Thursday, November 08, 2007

సింగడు

అనగనగా ఒక అడవి. అడవి మధ్యలో ఒక గూడెం. కష్టంచేసుకుంటూ కాలం సాగించే ఆ గూడెంలో అందరికీ పాటలంటే ఇష్టం. గతించిన కాలంలో తమ తాతముత్తాతలు ఎంత బాగా పాడేవారో గుర్తుకొచ్చినప్పుడు, వారి జీవితాలలో ఒక భాగమైపోయి వుండిన పాట తమ తరంలో క్రమంగా దూరమైపోవడం గురించిన ఒక విచారం ఆ గూడెంలో పొడచూపేది. వారిలో కొందరికి పాడటమంటే మోజు. కొందరికి ఆ మోజును చూస్తే ముచ్చట. కొందరికి కొన్ని గొంతుల నుండి వినవచ్చేపాటంటే ఇష్టం, కొందరికి పాడేవారంటే ఇష్టం.

వాళ్లలో కొందరు యువకులకు పాటలమీద మంచి పట్టు వుందని ప్రశంసలు. వాటిని అందుకొన్నవారిలో సింగడొకడు. మొదట్లో సింగనికి ఈ ప్రశంసలందుకోవడం కొంత భయపెట్టేది. ముందుముందు తాను వాళ్ల ప్రశంసలకోసమే పాడాల్సొస్తుందేమో అని. కానీ ప్రశంసలు భయంకన్నా చాలా ఎక్కువగా సంతోషపెట్టేవి. సింగర్ సింగడు, సింగారి సింగడు ఇలా రకరకాలుగా కొన్ని ఇతర గూడేలవారుకూడా అనేటప్పటికి...

సింగని మనుసులో ఒక సంశయం.

తనకోసమే పాడుకుంటూ వున్నాననుకునే వాడు మొన్నటిదాకా. బాగుందనేవాళ్లు బాగానే పెరిగారు మెల్లమెల్లగా. కొంత కాలానికి, "ఏమిటి నువ్వీమధ్య పాడటంలేదూ?" అని అడిగేవాళ్లు కూడా వచ్చారు. అలా సింగడు తనకు తెలియకుండానే (!?) తన కోసమేగాక గూడెం కోసం పాడటం మొదలైపోయింది. అందులో భాగంగా ప్రశంసల కోసం పాడటం కూడా జరగసాగింది. ప్రశంసలే కదా పాటగానికి ఇంధనం - అని సమర్థించుకున్నాడు.

సింగడు అంతటిలో ఆగలేదు. "పాటగాడిగా నాకొక బాధ్యత వుంది" అని కొంచెం అతిగా ఆలోచించడం మొదలెట్టాడు. ఇప్పుడున్న పాటగాళ్లందరినీ ప్రోత్సహించి గూడేనికి మళ్లీ గత కాలపు శోభను తెచ్చేందుకు ప్రయత్నిద్దామనుకున్నాడు. దీనికి గూడెంలో చాలానే తోడ్పాటు లభించింది. పాట తన గూడేనికి ఎందుకు దూరమౌతూ వచ్చిందో, అలా దూరమవడంవల్ల తన గూడెంలో వచ్చిన మార్పుల పరిణామాల దుష్ప్రభావాలేమిటో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా బయటపెట్టడం మొదలెట్టాడు. అవకాశం రాకపోయినా కల్పించుకొనిమరీ తనలోని ఈ పైత్యరసాన్ని కుమ్మరించేవాడు. గూడెంలోని కొందరు పెద్దలకిది అర్థమైంది. అయినా ప్రయత్నం మంచిదేనని సానుభూతి ప్రటించారు.

సింగడిలో ఈ సానుభూతి ఒక రకమైన మత్తును నింపసాగింది. కొన్ని అపశకునాలు ఎదురయ్యాయి. సింగడు వాటికి ప్రాధాన్యం ఇవ్వదలచుకోలేదు. కానీ, తాను బాధ్యతగా భావించి చేపట్టిన ఈ పనికి అడ్డు తగల జూసిన ఈ శకునాలపట్ల కొంత అసహనానికి గురయ్యాడు.

గూడెంలో సింగనికి తానొక ప్రతిభగల మంచి గాయకుడినని విశ్వాసం కుదిరింది. ఇది ఒక్కరోజులో కుదిరినది కాదు. గూడెంలోని పిన్న, పెద్దల ప్రోత్సాహాలే దీనికి ప్రబల కారణమని సింగడు భావించాడు. ఈ విశ్వాసం ఇచ్చిన ధైర్యంతో సింగడు అక్కడక్కడా కొన్ని యోగ్యతా పత్రాలు ఇవ్వడం మొదలెట్టాడు. కొన్నింటిని నిర్వచించడం మొదలెట్టాడు. కొన్నింటిని గర్హించడం కూడా చేశాడు.

ఈ చర్యలలో చాలా వరకూ గూడెం ఆమోదాన్ని పొందాయి - అనుకున్నాడు. కారణం అతనికి ఎక్కడా వ్యతిరేకత కనబడకపోవడమే. కొద్దోగొప్పో ఎక్కడైనా దృశ్యాదృశ్యంగా కనబడినా అది వారి పిరికితనం లేదా మూర్ఖత్వం లేదా అమాయకత్వం లేదా ఓర్వలేనితనం లేదా వీటి మిశ్రమం అనుకుంటూవచ్చాడు. అందరూ ఆమోదిస్తున్న తన మాటను ఎవరైనా తీవ్ర స్వరంతో ఖండిస్తున్నారంటే తన మాటకు కొద్దోగొప్పో ప్రభావం కలిగించగల శక్తి వచ్చిందని నమ్మాడు.

సింగడు వృత్తాసురునిగా మారే దశ వేగవంతం కాసాగింది.

తనకు విమర్శకులు వుండడానికి ఆస్కారం వుందని సింగనికి తెలియలేదు. కానీ ఆ నిజం త్వరిత గతిన అతనికి సాక్షాత్కరించసాగింది. దీంతో సింగడు కలత చెందసాగాడు. అయినా సరే, "వెరవను. అందరినీ నా అంత గాయకులను చేస్తా. ఎక్కడ అపశృతి దొర్లినా సరిచేస్తా. శక్తిమేరకు ఈ పని చేస్తా. అందరూ ఇదే పని చెస్తే ఇంకా త్వరగా బాగుపడిపోతాం. లేదంటే ఈ గూడేనికిక నిష్కృతి లేదు" అని కంకణం కట్టుకున్నంత పనిచేశాడు. (ఉన్నమాటంటే ఉలుకెక్కువ - సింగ డందు కెంత మాత్రమూ మినహాయింపు కాదు)

అతడొకరోజు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వుండగా ఒక తీతువు పిట్ట స్వరం వినిపించింది - "ఏఁరా! నువ్వేమైనా తుంబురుని వనుకుంటున్నావా లేక నారదుని వనుకుంటున్నావా? బొడి సింగన్నవు నువ్వు. నీకు వందిమాగధులు కూడానా? తంబురా పట్టిన ప్రతివాడూ త్యాగరాజుగాడు. తంబురా పక్కనబెట్టి సొంతబుర్ర పెట్టి ఆలోచించు. వేస్ట్ ఫెలో ... తీతువుపిట్ట సరిగా రాగం తీయలేదంటూ ఒక సభ పెడతావా? భావదరిద్రపు మొహం నువ్వూనూ ..."

సింగని భృకుటి ముడివడింది. ఏనాటి పగ ఇదంతా ... నా మీద ఇంత విషం గక్కింది ఎవరిది అనుకుంటూ చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మ చిన్నగా కదిలింది. ఆ కొమ్మనుండీ ఒక పక్షి ఎగిరిన శబ్దం వినబడిందంతే. సింగడు దిగులుగా ఏదో పాట పాడుకుంటూ పనిలోకి వెళ్తున్నాడు.

అంతలో ఒక యోగిపుంగవుడు మరో సిద్ధునితో ఇంకో మౌని సమక్షంలో యేదో వేదాంత చర్చ చేస్తూ ప్రసంగ వశమున ... "హహ్హహ్హ! ప్రతి కోడిపుంజూ తానొక గంధర్వుడిని ఓ తెగ యిదైపోతుంటుంది. తానే పైకోడినని యింటి కప్పెక్కి కూత బెడుతుంటుంది. అట్లా ఎక్కిన కోడిపుంజును ఆయువుపట్టు మీద కొట్టి బిర్యానీ వండుకు తిందామన్నంత ఆకలిగావుంది నాకు ... అసలు నేను బిర్యానీ తిని చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో భాగ్యనగరపు బావర్చీ వంగడపు వంటకం తిన్నదే ... ఈ కోళ్లను మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు." సింగని మనసుకు కేవలం ఈ భాగం మాత్రమే ఇలా వినిపించింది. ప్రాతఃకాలాన తీతువు పిట్ట కూతతోనే సింగని చెవులు మూతబడ్డాయి. అందుకే మనసుతో వింటున్నాడు. ఆ మనసు కూడా చిన్నదైపోయి చాలా సన్నని పౌనఃపున్యపు శ్రేణిలోని శబ్దతరంగాలనే లోపలికి అనుమతిస్తూ వుండటాన్ని అతడు గుర్తించలేకపోయాడు.

సింగనికి కళ్లు తిరిగినట్లయింది. "గూడెంలో రాగయుక్తమైన గొంతులెన్నో పల్లవించాలనే సలలితమైన తన ఆలోచనలో, ఉడుతసాయం లాంటి తన ప్రయత్నంలో కీర్తికండూతినీ గర్వాన్నీ అహాన్నీ చూస్తూ వున్నారే! యోగులు కూడా తన ఉద్దేశాన్ని శంకించి అవమానించాలని చూస్తున్నారే! యోగిపుంగవుడు కూడా తీతువుపిట్ట చెప్పిన మాటలనే దాదాపు అదే స్వరంతో చెబుతున్నాడేమిటీ..." అని అవాక్కయ్యాడు. హతాశుడయ్యాడు. అలాంటివే యేవో ఇంకో రెండుమూడయ్యాడు.

అయ్యాక, "నా పేరేమిటీ?" అని తనను తానే ప్రశ్నించుకొన్నాడు. మలయాళ పర్వతప్రాంతపు గూడేలలో ప్రజలంతా తననేమని కీర్తించారో గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఆ తరువాత అందరికీ వినబడేలా గట్టిగా తన తాతను తలచుకొని జూలు విదిలించాడు. కొమ్మ చాటు నుండి కూసిన పిట్టను ఏమీ అడగలేకపోయాడు. ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న యోగిపుంగవునితో కలబడి తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడు.

"పొద్దున్నే ఇదే కూతను విన్నాను. అది కూసింది మతరేనా? ఎవరికైనా ఒక పాటలో తప్పులను సరిచేయడానికి నేను గానగంధర్వుడిని కానక్కరలేదే? చిన్నప్పుడు నాకు జింకలను వేటాడటం నేర్పిన నా గురువు ధనుర్విద్యాపారంగతుడేమీ కాడే? అసలేమిటి మీ కత? మీరే కప్పెక్కి కూతబెడదామనుకుంటున్నట్లుగా వుందే!" అని చాలా అమర్యాదకరంగా అడిగాడు.

యోగి చిరునవ్వు నవ్వి, ఇలా అన్నాడు: "నాయనా, నీవు గానంలో గంధర్వులను ధనుర్విద్యలో ధనంజయునీ మించిపోతే నాకు సంతోషమే. నీవు నీ గూడెంలో గానకళ విలసిల్లాలని కోరుకుంటున్న సంగతినికూడా నేనెరుగుదును." దెబ్బకు సింగడు నిరాయుధుడయ్యాడు. నిప్పులు కక్కాలా లేక చిందులు తొక్కాలా అనుకుంటున్న వాడు కాస్తా ... ఈ యోగి మాటలు నిజమే కదా! అనుకున్నాడు - గత అనుభవాల దృష్ట్యా. మరైతే అలా ఎందుకన్నట్లు? అని గొణుక్కున్నాడు.

యోగీశ్వరుడు చెప్పసాగాడు: "నీవెంచుకున్న మార్గంలో కనీసం రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఒకటి - నీకు బోధనా పరిజ్ఞానం దాదాపు శూన్యం. రెండు - నీ బోధనలు వినడానికి కనీసం ఒక్క శిష్యుడైనా కావాలి. ఈ రెండూ లేకుండా గూడెంలో అందరి గుడిసెలలో చొరబడి గానవిద్య నేర్పించడమనేది బలవంతపు కు.ని.తో సమానం. ఔనంటావా?"

ఆ ప్రశ్నకు సమాధానం సింగనికి ముందే తెలుసు - నర్తనశాల అనబడు చలనచిత్రాన్ని అతడనేకమార్లు వీక్షించియున్నవాడు 'గాన', "... ఔననే అంటాను" అనుకున్నాడు. యోగి విన్నాడు.

"ఎవరు అద్భుతముగా పాడవలెనని నీవనుకుంటున్నావో వారందరూ గానకళపై నీ వనుకుంటున్నంత గౌరవప్రపత్తులను కలిగి వుండరని గ్రహించావా? ఒకవేళ కలిగివున్నా నీవు బోధించే పద్ధతిలోనే పాడాలని లేదు కదా? ఈ గూడెంలో నివసించడానికి నీ కెంత హక్కువుందో తీతువు పిట్టకూ అంతే హక్కు వుంది. తీతువుపిట్టకు కూడా ప్రకృతి ప్రసాదించిన తనదైన స్వరంతో కూతపెట్టే అధికారం వుంది. నీ పాట నీకెంత తీయనో దానిపాట దానికీ అంతే తీయన. దాన్ని కూడా నీలాగా పాడమంటున్నావు నీకేమైనా పిచ్చా?"

"... ఔననే అనిపిస్తోందిప్పుడు." సింగడు నర్తనశాల చాలామార్లే వీక్షించాడు.

"మరేం ఫరవాలేదు. నీకు చేతనైతే గానకళను వృద్ధి చేయగల సాధన సంపత్తిని సమకూర్చు. వీలైతే ఆ సాధన సంపత్తిని వృద్ధి చేస్తున్నవారికి నీ తోడ్పాటును ముమ్మరం చెయ్. తరతరాలందరికీ అది ఉపయోగపడుతుంది. వాక్కు చాలా విలువైనది. దానిని ప్రభుత్వనిధిలా వినియోగించకు. ఇంత చెప్పినా అర్థం కాలేదంటే క్షమించు." అని చెబుతూ అంతర్థామయ్యాడు యోగిపుంగవుడు.

"ఆచంద్రతారార్కమూ నిలుపుకొని మననం చేసుకోదగ్గ మాటలివి." అంటూ సిద్ధుడు యోగీశ్వరుని కొన్ని పలుకులను పునరుద్ఘాటించాడు. మౌని మౌనంగానే సింగడిని అనునయింప ప్రయత్నించాడు.

*** *** ***

సింగడు మళ్లీ సూర్యోదయాలను ఆస్వాదిస్తున్నాడు. కొమ్మ చాటు నుండి తీతువుపిట్ట అడపాదడపా ఏదో ఒకటి కూస్తూనే వుంది. కానీ దాని ప్రభావావికి సింగని చెవులు మూత బడటం మానేశాయి. భృకుటి ముడివడటం వంటి మనోవికార జనిత బాహ్యశరీర ప్రకంపనలు లేవు. నిజానికి దానికి కృతజ్ఞుడై వుండాలని అర్థం చేసుకుంటున్నాడు.
"జ్ఞానాంధత అనే చీకటిసముద్రంలో గర్వము, అహము అనేవి చిన్న అలలు మాత్రమే. ప్రశంస అనబడు సన్నని నున్నని ఏకదిశారహదారి నిన్నెప్పుడూ ఆ సముద్రానికి చేర్చుతూ వుంటుంది." యోగీశ్వరుని మాటలను ప్రతి రోజూ మనసులో తలచుకొంటూ అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. జాగరూకుడై మళ్లీ హాయిగా పాటలు పాడుకొంటూ పనిలో నిమగ్నుడయ్యాడు.

No comments:

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.