యథా ప్రజా తథా రాజా!

మొన్నటినుంచి వార్తలు చూసి చూసి మెదడు అలసిపోయింది. బాంబుపేలుళ్లు, కాల్పులూ చిన్నప్పటినుంచి వింటూనే వున్నాను చూస్తూనే వున్నాను. కాకపోతే ఈసారి చాలా తేడా కనిపిస్తోంది.

నాకేమనిపిస్తోందంటే ...

బారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కిచిడీ పార్టీ ఎవరు అధికారంలో వున్నా ... దేశప్రజల్లో అశేషంగా వున్న అజ్ఞానాన్ని పొదిగి వృద్ధిచేసేవాళ్లే. నగరాల్లో ఏరియాలను పంచుకొని దందా సాగించే మాఫియాలకూ, పరిపాలనా కాలాన్ని పంచుకొని దందా సాగిస్తున్న పార్టీలకూ తేడా ఏమీ లేదు. ఈ రెండు పరిస్థితుల్లోనూ సామాన్యునికి అభద్రతే.

మొన్నీమధ్యే ముంబయ్ రైలుపేలుళ్ల బీభత్సం జరిగిన వెంటనే నిముషాల్లో యథాతథ పరిస్థితి నెలకొంది, స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అన్నారు. సంతోషమే. స్పిరిట్ సరే, మంచిదే, వుండాల్సిందే. ఇష్టారాజ్యంగా బాంబులు ఎట్లా తయారౌతున్నాయి, ఎక్కడబడితే అక్కడికి ఎలా చేరుతున్నాయి, పేలుతున్నాయి అనే మాటకంటే స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అనే మాటే ఎక్కువగా వినిపించింది. కారణం మనకు బాంబు పేలుళ్లు కొత్తకాదు.

తాజాగా జరిపిన దాడితో ఉగ్రవాదులు 'కొంచెం కొత్తగా ఆలోచించండ్రా' అనే సందేశాన్ని మన జనానికి చేరవేయడంలో మొదటి అడుగు వేసినట్టున్నారు. ఎప్పటిలాగే 'తీవ్రంగా ఖండిస్తున్నాం' అనే రొడ్డకొట్టుడు మాటతో చేతులుదులుపుకోవడానికి దేశ నాయకులు వెరచేలా చేయగలిగినట్టున్నారు. మాకు ఫలానా విషయాల్లో బలగం సమృద్ధం కావాలి అని భద్రతాదళాలు కాస్త గొంతుపెంచి గట్టిగా అడిగేలా చేయగలిగినట్టున్నారు. ముసలినక్క లాంటి రోగిష్టి ప్రభుత్వం, గోతికాడ నక్క లాంటి ప్రధాన ప్రతిపక్షం, అసలు సమస్యను అలవాటుగా పక్కనపెట్టి ఒకరినొకరు నిందించుకునే ముందు కొంతైనా మనస్సాక్షిని సంప్రదించే పరిస్థితి కలుగుతున్నట్టు నాకనిపిస్తోంది.

'గత ప్రభుత్వం ఏం చేసిందిగనక, ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి! వీళ్లలో ఎవరు అధికారంలో వున్నా ఒరిగేదేముంటుంది! అందరూ స్వార్థపరులే.' అనే గందరగోళం సామాన్యునికి కలిగించడంతో పాటు, 'ముందు నేను సరైనవాణ్ణయితే కదా దేశ నాయకుల నుంచి సరైన పాలన ఆశించడానికి!' అనే అంతశ్శోధన దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మనందరిలో కలిగి నిరంతరంగా కొనసాగుతూ వుండాలంటే ఇలాంటి దాడులు ఇంకెన్ని జరగాల్సి వుందో!

ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారీ ముస్లిములను నిందించడం ఎక్కువగా జరిగేది మొన్నమొన్నటిదాకా. ఈమధ్య మసీదుల్లో, మార్కెట్లలో, రైల్వేస్టేషన్లలో కూడా దాడులు జరగడంతో ఒకింత ఐకమత్యం వచ్చినట్టుంది. ముంబయ్‌లో దాడి జరిగితే ముంబయ్ అంతా ఒకటైనట్టుంది. రాజ్ థాకరే రాజకీయం ఏమౌతుందో చూడాలి. మొత్తానికి జనంలో ఒక్కసారిగా కదలిక రావాలి అంటే ఆంగ్లేయుల పాలనలో జరిగినట్టు భారతీయులందరికీ ఒక్కసారిగా కష్టం కలగాల్సిందేనా!?

భారతదేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతోంది. అంతే స్థాయిలో అవినీతి కూడా అభివృద్ధి చెందుతోంది. స్వార్థం, బంధుప్రీతి, తాత్కాలిక స్వప్రయోజనాలకోసం ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కే నాయకులు ...

అభివృద్ధికోసం జరిగే పనుల అమలులో అవినీతి జరగడం ఒకప్పటి మాట. ఏకంగా ప్రణాళికలను రూపొందించడంలోనే స్వప్రయోజనాలకోసం అవినీతికి పాల్పడుతున్నట్టు స్పష్టమౌతున్నా తలెత్తుకొని ప్రజల్లోకి రాగలుగుతున్న నాయకులు ...

పార్టీలకు అతీతంగా ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. పరిమిత పరిపాలనా కాలంలో వీలైనంత 'స్వార్థాన్ని' ఆర్జించడానికి జరుగుతున్న ఈ పోటీలో దేశరక్షణనే పణంగాపెట్టే నాయకత్వం మన సుకృతం అయ్యేరోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది ...

శతాబ్దాల క్రితం ఎవరో ఒక ఆక్రమణదారు అన్న మాటలు - 'భారతదేశం ఒక సౌందర్యరాశి. బలవంతుని కౌగిలికై ఎప్పుడూ అర్రులు చాస్తూ వుంటుంది'. ఆనాటికీ ఈనాటికీ ఏమైనా మార్పు కనిపిస్తోందా అని నా అనుమానం. మనం మరింత నిజాయితీగా, ఒక సంఘంగా మెలగవలసిన అవసరం వుంది. బస్టాండులో మనం టీ తాగిన తరువాత ప్లాస్టిక్ గ్లాసును పడేయటానికి చెత్తబుట్టను వెతకడంతో ఈ సంస్కరణను మొదలుపెట్టవచ్చు.

మన జీవితాల్లో ఇలాంటి ఒక చిన్న మెరుగు చాలు మనం ఒక సంఘంగా బ్రతకడం మొదలవడానికి. ఇలాంటి ఒక చిన్న మెరుగు చాలు మన మునిసిపాలిటీ పనివారికీ అధికారులకూ వాళ్ల పని పట్ల కాస్త ఉత్సాహం కలిగించడానికి. ఇలాంటి ఒక చిన్న మెరుగు చాలు మనం వోటర్లం కాకముందు మనుషులమని మన నాయకులకు గుర్తు చెయ్యడానికి.

మనలో సాహసులకూ, త్యాగమూర్తులకూ కొదవేమీలేదు. 'ఖండిస్తున్నాం' అనే మాట వినడానికి మనకు ఎంత చిరాకుగా వుంటుందో, 'అశృనివాళి, కన్నీటివీడ్కోలు' వగయిరా మాటలు మన సాహసులకూ త్యాగమూర్తులకూ అంతేననుకుంటా. ఖండించడంతో పాటుగా ఏదైనా పనికొచ్చే పని చెయ్యమని మనం నాయకులను అడుగుతున్నట్టే, అశృనివాళి, జోహారులతో పాటు మనమూ ఏదైనా చెయ్యాలి కదా!?

కామెంట్‌లు

చాలా బాగా చెప్పారు. మార్పు,సంస్కరణ అనేది మన దగ్గరనుంచే ప్రారంభమవ్వాలి.
Sujata M చెప్పారు…
అసలు చిన్నప్పట్నించి ఈ 'ఖండిస్తున్నాం!' అన్న రాజకీయ పదమే అర్ధం కాలేదు. అసలు ఎవరు దేనిని 'ఖండించినా..', నాకు గాయం సినిమాలో కోట శ్రీనివాసరావు గుర్తొస్తారు.

చాలా బాగా చెప్పారు.
దేవన చెప్పారు…
రా నా రే గారు, మీతో వంద శాతం ఒప్పుకుంటాను.

rise or fall of any race or nation will start from the home - ఇప్పుడు మన దేశం వున్న పరిస్థితులకు మనమే కారణం. మన స్థాయి ని బట్టే మన నాయకులు వుంటారు. అప్పుడే బీజేపీ చేసిందేమీ లేదు, ఇప్పుడు కాంగ్రేసు చేయబోయేది ఏమి లేదు.

10,000 వేల సంవత్సరాలు ఇతర రాజులు దాడి చేసారు, ఇక రాబోయే పది వేల సంవత్సరాలు ఇలా వుగ్రవాదులు దాడి చేస్తూనే వుంటారు.
ప్రేమించామనీ,వంచించబడ్డామనీ,తెగనరికామనీ,తెగించలేకపోయామనీ,
కుళ్ళిపోతూ,కుమిలిపోతూ,భయపెడుతూ,భాదపడుతూ,కాష్టం వైపు నడిస్తే
నీ ఆత్మకూడా వెంట రాదు.
నమ్మిన వంచకాలు,నమ్మని నిజాలూ,ఆశించిన ధామలూ,అనుభవించని శవాలూ,ఇవికాదు...మన చావుకు కారణాలు!!!
ఏ సంబంధం వుందని..ఉన్నిక్రిష్ణన్ తెగించాడు?
నువ్వేమవుతావని..సాలస్కర్ సాగిపోయాడు?
నా ఒక్కడితో ఏమవుతుందనుకుంటే???
వందకోట్ల మనల్ని రక్షిస్తున్న
జవానులు ఎంతమందుంటారు?
లోపల నీ ఆనందం కోసం
బయట..తమ గుండెకాయల్ని పేర్చి
కాపుకాస్తున్న ఆ త్యాగాలకు
మనమందిస్తున్నదేంటి?
చావంటీ అందరికీ ఒకటే..
మనిషికీ ముష్కరులకీ
మరి..చచ్చాక..
బ్రతుకింకా ఉండేది ఎవరికీ?
మనకోసం మరణించిన
వీరులకి నివాళులివ్వాలంటే..
మన చావుకూ పవిత్రత వుండే..
జీవితాల్ని ప్రేమిద్దాం,
మన ప్రేమే వారికి దన్నుగా
దేశమాత సన్నిధిలో తరిద్దాం.
"ఈ పదాలు చాలు..మనిషన్న వాడికి ఆత్మ సోధన చేసుకోడానికి"..
ఈ పైపదాలు శ్రీఅరుణం గారి బ్లాగ్ లో చదివాను..నిజంగానె మార్పు అనేది మనతోనే ప్రారభం కావాలి, మన అలోచనల్లోంచే..అదీ ఎప్పుడో కాదు..ఇప్పుడే ఈక్షణమే..
అజ్ఞాత చెప్పారు…
మనం మారాలంటే మనమధ్య డైనమేట్లు పేలాలి,
డైనమోలు తిరగాలి, కాళరాత్రి కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి అన్న తిలక్ మాటలు గుర్తొచ్చాయి.
అజ్ఞాత చెప్పారు…
చెప్పవలసినది మీరు, బ్లాగర్లు, చెప్పేసారు, చెబుతున్నారు కూడాను.

" బస్టాండులో మనం టీ తాగిన తరువాత ప్లాస్టిక్ గ్లాసును పడేయటానికి చెత్తబుట్టను వెతకడంతో .."

ఇలా ఒక్కో వారం ఒక్కొక్కటి మన బ్లాగర్లమే పాటిస్తే? రెడ్డి గారు, ఆలోచించండి., వీలయితే, ముందుండి ఆరంభించండి.
Unknown చెప్పారు…
అవునండి.ప్రతిదీ మనదగ్గరే మొదలు కావాలి.మన ఇంట్లో చెత్తను ఇంటి బయటి కాళీ స్థలంలో కాకుండా మునిసిపాలిటీ వారి చెత్తకుండీ వరకైనా చేర్చే ప్రయత్నం మొదలు పెడదాం.
రానారె చెప్పారు…
ఈరోజు మధ్యాహ్నం భోజనాల సమయంతో నా సహోద్యోగమిత్రుడొకమాటన్నాడు. ఉగ్రవాదుల దాడి తరువాత ఈసారి ముస్లిము మతపెద్దల నుంచీ ఖండనలూ సంఘీభావాలు మునుపటికన్నా ఎక్కువగా వినిపిస్తున్నాయని.

నేనన్నాను - దేశప్రజలను ఒకతాటిపై నడిపించే శక్తి ఉగ్రవాదప్రస్తుతరూపానికి వున్నట్టుంది. రకరకాలుగా జనాన్ని విడగొట్టే రాజకీయ శక్తులకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎప్పటిలాగే మరచిపోయి ఎవరిపనుల్లో వాళ్లు పడేలా, వాళ్లిప్పుడు ఏదో ఒకటి చెయ్యాల్సివస్తోంది - అని.

విమానాశ్రయాల్లో దాడులు చేస్తాం - అనే ఈమెయిలొకటి రాగానే విమానాశ్రయాలను పోలీసులతో నింపడం, మరోచోట దాడిచేస్తాం అనే పుకారు వినబడగానే అక్కడా పోలీసులతో నింపేయడం .. ఇలాంటివేవో చేసి సమర్థవంతంగా పనిచేస్తున్నాం అనిపించుకోవడం ప్రస్తుత విధానంగా కనిపిస్తోంది.

'రండి కలిసిపోరడదాం', 'ఉగ్రవాదానికి భారతదేశం మోకరిల్లదు', 'ఈదారుణం ఫలానావాళ్ల పనే' ... లాంటి స్టేట్‌మెంట్లు మాత్రం తక్కువేమీ కాలేదు.
చైతన్య.ఎస్ చెప్పారు…
>> అంతే స్థాయిలో అవినీతి కూడా అభివృద్ధి చెందుతోంది. స్వార్థం, బంధుప్రీతి, తాత్కాలిక స్వప్రయోజనాలకోసం ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కే నాయకులు ...

అన్నింటికి ఇదే కారణం, బాగా చెప్పారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం