పొద్దుపోని యవ్వారం -2

"హేయ్!"
"..."

"హేయ్! నిన్నే!!"
"నన్నా! ఏంటా పిలుపు? అసలేమిటా సంబోధన?"

"పిలవటంలో తప్పేమిటి?"
"ఐదో తరగతిలో సంబోధనా ప్రథమావిభక్తి చదువుకున్నావా?"

"ఓయీ, ఓరీ, ఓసీ, ఓయీ సుబ్బారావూ, ఓసీ సరళా - ఇదేగా!"
"అదీ... చక్కగా ఇటువంటి విభక్తులుండగా, -హే- యేమిటి, గొడ్డునో గోదనో అదిలించినట్టు!"

"ఓరి నీ విభక్తుల భక్తి తత్పరత తగలెయ్యా!"
"చూశావా, ఓరీ అంటూ చక్కగా మాట్లాడావ్? తిట్టినా చిక్కటి నుడికారంలో తిట్టావ్."

"తెలుగులో అయితే తిట్టినా ఫరవాలేదా! వామ్మో!! ఈ మధ్య ఆయనకెవరికో తెలుగుచేసిందని విన్నాను. ఇక నిన్నేమనాలి!?"
"ఏమైనా అనుకో, అదియునూ ఒక్క -హే- దక్క!"

"వచ్చాడయ్యా యమధర్మరాజు! సరెలే గానీ, ఇంతకూ నేన్నిన్ను పిలిచిందెందుకో అడగనేలేదు నువ్వు."
"నేను తత్‌క్షణం యమధర్మరాజునైపోతే బాగుండును.... సరే, ఇప్పుడు అడిగాననుకొని చెప్పు మరి."

"మ్... ఈ మధ్య నేనొక తెలుగు వెబ్ సైట్ చూసినాను."
"ఎక్కడా?"

"భలే అడిగావ్! వెబ్ సైట్ ఎక్కడుంటుందేమిటి? రవి గాంచని చోట. అంటే అంతర్జాలంలో."
"అబ్బో! అంతర్జాలం రవిగాంచని చోటా? సరే అలాగే అనుకుందాం. ఇంతకీ నువ్వు చూసిందేమిటి?"

"పొద్దు అని ఒక తెలుగు వెబ్ సైట్."
"ఓ... పొద్దా! హహ్హహ్హ... అంతర్జాలంలో పొద్దు పొడవటం చూశానంటావ్, ఔనా?"

"ఔను. ఎందుకా యటకారపు నవ్వు?"
"మరిందాక -అంతర్జాలం రవిగాంచని చోటు- అన్నావుకదా? అందుకు."


"వామ్మో! ఈ తెలివిని పొద్దు గడి నింపడంలో చూపొచ్చుగా!? ఇంతకీ పొద్దు నీకు ముందే తెలుసా?"
"ఆ సాలెగూడు చాలా కాలంగా మనకు సావాసగాడు."

"సాలెగూడా? అంటే వెబ్ సైటుకు తెలుగుపదమా? ...హహ్హహ్హ"
"ఔనోయ్ తెలుగు పదమే. ఇందులో నీ నెటకారమెందుకో?"

"అబ్బే నేను నవ్వింది ఆ అనువాదాన్ని చూసి కాదు, అది బానే వుంది. హహ్హహ్హ..."
"... గుర్ ..."

"కోపగించుకోకు మహాశయా! విభక్తుల దగ్గరనుంచే మనకు కోపాలు పెరిగిపోతే అవిభక్త ఆంధ్రదేశాన్ని నిలుపుకోవడం అసాధ్యం. అసలే భోక్తలెక్కువ మన రాష్ట్రంలో."
"ప్రాసతో మాట మార్చకు. అది వృధా ప్రయాస. విషయంలోకి రా!"

"ఏమీ లేదు, ఇందాక సాలెగూడు-సావాసగాడు ... శబ్దసారూప్యాన్ని ఇంకా బాగా కుదిరిద్దామనుకుంటుండగా, నాకో అడివియా వచ్చింది. వెబ్‌సైటును సాలెగూడు అంటున్నప్పుడు వెబ్‌మాస్టర్‌ను సాలెగాడు అనవచ్చుకదా! ఒకవేళ పొద్దు వెబ్ మాస్టర్ మీద మనకెప్పుడైనా కోపమొస్తే "ఏరా, సాలెగా..." అనడానికి సౌకర్యంగా వుంటుంది. హహ్హహ్హహ్హ..."
"హీ..."

"నాతోపాటు నవ్వుతావనుకుంటే వుడుక్కుంటున్నావా? కొంపదీసి ఆ సాలెగానివి నువ్వే కాదుగదా? ఏమైనా మన తెలుగోడికి సెన్సాఫ్ హ్యూమరు తక్కువేనయ్యా!"
"నీ మొహం! జోకు ఫర్లేదు. బానే వుంది. ఓ పాలి నవ్వుకోవచ్చు. కానీ పొద్దు సాలెగూడు కాదు."

"మరి?"
"అదొక అంతర్జాల పత్రిక."

"హన్నా! మరయితే సాలెగూటికీ జాలపత్రికకూ తేడా ఏంటో!?"
"ప్రవీణ్ గార్లపాటిని అడుగు."

"నీకు తెలుగుతో పాటు బాగా తెలివి చేసింది! నిన్నని యేం లాభం లే! ..."
"లేస్తున్నా! నీతో బాతాఖానీ కొడుతూ కూర్చుంటే ప్రయోజనమేముందిగనుక!"

"...!!?"

కామెంట్‌లు

SR చెప్పారు…
చాలా బాగా రాసారు. సాలెగాడు,సంబోధనా ప్రథమావిభక్తి లాంటివి సుపర్
అజ్ఞాత చెప్పారు…
mee kaththi ki rendu vaipula padunu unnattu unde
సుజాత వేల్పూరి చెప్పారు…
భలే బగుంది. మరియు...
10/10
కొత్త పాళీ చెప్పారు…
ha hha hha
sebaasu.
రాధిక చెప్పారు…
ఇదేదో భలేగుందే? 10/10
rākeśvara చెప్పారు…
అసలు రానారెతోఁ ముఖాముఖినా.. :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము