పొద్దుపోని యవ్వారం - 6

"హరికేన్ గురించి నీకేమైనా తెలుసా?"
"అట్లాంటిక్, తూర్పుపసిఫిక్ మహాసముద్రాల్లో పుట్టిపెరిగే వినాశకరమైన సుడిగాలి-వా"

"అట్లాంటిక్ ఇట్లాంటిక్ లాంటి జవాబు ఎవరినడిగినా చెబుతారు"
"మరి ఎట్లాంటిక్ జవాబులు కావాలి నీకు?"

"దాన్ని హరికేన్ అని ఎందుకంటారో తెలుసా?"
"ఏదో ఒకటి అనాలి కదా"

"ఎందుకురా పెళ్లి చేస్కున్నావంటే - రాసిపెట్టుంది, చేస్కున్నానన్నాడంట వెనకటికెవడో."
"నీకు తెలిస్తే నువ్వే చెప్పరాదా!"

"ఆంగ్లమున. అట్లాంటిక, పసిఫిక తీరములందు పాపం పెరిగినపుడు శ్రీమహావిష్ణువు ఝళిపించే బెత్తమే హరికేన్. ఆంగ్లభాషనందూ ఎస్పన్యోలునందూ హరి హరియే. బెత్తమనగా కేన్. ఆంగ్లమున."
"మోకాటికీ బట్టతలకూ ముడిబెట్టినట్టుంది"

"దైవలీల అలాగే వుంటుంది. తెలుగులో బెత్తం అని పలకడం చేతగాక bastón అని పలుకుతాడు ఎస్పన్యోలు శాన్యోరు. caña అని కూడా అంటాడు."
"మోకాటికీ బట్టతలకూ కాదు, కాటికీ నీబొందకూ ముడిబెడితే బాగుండును దైవలీల"

"...!!?"


******************************

మానవుడు నిస్సహాయుడై చూస్తుండిపోయేలా ఒక మహాద్భుతాన్ని ఈ ప్రకృతి చేస్తే చూడాలనే కోరిక ఒకటుం(డే)ది నాకు.

ముక్కావారి పల్లె ఆం.ప్ర. గురుకుల పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఒక నాటి వెన్నెల రాత్రి మా భోజనగృహానికి బయట విద్యార్థులమందరమూ ఎర్రటి మట్టి రోడ్డు మీద, పొడవైన ఆరు వరుసల్లో కూర్చుని భోజనం చేస్తున్నాం. ఆకాశంలో చంద్రునికి కొంచెం పక్కగా పెద్ద పళ్లెమంత పరిమాణంలో రంగు రంగులు పువ్వు విరపూసి మాయమయింది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ... CNBC, విప్రో వారి లోగోల్లోని రంగులు అవి. అందరమూ అబ్బురంగా చూశాం. కొన్ని క్షణాల్లో మరో సారి అదే అద్భుతం కనిపించింది. తారాజువ్వ పేలినట్టు కాదు, నీటిలో రంగులు వ్యాపించినట్టు మెల్లగా. ఎందుకలా జరిగిందో మా కెవరికీ తెలీలేదు. అది ఎంత ప్రమాదకరమైనదైనా సరే ఒకసారి నేల మీదకు దిగితే చూద్దామనిపించింది.

మొన్నటి హరికేన్ ఐక్ ఎక్కడో ఆఫ్రికా తూర్పుతీరాన గల సూడాన్‌లో మెల్లగా పుట్టి, ఆఫ్రికా పడమటి తీరాన గల సెనెగల్ దేశం మీదుగా అట్లాటిక్‌ మహాసముద్రంలో ప్రవేశించి, క్రమంగా తీవ్రతరమౌతూ హైతీ, క్యూబా దేశాల్లో విధ్వంసం సృష్టించి అమెరికా తీరాన్ని తాకింది. రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో చూశాను అత్యంత అవినీతిమయమైన ప్రపంచ దేశాల్లో హైతీ ఒకటి అని. ఈ చిన్న ద్వీపాన్ని హరికేన్ ఐక్ తాకకముందు కొద్ది రోజుల వ్యవధిలోనే హానా, ఫే, గుస్తావ్ అని పిలువబడిన మూడు హరికేన్లు బలంగా నాశనం చేశాయట.

నా జీవితంలో మొదటిసారిగా నేనొక సముద్రతీరాన్ని చూసింది హ్యూస్టన్ మహానగరానికి అతి సమీపంలో తూర్పున వున్న గాల్వెస్టన్ అనే చిన్న దీవి నుండి. పాపం ఆ దీవి మొన్నటి ఉప్పెనలో ఇలా మొదలై దాదాపు పూర్తిగా మునిగింది. అదొక పర్యాటక కేంద్రం. ఇప్పుడక్కడికి ప్రవేశం లేదు.

హ్యాస్టన్‌లో నేనుంటున్న ప్రాంతం అతి తక్కువగా దెబ్బతిన్నది. జనజీవనం అస్తవ్యస్తం కావడం అంటే ఏమిటో కొద్దిగా తెలిసొచ్చింది. చాలా ఇళ్లకు విద్యుత్సరఫరా లేదు. రాత్రిళ్లు కర్ఫ్యూ. కొద్ది రోజులపాటు దుకాణాలన్నీ సాయంత్రానికే మూసేవారు. పాలూ, పెరుగూ, కూరగాయలు దొరకడం కొన్నాళ్లపాటు కష్టమయింది. నాలుగు రోజుల తరువాత మా ఇంటికి కరంటు వచ్చింది. ఆఫీసు మాత్రం యథావిథిగా నడిచింది.

విద్యుచ్ఛక్తి పునరుద్ధరణ పనులెలా జరిగాయో చెప్పితీరాలి. జనసమ్మర్ధం ఎక్కువగా వుండే అపార్టుమెంట్ల సముదాయాలకు ముందుగానూ, ప్రత్యేకంగా విడిగా వున్న ఇళ్లకు చివరిగానూ (సాధారణంగా వీళ్లు ధనవంతులు) విద్యుత్‌ పునరుద్ధరణ చేసుకుంటూ వచ్చినట్లు తెలిసింది. మన దేశంలో ఈ పద్ధతిని ఊహించగలమా?

హరికేన్ మమ్మల్ని సోకీ సోకనట్లుగా వెళ్తేనే పరిస్థితి ఇలా వుంటే, నిజంగా తాకివుంటే ఎంత దారుణంగా వుండేదో ననిపించింది. గతంలో హరికేన్ కత్రీనా తాకిన ప్రాంతంలో జరిగిన హింస, దొమ్మీల వీడియోలను కొన్నిటిని చూసి వున్నాను. దాని ప్రభావంతో ఇళ్లొదిలి వచ్చిన వారి వల్ల హ్యూస్టన్‌లో నేరాలు పెరిగాయని చెబుతారు.

ఇక్కడుంటే ముఖ్యంగా విద్యుత్ సరఫరా లేక అగచాట్లు పడాల్సొస్తుందేమోనని ఒక రోజు ముందుగానే నేను మరో ఇద్దరు మిత్రులతోపాటు ఇంకో నగరానికి వెళ్లిపోయాను. నాలుగురోజులు అక్కడ ఒక మోటెల్‌లో వుంటూ మంచి తిండీ, పేకాట, టీవీ, నిద్రలతోపాటు, తెన్నేటి సూరి నవల చెంఘిజ్ ఖాన్ ను ఏకబిగిన చదవడం నేను చేసిన ఘనకార్యం.

ఈ రోజుకు కూడా నేను ఇంటికెళ్లే దారిలో ట్రాఫిక్ లైట్లు ఇంకా పనిచెయ్యడం లేదు. సిగ్నల్ పనిచెయ్యని రద్దీ కూడళ్లలో సాయంత్రం ట్రాఫిక్ ఎంతో క్రమశిక్షణతో ఒకరి తరువాత ఒకరుగా ఆగి, ముందొచ్చిన వారు వెళ్లడం కోసం ఓపికగా వేచి, దారి తొలగి, గందరగోళానికి తావు లేకుండా సాఫీ వెళ్లడం చూస్తే ... ఈ క్రమశిక్షణ మన నగరాల్లో కూడా వుంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది.

ప్రకృతివైపరీత్యాల్లోని అద్భుతరసాన్ని ఒక అరగంట పాటు ఆస్వాదించ వచ్చునేమో గానీ, ఆ తరువాత బతికుంటే చాన్నాళ్లపాటు అనుభవించాల్సినవి భీభత్స, భయానక, చీకాకు రసాలే. హరికేన్ ఐక్ ఫ్లోరిడాకు ఉత్తరంగా అమెరికా తూర్పుతీరానికి వెళ్తుందని నిపుణులు మొదట్లో అంచనా వేశారు. "ఇటువైపొకసారి రావచ్చు కదా" అనుకున్నాను.

ఇప్పుడు నాకు తెలిసింది hurricane is no fun to be in.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
ఊహించా! హరికేన్‌ అని మీరనగానే ఇలాంటి అర్థమే చెబుతారని కూడలిలో అనుకుంటూనే ఇక్కడకి వచ్చా. నయం - ఇంకా హరి కేను మూత తెరిస్తే పొంగిన బుసబుసల బుడగలే హరికేను అనలేదు. సంతోషం.
మీకీ తుఫానుల లవ్వేమిటండి బాబూ! అంతే మరి - పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటం. కానీండి.
చైతన్య చెప్పారు…
మొన్న వచ్చిన ఈ మెయిల్ లో చూసాను... హరికేన్ సౄష్టించిన భీబత్సం. ఆ ప్రదేశాలన్నీ కోలుకొవటానికి ఎంత కాలం పడుతుందో కదా!

మీరొకసరి వచ్చిపోతే బాగున్ను... అనుకుంటేనే వచ్చి తాకిపోయిందా!!

హరికేన్ కి మీరు చెప్పిన నిర్వచనం చాలా బాగుంది... అది కూడా నిజమేనేమో!
kiraN చెప్పారు…
దూల తీరిందా అని అడగాలనుంది, కానీ ఐక్ భీభత్సానికి సంబదించిన ఫోటోలు చూసాను. చాలా దారుణంగా ఉంది పరిస్థితి.
౨౦౦౫ బొంబాయిలో
నేనుండగా వచ్చిన వరదలు గుర్తొచ్చాయి.

-కిరణ్
కొత్త పాళీ చెప్పారు…
ha ha ha.
good one.
ఇంతకీ మీ యింటో హరికెను లాంతరు ఉందా? :)
రానారె చెప్పారు…
కృష్ణమోహన్ గారూ - మీరు చెప్పిన అర్థం ఇంకా బాగుంది.

చైతూ - నిజమేనేమో, చెప్పలేం.

కిరణ్ - అడిగేసినావ్ కదా. :)

కొత్తపాళీ గారు - ఇంట్లోనే వుండాలనుకునే వాళ్లకు శ్రీహరిబెత్తపుదివిటీలు కావాలేమోగానీ, ఉడాయించే నాకెందుకని కొనలేదు. :)
Purnima చెప్పారు…
Hmmm.. interesting insight!

Btw, everything is funny as long as we are not in it, అని ఎప్పుడో చదివింది, మీ ఆఖరికి వాక్యం చూస్తే గుర్తొచ్చింది.
cbrao చెప్పారు…
While I was in Canada I learnt about the devastation in Galveston Island caused by hurricane and worried about your safety. Glad that you are o.k. Advise your phone number to me by mail.

cbrao - New York,USA.
రిషి చెప్పారు…
Good one..


ప్రకృతివైపరీత్యాల్లోని అద్భుతరసాన్ని ఒక అరగంట పాటు ఆస్వాదించ వచ్చునేమో గానీ :o)
చంద్ర మోహన్ చెప్పారు…
"హరికేన్" కు మీ నిర్వచనం బాగుంది. శివుని పోర్టుఫోలియోను విష్ణువుకిచ్చేస్తే ఒప్పుకొంటాడంటారా :-)
రానారె చెప్పారు…
చంద్రమోహన్ గారూ, భలే అడిగారు. శివుని పోర్టుఫోలియో అంటే విలయమనేనా? ఆలోచించాల్సిన మాటే. పోర్టుఫోలియోలు మార్చేయడానికిది మన మంత్రివర్గ విస్తరణ కదాయెను. :)

@రిషి - నెనరులు.

రావుగారూ, థాంక్యూ. మీరు ప్రపంచయాత్రలో వున్నట్టున్నారు!? జయప్రదమగుగాక. :)

@పూర్ణిమ - పైన కిరణేమో అడగాలనుంది అన్నారు. విహారిగారు నేరుగానే అడిగేశారు - ఆమధ్యేదో అడ్వెంచరన్నావు, అక్కడే వుండి ఒక టపా రాయరాదా అని. ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పాను. మీరు చదివిన ఇంగ్లీషు మాటకు తెలుగులో కూడా సామెత వుంది. గూగుల్లో "తనదాకా" అని వెతికి చూడండి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం