Monday, July 21, 2008

... చినమాయను పెనుమాయ ...

మా ఇంటికి ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో పక్షుల అరుపులు వినబడుతూ వుంటాయి. పిట్ట యెంతదైనా కూత మాత్రం ఫోన్లో ఘనంగా వినబడుతూ వుంటుంది. మామిడి చెట్ల మింద వాలే చిలకలు, కోకిలలు, పుల్లాచెదలు, గోరింకలు, కాకులు, చిన్నచిన్న గువ్వల శబ్దాలు ఎంత బలంగా వినిపిస్తుంటాయంటే ఒకోసారి 'యినబళ్ల్యా!' అనాల్సుంటుంది. పదోతరగతి దాకా ల్లెలోనే చదువుకోవడంతో చెట్లు, పుట్టలు, పిట్టలు మనకు కొత్త కాదుగానీ ఆ తరువాత దూరం పెరిగిపోయింది.

ఇదిగో ఈ కిందున్న వీడియోలో కనిపించే నలభై ఎకరాల చెఱువు చుట్టూ కూడా రెండు బారల పొద్దెక్కే దాకా రకరకాల పక్షుల శబ్దాలు వినపడుతూ వుంటాయ్. వీలు కుదిరినప్పుడల్లా పొద్దున్నే బయల్దేరి నూరు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ చెఱువును చేరి చుట్టూ ఒక సారి నడవడం నాకొక అలవాటుగా తయారవుతూ వుంది. ఇది ఆరోసారి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ వారాంతంలో వెళ్లిపోదామనిపిస్తుంది. పెద్దగా జన సంచారం వుండకపోవడం ఒక కారణం. ఉదయమే అక్కడకి చేరుకుంటే పక్షులు, నీటి జీవాలు చేసే శబ్దాలతో భలే సందడిగా వుంటుందీ ప్రాంతం. స్థూలంగా చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. గమనించే కొద్దీ చిన్నచిన్న విషయాలే విశేషాలుగా కనిపిస్తుంటాయి. ఇంతకూ ఈ మారు నేను వెళ్లేసరికి మరీ పొద్దున కావడంతో అక్కడి దారి మూసి వుంది. అదీ మంచిదే అయింది. మంచి సూర్యోదయాన్ని చూడటం కుదిరింది. చెఱువు పల్లపు ప్రాంతంలో వుంటుంది కనుక చుట్టూ చెట్లతో సూర్యోదయం ఇంత బాగా కనిపించదు.

విశేషమేమంటే ... ఆ చెరువు గట్టున కట్టిన ఒక చిన్న వసారాలో Barn Swallows అనబడే నాలుగు గువ్వ పిల్లలు (వీటిని తెలుగులో ఏమంటారో!) వాటి గూటి నుంచి ఎగరడానికి సిద్ధమవుతూ నా కంట బడినాయి. వాటిలో ఒకటి తల్లితోపాటు ఎగిరింది. మిగతా మూడూ చాలా సేపటి వరకూ గూట్లోనే వుండి తల్లి ఎగిరి వచ్చినప్పుడు పెద్దగా నోర్లు తెరుస్తూనే వున్నాయి. కానీ ఆ తల్లి ఆ రోజు ఉదయం వాటి నోటికేమైనా అందించే ఆలోచనలో వున్నట్టు కనబళ్లా. వాటిని రెండు క్లిక్కులు క్లిక్కి పక్కకొచ్చేశాను.
మెరుగైన అనుభూతి కోసం మీ కంప్యూటరు స్పీకర్ల శబ్దాన్ని కొంచెం పెంచండి.'కొంచెం వెరయిటీగా థింక్' చేసి ఆ గట్టునున్న మొక్కల మీదుగా కెమెరాను అట్లా ఒక మొసలిపిల్ల మీదికి తీసుకెళ్లాను. నన్ను బూచోడనుకుందేమో పాపం అది భయపడింది. కెమెరా లో నుంచి చూస్తున్నాను కదా, చుట్టుపక్కలేం జరుగుతోందో నాకూ తెలీక, అది కదిలిన తీరుకు ఆ శబ్దానికీ నేనూ ఉలికిపడ్డాను. ప్రశాంతంగా వున్న చెఱువులో ఈ అల్లరేమిటని ఒక చెఱువుకోడి నన్ను గట్టిగానే నిలదీసింది. మీ స్పీకర్ల శబ్దం పెంచి వినండి. నేను దానికి సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డాను.

ఆ తరువాత నాకెదురైన ఇద్దరు ముగ్గురు మనుషులు 'శుభోదయం'తో సరిపెట్టక ఏదో ఒక మాట అడిగారు. ఒక తల్లీపిల్లా 'నీటి బయట మొసలిని చూశావా' అనడిగారు. 'లేదు గానీ ఒక ఆసక్తికరమైన వీడియో వుంది, మీకు సమయం వుంటే చూస్తారా' అనడిగాను. 'రోజంతా వుంది' అందా తల్లి. 'మేమిక్కడ కేంపింగ్ చేస్తున్నాం' ఉత్సాహంగా అన్నదా ఆరేడేళ్ల పాప. ఆ ఉత్సాహానికి ముచ్చటపడి 'ఆ హా! వెరీ గుడ్!' అన్నాను. 'భయపడకూడదు. సరేనా?' అంటూ వీడియో చూపించాను. నాలాగే పాప కూడా ఉలికిపడింది. తరువాత నవ్వింది. ఈ ఉత్సాహంతో ఇంకో ఇద్దరు పెద్దలకు చూపించాను. వాళ్లూ అంతే. :)

11 comments:

కొత్త పాళీ said...

I don't think it was startled by you. I think it caught some food item.

రవి said...

౧౧/౧౦ . వావ్! వావ్! నాకూ ఇలాంటి ౨ అనుభూతులు. నైలు నదిలో దాదాపు ఓ పాతిక అడుగుల ఎత్తు కొంగ ను చూసినప్పుడూ, ఓ పెద్ద నెమలి ఓ చెట్టు పై కొమ్మ నుండి నా పక్కనే దూకి పరిగెత్తడం చూసినప్పుడూ...ఐతే ఆ అనుభూతులు కెమెరాలో చిత్రించడం కుదరలేదు!

ప్రసాద్ said...

"ప్రశాంతంగా వున్న చెఱువులో ...." ఎక్కడ కనపడింది మీకు ప్రశాంతత? అదాటుగా వున్న జీవిని అమాంతం మింగేసిన మొసలిలోనా? అమ్మ ఏమయినా తెస్తుందేమొనని ప్రతిసారీ నోరు తెరిచే పిల్ల పక్షుల నోళ్ళల్లోనా?

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

కొత్తపాళీగారు - అది భయపడిందనే నేననుకోవడం. చెఱువుకోళ్లు మాత్రం ఒక్కలాగే గోల చేస్తాయి. వాటిని బట్టి ఏం జరిగిందో చెప్పడం కూడా కష్టమే. మీరన్నదీ నిజమే కావచ్చు.

రవి - పాతిక అడుగుల ఎత్తు కొంగా!!!!? ఒక పొడుగాటి మనిషి కంటే నాలుగు రెట్లు ఎత్తున్న కొంగ! చందమామ కథల్లోలాగా పిల్లలను సులభంగా ఎత్తుకు పోతుందేమోనే? దాని వివరాలు కావాలి. మీకు తెలిస్తే చెప్పండి.

ప్రసాద్ గారు - మొసలి కదిలినప్పుడు జరిగిన అలజడితో పోలిస్తే అంత వరకూ వున్నది ప్రశాంతతే కదా! :)

ప్రవీణ్ గార్లపాటి said...

కదిలిపోకుండా వీడియో బాగా తీసావు...
బాగా వచ్చింది.

@ రవి:
వావ్! అంత మంచి అనుభవాలున్నాయా మీకు.
కెమెరాలో బంధించలేకపోవడం బాధాకరమే :(

రానారె said...

థాంక్యూ ప్రవీణ్! ముక్కాలిపీట (tripod) తీసుకెళ్లి వుంటే ఇంకా బాగా వచ్చేదేమో. కానీ హారర్ ఎఫెక్టు రావాలంటే కదిలే కెమెరాయే మంచిదేమో. :)

వికటకవి said...

అసలా మొసళ్ళు అలా అలా నేల మరియు నీటిలో తిరిగెయ్యటమేమిటీ, మీరు వాటెనక ప్0అడి బంధించెయ్యటమేమిటి? ఈ అభయారణ్యం పేరేమిటి? మీరు నడిచేచోటు వరకు అవి రావన్న గ్యారంటీ ఏమన్నా ఉందా?

వేణూ శ్రీకాంత్ said...

వావ్ చాలా బావుంది రానారే గారు.

teresa said...

Beautiful video! You'd have enjoyed(absorbed) the moment much better,had you not been busy with the camera!

రానారె said...

@వికటకవి - నడిచే చోటుకు వస్తూ వుంటాయి , కానీ అవి కూడా కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడానికి భయపడతాయి కదా!

@వేణూ శ్రీకాంత్ - థాంక్యూ.

@తెరెసా - కృతజ్ఞతలు. ఎప్పుడూ కెమెరాలో నుండి చూస్తూ వుండిపోకండి అని మా ఆఫీసులో గతేడాది ఛాయాగ్రహణం తరగతుల్లో అనుభవజ్ఞులు చెప్పిన మాటే మీరూ చెప్పారు. కానీ ఒక్కోసారి (మై)మరచిపోతూ వుంటాన్నేను. :) మీరంటున్నది మొసలి హఠాత్తుగా కదలడాన్ని గురించే అయితే, కెమెరాను దాని మీదికి తీసుకెళ్లడంవల్లనే అది కదిలిందని నా ఊహ. :)

Anonymous said...

నాకో డౌటు.అలా కాలో చెయ్యో సమర్పించు కోడానికి 6o మైళ్ళు వెళ్ళాలా? దాని కోసం గ్యాసు ఖర్చు.మీ ఊళ్ళోనే ఏ కారు టైరొ చూసుకోవచ్చు గదా?క్రోకడైల్ హంటర్ స్టీవ్ గానీ కల్లోకొస్తున్నాడా?

-- విహారి

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.