లఘు కవితలు - సర్వలఘు కందము
కవితలను చదవగానే నా బుర్ర వేడెక్కిపోతుంది. అది గొప్ప కవితైనా, మంచి కవితైనా, మామూలు తవికైనా నా మెదడు ఉష్టోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వుండవు. "కవిత్వాన్ని అనుభవించాలి అంతేగానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు" అని కొందరు శ్రేయోభిలాషులు నాతో చెప్పారు. వారి మాటలు నా తలకెక్కలేదు. కొన్ని కవితలైతే కనీసపు ప్రూఫు రీడింగ్ కూడా లేకుండా నా కంటబడతాయి. అలాగని కవితలకు దూరంగా వుంటానా వుండను. చదవడం, ఏదో అర్థమయినట్టూ కానట్టూ అనిపించి తల గోక్కోవడం ... కం. మిడిమిడి తెలివిడి తెగబడి వడివడి పరుగిడు కవితల పడిపడి చదువన్ దడదడ మని జడి కురిసెను గడగడ వణికెను భువనము ఘటములు పగిలెన్!! ... ఇదీ నా పద్ధతి. గతంలో ఇలాంటిదే ఒక తవిక కూడా తయారు చేశాను. భాషందం బ్రతు కందం అంటున్న రాకేశుని బ్లాగులో కాస్త నవీనమైన పద్ధతిలో కందపద్యాన్ని గురించిన మంచి పరిచయమొకటి చూశాను. బమ్మెర పోతన్న గారి భాగవతంలోని ఒక సర్వలఘుకందాన్ని గురించి రాకేశ్ మాట్లాడుతూ, "మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం" అన్నారు. 'అందరూ చనిపోయే ముందు' అంటే 'కలియుగాంతంలో' అని కాదని విజ్ఞ...