~~ కలకాలమొకటిగా ~~

ఆ దారి ఎర్రమన్ను, కంకరలతో తయారయింది. ఇరువైపులా సర్కారుతుమ్మచెట్లు దట్టంగా పెరిగివున్నాయి. నలుగురు మిత్రులం ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నాం.

రాత్రి వర్షంపడి వెలసినట్టుంది. దారిమధ్యలో వున్న గుంతల్లో నీళ్లు నిలచివున్నాయి. పొద్దింకా పొడిచినట్టులేదు. వాతావరణం చల్లగా వుంది. ఆ దారి ఒక మలుపుతిరిగాక మాకు కొద్దిగా ముందు ఒక పన్నెండు-పదమూడేండ్ల పాప మెల్లగా నడుస్తోంది. పాత పావడా, పొడుగాటిజాకెట్టూ వేసుకుని, మొన్నెప్పుడో అల్లుకున్నజడతో మురికిగా కనిపిస్తోంది. మా నలుగురినీ గమనించినట్టే వుంది. నడుస్తూ మేము ఆ పాపకు దగ్గరగా చేరుతున్నాం. నేను పాపనే గమనిస్తున్నాను. అప్పుడా పాప తన తలమీదుగా దేన్నో వెనుకకు విసిరింది. అది గాలిలో వుండగానే నాకు తెలిసిపోయింది - గ్రెనేడ్‌. అది నేలను తాకగానే మా ముఖాలు మాడిపోతాయి, పాపతోసహా అందరి శరీరాలూ ఛిద్రమౌతాయనే ఊహ కలిగి, నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను.

గ్రెనేడ్ కిందపడింది. పడి దొర్లుతోంది. కూజామూతిలాంటి దాని మూతినుండి నల్లమందు, మినమినా మెరుస్తున్న లోహపురవ్వలు ఒలికి ఎర్రటి మట్టిపై పడుతున్నాయి. దానికి ఇటువైపు మేము, అటువైపు పాప. పాప ఇటు తిరిగింది. గ్రెనేడ్ మా మధ్యలో నిశ్చలంగా వుంది. బొమ్మగ్రెనేడ్ కానేకాదది. మేము ఒకరిముఖాలొకరం చూసుకున్నాం. పాపముఖంలో ఏమాత్రం నిరాశగాని, భయంగాని, కోపంగానీ లేవు. ఇంకా ప్రాణాలతోవున్నామని తెలిసి నేను గట్టిగా ఊపిరిపీల్చుకున్నాను.

ఈ పాప ఎందుకిలా చేసింది? గ్రెనేడ్ ఆ పిల్ల చేతికి ఎలా వచ్చింది? నాకు మనసుకు వెంటనే తట్టింది - తీవ్రవాదానికి ఇదో కొత్త అవతారమని. భయం ఆవరించింది. ఆ పాప పరిస్థితికి విపరీతమైన బాధకలిగింది. పాప ఎదురుగా మోకాళ్లమీద కూర్చొని, "అమ్మా! ఇట్లాంటి పనులు చెయ్యొద్దు తల్లీ, అందరమూ హాయిగా బతుక్కుందాం. ప్రాణాలు పోతే మళ్లా రావు. నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు ..." ఇట్లా ఏదేదో మాట్లాడుతున్నాను. నా ఆందోళన పాపను చేరలేదు. నామీద ఆమెకు నమ్మకంగాని, అపనమ్మకంగానీ కలిగినట్టు కనిపించలేదు. "మాతో రా" అంటూ దారివెంట నడిపించుకుని ముందుకే పోతున్నాము.

క్రమంగా ఆ దారి పల్లమవుతూవుంది. ఆ పల్లంలో దారికడ్డంగా ఒక చిన్న వంక. ఆ వంకనీళ్లు మెల్లగా పారుతున్నాయి. మోకాటెత్తుకు జానెడు కిందేవుంది నీటిమట్టం. ఆ నీళ్లలో కాళ్లీడుస్తూ వంక దాటాం. ఎవ్వరమూ ఏమీ మాట్లాడటం లేదు. వంకపారుతున్న శబ్దం వినిపిస్తోంది. క్రమంగా మేం నడుస్తున్నదారి వెడల్పుగా, కొంచెం బురదగా తయారవుతోంది. దారికిరువైపులా సర్కారుతుమ్మ, కానగ, కాకిబుర్ర గుబుర్లు, జిల్లేడు చెట్లతోపాటు చిక్కగా ఏపుగాపెరిగిన జమ్ము కూడా వుంది. అది పల్లం కావడంతోనూ, చుట్టూ చెట్లుండడంతోనూ కొంచెం మబ్బుగా వుంది. బురద దాదాపుగా మోకాటి లోతువరకూ వుంది. సర్కారుకంపముళ్లు వుంటాయేమోనని నా అనుమానం. ఈ బురదలో కాలికి ముల్లుదిగితే చీముపడుతుంది, తొందరగా మానదేమోనని భయం. అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ నడుస్తున్నాం.

జారిపడతామనే భయంతో మా కంటికి ఒక బారడు కన్నా ఎక్కువదూరం చూడకుండా సుమారైనదూరమే వచ్చేశాం. ఉన్నట్టుండి ఘు‌ర్‌ర్‌ర్రుమని శబ్దం. తలెత్తి చూద్దుముగదా, బురదమధ్యలో పడుకొనివుందొక ఎలుగుబంటి. మా ఐదుమందిలో యడమవైపు నడుస్తున్న ఇద్దరు రయ్యమని ఆరు బారలు వెనక్కు పరిగెత్తి నిలబడినారు. పరుగెత్తవద్దు అని చెబుతూనే వున్నా వినేస్థితిలో వాళ్లు లేరు. పాప, నేనూ, ఒక మిత్రుడుమాత్రం ఎలుగుబంటికి దగ్గరగా మిగిలినాము. వాళ్లిద్దరూ నాకు చెరోవైపునా వున్నారు. అది మా ముగ్గురినీ చూస్తోంది. అందరికీ భయంగానే వుంది. వెనుకకు తిరిగితే వచ్చి మీదబడుతుంది, ముగ్గురమూ దగ్గరగా నిలబడదాం రండి అన్నాను. ఎలుగుబంటిని సూటిగా చూస్తూ, భయపడినట్టు కనిపించకుండా, ఒక్కో అడుగూ వెనక్కు వేద్దాం అనుకుంటున్నాను.

అంతలో బురదనీళ్లలో మునిగిన నా కుడికాలి మడమ దగ్గర చిన్న అలజడి. కాకిబుర్రలో, కానగాకులో అయుంటాయిలే అనుకున్నాను. వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది - జలగలేమో అని. ఎనుములు (బఱ్ఱెలు) బురదనీళ్లలో దిగినప్పుడు వాటి పొదుగులకు జలగలు కరుచుకొని, సాయంత్రం అవి ఇంటికొచ్చేవరకూ కూడా రక్తం పీలుస్తూనే వుంటాయని మా అవ్వగా చెప్పగా విన్నాను. అవి ఎంత రక్తం తాగినా మనకు తెలీదని, ఒకసారి కరచుకున్నాయంటే ఇగ్గపెరికినా ఊడిరావని, కాబట్టి అవి వుండే బురదనీళ్లలో దిగకూడదని కూడా చెప్పింది. కానీ జలగలను నేనింతవరకూ చూళ్లేదు.

ఇప్పుడు నా కాలిమడమ దగ్గరున్నది జలగలేనేమో అనే ఊహ రాగానే, అమ్మో, ఎన్ని జలగలుంటాయో, ఎంత వేగంగా నా రక్తంమంతా తాగేస్తాయో, వాటిని నా చేతులతో పట్టి లాగితే వస్తాయా, మొత్తం ఎన్నివుంటాయో అనుకుంటూ నా ఒళ్లంతా జుగుప్సామయమైపోయి, కాలిని బలంగా విదిలిస్తూ నిద్రనుండి లేచి కూర్చున్నాను.

కూర్చోగానే బాగా దప్పికగొన్నానని తెలిసింది. నీళ్లు తాగాను. జలగల గురించి మా అవ్వ నా మెదడులో గీసినచిత్రమే నాలో జుగుప్సను కలిగించింది. చిన్నప్పుడు గొంగళి(బొచ్చు)పురుగులను చూస్తే ఈ భయం వుండేది. చేలలో మళ్లలో అవి సర్వసాధారణం కదా! రైతుకుటుంబం నాది. పురుగులను చూసి భయపడితే కుదరదు. అదేపనిగా వాటిని దగ్గరగా చూసి, చేతులమీద పాకించుకొని, కొన్నిరకాల గొంగళులే సీతాకోకచిలకలుగా మారుతాయని తెలుసుకున్నాక ఆ భయం పోయింది.

నిన్న తెల్లవారుజా౨మున నా కొచ్చిన కల ఇది. నాకు మామూలుగా కలలు రావు. ఒకవేళ వస్తాయనుకున్నా, వచ్చినట్టు నాకు తెలీదు. మళ్లీ నాకు కల ఎప్పుడొస్తుందో తెలీదు, వచ్చినా గుర్తుంటుందో లేదోనని ఇక్కడ రాసిపెడుతున్నాను. ఇంతకూ కలలో నాక్కనిపించి సంఘటనలకూ, రోజూ నేను చేస్తున్న ఆలోచనలకూ, ఇప్పుడు నేనున్న పరిస్థితులకూ, ఆలోచిస్తే, కొంత సామ్యం వుందనే అనిపించింది.

కలలు నిజమవుతాయా? తెల్లవారుజా౨మున వచ్చిన కల నిజమవుతుందా? అలా అయేట్లయితే బ్లాగులోకాన రానారె అనే పదార్థం మీకు తెలిసే అవకాశంలేదు. ఎందుకంటే 1998వ సంవత్సరం ఆఖరులో ఒక తెల్లవారుజా౨మున నేను కన్న కల నిజం కాకపోవడం వలన, నాతోసహా ముగ్గురు మానవుల జీవితాలింకా కొనసాగుతున్నాయి.

ఒక మాట: ఈ టపా శీర్షిక ఒక తియ్యటి పాటలో వినిపిస్తుంది. పాడుకోండి చూద్దాం!

కామెంట్‌లు

సిరిసిరిమువ్వ చెప్పారు…
కథ అనుకుని చదవటం మొదలుపెట్టా, ఏంటబ్బా మీ శైలికి భిన్నంగా వుంది అనుకుంటూ చివరికి వచ్చేటప్పటికి అది మీ కల అయింది. మన కలల్ని ఇలా అక్షరబద్దం చేయకలిగితే ఎన్ని కథలవుతాయో! కలలకి జీవితంలో జరిగే సంఘటనలకి, మన ఆలోచనలకి చాలా సామ్యం వుంటుంది.

ఇక మీరు చెప్పిన పాట పాతాళభైరవిలో "ప్రణయ జీవులకు దేవి వరాలే" పాటే కదా!
సుభద్ర చెప్పారు…
chala andam gaa vivaramgaa bagarasaru.
ilane rastu undandi.
అజ్ఞాత చెప్పారు…
కల అయినప్పటికీ, పసిపాప చేతి లో గ్రనేడ్ - తీవ్రవాదానికి కొత్త అవతారం కావడానికి అవకాశాలు లేకపోలేదు. భయపడవలసిన విషయమే ఇది. మీ శైలి చాలా బాగుంది.
చైతన్య.ఎస్ చెప్పారు…
>>1998వ సంవత్సరం ఆఖరులో ఒక తెల్లవారుజా౨మున నేను కన్న కల నిజం కాకపోవడం వలన, నాతోసహా ముగ్గురు మానవుల జీవితాలింకా కొనసాగుతున్నాయి. హ..హా

బాగుంది. చక్కగా అక్షరబద్దం చేసారు.
రాధిక చెప్పారు…
నాకు ఇండియా ప్రయాణం వుంది అన్నప్పటి నుండీ ఒకటే కలలు.మా విమానాన్ని ఎవరో హైజాక్ చేసినట్టు,ఉగ్రవాదులమని అనుమానించి విమానాశ్రయంలో ఆపేసి ఇంటరాగేషను చేస్తున్నట్టు,అమెరికాలో ఇండియన్స్ ని చంపుతున్నటుగా ఎవరో ఏ మూలనుండో నన్ను కాల్చ్జేస్తున్నటు. ఇప్పుడేమో మీకల.పైకి చెప్పుకోవట్లేదు గానీ ఎంత భయం లో బ్రతుకుతున్నామో చూడండి. రెండు మూడేళ్ళ క్రితం అయితే రేపు పరీక్షలయినా ఇంకా చదవాల్సినది పూర్తిచెయ్యలేనట్టు,రేపు ఇంగ్లీషు పరీక్ష అయితే నేను సైన్సు చదువుకుని వెళ్ళినట్టు...ఇలా వస్తూ వుండేవి.
cbrao చెప్పారు…
అందరికీ కలలొస్తాయి. కలలో నిత్యం మనము ఆలోచించే లేక అభిలషించే విషయాలే గోచరమవుతాయి. కలకు అక్షర రూపమివ్వటంలో మీ ప్రయోగం సఫలం. మీ కలల రాణి ని కూడా ఇలాగే పరిచయం చేయ కోరుతాను.
రానారె చెప్పారు…
సిరిసిరిమువ్వగారు - ఇది కల అని ముందే చెబుదామా వద్దా అనుకుంటూనే రాయడం మొదలుపెట్టాను. రాయగలగాలిగానీ, మీరన్నట్టు కలలు కథావస్తువులుగా గొప్పగా పనికొస్తాయనుకుంటా. పాట పాతాళభైరవిలోదే. మీరు గూగులమ్మను అడగనవసరం లేకుండానే చెప్పగలిగారనుకుంటా.

సుభద్ర, బాబు, చైతన్యగార్లకు - నెనరులు.

రాధికగారూ - ఒక్క భయంలోనేనా? మన చుట్టూ భయానకంతో పాటు నవరసాలు అన్నీకూడా ఎప్పుడూ వుండేవేకదండీ. అన్నిటిమధ్యా బ్రతుకున్నాంగానీ, మానవులం ఒకోసారి ఒకో రసానికి అతిగా స్పందిస్తామనుకుంటా. ఎందుకంటున్నానంటే అంతా భయపడుతున్న సమయంలో ఒకోసారి భయం కలగదు, కనికరం చూపాల్సిన సమయంలో కరుణకలగదు. కానీ ఒకోసారి అతిగా స్పందించడం గమనిస్తూవుంటాం. ఈ స్థితులేనీ స్థిరం కాదని నాకనిపిస్తుంది. స్థిరం సాధించనవాడు స్థితప్రజ్ఞుడు. వాణ్ణి గ్రెనేడ్లు, ముళ్లు, బురద, జలగలు, ఎలుగుబంట్లూ, హైజాకులు, ఇంటరాగేషన్లూ, ఇంగ్లీషుపరీక్షలూ కలదల్చలేవు. చాలా విషయాలు చెప్పేస్తున్నట్టున్నాను. ఈపాటికి నేనొక శ్రీకృష్ణపరమాత్మలాగా కనిపిస్తూవుండాలే! :)

సీబీరావుగారూ, కృతజ్ఞతలు. కలలరాణి కలల్లో వుంటేనే బావుంటుంది, మీకు తెలియనిదేముందీ! :)
రాధిక చెప్పారు…
"ఈపాటికి నేనొక శ్రీకృష్ణపరమాత్మలాగా కనిపిస్తూవుండాలే!" :)
Dr.Pen చెప్పారు…
@శిష్యుడు
"అమ్మా! ఇట్లాంటి పనులు చెయ్యొద్దు తల్లీ, అందరమూ హాయిగా బతుక్కుందాం. ప్రాణాలు పోతే మళ్లా రావు.>>> నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు ...<<<"

@గురువు
"మొన్నటి కబుర్లలో మా సద్గురు బోధ .. దయ ముఖ్యం అని చెప్పాను. ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు కూడా కరుణ ముఖ్యం అన్నారు. >>>ఒక్కోసారి మనం ఏదో మనసు దిగజారిపోయిన దిగులు దిగులు గుబుల్లో ఉండగా, ఎక్కడో ఎదురు చూడని మూల నించి, అస్సలు పరిచయం లేని కొత్తవ్యక్తి దగ్గర్నించి మనమీదికి దయ ప్రసరిస్తుంది.<<< ఆ క్షణంలో దయ కురిపించిన వారూ, పుచ్చుకున్న మనమూ .. ఇద్దరమూ మన మానవత్వాన్ని దృఢపరుచుకుంటాం. నిజమే, దయ ముఖ్యం. కరుణ ముఖ్యం."

- ఆణిముత్యాలు!!!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము