జగజ్జేత - చెంఘిజ్‌ఖాన్
"మానవునిలో వుండే బలహీనత లన్నింటిలోనూ, యితరుల బాధచూసి ఓర్చలేకపోవటం వంటి దురదృష్టకరమైన బలహీనత మరొకటి లేదు. ఏ రకం కిరాతుడిలోనైనా సరే, ఇది యే మూలనో ఒక మూల యింతో అంతో అణగి వుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాళ్లు, ఎంత లావు ధీశాలినైనా సరే, ఇట్టే కూలదీసివేయగలుగుతారు. తండ్రి, తను కోరిన వస్తువు ఇవ్వకపోతే, బిడ్డ అన్నం తినకుండా ఏడుస్తూ మంచంలో యెదుట పడుకుంటుంది. భర్త చెప్పినమాట వినేవాడు కాకపోతే, భార్య ఏడుస్తూ కూర్చుని వాణ్ణి లొంగదీస్తుంది. కానీయో దమ్మిడీయో పారవెయ్యకపోతే, మొండి బండాడు కత్తితో చెయ్యో కాలో కోసుకుంటానని మనని బెదిరిస్తాడు. పెళ్ళాంమీద కోపమొస్తే మొగుడు అన్నం తినకుండా మొండిచరిచి పడుకుంటాడు. ఈ రకంగా మానవునిలో వుండే యీ మహా దౌర్బల్యాన్ని ఆధారం చేసుకుని, వొత్తిడి తీసుకురావడంవంటి హిజాడ పని మరొకటి లేదు. న్యాయమైన పద్ధతిని ఎదుటివాడికి నచ్చచెప్పలేక, కొంతమంది ఇలాంటి నీచమైన పిరికిపద్ధతులు అవలంబించుతారు."
12, 13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను - తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా మలచి, తెన్నేటి సూరి చేసిన సాధికారిక రచన చెఘింజ్‌ఖాన్ నవల. యాభైమూడేళ్లకు ముందు ప్రథమ ముద్రణ పొందిన ఈ నవల ఎవ్వరికీ కొత్త కాకపోయినా, నేను ఇటీవలే చదవడం తటస్థించింది. చదవడంలో నేను పరమనిదానం. ఒకో వాక్యాన్ని పట్టి పట్టి చదవనిదే ముందుకు పోవడం నాకు తృప్తిగా వుండదు. అలా మామూలుగా చదువుకుంటూపోతే అందని ఏదో మహత్తును ప్రతి వాక్యంలో/పేరాలో/పేజీలో రచయిత దాచి వుంటాడనే అనుమానం నాకు. వేగంగా చదవలేకపోవడం నా బలహీనతే కావచ్చుగానీ దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా వున్నాయి, అది వేరే విషయం. అలాంటి నాతో ఏకబిగిన చదివింపజేసిన పుస్తకం ఇదే. ఎంతో ఉత్కంఠగా చదువుతూపోతున్నా, అందులోని కొన్ని కొన్ని వాక్యాలు నన్ను కాసేపు ఆపి, మళ్లీమళ్లీ చదివింపజేశాయి. అలాంటి వాక్యాలన్నింటిలో నాకు ముందుగా గుర్తుకొచ్చేవి పై వాక్యాలు.
కాగా, నాకు కొంత నవ్వు తెప్పించి, కొంత ఆశ్చర్యపరచిన ఆసక్తికరమైన మాటలు ఇవీ (టెమూజిన్-బుర్టీల పెళ్లిచూపుల సన్నివేశం)...
"మన మామూలు అందగత్తెలకూ, బుర్టీకి చాలా తేడా వుంది. కలువల్లాంటి కళ్ళూ, పువ్వుల్లాంటి బుగ్గలూ, తామరతూళ్లలాంటి చేతులూ, నల్లికిల పాముల్లా మెలితిరిగిపోయిన వ్రేళ్లూ, సన్నగా ఈచుకుపోయిన ఊగిసలాడే నడుము - ఇలాంటి క్షయరోగి బాపతు ఆడదికాదు బుర్టీ. అలంకార శాస్త్రజ్ఞులు అందగత్తెగా అంగీకరించకపోతే పోతారుగాక, ఆరోగ్యవంతుడైన యే మొగాడికైనా ఆ రూపం చూడ్డం తోటే వెర్రెత్తి పోతుంది. కొంచెం పొట్టికురచ మనిషి. తెలివితేటలు ఉట్టిపడుతున్న తీవ్రమైన కళ్లు. నిట్టూర్పుకు నిట్టూర్పుకు ఉవ్వెత్తుగా లేచిపడుతున్న బరువైన చనుకట్టు. గుఱ్ఱపు వెన్నులాంటి బలమైన నడుం."
మీరిదివరకే ఈ పుస్తకాన్ని చదివివున్నా సరే, మళ్లీ తప్పక చదవండి. చదవనివాళ్లకు ప్రత్యేకంగా చెప్పాలా? ఈ నవలలో ఎన్నో మనస్తత్వాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో వర్ణనలు, ఎన్నెన్నో ఆలోచనలు... బ్రేవ్‌హార్ట్, ఎపోకాలిప్టో లాంటి మెల్‌గిబ్సన్ చిత్రాలు కలిగించలేని ఉద్వేగభరిత సన్నివేశాలు మీ కళ్ల ముందు కదలాడతాయని, మీ మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉపయోగకరమైన కొన్ని ఆలోచనలను ఈ నవల మీలో కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. విశాలాంధ్రవారి అంగళ్లలో తప్పకుండా దొరుకుతుంది. వెంటనే దాడిచెయ్యండి. లేదా అంతర్జాలంలో అజోవిభోవారిద్వారా తెప్పించండి.
కామెంట్‌లు
పూర్ణిమ
sUTU bODgaa baT TengrI TemUjin khAkhAn, tennETi sUri jindAbAd...
అలాగే, ఒమార్ షరిఫ్, హాలివుడ్ నటుడు ఆ పాత్రలో జీవించాడు అంటే అతిశయోక్తి కాదేమో.
ఈ బ్లాగ్‌లోకంలో చాలా మంది ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు.
పూర్ణిమా, మీరొక మంచి నవలని మిస్స్ అవుతున్నారు.
వంశీ గారు ఆ ప్రతిని బైండ్ చేసి దాచుకోవాలి.
http://www.eenadu.net/archives/archive-18-9-2008/sahithyam/display.asp?url=maha167.htm
పుస్తక పరిచయంలో మొదటి పేరా (emotional blockmailing మీద)బావుంది.యాదృచ్చికంగా నేనూ అదే అంతర్మథనం లో ఉన్నాను., కొంత కాలంగా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.