎక్కడివీ దరువులు?
కెన్యూ గివ్మీ సమ్ ఐడియా? :-)

~~~~~~

చంద్రుళ్లో వుండే కుందేలు:

... ఈ పాట కాదుగానీ.., కుందేలు సంగతి చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నాను. మొన్నీమధ్యనే చూశాను చంద్రునిమీద కుందేటి ఆకారాన్ని. ఇలాంటి ఆకారం అమెరికా భూభాగం నుండి చూస్తేనే కనబడుతుందా, భారతభామి నుంచి కూడా కనబడుతుందా అని నాకు సందేహం కలిగింది. కాస్త గూగులించి చూశానుగానీ సమాధానం దొరకలేదు. ఎందుకీ సందేహమంటే, చంద్రుని ఒకవైపు మాత్రమే భూమినుంచి కనబడుతుంది, మరోవైపు ఎప్పటికీ కనబడదు అని...
ఎక్కడో చదివినట్టు ఉన్నాది నాకు
...
ఫిఫ్త్ క్లాసునా సిక్స్త్ క్లాసునా - సెవెన్స్త్ క్లాసునా టెన్త్ క్లాసునా ...

ఏదైనా పాట గుర్తుకొచ్చిందా? ఏ సినిమాలోదో చెప్పుమరి! తెలిసి కూడా చెప్పకపోయావో... ఏం జరుగుతుందో నీకు తెలుసులే. చందమామను గురించి కాకపోయినా చందమామ చదివే వుంటావు. :-)

~~~~~~

చాంగుభళా
:

చక్కని తల్లికి చాంగుభళా ... అన్నాడు అన్నమయ్య. ఎక్కడిదీ పదం? చాంగుభళా అంటే ఏమిటి? పొద్దున లేచినప్పటినుంచి పాడుకోవడం కాదు, టింగేమిటే రంగేమిటీ అని ఆలోచిస్తే కదా సూరీడు నెత్తుటి గడ్డలాగ అగుపించేది.. ఆఁ?!

కామెంట్‌లు

RG చెప్పారు…
చంపెదరువులు అనేది వేటూరి గారి పన్ అయిఉంటుందని నా అవమానం... ఆ పాట వేటూరి రాసారోలేదో నాకు తెలియదు... కాని అదో గట్-ఫీలింగ్ అంతే :)
Naveen Garla చెప్పారు…
నిజమే సుమీ...
అవును సుమీ ఏమిటి ..ఇదిఎక్కడిదీ? ;)
కొత్త పాళీ చెప్పారు…
చంపె దరువులు కాదు .. బహుశా ఝంపె అయుంటుంది. ఝంపె అనేది సంగీతంలో తాళరీతుల్లో ఒకటి.
పొద్దున్నే పరమ పవిత్రమైన పాటని గుర్తు చేశారు :)
రవి వైజాసత్య చెప్పారు…
ఛాంగుభళా, "గమ్మత్తుగా" మరాఠీ పదమనుకుంటా
రాఘవ చెప్పారు…
"ఏంది బే ఎట్టాగ ఉంది ఒళ్లు" పాటా, "చమక్కు చమక్కు ఛాం" పాటా వేటూరివారివే అని నా గాఠి నమ్మకం.

అది చేపముల్లే అనుకుంటాను (దీనికి చాలా లోతై...న అర్థం ఉందని ఎవరో ఇంకెవరితోనో చెప్తూండగా విన్న గుర్తు). చంపెదరువులా చెంపదరువులా? చెంపదరువులు కాకపోతే క్రొత్తపాళీవారు చెప్పినట్టు ఝంపె దరువులు అయ్యుంటాయి.

నాకు తెలిసినంతలో ఏ దేశమైనా కుందేలు కనబడవలసిందే. చంద్రుడికి భ్రమణకాలం పరిభ్రమణకాలం సమానం కాబట్టి.

అలాగే చాంగుబళా సాంగుభళా రెండు ప్రయోగాలున్నాయనుకుంటాను. వసుచరిత్రలో అనుకుంటా చూసిన గుర్తు. పరాక్ బహుపరాక్ లాంటిదే ఇదీను.
ఊకదంపుడు చెప్పారు…
ఝంపె దరువులే, వేటూరివారికి మాత్రం సంగీతజ్ఞానం తక్కువా.
జానకి గారనుకుంటా ఒత్తుతో సహా పాడారు. ఓ సారి వినండి ( చూడకండి :) )
http://www.musicplug.in/songs.php?movieid=1291
80 లలో వచ్చిన తెలుగు సినిమా పాటల సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.
ఇలాంటిదే "గుంతలకిడి గుంతలకిడి ..." . కూడా
బాగున్నాయి మీ సమ్ దేహాలు. చాలా ట్యూనులు తమిళ్ నుండి రావడం వల్ల వాడిన తెలుగు పదాలు కిట్టించినవై కూడా ఉండచ్చు. పాడేవాళ్ళ నోట్లో మరికాస్త మార్పులకి లోనైతే సరేసరి. ఈమధ్య వస్తూన్న ఓ సీరియల్లో "కడువింతైన అతివల కధ వినరా" అన్న పదాలని ఆ గాయనీమణి "నడుమింతైన అతివల కధ వినరా" అని వినిపించేలా పాడింది.
Chivukula Krishnamohan చెప్పారు…
అది ఝంపె దరువులేనండి. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసింది. మీ చాపముల్లు సందేహం ఇదే పాటలో తీరి ఉండాలే. (ఈతముల్లులా ఎదలో దిగెరో జాతివన్నెదీ జాణ). సిరివెన్నెల వారి కలానికి అప్పుడప్పుడు వేటూరి వారి గంధం అంటిందనిపిస్తుంది. ఆ కలానికి రెండు వైపులా పదునే. - ఈతముల్లులా ఎదలో దిగెరో ఛాతివన్నెదీ జాణ అని పాడేసుకుంటూ ఉంటారు కొంతమంది.

అలాగే బలపం పట్టి భామ బళ్ళో ... అని ఓ పాట ఉంది. నిర్మాత ఇంకా మసాలాతో పాట కావాలంటే విసిగిపోయిన శాస్త్రిగారు అయితే బలపం పెట్టి భామ ఒళ్ళో అని మార్చుకోండి అనేసారుట. (పాపం శమించుగాక)
ఇలాంటి పదప్రయోగాలకి మాత్రం వేటూరివారిని చెప్పుకునే ఇంకెవరినైనా తలచుకోవాలి. ఇలాంటి పదబంధాల్ని మీరు సహకరిస్తే పొద్దులోనో, వికీలోనో పెడితే... తెలుగు సంస్కృతికి మనం చేసే ఉడతసాయం అవుతుంది. ఏమంటారు? :)
ఊకదంపుడు చెప్పారు…
చివుకుల కృష్ణమోహన్‌ గారు,
సిరివెన్నెల గారిదా, ఇప్పుడే తెలిసిందండీ. నెనరులు
వారి కలానికి అన్ని వైపులా పదునే.
రానారె చెప్పారు…
ఘంపెదరువులన్నమాట. అందరికీ కృతజ్ఞతలు.

నవీన్ సందేహానికి సమాధానం? సుమీ అనే మాటకు వ్యుత్పత్తి కావాలి.

రవి, మరాఠీ పదమని ఎందుకనిపించింది?

రాఘవా, చంద్రునికి భ్రమణ, పరిభ్రమణకాలాలు ఒకటే కాబట్టి భూమ్మీదినుంచి ఒక ప్రాంతంలోని జనాలకు ఎప్పుడూ ఒకటే పార్శ్వం కనబడుతూ వుండాలి. అంతేకాక భూగోళంమీది ఒక ప్రాంతంవారికి కనబడే చంద్రుని పార్శ్వం మరొకప్రాంతంవారికి కనబడే చంద్రుని పార్శ్వం వేరువేరు అయివుండాలి కదా?

"భలేపాట కదూ!" అనే అర్థం వచ్చేలా 'సాంగు'భళా అని విరవడం చూశాను ఏదో పత్రికలో.

ఆచార్యా, నడుమింతమైనవారే సినిమాలొదిలి సీరియళ్లలోకొస్తున్నారుగనుకనేమో? :)
రాఘవ చెప్పారు…
రానారెగారండోయ్... ఒహసారి http://en.wikipedia.org/wiki/Moon చూడండి. :)
రానారె చెప్పారు…
రాఘవా, (జా౨)పిల్లిని వికీపీడియాలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నా పని. చాలా థాంక్సు. :-)
Bhãskar Rãmarãju చెప్పారు…
"౨" దీన్ని రాయటం ఎలా?
రానారె చెప్పారు…
మీరు ఇన్‌స్క్రిప్ట్ వాడుతున్నట్టయితే కుడిAlt+2 తో "౨" వ్రాయొచ్చు. ఇది మన తెలుగు అంకె 2 అంతే. కుడిAlt+3 తో "౩", +4 తో "౪" ఇలా.
Ajit Kumar చెప్పారు…
ఛాంగురే బంగారూ రాజా, ఛాంగుఛాంగురే బంగారూ రాజా...
చెంగు చెంగునా గంతులు వేయండీ ఓ..జాతివన్నె బుజ్జాయిల్లారా..
చాంగుభళా అంటే ఎగిరి గంతేసినంత ఆనందం కావచ్చు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము