Wednesday, October 31, 2007

మా విద్విషావహై!

భూషయ్య: వాళ్ల పద్ధతులు నాకేం నచ్చలేదు. అందుకే వాళ్లను చంపాలి, చంపుతున్నాం.
లాడెను: వాళ్లూ అంతే. చాలా ప్రమాదకరం. మేమంతా ఒక్కటై వాళ్లను లేకుండా చెయ్యాల్సిందే.
మోడీ: నేనూ అలాగే అనుకుంటున్నాను. అందుకే రామనామం జపించే రాక్షసులకు దొడ్డివాకిలి తెరిచా.

అమాయక అమెరికన్: తీవ్రవాదికి గడ్డం వుంటుంది. వాడు అల్లాను పూజిస్తాడు. వాడుండకూడదు.
ఆవేశపు ముస్లిమ్: నా కళ్లముందే ఇంత ఘోరం జరిగింది. నాకు రక్షణలేదు. కనీసం నలుగురిని చంపి నేనూ చస్తా.
హిందూ మూర్ఖుడు: ఇస్లాం లేకుంటే ఇండియా బాగుపడిపోతుంది. అమెరికా కూడా నాశనమైపోవాలి.

లాడెన్ = అరేబియన్ జార్జిబుష్
బుష్ = అమెరికన్ మోడీ
మోడీ = ఇండియన్ లాడెన్

వీళ్లందరిదీ ఒకటే మతం. రాక్షస మతం. అన్నదమ్ములే వీళ్లంతా. వీళ్లది ఒకటే జాతి. రాక్షస జాతి. నరమేధం చేసిన రాక్షసుల అంశ వీళ్లు. ఇప్పుడు దేవుని పేరిట చేస్తున్నా రా పని. వీళ్లెవరూ మతోద్ధారకులు కారు. మత రక్షకులు అసలే కారు. ప్రశాంతంగా బతికే అమాయక జనాన్ని చంపి "హమ్‌ భీ మర్ద్ హైఁ" అని రొమ్మువిరిచిన మోడీ హిందూమతోద్ధారకుడు ఎలా అవుతాడు? సంఘంలోని కలతలకు ఆజ్యంపోసి పెంచినవాడు శ్రీరామునికి ప్రీతిపాత్రుడెలా అవుతాడు? దుష్ట రక్షణ చేసినవాడు శ్రీరామునికి ఇష్టుడు కాడు. వీళ్లవల్ల వీళ్ల మతానికీ జాతికీ రక్తపు మరకలేగానీ సుఖశాంతులు ప్రాప్తించడం కల్ల. ఇవే కారణాల రీత్యా లాడెన్ అల్లాకు వ్యతిరేకి. "వియ్ ట్రస్ట్ ఇన్ గాడ్" అని బుష్ అంటున్నది అబద్ధపు కూత. కనకపు సింహాసనా లెక్కిన ఈ శునకాసురుల నుండి సామాన్య మానవునికి ఎప్పటికీ ప్రమాదమే. ఈ అసురుల నుండి మనం పరస్పర విద్వేషాలు నేర్చుకోకూడదు.

******************

ఈ టపాకు ప్రేరణ: నిన్న యూట్యూబులో తెహల్కా వీడియోలకు వచ్చిన వ్యాఖ్యలు. "I swear, I’ll take revenge for this!" అన్నది వాటిలో ఒక వ్యాఖ్య. ఈ ప్రతీకారం ఎవరిమీద? ఆ దొమ్మీ జరిపినవారిమీద కాదే! మళ్లీ అమాయక జనం మీదే. ఇంకో రాక్షసజాతీయుని ఆధ్వర్యంలో.

9 comments:

Vamsi M Maganti said...

అసలు మోడీని "మతోద్ధారకుడు" అని తలవటమే తప్పు. ప్రశాంతంగా బతికే గొఱ్ఱెల మందలోకి చప్పుడు కాకుండా వచ్చి కలకలం సృష్టించే తోడేలు తోలు కప్పుకున్న రాక్షసులు ఈ ముదనష్టపు నాయకులు..జనాలు గొఱ్ఱెల నుంచి తోలు మందం, బుఱ్ఱ మందం బఱ్ఱెలు అయ్యేదాక దేకుతున్నారే తప్ప , తెలివి తెచ్చుకోవట్లా...మరి ఖర్మ అనుకుని వదిలేస్తే ఈ దుర్మార్గుల నుంచి రక్షించే నాథుడెవడు ? ఆ రాములవారా? ఏమో - కాలమే సమాధానం చెపుతుంది...

Cha.Chu. said...

10/10

విశ్వనాధ్ said...

లాడెన్,బుష్ మాట వదిలేస్తే.
మన సంసృతిమీద జరిగే దాడిని చూస్తూ ఉండేకంటే
ప్రపంచంలోనే అమూల్యమైన సంసృతిని పాడు చేస్తున్నారనే ఆవేశంలోఎవరో ఒకరు మీరన్న మత మూర్కులుగా మారటం మంచిదిగా.
ఆంధ్ర ప్రాంతంలో చూస్తే తెలుస్తుంది. మత మార్పిడులు ఎంత చాందసంగా జరుగుతున్నాయో.(మనవాళ్ళలో ఏంజరిగినా అడిగే వాడే లేడు) అదే గుజరాత్ ప్రాంతాలలో గమనించండి. భయమైన మరేదైనా కొందరి వ్యక్తులవలనేకధా. అదీ ఒక రకంగా మంచే అనుకోవచ్చు.
మిగిలిన మతాలవారితో పోలిస్తే.

రాకేశ్వర రావు said...

మరైతే ఎం చేద్దామంటారు?
హృదయభానుకి మండి పడడమే తప్ప పరిష్కరిచడం చేతకాదంటారా?

రానారె said...

విశ్వనాధ్‌గారూ, అమూల్యమైన మన సంస్కృతిని వదిలి ఇతర మతాల్లోకి మారుతున్నారంటే - ఆ మారే వారిని అందుకు పురికొల్పుతున్న పరిస్థితులు గమనించి చూస్తే ... మతం ఎవరు మారుతున్నారు? పేదలు, వెనుకబడినవారు, విజ్ఞానం లేని వారు, సంఘంలో తగిన గౌరవం లేక నిమ్నజాతులుగా చూడబడుతున్నవారే కదా ఎక్కువగా మారుతున్నది! మతం ఎందుకు మారుతున్నారు? తిండి గింజలు దొరుకుతాయని, ఇంట్లో అందరూ పస్తులుండే పరిస్థితి మారుతుందని, కాస్త గౌరవం దక్కుతుందని, వైద్య సహాయం అందుతుందని, పిల్లలకు చదువులు అబ్బుతాయని, ఉన్నత కులాల వారికి వూడిగం చేసే పరిస్థితి తమపిల్లలకు రాకూడదని. మత మార్పిడులు జరుగుతున్నాయని రభస చేస్తున్న ఈ 'మతోద్ధారకులు' ఎప్పుడైనా నిమ్నకులాలకు ఆసరాగా నిలిచారా? వారికోసం తిండిగింజలు ఇచ్చారా? వారి పిల్లలకు ఉపాధి దొరికేదాక చదువు చెప్పించారా? వైద్యం అందించారా? ఒక వేళ ఇవన్నీ చేసినా వాళ్లకు సంఘంలో గౌరవం ఇవ్వగలిగారా? ఇవన్నీ స్వమతస్తులు చేయగలిగితే మరో మతానికి మారవలసిన అవసరమేముంటుంది ఎవరికైనా? ఆ అవసరం లేనప్పుడు మతమార్పిడులు సాధ్యం కావు. కానప్పుడు ఆ ప్రయత్నాలూ జరగవు. కాబట్టి మతమార్పిడులు జరిగిపోతున్నాయని గోలచేసేవాణ్ణి మతోద్ధారకుడుగా భావించడం తగదు. వీళ్లను నెత్తికెత్తుకోవడం ప్రమాదకరం.

రాకేశ్వరా, ఈ హృదయభానుడిది మండిపాటు కాదు. కేవలం విశ్లేషణ. పరిష్కారం ఒక్కటే. మా విద్విషావహై. ద్వేషాలను పెంచుకోకపోవమే. ముస్లిం మీద ద్వేషం వున్నవాణ్ణి గుజరాత్ అల్లర్లలో ఉపయోగించుకొంటారు. ఎంచక్కా చంపవచ్చు నరికి నిప్పుపెట్టవచ్చు. ఆ నేరాన్ని అక్కడి ప్రభుత్వం కప్పిపుచ్చుతుంది. తరువాత ఆ దొమ్మీలో మిగిలిన ముస్లిం తమను నాశనం చేసిందెవరు అంటే ఫలానా ఎమ్మెల్యే, వాని మనుషులు అని కాక హిందువులు అన్నాడనుకో... వాణ్ణి అల్లర్లలో ఉపయోగించుకోవడానికి ఇంకో వర్గం సిద్ధం. వాడు నాశనం చేసేదెవరిని? ఎక్కడో హైదరాబాదులో చాట్ తింటూ మాట్లాడుకునేవాళ్లను. గుజరాత్ ప్రభుత్వ పెద్దలను కాదుకదా! ఎవడు అందితే వాణ్ణి ఎవరికి చేతనైతే వాడు ఇలా నాశనం చేసుకోవడానికి ఈ స్వయంప్రకటిత మత నాయకులెప్పుడూ వుంటారు. వీళ్లంతా ఒకటే జాతి. రాక్షసజాతి. వీళ్లకు అనుచరులుగా మారకుండా జాగ్రత్తపడటమే పరిష్కారం. వీళ్లకు మోరల్ సపోర్ట్ లేకపోతే చాలు. సగం సమస్య పరిష్కారమైనట్లే.

Anonymous said...

సెక్యులర్ రానారెకు జై !
వై విద్విషామహై?

కొత్త పాళీ said...

"లాడెన్ = అరేబియన్ జార్జిబుష్
బుష్ = అమెరికన్ మోడీ
మోడీ = ఇండియన్ లాడెన్"

బాగా చెప్పావ్!

రానారె said...

ఎవరండీ బాబూ నామీద ఎందుకో ఇంత కక్ష గట్టారు? మా విద్విషావహై అంటే మీరనుకొంటున్న అర్థం ఏమిటో నాకు తెలీదుగానీ, "మా విద్విషావహై" అంటే May we not hate each other అని అర్థం. నామీద ద్వేషం పెంచుకోకండి.

కొత్త పాళీ said...

మిత్రకేసరీ, ఈ వ్యాఖ్య చదువు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.