రసికవతంసుడు - టైపాటు

రాజ భోజ రవితేజ దాన జిత కల్పభూజ జోహార్
నీదు ... సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

పై పంక్తులు ఎవ్వరివో ఎక్కడివో అందరికీ తెలుసు. ఈ పాటను కనకపోయినా కనీసం వినియైనా వుంటారు. ఇందులో "..." ఏమిటో ఎవరైనా చెబుతారేమోనని ఈ టపా రాస్తున్నాను.

అసలింతకూ నాకీపాట ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న ఒక పుస్తకంలో రసికవతంసుడు అనే పదం చదివాను. ఎవరా రసికవతంసుడు అంటే, రాయలవారు. మనకు తెలిసిన కృష్ణదేవరాయల సంగతి కాదు, తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాథరాయల సంగతి. ఈయన గురించి ఏం చెప్పారంటే "1600 మొదలు 1630 వరకు తంజావూరును పాలించిన పండితకవి రఘునాథనాయకుడు, కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక అంతకుమించినవాడని ఎంచదగిన ఆంధ్రభోజుడు. శత్రువులను నిర్మూలించుటలో అవక్ర పరాక్రమశాలి. జనరంజకముగా దేశాన్ని పరిపాలించుటలో నేర్పుగల రాజనీతి నిపుణుడు. సహృదయులు మెచ్చేటట్లు రసభావకవిత సంస్కృతం, తెలుగు రెండింటిలో చెప్పగల విద్వత్కవి. నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించగలిగిన సంగీతశాస్త్ర నిపుణుడు, మేధావి. యజ్ఞనారాయణ దీక్షితులు, మధురవాణి, రామభద్రాంబ మొదలగు కవిశిరోమణులను తీర్చి దిద్దగలిగిన ప్రతిభాశాలి. యక్షగాన రచనముతో, నాటకశాలా వికాసంతో కళాభ్యుదయానికి తోవచూపిన రసికవతంసుడు. వేయిమాటలెందుకు ఆంధ్రనరపాలులలో ఇంతటివాడు లేడు అని చెప్పదగిన బహుముఖ ప్రజ్ఞానిధి."

ఇది చదవగానే 'జోహార్' అనుకున్నాను. నరపాలుడు, రసికవతంసుడు అనేపదాలను చదవగానే సినారె రాసిన "సరిలేరు నీకెవ్వరూ" అనే పాట గుర్తొచ్చింది. కానీ ఈ పాటలోనేమో - రసికావతంస అన్నారు. రసికవతంస అనలేదు. బ్రౌణ్యం వుంది కదా మన సందేహాలు తీర్చడానికి. వెతికి చూస్తే రెండూ సరైనవేనని చెప్పింది. వతంసము, అవతంసము రెండున్నాయి, రెంటి అర్థమూ ఒకటే.

రసిక+వతంసుడు=రసికవతంసుడు - ఇది సమాసమౌతుందేమోగానీ సంధి కావడానికి వీల్లేదనుకుంటాను. సమాసమైతే ఏ సమాసమో మీరే చెప్పాలి.

రసిక+అవతంసుడు=రసికావతంసుడు - సవర్ణదీర్ఘసంధి - పేచీలేదు. ఔనా?

ఏదేమైనా ఒక(రెండు) కొత్త పదానికి అర్థం తెలిసింది, చాన్నాళ్ల తరువాత ఒక మంచి పాట గుర్తొచ్చింది. వెంటనే వినే అవకాశం కల్పించిన చిమటా వారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను.

పుస్తకంలో రసికవతంసుడు అనేది చూసి, "అచ్చుతప్పేమో, రసికావతంసుడు అని కదా వుండాలి!" అనుకున్నాను.

అంతర్జాలంలో ముఖ్యంగా వేగుల్లోనూ బ్లాగుల్లోనూ కనిపించే అచ్చుతప్పులను అచ్చుతప్పులు అనబుద్ధి కాదు నాకు. ఎందుకంటే మనమేమీ అచ్చువేయడం లేదు. టైపించుతున్నాం. టైపించడంలో జరిగిన పొరపాటును అచ్చుతప్పు అనడం చాలా కాలంగా నాకు నచ్చలేదు. ప్రత్యామ్నాయం దొరక్క అలాగే అంటూ వచ్చానిన్నాళ్లూ. ఎలాగూ టైపు చేయడాన్ని "టైపించు" అంటున్నాం కనుక అప్పుడు జరిగే పొరపాట్లను "టైపాట్లు" అందామని ఈరోజే నిర్ణయించేశాను.

టైపించుటలో పొరపాట్లు, టైపులో లోపాలు, టైపరుల పాట్లు గనుక వీటిని టైపాట్లు అని పిలవడం బాగుందనిపించింది. దీనికి ఏకవచనం టైపాటు అనగా typo.

ఇక నుంచీ కీబోర్డుతో టైపించేటప్పుడు జరిగిన పొరపాట్లను టైపాట్లు అందామనుకున్నాను. అంతేగాదు, టైపాటును అచ్చుతప్పు, అప్పుతచ్చు, ముద్రారాక్షసం, రుద్రాక్షఫలరసాయనం, అభిజ్ఞానశాకుంతలం, దక్షయజ్ఞం, దశగుణంభవేత్ లాంటి పేర్లతో పిలవడం మానేస్తున్నాను.

మన సినిమా హాస్యనటుడు సునీల్ స్టైల్లో ... ఏఁయాఁ!? :-)

కామెంట్‌లు

teresa చెప్పారు…
హ, శీర్షిక చూసి 'ఓహో, ఏ రసికావతంసుడికో టై కట్టుకోడం రాక పాట్లు పడుతున్నాడు గావున'నుకున్నా.
ఈ కొత్త పదం నచ్చలేదు గానీ చక్కటి పాట వినిపించినందుకు థాంకులు.
Purnima చెప్పారు…
తెరిస్సా గారు: మీ కమ్మెంటు అదరహో! :-))

రానారె గారు: టైపాటు అంతగా బాగుందనిపించటం లేదు, కానీ సూచించడానికి ఏమీ తోచటం లేదు. అయినా.. అప్పుతచ్చు, ముద్రారాక్షసం, రుద్రాక్షఫలరసాయనం, అభిజ్ఞానశాకుంతలం, దక్షయజ్ఞం, దశగుణంభవేత్ లాంటి పేర్ల.. లాంటి వాటికన్నా, ఇదే మేలేమో నాలాంటి వాళ్ళకి. :-)

పాటను పరిచయం చేసినందుకు నెనర్లు!
teresa చెప్పారు…
@ Purnima- Thanks. ఇప్పుడంతా గొలుసు టపాల హవా నడుస్తోంది కదా. ఇది పట్టుకుని 'టై కట్టుకోడమెలా,"టై నాట్లూ-రకాలూ"
'మీ సూట్ ని టై తో మేచ్ చేశారా' గట్రా టపాలు రాయొచ్చు. *కాదేదీ బ్లాగుకనర్హం *మీ బ్లాగుకి మీరే సుమన్!
అజ్ఞాత చెప్పారు…
@రానారె - ఎవరూ కనిపెట్టకపోతే పదాలెలా పుడతాయి? వేసుకోండి - ఒకటి - తెలుసుగా -వీరతాడు.

టై - పా - టు అబ్బో! కానీండి - కొంచెం కష్టంగానే ఉందండి - అయినను, ఇచ్చిన వీరతాడుని వెనక్కి తీసుకునేదే లేదు..
అజ్ఞాత చెప్పారు…
పదం కొత్తగా ఉంది, కొత్త పదం కదా అందుకే నే్మో. మీరు ఖచ్చితంగా రైటర్ అయిపోతారు త్వరలో ...
తంజావూరు రఘునాథ నాయకుడు ఇంతటి సకల కళా వల్లభుడని నాకు ఇంతక ముందు తెలీదు. ఇతగాడి గురించి చదవాల్సిందే.

టైపాట్లు - పూర్తి తెలుగు పదం కాకపోయినా వెరైటీగా ఉంది. నాకు నచ్చింది. నా తరపు నుంచి కూడా ఒక వీరతాడు.
Ramani Rao చెప్పారు…
తెరెసా గారి కామెంట్ అదరహో! అలవాట్లో పొరపాటు, గ్రహపాటు, టైపాటు. పదాలన్నీ 'పాటు ' తోటే ముగుస్తాయి కాబట్టి ఇహ ఎవరూ పాట్లు పడనవసరం లేక, నా పొరపాటు టైపాటు కి మన్నిచండి అనాలేమో, రానారే గారు! బాగుంది కొత్త పదం. మంచి పాట. నేను తరుచూ వింటూనే ఉంటాను. మరోసారి తలచుకొనేలా చేసినందుకు నెనర్లు.
Niranjan Pulipati చెప్పారు…
బాగు బాగు.. నా కామెంటు లో టైపాటు లేకుండా చూసుకోవాలి.
అజ్ఞాత చెప్పారు…
టైపాటుకు నావోటు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం