ముత్యాల హస్తభూషణం

సత్తువున్నది సమయమున్నది
పొత్తు జేయగ పొత్తమున్నది
సొత్తు నీకిది శాశ్వతమ్ముగ
చెత్త జోలికి పోకు మా!


ధిరన ధిరనన ధిరన ధిరనన
ధిరన ధిరనన ధిరన ధిరనన
తకిట తకధిమి తకిట తకఝణు
తకిట తకధిమి తకిట తోం!


నడకను తెలుగువారికి నేర్పింది గురజాడ అప్పారావుపంతులు.
కాకపోతే నేను ఆ పంతులుదగ్గర నేర్చుకోలేదు.

సరళమౌ నా పలుకులోనే
సరముగలదని తెలుసుకొంటిని
నాకు తెలిపిన పంతులెవరో
నీకు తెలుసని తెలుసునా?



చాలా కాలం తరువాత ఈ మధ్య హస్తభూషణాలు ధరించడం మొదలుపెట్టాను. పదవతరగతి వరకూ అవీఇవీ అని లేదు, వీరబల్లె మండల శాఖా గ్రంథాలయంలో కనబడిన పుస్తకాలన్నీ చదివే అలవాటుండేది. బాలలమాసపత్రికలు, పురాణపండ రంగనాథ్ రచించిన బొమ్మల పంచతంత్ర భాగవత రామాయణాదులు, మహీధర నళినీమోహన్ చొప్పదంటు ప్రశ్నలు, వినువీధిలో వింతలు, ఆరుద్ర రాసిన చదరంగం పుస్తకం, ఎనిమిదోతరగతి నుంచి సపరి'వార'పత్రికలు, సరసమైన కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన కథలు, ముప్పైరూపాయలకు పాత విజ్‌డమ్ సంచికలు దండిగా కొనుక్కోవచ్చుననే ప్రకటన చూసి కొన్న పెద్ద కట్ట (చాలా ఉపయోగపడిన మరియు గుర్తుండిపోయిన ఒక వ్యాసం నాకు వీటిలో దొరికింది), ముక్కావారిపల్లెలో చదివేటప్పుడు మా ఇంగ్లీషు ఉపాధ్యాయుడు సిఫారసుచేసి కొనిపించిన మంచి ఆంగ్ల నిఘంటువు (జీవితకాలం ఉపయోగపడుతుందిది), చందు సోంబాబు రచించిన కొన్ని డికెష్టీ నవలలు (వీటిలో ఎక్కడో ఒకచోట మాంఛి రెండు పేజీలుంటాయి, ఈ పేజీలను మళ్లీ చదవాలనిపిస్తుందన్నమాట), క్విజ్, జనరల్ నాలెడ్జ్ (వ్యంగ్యమేమీ లేదు!) తరహా పుస్తకాలు, ఛార్లెస్ ఛార్లెస్ (శోభరాజ్ నేరచరిత్రను వర్ణించిన పుస్తకం), రావిశాస్త్రి రాసిందనుకుంటాను గోవులొస్తున్నాయి అనే కథలపుస్తకం ... ఇలా పద్ధతీపాడూ లేకుండా ఏది కంటబడితే అది ఇంటికి తీసుకొచ్చి చదవడమే.

పదో తరగతి తరువాత సాధారణంగా తొంభైతొమ్మిదిశాతం తెలుగు విద్యార్థులు "ఇన్‌ టర్మ్ ఇడియట్" అనే రెండేళ్ల సుదీర్ఘ రసాయనిక ప్రక్రియకు గురవుతూ వుంటారు. హార్మోను ఇంజక్షన్లు, దాణా మరియు రోగనిరోధక టీకాలను శరీరంలోకి ఎక్కించి, బోనుల్లోనే బలిసిన బ్రాయిలర్ కోళ్లను రెండునెలల వ్యవధిలో అమ్మకానికి సిద్ధం చేసే కోళ్లఫారాలు రెసిడెన్షియల్ జూ.కాలేజీలకు స్ఫూర్తి ప్రదాతలు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలంటే డాక్టర్లనూ యింజనీర్లనూ తయారుచేసే భారీ పరిశ్రమలన్నమాట. ఇది కళలకు కాశీ, అంటే విద్యార్థుల్లో కళలేమన్నావుంటే కాల్చివేసి, నీళ్లొదుల్తారన్నమాట. కొందరేమో పాపం, బడిలో అలవాటైన పద్ధతులు మానుకోలేక చాటుమాటుగా చిత్రలేఖనం గట్రా సాధనచేస్తూ దొరికిపోయి దెబ్బలు తింటూవుంటారు. పాఠ్యపుస్తకాలు తప్ప విద్యార్థుల చేతుల్లో వేరే ఏది కనబడినా, నక్సలైట్ల కోసం పోలీసులు జరిపిన కూంబింగ్ ఆపరేషన్లో మందుగుండుసామాగ్రి మరియు విప్లవసాహిత్యం దొరికినంత సీన్ ఔతుందది. వెంటనే రోగనిరోధక చర్యలు ప్రారంభమౌతాయి. ఇతర పుస్తకాలు చేతబట్టాలంటే న్యూనత కలిగేలా చేస్తారు.

కొన్నికొన్ని వ్యసనాలు ఇంటర్మీడియట్లోనే మొదలౌతాయి; దున్నపోతై పుడతామనే భయంవల్ల కాబోలు. పదోతరగతి వరకూ పుస్తకపఠనం నాకొక వ్యసనంగా వుండేది. నేను ఇంటర్మీడియట్లోకి వచ్చాక అది ఇమ్మీడిట్టుగా దూరమైంది. మళ్లీ యిన్నాళ్లకు బ్లాగుల పుణ్యమా అని, పుస్తకాలకు సంబంధించిన పరిచయాలు, సమీక్షలు, సందేహాలు, వాదోపవాదాలు చూసిచూసి నేనూ మార్గదర్శిలో చేరాను. ఒక పుస్తకం కొనుక్కున్నాను.

కొత్తగా మళ్లీ పుస్తకాలు చదువుతూవుంటే ఇన్నాళ్లూ చాలా సమయం వృధాగా గడిపాననిపించింది. టీవీలో వచ్చే నానా చెత్తకార్యక్రమాలూ, విడుదలైన ప్రతి చెత్తసినిమా చూడటంకోసం రోజూ కేటాయించే సమయాన్ని కాస్త తగ్గించి, ఒక మంచి పుస్తకంలో నాలుగు పుటలు తిరగేస్తే కలిగే వినోదం నిజంగా నాణ్యమైనదని నా ఇటీవలి అనుభవం. ఈ అనుభవాన్ని అలా ముత్యాలసరంలో రాశాను.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
చాలా నిండుగా కడు చమత్కారముగా వుంది.

రెసిడెన్షి‌యల్ కాలేజీ ఉపమానం, దున్నపోతు గా పుడతారని భయమేమో, విప్లవ సాహిత్యం లాంటివి అన్నీ ఒక్క చోటే చేరి గిలి గింతలు పెట్టాయి.

శుభం.

పుస్తక పఠనం లో (పాడు)పడ్డారన్న మాట. పైకి లేస్తే ఓ సారి హలో చెబ్దురూ..

-- విహారి
రానారె చెప్పారు…
హలో చెప్పడమా.... అబ్బే, కుదరదండి. నేను చాలా బిజీ ;-)


ఈ హాబీ అయితే చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనాసరే చదవడంలో నేను చాలా నిదానం. ఒక చిన్నపుస్తకం చదవాలన్నా చాలా రోజులు పడుతుంది. ఇంగ్లీషువయితే మరీ అన్యాయం. గుట్టలకొద్దీ పుస్తకాలను చదివేసే వాళ్లను చూస్తే నాకు ఆశ్చర్యంగా వుంటుంది. ఈమధ్య ఏకబిగిన మూడు పుస్తకాలు చదివాను. ఎన్నిరోజుల్లో అనేది వేరేసంగతి. ఆ సంబరంలో 'నీ హాబీలేమిట'ని ఎవరూ అడక్కపోయినా పుస్తకపఠనం అని చెప్పుకోవడం మొదలుపెట్టా. :))
కామేశ్వరరావు చెప్పారు…
అస్తు అస్తూ మంచి వ్యసనమె
హస్తభూషణ మంతెకాదూ
పుస్తకాలను మించు దోస్తులు
నాస్తి లోకమునా... అస్తు అస్తూ!

ముత్యాలసరాల విషయానికి వస్తే, జానపదసాహిత్య సముద్రం నుండి గురజాడవారు ఏరి కూర్చిన ముత్యాల సరాలే అవి.

గుమ్మడేడే గోపిదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడచూపగదవే
అమ్మ మాయమ్మా... అమ్మా గుమ్మడేడే!

ఈ పాట చిన్నప్పుడు మా ముత్తవ్వ పాడివినిపించేది మాకు. మొత్తం దశావతారాలన్నీ వస్తాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం