Monday, December 08, 2008

కాళ్లకూరు పాలరైతుల సత్యాగ్రహం

మిత్రులారా,

మన దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయాల్లో అవినీతిని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అసహనంతో రాజకీయనాయకులను తిట్టుకోవడం, లేదా -సమాజంలో మార్పు రావాలి- అనుకోవడం వరకూ తరచుగా జరుగుతూ వుంటుంది. ఆ తరువాత పెద్దగా జరిగేదేమీ ఉండదు. దీనికి -ఇవన్నీ పట్టించుకుంటే నా జీవితం నడవాలి కదా- మొదలుకొని ఎన్నో కారణాలు చెబుతాం. నామాటకు వస్తే నాకు ఓటువేసే వయసు వచ్చి పదేళ్లయినా ఓటరుజాబితాలో ఇంతవరకూ నా పేరు నమోదు కాలేదు. అయినా నేనూ, నాబోటివాళ్లూ రాజకీయాల గురించి అసంతృప్తిని వెళ్లగక్కే హక్కు మాకున్నట్లుగా నిస్సిగ్గుగా మాట్లాడుతూనే వుంటాం.

ఎందుకు? నాకు తోచిన కారణాలు ఇవీ:

చిన్నప్పటి నుంచీ మార్కులు, రాంకులూ, ఆపైన ఒక ఉద్యోగమో వ్యాపారమో సేద్యమో, వ్యక్తిగతంగా మన కాళ్లపై మనం నిలబడటం తప్ప - మనం ఈ సమాజంలో పౌరులం, మనమంతా కలిసికట్టుగా వుండి కొన్ని పనులు చెయ్యగలం, ఈ పనులవల్ల మనకు కలిగే బలం ఇదీ, సమాజంలో భాగస్వాములం కావడంవల్ల మనకు కొన్ని చిన్నచిన్న బాధ్యతలుంటాయి, వాటిని నెరవేర్చడాన్ని చిన్నప్పటినుంచే అలవాటు చేసుకోవాలి అనే భావనను కలిగించిన సంఘటనలుకానీ బోధనలుకానీ మన బళ్లనూ ఇళ్లలోనూ (కావలసినంతగా) లభించకపోవడంవల్ల. అందర్నీ తోసుకుంటూ ముందుకొచ్చి నిలబడగలిగితే అదే మొనగానితనం అన్నది మాత్రం బాగా ఒంటబట్టడం వల్ల.

'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదని..'

శ్రమైక అనే పదానికి కలసికట్టుగా శ్రమించడం అనే అర్థమున్నట్టు తెలిసినా, శ్రమను ఒంటబట్టించుకున్నంత తీవ్రంగా 'ఏకత'ను కూడా పట్టించుకోవాలని చెబుతున్నారు కాళ్లకూరుగ్రామంలోని పాలరైతులు. ధర్మబద్ధంగా జీవిస్తాం అంటున్నారు. అన్నట్టుగానే జీవిస్తున్నారు. ఇప్పుడు -అవినీతిని ఎదిరిస్తాం- అంటున్నారు. అందుకోసం వీళ్లెవరిమీదికో యుద్ధానికి పోవడం లేదు. మరి వాళ్లేమి చేస్తున్నారో వారిమాటల్లోనే వినండి.

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****


మేలుకొన్నాం

కాళ్ళకూరు పరిసర పాలరైతులం (కెయంపి)


పెద్దలకు, సోదర సోదరీమణులకు, పిన్నలకు నమస్కారములు. మీ అందరిలోని పవిత్రతకు పరమార్థతకు వందనాలు. మేము చెప్పేది నిజ జీవితంలో జరిగే మా పాలరైతుల కథ.

కాళ్ళకూరు గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం కొందరం కలసి -కెయంపి- ని ప్రారంభించాం. ఇపుడు 160కి పైగా సభ్యులం ఉన్నాం. మాలో సుమారు 100 మందికిపైగా ఆస్తులు లేని కూలిరైతులమే.


1. పాలలో నీరు కలపటం పూర్తిగా మానివేశాం.

2. పాలు విక్రయించి సంపాదించిన ప్రతీ రూపాయకు 3 పైసల చొప్పున ఆదరణనిధి'కని కేటాయిస్తున్నాం. సుమారు నెలకు 6000/-రూ. వస్తున్నాయి.

ఈ 3 పైసలు పరమ పవిత్రమైనవి.

  • ఇందునుండి 40 మంది వృద్దులకు ప్రతినెల 50/-రూ. చొప్పున ఇస్తున్నాం.
  • కాళ్లకూరు గ్రామంలోగల 8 పాఠశాలలలో సుమారు 445 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరకు రోజూ సురక్షిత మంచినీటిని ఉచితముగా అందిస్తున్నాం (12 లీటర్ల పట్టే-22 టిన్నులు).

3. 2008వ సంవత్సరంలో 350,000/-రూ. సదుపాయం చేసి ప్రజల ఆరోగ్యసంరక్షణకై సురక్షిత మంచినీటి ప్లాంటును (U-V tretment Plant- Water Health India/Naandi) కాళ్లకూరు గ్రామంలో కట్టించినాము.


ఈవిధంగా క్షృషి, నిజాయతీ, కరుణ అనేటి మానవవిలువలను మా జీవన విధానంతో అనుసంధానం చేసుకొన్నాం. దీనివలన మా అందరకు ఎన్నడూ లేని, అమితమైన సంతృప్తి, ఆనందము కలిగింది. ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. మెలుకువ వచ్చింది, అవగాహనాశక్తి పెరిగింది.

ప్రజా పరిపాలనా విధానానికి ఓటుహక్కే ప్రాణం అని పూర్తిగా గ్రహించాం.

మనదేశంలో ఓటునూ మానవత్వాన్నీ నీచంగా అమ్ముకోవటం, కొనుక్కోవటం మామూలు అయిపోయిందనేది అందరకూ తెలిసిందే. అమ్ముకొనేవాడు అమ్మేసుకొంటున్నాడు, కొనుక్కొనేవాడు కొనేసుకొంటున్నాడు, ఇక నోరెత్తకుండా పిరికిపందలవలే ఇదంతాచూస్తూ కూర్చునేవాళ్లూ కూర్చుంటూనే ఉన్నారు.

ఈవిధంగా ఇంచుమించుగా అందరం ఏదోరూపంలో ఈ అవినీతిలో పాలుపంచుకొంటున్నాం. ఒకరినొకరం దూషించుకొనే సమయంలేదు, అందరం కలసి సమాజాన్ని రక్షించుకోవలసిందే.

ఇంతటి దౌర్భాగ్యస్థితికి మూలకారణం ఏమిటా అని దీర్ఘంగా ఆలోచించాం.

భయంకరమైన సత్యం బయటపడింది, గుండె దడదడా కొట్టుకుంది, కాళ్ళువణికాయి, చెమటపట్టింది.

ఈ పాపానికంతటికీ మేమే, మేమే పూర్తిగా మూలకారణమని వివరణమైంది.

(మేము అజ్ఞానులమై, నీచంగా ఓటును అమ్ముకోవటమే అన్నిటికీ మూలకారణం, మరొకటి కాదు.)

మరి ఎందుకని ఇంతకాలం మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నాం?

ఒక్క 10 నిమిషాలు సావధానంగా ఆలేచించలేక. అంతే.

నిలదొక్కుకొని నిదానంగా ఆలోచించసాగాం. కొన్ని పరమ సత్యాలు మాకు తెలియ వచ్చాయి.

--- అసలు మంచితనం లేని మానవుడు ఎక్కడైనా ఉంటాడాండీ! దాన్ని ఎంతలోతులో కప్పెట్టాడో అనేది, వేరేసంగతి.

--- ప్రతీమనిషీ మంచిని నేర్చుగోగలడు, కావాలనుకొంటే.

--- క్రితంచేసిన తప్పులగురించి వాపోవటం ఒకటే సరికాదు - వాటిని సరిదిద్దుకొని మంచిమార్గంలో నడవడటమే- మనం చేయవలసిన ధర్మం.

--- అందరూ మనకు స్నేహితులే, విరోధులు లేరు.

ఈవిధంగా ధైర్యం తెచ్చుకొని, ఒక పవిత్రమైన శపథం చేశాం, మేమందరం కలసి.


మానవత్వాన్నీ ఓటునూ అమ్ముకోం' అని.

మా నిర్ణయాన్ని ఈక్రింది విధంగా వ్యక్తం చేస్తున్నాం. కొన్నిటిని మా తలుపులపై కూడా అంటించిపెట్టుకున్నాం.

"పంటలు పండిస్తాం - పాడి పశువులను పోషిస్తాం-!

ధర్మ మార్గంలో జీవిస్తాం - అవినీతిని ఎదిరిస్తాం -!

వృద్ధులను ఆదరిస్తాం - సమాజాభివృద్ధి సాధిస్తాం-!

ఓటును - మానవత్వాన్ని అమ్ముకోం !!"

మేము కె.యం.పి. రైతులం...!


"మేము యాచకులం కాము, పోషకులం,

మానవ విలువలను పోషిస్తాం, మానవులుగా జీవిస్తాం -!"


అని అంటూ మా జీవన విధానంలో ఆచరించి చూపుతున్నాం.


"ఓటును అమ్ముకోను,

అది పెంటమీద కూడు

బీదలమని హేళన చేయకురా-!

నీతిగా బ్రతుకరా-!"

... కాళ్ళకూరు నివాసి

కష్ఠించి, నిజాయతీగా, కరుణా భావంతో జీవిస్తే మనం బ్రతకటానికి సరిపడా డబ్బు దానంతట అదేవస్తుంది, లక్షాధికారులం కాకపోవచ్చు- కాని -- గుండెమీద చేయేసి చెప్పొచ్చు -- ‘నేను ఒకమనిషిలా బ్రతికానురా' అని.

అంతకంటే ఏంకావాలండీ మనిషికి! ఏంచేసుకొంటామండి అవినీతిగా సంపాదించిన కోట్లరూపాయలతో!!

ఎన్నికలలో ఇంకా బలవంతంచేస్తే ఈవిధంగా జవాబివ్వగలం-

"నేనూ ఒక మనిషినే, నాకూ పరపతి ఉంది.

ఎంత దుర్మార్గంరా! నన్నూ నా ఓటునూ కొనటానికి వచ్చావా!

తక్షణం నా ఇంట్లోంచి బయటకు ఫో" అని.


సహృదయులైన మీఅందరకు నమస్కరించి మేము కోరుకొనేది ఏమంటే- మనందరం కలసి ఓటును అమ్ము కోకుండా నీతిగల వ్యక్తులను ఎన్నుకుంటే, దేశంలోని రాజకీయపు అవినీతినంతటినీ ఒక్కసారిగా అంతంచేయవచ్చు.

ఎంత మేధావికైనా, ధనవంతుడికైనా ఉన్నది ఒకటే ఓటు.

ప్రజా పరిపాలన -- సంఖ్యల్లో ఆధారపడిఉంటుంది. అందుకని మనపై చాలా బాధ్యత ఉంది.

కులమత భేదాలను రెచ్చగొట్టే రాజకీయపు అవినీతికి మనం బలైపోకూడదు, శ్రద్ధ తీసుకోవాలి. విడదీసే శక్తులు చాలాఉన్నాయి, వాటినిగురించి జాగ్రత్తపడాలి.

మనదైన రాజ్యంలో మనలనే యాచకులుగా చేసే ఈ రాజకీయపు అవినీతి అంతమైతేనేగాని ప్రజలకు శాంతి సుఖాలు కలగవు.

దీనికని ఇతరుల ప్రాణాలను తీయనక్కరలేదు, మన ప్రాణాలనూ అర్పించనక్కరలేదు. మనం చేయవలసిందల్లా ఓటును అమ్ముకోకపోవటమే. అంతే.

ఇదే ప్రజాస్వామ్యంలోఉన్న గొప్పదనం.

ఇది మనకు సాధ్యం.

-భారతమాతకు జై-

ఇట్లు,

వినయ విధేయతలతో

కాళ్ళకూరు పరిసర పాల ఉత్పత్తిదారులు.


***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

త్వరలో ఎన్నికలొస్తున్నాయి. వీళ్లు చెప్పేదంతా చేతల్లో చూపగలిగితే ఇంకేముందీ! ప్రస్తుతమున్న రాజకీయపోకడల పునాదులే కదిలిపోతాయి. ఈ పునాదులపైనే మహాసౌధాలను కడుతూ బతుకుతున్నవాళ్లు చూస్తూ ఊరుకుంటారా? దాన, భేద, దండోపాయాలను ప్రయోగించక మానుతారా? కాళ్లకూరు పాలరైతుల్లోని ఈ చైతన్యం ఎన్నికలసమయంలో నిలబడుతుందా?

తెలుగుసీమలో ఎక్కడుందీ కాళ్లకూరు? అక్కడి రైతుల్లో ఈ చైతన్యాన్ని మేలుకొల్పిన వారెవరు? వారికి సహకారం ఎక్కడినుంచీ వస్తోంది? వారి ఆశయానికి ప్రధాన విఘ్నాలేమిటి? ఇంతవరకూ వారు సాధించిన విజయాలేమిటి? మనం చేయగలిగిందేమిటి?

వారిని చూసి మనం గర్విస్తున్నామని, వారి స్ఫూర్తితో మనలోనూ కాస్తయినా కదలిక కలుగుతోందనీ వారికి తెలియజేయగలిగితే అంతేచాలు.

మనముంటున్న, చూస్తున్న సమాజంలో ఇంతటి మహత్తరమైన సామాజిక చైతన్యం కనిపిస్తోందంటే అదెక్కడుందో ఈపాటికి మనలో కొందరికైనా తెలిసేవుండాలి. కాళ్లకూరు పాలరైతుల కృషిని నిజాయితీని, కరుణను, శ్రమైన జీవన సౌందర్యాన్నీ దగ్గరనుండి చూసినవారు మన బ్లాగు పాఠకుల్లో కనీసం ఒకరైనా వుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే, "అందరూ మనకు స్నేహితులే, విరోధులు లేరు" అని గుర్తెరిగి, ఆత్మశుద్ధికోసం నిజాయితీగా ప్రయత్నిస్తున్నవారి జీవితం. ఇది గాంధీజీనాటి సత్యాగ్రహానికి సరిసాటి అని నాకనిపిస్తోంది!

1 comment:

రాకేశ్వర రావు said...

ఇలాంటి ఇంకో గ్రామం గుఱించి నేను విన్నాను.
వారి వూరికి వోటు అడగడానికి వస్తే, నిలదీసి అడిగి, చివరకి వారికి నచ్చిన అభ్యర్థికి కలసి వోటేస్తారంట. అలా వూరు చాలా బాగుంటుందని విన్నాను.

ఈ మధ్య నగరాల్లో అందరూ Enough is enough అంటున్నారు గాని, ఏఁవో సమయం వచ్చే సరికి ఎవరు ఏం చేస్తారో తెలియదు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.